Previous Page Next Page 
మొగుడే రెండో ప్రియుడు పేజి 5

    "ఆ....ఆ...మీ ఇద్దరు ఈ రాత్రికే అస్సాం లేచిపోతారన్న విషయం కూడా చెప్పాడు."

    "అప్పుడే మీకు అసలు సంగతి తెలిసిపోయిందా?" అడిగింది అమృత-మీకు కాస్తయినా అనుమానం రాలేదా అన్నట్టు.

    ఆయన వాత్సల్యంగా ఆమెని చూస్తూ "నేను నీ తండ్రినిరా! నీ అల్లరి సంగతి నాకంటే బాగా ఇంకెవరికి తెలుస్తుంది?" అన్నారాయన.

    జగదీశ్వరి అర్ధం కానట్టు భర్తకేసి, కూతురికేసి చూడసాగింది.

    అమృత తండ్రి మెడ చుట్టూ చేతులు వేసి "హర్షలాంటి భర్తా, నీలాంటి అర్ధం చేసుకొనే తండ్రీ వున్న నేను చాలా అదృష్టవంతురాల్ని నాన్నా" అంది తృప్తిగా.

    ఎందుకో ఆ అమ్మాయి కళ్ళు అప్రయత్నంగా తడి అయ్యాయి.

    ఆ మాటలకి హర్ష నవ్వేశాడు.

    "అసలు సంగతేమిటర్రా," అంది జగదీశ్వరి'విసుగ్గా.

    "నీ కూతురి అల్లరి పెళ్లైనా తగ్గలేదు కానీ, చెప్తాను పైకి పద," అని కుర్చీలోంచి లేచారు చక్రధరరావుగారూ.
   
                                          *    *    *

    కారు సుతిమెత్తగా సాగిపోతోంది.

    అమృత హర్షని ఆనుకొని కూర్చుని కళ్ళు మూసుకుంది.

    హర్ష ఒక చేత్తో స్టీరింగ్ కంట్రోల్ చేస్తూ మరో చేయి అమృత భుజాల చుట్టూ వేసి దగ్గరికి తీసుకున్నాడు "ఇంత త్వరగా వెళ్ళిపోతున్నామని మీ అమ్మా నాన్నగారు బాధపడినట్లున్నారు" అన్నాడు.

    అమృత అతనికి మరింతగా దగ్గిరగా జరిగి, "ఉహూ! ఉండబుద్ది కాలేదు హర్షా."

    మా ఇంట్లో బాగానే వుంది కానీ, ఎంత త్వరగా మన స్వర్గానికి వెళ్ళిపోతామా అని ఎదురుచూశాను ఈ రెండు రోజులూ" అంది గోముగా.

    హర్ష ఆమె చెవి సుతారంగా పట్టుకొని దగ్గిరకి లాక్కొని, ఒక చేత్తో డ్రైవ్ చేస్తూనే, మొహాన్ని తనవైపు తిపుకుని పెదాలమీద ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకోవటంలో అతడు ఎక్స్ పర్ట్. అందులో సందేహంలేదు. నాలుకతో వంట్లోని శక్తినంతా పీల్చేస్తున్నట్టు వుంటుంది అతడు ముద్దాడితే.

    "టీ తాగుతావా" అని అడిగాడు.

    "ఇక్కడ దొరుకుతుందా?" అడిగింది.

    "ఊ" అతను ఒక చిన్న టీ కొట్టు ముందు కారు ఆపాడు. ఇక్కడ ఇంకా రెండు కార్లు, స్కూటర్లు ఆగివున్నాయి.

    "సౌసాల్ పహలే ముఝే తుమ్ సే ప్యార్ థా,

    ముఝే తుమస్ సోర్ ధా...ఆజ్ బీ హై....

    ఔర్ కల్ భీ రహేగా..."

    టీ కొట్టులో వున్న ట్రాన్సిస్టర్ లోంచి పాత వినిపిస్తోంది.

    హర్ష కారు దిగి టీ తీసుకురావడానికి వెళ్ళాడు.

    అమృత పాత వింటూ అనుకుంది, "ప్యార్...ప్రేమ...కదల్ ...లవ్, భాష ఏదైనా భావం రమణీయం! ప్రేమించని ప్రేమింపబడని జీవితాలు ఎందుకు? ప్రేమించిన వాళ్ళని పరిపూర్ణంగా తమ దృష్టిలో స్నానింప చేయలేకపోతే, ఆ పనికిరాని తనువెందుకు?"

    అమృతకి చదువుకొనే రోజుల్లో తన స్నేహితురాలు, ఒక తమిళ అమ్మాయి తెలుగులోకి అనువదించి చెప్పిన కవిత గుర్తుకొచ్చింది.

    "బాగావద్దర్సనం కావాలా? లేక.

    నీ ప్రియురాలి దర్సనం కావాలా అంటే,

    నా ప్రియురాలి దర్శనమే కావాలంటాను!

    ఒకవేళ ఆ దేవుడే నా దర్సనం కావాలనుకుంటే.

    నా ప్రియురాలి మొహం పెట్టుకొని రావలసినదే!"

    ఎంతటి అద్భుతమైన భావన! అందుకేనేమో తపస్సులు మాని మోక్షాన్ని సైతం, చేయిజార్చుకుని, ప్రియురాళ్ళకోసం, పరుగులు పెట్టిన ఋషులు పురాణాల్లో కూడా కనిపిస్తారు.

    అమృత కార్లోంచి క్రిందకి దిగి కారుని ఆనుకుని నిలబడింది. తనని ఎవరో ఆమూలాగ్రం పరీక్షగా చూస్తున్నట్లు వళ్ళంతా తడుముతున్నట్లు భావన కలిగింది.మనం తల ఎత్తకపోయినా ఎవరైనా తీక్షణంగా మననే చూస్తుంటే తెలిసిపోతుంది. ఈ శక్తి ఆడపిల్లలకే అపారం! అందుకే మాటి మాటికి పైట సవరించుకుంటూ వుంటారు. అమృత తలెత్తి చూడగానే ఎదురునుండే స్కూటర్ ని ఆనుకుని నిలబడిన యువకుడు దిక్కున తలదించుకున్నాడు.

    అమృతకి తన కాలేజీ రోజులు గుర్తుకొచ్చాయి.

    "నువ్వు స్టన్నింగ్ బ్యూటీవే. నిన్ను చూస్తుంటే ఆడపిల్లలం మాకే కళ్ళు చెదురుతాయి. ఇంకా మొగపిల్లల సంగతి ఆలోచించు పాపం!" అనేవారు క్లోజ్ ఫ్రెండ్స్.

    పలకరిస్తే రాగాలు పలికే వయస్సు...ఎంత అందమైన వయస్సు....అపస్వరాలు పలకనంత వరకూ!

    హర్ష టీ గ్లాస్ తో వచ్చాడు "ఇదిగో టీ నీకోసం, నా కాఫీకి కొంచెం టైం పడుతుందిట" చెప్పాడు.

    అమృత టీ అందుకుని త్రాగసాగింది.

    హర్ష ఎదురుగుండా వున్న ఫియట్ కారువైపు దృష్టి సారించడం చూసి తనూ అటూ చూసింది అమృత, చాలా మోడర్న్ గా అందంగా వున్న ఓ పద్దెనిమిదేళ్ళ అమ్మాయి హర్షనే చూస్తోంది.

    "నిజంగా హర్ష చాలా హ్యాండ్ సమ్ గా వుంటాడు" గర్వంగా అనుకుంది అమృత.

    హర్ష పెదిమలు చిన్నగా విచ్చుకుని చిరునవ్వు  నవ్వడం చూసి మళ్ళీ ఆ అమ్మాయివైపు చూసింది అమృత.

 Previous Page Next Page