Previous Page Next Page 
నవ్వితే నవ్ రత్నాలు - 1 పేజి 5


                       సోది రాయుళ్ళు

    సోమశేఖరం చాలా హడావిడి పడిపోతున్నాడు. ఇంట్లోనే అటూ ఇటూ పరుగులు పెడ్తున్నాడు.
    అతన్ని చూసి వాళ్లావిడ రత్నాబాయ్ కెవ్వుమని అరిచింది.
    హడావిడిగా అటూ ఇటూ పరుగులు తీస్తున్నవాడు కాస్తా అ అరుపుకి ఠకిమని ఆగిపోయాడు.
    "ఏమైంది?...ఎందుకలా అరిచావ్?" కంగారుగా అడిగాడు సోమశేఖరం.
    "చెప్పండి...బుగ్గమీద ఆ కుంకుమ ఎలా వచ్చింది... ఎవత్తి దగ్గరికెళ్ళొచ్చారు?... చెప్పండి!... చెప్పండి!!... చెప్పండి!!!..." చిందులేసింది రత్నాబాయ్.
    సోమశేఖరం ఆశ్చర్యంగా భార్యవంక చూశాడు.
    "కుంకుమా?... నా బుగ్గమీద?... ఎలా వస్తుంది?"
    "ఎలా వస్తుందని నంగనాచిలా నన్నే అడుగుతున్నారా??.. చెప్పండి... ఎవర్తది?"
    మళ్ళీ చిందులు వేసింది రత్నబాయ్.
    "నువ్వు అలా దుంకడం కాస్త ఆపుతావా?...లేకపోతే కింద పోర్షనువాళ్ళొచ్చి  పీకుచ్చుకుంటారు ఏంటీగోలని...పొద్దున్న లేచిందగ్గర్నుండీ ఇంట్లోనే ఉన్నావ్... నేనెక్కడికి వెళ్తాను?..." కోపంగా అరిచాడు సోమశేఖరం.
    "మీరు అలా అరిస్తే నేను తగ్గిపోతాననా?...హమ్మా!...నేను వంటగదిలో నా పన్లో నేనున్నప్పుడు ఓ అరగంటలో అలా వెళ్ళి ఉండొచ్చుగా?... ఆహా!!... నాకు తెలీదా?... చెప్పండి...ఎవర్తది? చెప్పకపోతే కింద పోర్షనువాళ్ళురావడం కాదు ...నేనే మీ పీకుచ్చుకుంటాను..."
    "ఏంటో... నాకంతా కన్ ఫ్యూజన్ గా ఉంది... ఓ మారిలా అద్దంతే..." అన్నాడు సోమశేఖరం బుర్రగోక్కుంటూ.
    రత్నాబాయ్ అద్దం తీస్కొచ్చి సోమశేఖరానికి ఇచ్చింది.
    అద్దంలో మొహం చూస్కుని సోమశేఖరం "కెవ్వు...కెవ్వు...కెవ్వు..." అని మూడుసార్లు అరిచాడు.
    "ఎందుకలా అరిచావ్ అని నన్నడిగి మీరెందుకలా అరిచారు?... చెప్పండి ఎవర్తది?..."
    "గుర్ ర్...గురగుర...గరగర...బుస్..."
    "మాట్లాడకుండా గుర్రు గుర్రు...బుస్... అంటారేం?"
    సోమశేఖరం రత్నాబాయ్ చేతుల్ని విదిలించికొట్టి విసుక్కుంటూ అన్నాడు.
    "నా పీక పట్టుకుని నులిమేస్తూ మాట్లాడమంటే ఎలా మాట్లాడను?... అది నువ్వనుకుంటున్నట్టు కుంకుమేంకాదు...కంగారుగా గడ్డం గీస్కుంటుంటే బుగ్గమీద చెక్కులేచిపోయింది... చూడు రక్తం ..." చూపుడు వేల్తో చెక్కుకుపోయిన చోట చూపిస్తూ అన్నాడు సోమశేఖరం.
    "అయినా పెళ్ళి ముహూర్తానికి ఇంకా చాలా టైముందికదా??... అంత కంగారేందుకూ?"
    సరిగ్గా టైముకి వెళ్ళమంటవా?.. భలేదానివే...కనీసం రెండు గంటల ముందన్నా వెళ్ళాలి... అక్కడ పెళ్ళి పనుల్లో సాయం చేయాలి...భోజనాల దగ్గర వడ్డనలు చేయాలి!...ఎన్నిపన్లు!ఎన్నిపన్లు!!..."
    "అవన్నీ మీరు చెయ్యడం ఎందుకూ? ఆయనేమైనా మీకు చుట్టమా స్నేహితుడా?"
    "చుట్టం కాకపోతే...ఆయనెవరు?...మా జనరల్ మేనేజర్. తెల్సా?...ఇప్పుడు పెళ్ళి ఆయన కొడుకుదే...పెళ్ళికి పన్లు చేయకుండా సరిగ్గా ముహూర్తం టైంకి వెళ్ళి భోజనాలు చేసోస్తే ఆయనకి కోపంరాదూ?...అసలే నా పేరు ప్రమోషన్ లిస్టులో ఉంది. రేప్పొద్దున్న ఇంటర్వ్యూలో నన్ను ఫెయిల్ చేసినా చేసెయ్యొచ్చు..." అని చెప్పి గోడ గడియారం వంక చూసి కెవ్వుమని అరిచి "టైమైపోయింది...స్నానానికి వేణ్ణీళ్ళు పెట్టేయ్..."అన్నాడు.
    "ఏం కేకలో...ముదనష్టపు కేకలు" అని తిట్టుకుంటూ బాత్రూములో వేడినీళ్ళు పెట్టింది రత్నాబాయ్. సోమశేఖరం బాత్రూములోకి వెళ్ళి తలుపేస్కున్నాడు.
    అప్పడే పక్కింటి సుబ్బాయమ్మ స్టీలు గ్లాసుతో కాఫీపొడి అరువడగడానికి వచ్చింది.
    "ఉండొదినా...ఒక్క క్షణంలో ఇస్తా" అంటూ సుబ్బాయమ్మదగ్గర గ్లాసుతీస్కుని వంటగదిలోకి వెళ్లింది రత్నాబాయ్.
    అదే సమయంలో బాత్రూము తలుపులు తీస్కుని కెవ్వుమని అరుచుకుంటూ బయటికి వచ్చాడు సోమశేఖరం.
    ఒట్టి డ్రాయర్తో బయటికి పరుగెత్తుకుని వచ్చిన అతన్ని చూసి నోటిమీద హవ్వ.. హవ్వ.. హవ్వ.."అని కొట్టుకుని ఓసారి గట్టిగా కేకపెట్టి కిందపడి గిలగిలా పది క్షణాలు కాళ్ళూ చేతులూ కొట్టుకుని మూర్చపోయింది సుబ్బాయమ్మ.
    సుబ్బాయమ్మ కేక విని రత్నాబాయ్ వంటగదిలోంచి కంగారుగా బయటికి వచ్చింది.
    "ఏంటీ అవతారం?... ఎందుకలా డ్రాయర్తో ఈవిడ ముందుకు పరుగెత్తుకు వచ్చారు?... ఒంటినిండా ఎలగుబంటిలా బొచ్చుతో ఉన్న మిమ్మల్నిచూసి ఎలా మూర్చపోయిందో చూశారా?... అయినా ఆ కేకలేంటి ఆ పరుగులేంటి?..." మండిపడ్తూ అంది రత్నాబాయ్.
    "అది కాదే... చెంబుతో నీళ్ళు మీద పోస్కోగానే వీపు కాలిపోయింది..." సణుగుతూ చెప్పాడు.
    "అంత కంగారెందుకూ ...వేణ్ణీళ్ళలో నేను చన్నీళ్ళు తొలపలేదు... కాస్త చూస్కోవద్దూ?...లోపలికి వెళ్ళండి...మీ అవతారం చూడలేక చస్తున్నా..."
    సోమశేఖరం బాత్రూములోకెళ్ళి తలుపేస్కున్నాడు.
    రత్నాబాయ్ సుబ్బాయమ్మ మొహంమీద చల్లనీళ్ళు చల్లి, లేపి కూర్చోబెట్టి జరిగిందానికి క్షమాపణలు చెప్పి కాఫీపొడి ఇచ్చి పంపించేసింది.
    సోమశేఖరం గబగబా స్నానం చేసి బయటకొచ్చి ఓసారి గోడ గడియారం వంక చూసి మళ్ళీ కేవ్ వ్...అని అరిచి డ్రస్సు వేస్కుని "నేనిహ వెళ్ళొస్తా ..."అని భార్యకి చెప్పి వరండాలోకి వచ్చాడు.
    వరండాలో అతనికి నారాయణ కనిపించాడు.
    "ఆ ...ఏంటోయ్...ఏంటి సంగతి?" అని పలకరించాడు నారాయణని_ సోమశేఖరం.
    నారాయణ సోమశేఖరం ఎదురింట్లో ఉంటాడు.
    "ఏం లేదు...ఊర్కేవచ్చా..." అని చెప్పి వరండాలో ఉన్న సోఫాలో కూర్చుని సోమశేఖరం వైపు చూసి "హిహిహి..." అని నవ్వాడు.
    సోమశేఖరం వాచ్ వంక చూస్కుని ఇబ్బందిగా "హిహిహి..."అని నవ్వాడు తనుకూడా.
    "ఏంటీ అలా నిలబడే ఉన్నావ్ ...కూర్చో " అదేదో తన యిల్లు అయినట్టు సోమశేఖరంతో అన్నాడు నారాయణ.
    సోమశేఖరం ఆముదం తాగినట్టు మొహం పెట్టి  బలవంతంగా నవ్వి నారాయణ ఎదురుగా మరో సోఫాలో కూర్చున్నాడు.
    "అదేంటి అంత ఇబ్బందిగా కూర్చున్నావ్... నీకేమైనా పైల్సా?...హిహి..." అని అడిగాడు నారాయణ.
    సోమశేఖరం ఓసారి పళ్ళు పరపరా నూరి "నాకేం పైల్సులేవు..." అన్నాడు సోఫాలో వెనక్కి జారబడి రిలాక్స్ అయి కూర్చుంటూ.
    "నీ పళ్ళు పరపరా భలే శబ్దం చేశాయ్!!... ఏదీ మళ్ళీ నూరు?..." ముందుకు వంగి కుతూహలంగా చూస్తూ అడిగాడు నారాయణ.
     ఎదురింటాయన అంత ముచ్చటపడి అడుగుతుంటే కాదని అంటే బాగుండదని పళ్ళు మరోసారి పరపరలాడించాడు సోమశేఖరం .
    నారాయణ ఎంతో సంబరపడిపోయి "బాగుంది... చాలా బాగుంది..." అన్నాడు.
    ఆ తరువాత తన వంశీయుల్లో ఎవరెవరికి పైల్సు ఉన్నాయో చెప్పాడు. పైల్సుకి ఏయే మందులూ, ఆయింట్ మెంట్సూ వాడాలో చెప్పాడు.
    సోమశేఖరంలో సహనం నశిస్తూ ఉంది. ఓసారి వాచ్ వంక చూస్కుని కెవ్వుమని అరిచాడు.
    "ఏంటి వాచ్ వంక చూసి అలా అరిచావ్?... వాచి అద్దం బద్దలయిందా? ఆ ?.."అడిగాడు నారాయణ.
    "వాచి అద్దం బద్దలవలేదుగానీ టైమైపోతూంది..." మెల్లగా చెప్పాడు సోమశేఖరం.
    "టైమా?...దేనికయిపోతుంది??..."
    తను పెళ్ళికి వెళ్ళాలనీ ముహూర్తం టైము, ఎక్కడ జరుగుతుందీ చెప్పాడు సోమశేఖరం.
    "మరి నేను  వెళ్ళనా?...ఆ??... హిహి" అడిగాడు సోమశేఖరం.
    "అప్పుడే ఎందుకోయ్...ముహూర్తానికి ఇంకా చాలా టైముందిగా...కూర్చో కూర్చో... నీతో మాట్లాడాలని వస్తే వెళ్ళిపోతానంటావేం?..." అన్నాడు నారాయణ.
    "అంటే అక్కడ పెళ్ళి పనులుంటాయ్ కదా... పెళ్ళేమో మా జనరల్ మేనేజర్ కొడుకుది" అంటూ లేచి నిలబడ్డాడు సోమశేఖరం.
    "అయితే ఇంకేం... పెళ్ళి పనులు చేసేవాళ్ళు బోలెడంతమంది ఉంటారు... నువ్వెందుకూ వెళ్ళడం...కూర్చో..."అని సోమశేఖరం  కాళ్ళు పట్టిలాగేశాడు. సోమశేఖరం సోఫాలో దభీమని పడ్డాడు.
    ఆ తరువాత నారాయణ సోమశేఖరంతో బోఫోర్సు గురించీ, ఎన్టీఆర్ తుగ్లక్ పాలన గురించీ, అధిక ధరల గురించీ చెప్పాడు. అతని మాటలు అయ్యేసరికి ముహూర్తం టైం కూడా అయిపోయింది.
    "ఇంక నేనొస్తానోయ్" నారాయణ తృప్తిగా మొహం పెట్టి లేచాడు.
    "ఎక్కడికీ?... ఇంకాసేపు కూర్చుని మాట్లాడు..." పళ్ళు నూర్తూ అన్నాడు సోమశేఖరం.
    "అమ్మో... మా ఆవిడకి టైం ఇచ్చాను. ఇప్పుడు షాపింగ్ కి వెళ్ళాలి!... లేకపోతే వీపు చచీరేస్తుంది..." వాచ్ చూస్కుంటూ లేచాడు నారాయణ.
    "ఉండవోయ్...షాపింగ్ కి రేపైనా వెళ్లొచ్చు...షాపులెక్కడికి పోతాయ్...కాస్సేపు సర్దాగా మాట్లాడుకుందాం...కూర్చో..." అంటూ నారాయణ రెండు కాళ్ళమధ్య తన కాలుపెట్టి మెలేసి కిందపడేసి గుండెలమీద కూర్చున్నాడు సోమశేఖరం.
    అప్పుడు అతనికి చెప్పడం మొదలుబెట్టాడు సోమశేఖరం తెలుగు నవలా సాహిత్యం తీరుతెన్నుల గురించీ, ఆవకాయ పెట్టడం గురించీ...అప్పడాలు వత్తడం గురించీ... ఇంకా వాటి గురించీ వీటి గురించీ...
                                * * *

 Previous Page Next Page