Previous Page Next Page 
అడుగడుగునా... పేజి 5


    నేలకి అతుక్కు పోయినట్లు నుంచుండిపోయాడు చంద్ర.

    "రిక్షా కావాలా బాబూ!" రిక్షా అతనికి చాలాసేపు నుంచి నేరం రాలేదేమో చంద్ర దగ్గరకు వచ్చి అడిగాడు.

    చంద్ర ఏ మాత్రం ఆలశ్యం చేయకుండా  రిక్షాలో ఎక్కి "పోనియ్యి" అన్నాడు.

    చంద్రని చూసిన రిక్షా అతను "పాపం చలి జ్వరం కాబోలు" అనుకున్నాడు.

    "ఆ పిల్లని తను రక్షిస్తే తనకే టోకరా యిచ్చి అటునుంచి అటే అదే పోతగా పోతుందా, మాట మాత్రం అయినా వక్కమాట తనతో చెప్పకుండా ఎందుకు పారిపోయింది? తనని మోసగాడనుకుందా! ఆ పిల్ల పెద్ద మోసగత్తె. తనని కళ్ళు తెరవమని చెప్పి కళ్ళల్లో కారం కొట్టి మరీ వెళ్ళింది. అమాయకంగా వుండే ఆ చూపులు అందంగా నవ్వే ఆ పెదవులు చూసి మంచి పిల్ల అనుకున్నాడు. ఆడదాన్ని నమ్మకూడదు. యింకానయం ఆ రౌడీలు తనని తన్నారు కాదు. అమ్మమ్మ అది ఆడపిల్లా. ఊహూ ఆడరౌడీ. అలా బుడింగిన చెట్టు చాటుకెళ్ళి అందమైన ఆడపిల్లలా అరక్షణంలో తయారయి వచ్చింది. ఎంత గుండెలు తీసిన బంటు కాకపోతే అంత త్వరగా వేషం మార్చ గలుగుతుంది!

    "రిక్షా ఎక్కడికి పోనివ్వను బాబూ?" రిక్షా అతను అడగటంతో చంద్ర ఆలోచనా స్రవంతిలోంచి బైట పడ్డాడు.

    చంద్ర చుట్టూ చూశాడు.

    రిక్షా పోవటంలేదు. ఉన్నచోటనే వుంది.

    చంద్ర గాభరాగా  ఎడ్రస్ చెప్పాడు. రిక్షా ముందుకు సాగింది.

    రిక్షాతో పాటు చంద్ర ఆలోచనలు కూడా పరిపరిధాల సాగుతున్నాయి.


                        *    *    *


    అవంతి వంచిన తల ఎత్తకుండా  మూడు పేజీలు పూర్తిగా రాసింది. అప్పుడు సమయం సాయంత్రం నాలుగు.

    తను రాసిందంతా  మరోసారి చదివింది. రాసింది తృప్తిగా అనిపించటంతో ఆ కాగితాలు మడిచి కవరులో పెట్టి కవరుపై ఎడ్రస్ రాసింది. అప్పుడు లేచి వెళ్ళి తలుపు తీసింది అవంతి.

    బక్కయ్య వరండాలో కూర్చుని రంగు కాగితాలు డిజైన్లుగా కత్తిరిస్తున్నాడు.

    "బక్కయ్యా!" అవంతి పిలుపు విని చేస్తున్న పని ఆపుచేసి తల ఎత్తి చూశాడు.

    "ఈ కవరు పోస్టాఫీసుకి వెళ్ళి పోస్టుచేసి రావాలి" అవంతి చెప్పింది.

    బక్కయ్య తల వూపాడు. కాగితాలు, కత్తెర ఓ పక్కగా పెట్టి లేచాడు. అవంతి యిచ్చిన కవరు తీసుకుని వెళ్ళిపోయాడు.

    అవంతి దీర్ఘంగా ఆలోచిస్తూ గుమ్మానికి ఆనుకుని వుండిపోయింది.

    బక్కయ్య పేరుకే బక్కయ్య గాని ఆకారంలోకాదు. ఎత్తుగా లావుగా బలంగా వుంటాడు. నోట్లో నాలుక లేనివాడు. అంటే మాట్లాడలేడని కాదు. నిజంగానే నాలుక లేదు. దానికో పెద్ద కథ వుంది. అది అవంతికి తెలుసు.

    పక్క వీధిలోనే పోస్టాఫీసు. బక్కయ్య పదినిముషాల్లో తిరిగి వచ్చాడు.

    "పోస్ట్ చేశావుగా!" అవంతి అడిగింది.

    బక్కయ్య తల తాటించాడు.

    అవంతి యింకేమీ  అనలేదు. లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంది. బక్కయ్య మళ్ళీ కాగితాలు కత్తిరిస్తూ కూర్చున్నాడు.

    తలుపులోపల గడియ వేసి బెడ్ రూమ్ లోకి వెళ్ళింది.

    బెడ్ రూమ్ లో గాడ్రేజ్ బీరువా గోడకి బిగించి వుంది. ఆ బీరువాలో అవంతి ధరించే రకరకాల డ్రస్ లు తప్ప మరేమీ వుండవు. అయితే అది బట్టల బీరువా ఎంత మాత్రం కాదు. ఆ బీరువా వెనుక సీక్రెట్ అరవుంది. అది అవంతికి మాత్రమే తెలుసు. 

    అవంతి బెడ్ రూమ్ లోకి రాంగానే బెడ్ రూమ్ లోపల కూడా తలుపుకి బోల్ట్ బిగించింది. అప్పుడు బీరువా తలుపు తెరిచింది. రాత్రి ఎనిమిదింటికి బైటికి వెళ్లాల్సిన పని వుంది. అప్పుడు ధరించటానికి చూడీదార్ తీసి బైట పెట్టింది. బటన్స్ వూడిపోతే అప్పటి కప్పుడు కుట్టుకోటానికి వీలుగా ఓ బాక్స్ లో రకరకాల రంగురంగుల బటన్స్ వున్నాయి. ఆ బాక్స్ తెరిచి ముదురు నీలం బటన్ ఒకటి తీసుకుని చూడీదార్ మెడకి అందంగా కనపడేలా రెండేరెండు టాకాలేసి కుట్టేసింది.

    ఆ బటన్ మామూలుది కాదనీ టాప్ సీక్రెట్. అవంతికి మాత్రమే తెలుసు. అలాగే బాక్స్ లో వున్న బటన్స్ లో కొన్ని మామూలువి మరికొన్ని అత్యద్భుతమైనవి. ఏ రంగులవి ఏయే పనులకి వుపయోగపడతాయే అవంతికి మాత్రమే తెలుసు. ప్రతిరంగువీ పడేసి బటన్స్ వున్నాయి. అయితే ఆరు రంధ్రాలు వున్న బటన్స్ మాత్రమే ముఖ్యమైనవి.

    బైటికి వెళుతూ రాత్రి ధరించాల్సిన చూడీదార్ ని బెడ్ మీద వుంచి బీరువా వేసింది. ఆ తర్వాత ఆదిమ జాతులు వారి ఆచారాలు అన్న నాలుగువందల పేజీల పుస్తకాన్ని తీసుకుని కుర్చీలో కూర్చుని మొదటి పేజీ తిరగేసింది. ఆ పుస్తకం మొదటి పేజీలో ఏ పేజీల్లో ఏమి వుంది వివరంగా రాసివుంది. అయితే ఆ వివరం కూడా సీక్రెట్ కి సంబంధించినది.

    పచ్చబొట్లు వాటి వివరణ పేజీ నూట తొంబై ఆరు. తిరగేస్తే పచ్చబొట్లు గురించే వుంటుంది. కానీ ప్రతి వాక్యంలోని చివరి అక్షరం తీసుకుని చదివితే పచ్చబొట్టు వుపయోగాలు వాటిని ఆపదలోను అవసరానికి వాడే విధానం తెలుస్తుంది.

    ఆదిమ జాతుల వారి ఆచారాలు పుస్తకం నిండా ఇలాంటి సీక్రెట్ విషయాలు చాలా పొందు పర్చివున్నాయి.  

 Previous Page Next Page