ఆ అమ్మాయి పెదవులు సున్నాలా చుట్టి హర్షకి ముద్దుపెడుతున్నట్లుగా అభినయం చేసింది. రెప్పపాటు కాలంలో జరిగింది అది. అయినా అమృత కళ్ళబడింది.
ఒళ్ళు మండిపోయింది. "ఏయ్ కృష్ణారావ్! నేను ప్రక్కనే వున్నాను అని కూడా లేకుండా ఏమిటా గోపికతో వేషాలు" కోపంగా అడిగింది.
"నువ్వు ప్రక్కన లేకపోతే ఫరవాలేదా?" చిలిపిగా అడిగాడు అతను.
"అటూ చూడకు" చెప్పింది చిరాగ్గా.
"ఎందుకు చూడద్దు? చూసినంత మాత్రాన ఓ చిరునవ్వు విసిరినంత మాత్రాన ఏమవుతుంది? రేపు మళ్ళీ మేమిద్దరం జీవితంలో తారసపడతామా ఏమన్నానా? మరీ అంత పాజిటివ్ గా తయారవకు" చెప్పాడు నవ్వుతూ.
అమృత మాట్లాడలేదు. మూతి బిగించి ఖాళీ టీ గ్లాసు అతనికి అందించింది.
హర్ష కొట్టువైపు వెళ్ళాడు.
అమృత తలతిప్పి స్కూటరబ్బాయివైపు చూసింది. అతను ఆరాధనగా తనను చూడడం గమనించి సన్నగా నవ్వింది. అతని కళ్ళల్లో మెరుపు స్పష్టంగా కనబడిపోయింది. అతను ఉషారుగా నవ్వాడు. అమృత గాలి కెగురుతున్న ముంగురులు సవరించుకుంటూ దృష్టి మరల్చుకుంది.
"ఎక్స్యూజ్ మీ" అన్న కంఠస్వరానికి తల త్రిప్పి చూసింది.
ఇప్పుడా యువకుడు దగ్గరగా నిలబడి వున్నాడు.
అమృత ప్రశ్నార్ధకంగా చూసింది.
"మీతో కొంచెం మాట్లాడాలనిపిస్తోంది" అన్నాడు.
అమృత గాభరాగా హర్ష వెళ్ళినవైపు చూసింది.
హర్ష కాఫీ సిప్ చేస్తూ, ఫియట్ కారు అమ్మాయి ఏదో అడుగుతుంటే సమాధానం చెపుతున్నాడు. చేతిలో కప్పు అలాగే వుంది.
"ఇక్కడ కాదు! అలా కాస్త దూరంగా వెడదాం" సంశయిస్తూ అడిగాడు. అమృత బిత్తరపోయింది. హర్ష ఇంకా ఆ అమ్మాయితో మాట్లాడుతూనే వున్నాడు. వళ్ళు మండిపోయింది. దాంతో ఆమె తల అంగీకారంగా వూపి అతనిని అనుసరించింది. కాస్తదూరం వెళ్లాక నిర్మానునుష్యంగా వున్న చోట ఆగి "మీరు చాలా అందంగా వున్నారు" అన్నాడతను వెనక్కి తిరిగి.
అమృత దృష్టి అంతా హర్ష మీదే వుంది.
"ఔను" అంది అనాలోచితంగా.
"నువ్వు నాకు చాలా నచ్చావు!"
ఆమె ఆ మాట అర్ధం చేసుకుని అతనివైపు తిరిగే లోపల అతను ఆమె భుజం మీద చేయివేసి దగ్గిరగా లాక్కున్నాడు.
"ఏయ్! ఏమిటది, మర్యాదగా వాదులు...లేకపోతే" అంటూ ఆమె వదిలించుకొబోయింది.
"కంగారుపడకు ఆ....త.....ని కంటే ఎక్కువ రేటే ఇస్తాలే" అన్నాడు వదలకుండా పట్టు బిగించి.
అమృత ఆ మాటలకి మ్రాన్పడిపోయింది.
"ఛీ ఛీ అతను ఎవరనుకున్నావు నా హజ్బెండ్" అంటూ శక్తి కొద్దీ పెనుగులాడి విడిపించుకొని ఈడ్చి చెంపమీద కొట్టింది. అతను ఆ దెబ్బకి చెంప పట్టుకొని "మరి....మరి....ఎందుకు నవ్వావు" అన్నాడు కోపంగా.
"నీ తిక్క కుదర్చడానికి" అంటూ అప్పటికే చెక్కిళ్ళ మీదకి జారి పడుతున్న కన్నీరు తుడుచుకుంటూ వేగంగా కారువైపు పరిగెత్తింది.
"అమృతా ఎక్కడికి వెళ్ళావు? అదేమిటి ఏమైంది" హర్ష ఎదురు వచ్చి ఆమెని దగ్గిరగా పొదుపుకొంటూ అడిగాడు.
"హర్షా, ఇంకెప్పుడు ఎవరివైపు చూసి మనం నవ్వకూడదు, సరేనా!" చూపుడు వేలితో బెదిరిస్తున్నట్టుగా అంది.
హర్ష తేలికగా నవ్వేస్తూ "ఆ అమ్మాయితో మాట్లాడానని కోపమా? ఆ అమ్మాయికి నిన్ను చూపించి నాకు పెళ్ళయింది అని చెప్పగానే నన్ను 'సారీ అంకుల్' అంది తెలుసా" అంటూ మళ్ళీ పెద్దగా నవ్వాడు.
"చాల్లే దశరధరామయ్యా-పద పోదాం" అంది అమృత సీరియస్ గా కారు డోరు మూస్తూ మనసులో మాత్రం-"నేను నా అల్లరి బాగా తగ్గించుకోవాలి, వయసు వస్తోంది. కాస్త గంభీరంగా వుండాలని అనుకుంది.
* * *
అ....త...ను,
సన్నగా, పొడుగ్గా వున్నాడు, కళ్ళల్లో ఏదో తీక్షణత, పెదవి కొరకడంలో అసహనం కనిపిస్తున్నాయి. ట్రీమ్ చెయ్యని గడ్డాన్ని ముని వేళ్ళతో సవరించుకుంటూ నిలబడ్డాడు. జైల్లోంచి ఎన్నో రోజులకి బయటకి వచ్చిన అతనికి ప్రపంచమంతా చాలా విశాలంగా తనని ఆహ్వానిస్తున్నట్లుగా కనిపించినట్లుంది. నాలుగువైపులా చూస్తూ తనలో తానే "వర్షిణి" అని గొణుక్కున్నాడు. అంతలోనే ఏదో ముఖ్యమయిన పని గుర్తువచ్చిన వాడిలా జేబులోంచి ఒక కాగితం తీసి అందులో వున్న ఎడ్రసుని చూశాడు.
ఎదురుకుండా వస్తున్న ఒక నడి వయసు వ్యక్తిని ఆగమన్నట్లు చెయ్యి చూపించి, "ఈ ఎడ్రస్ ఎక్కడో తెలుసా" అని అడిగాడు.
ఆయన ఆ ఎడ్రస్ కాగితంలో వున్న పేరుని "శిల్పా" అని పైకే చదివి "అదుగో ఆ వేపచెట్టు క్రిందనుండి పైకి పరీక్షగా చూసి కాగితం అందిస్తూ" ఆ అమ్మాయి నీకేమవుతుంది-ఏ ఊరు మనది" అని అడిగాడు.