Previous Page Next Page 
ఫాలాక్షుడు పేజి 6


    అహోబలపతి వెళ్ళిపోయాక అయిదు లక్షల కోసం ఆ మర్డర్ ని చేయడానికే నిర్ణయించుకున్నాడు. మర్డర్ చేసి తను తప్పించుకోగలగాలి. అయితే ఎలా?

 

    ప్రస్తుతం ఆదిత్య మెదడును దొలిచేస్తున్న ఆలోచన అది.

 

    జాగింగ్ పూర్తిచేసి, క్యాంటీన్ లో టీ తాగి, హాస్టల్ మెట్లెక్కాడు.

 

    అప్పటికే హాస్టల్ కళకళలాడుతోంది. రీడింగ్ రూమ్ లో... స్టూడెంట్స్ డైలీపేపర్స్ ని తిరగేస్తున్నారు.

 

    "నిజాం కాలేజీలో మీటింగ్. నాలుగ్గంటలకే మనం అక్కడుండాల" ఓ స్టూడెంట్ తన చేతిలోని ఈనాడు పేపర్లో ఓ పేజీని చూస్తూ అన్నాడు.

 

    యాంత్రికంగా ఆ పేపర్ని అందుకున్నాడు ఆదిత్య.

 

    "నిజాం కాలేజీలో అధికార పార్టీ వార్తతోపాటు లోన, బయట ఎరేంజ్ మెంట్స్... పార్కింగ్ ప్లేసులు... ప్రవేశ ద్వారాలు... వి.ఐ.పీ... ప్రవేశద్వారాలు... సెక్యూరిటీ ఎరేంజ్ మెంట్స్ కి సంబంధించి పోలీస్ డిపార్ట్ మెంటు... ముందు జాగ్రత్త చర్యగా-

 

    ఓ మ్యాప్ ని ప్రచురించింది!

 

    ఆ పేపర్ తీసుకుని తన రూమ్ లోకెళ్ళి నిశితంగా ఆ మేప్ ను చూస్తూ, ఆలోచిస్తూ చాలాసేపు అలా వుండిపోయాడు ఆదిత్య.

 

    తను చదివిన క్రైమ్ స్టోరీస్, ఎడ్వంచర్స్ లోని కిల్లర్స్ అందరూ కళ్ళముందు కదలాడుతున్నారు.

 

    నిర్దోషుల్ని ఎలా తప్పించాలో తెలుసుకోవడం కోసం క్రిమినాలజీ మీద ఆసక్తిని పెంచుకున్న తను...

 

    అనుకోని పరిస్థితుల్లో కిల్లర్ అవుతున్నాడు.

 

    అతని పెదవుల మీదకు చిత్రమైన నవ్వొచ్చింది.

 

    వరల్డ్ గ్రేట్ క్రైమ్స్... డి రియల్ అసాసెన్స్... పుస్తకాలన్నీ తిరగేశాడు.

 

    అతని మెదడులో అస్పష్టంగా ఏదో ఆలోచన కదలాడుతోంది...

 

    ఎనిమిదీ నలభై అయిదు నిమిషాలకు బాత్ రూమ్ లోకెళ్ళి తొమ్మిది గంటలకు బయటికొచ్చాడు.

 

    సరిగ్గా తొమ్మిదీ పదిహేను నిమిషాలకు రూమ్ లోంచి బయటపడి ఆటోని పిలిచాడు.

 

    "నిజాం కాలేజీ..." అని చెప్పి కూర్చున్నాడు.

 

    మరో ఇరవై నిమిషాల్లో ఆటో నిజాం కాలేజీ దగ్గర ఆగింది. ఆటోను వెయిట్ చెయ్యమని లోపలకు నడిచాడు.

 

    అప్పటికే...

 

    అధికారపార్టీ కార్యకర్తలు స్టేజ్ ని చాలా అందంగా అలంకరించే కార్యక్రమంలో వున్నారు. దూరంగా పోలీసులు అటూ ఇటూ తిరుగుతున్నారు.

 

    స్టేజి... వి.ఐ.పీ. గ్యాలరీ... ఎమ్మెల్యే సీట్స్... ఒక్కొక్క పాయింట్ నూ నిశితంగా పరిశీలిస్తున్నాడు. స్టేజీకి దగ్గరలో ప్రెస్ అన్న బోర్డ్ కనిపించింది. దాని వెనుక పాతికదాకా కుర్చీలు వేసి చుట్టూ బారి కేడ్స్ కట్టివున్నాయి. వి.ఐ.పి. గ్యాలరీలోకిగాని, ఎం.ఎల్.ఏ, ఏం.పీల గ్యాలరీలోకిగాని వెళ్ళటం చాలా కష్టం. మంత్రుల గేలరీకి వెళ్ళటం అసాధ్యం. అధికారుల గేలరీలోకి అసలే వీలుపడదు. ఇక మిగిలింది ప్రెస్ గ్యాలరీ మాత్రమే... అక్కడకు వెళ్ళగలిగితేనే డిస్టెన్స్ సరిపోతుంది. లేదంటే తన దగ్గరున్న పిస్టల్ కి టార్గెట్ డిస్టెన్స్ దూరమైపోతుంది. అందుకే ప్రెస్ మీద అతని దృష్టి పడింది. ప్రెస్ ఫోటోగ్రాఫర్స్ అన్న చిన్న బోర్డుని నిశితంగా పరిశీలించి ఏదో నిర్ణయించుకున్నవాడై మళ్ళీ వెనక్కొచ్చాడు...

 

    అప్పటికి తొమ్మిదీ నలభై అయిదు నిమిషాలైంది.


                           *    *    *    *    *


    కాలింగ్ బజర్ నొక్కి అపార్ట్ మెంట్ ముందు నుంచున్నాడు ఆదిత్య.

 

    ఎలక్ట్రానిక్ కాలింగ్ బెల్... రకరకాల బర్డ్స్ స్వరాలతో రెండు మూడుసార్లు మెత్తగా అరిచి వూరుకుంది.

 

    మరో రెండు ఘడియల్లో తలుపు తెరచుకుంది.

 

    ఎదురుగా ఓ వ్యక్తి నుంచున్నాడు. అతన్ని చూడగానే గుర్తుపట్టాడు ఆదిత్య.

 

    "మైనేమీజ్ ఆదిత్య. మీతో చిన్న పనుండి వచ్చాను..." చెప్పాడు ఆదిత్య.

 

    ఎదురుగా నుంచున్న వ్యక్తిపేరు రమేష్ చంద్ర. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. లోనికి ఆహ్వానించాడాయన.

 

    "రెండు నెలల క్రితం మీరు మా హాస్టల్ కి వచ్చారు. స్టూడెంట్స్ ఫోటోలు తీసుకోవడం కోసం... అప్పుడు నా ఫోటోలు కూడా తీశారు. ఒక రీలంతా ఎక్స్ పోజ్ చేసినట్టు గుర్తు..." కుర్చీలో కూర్చుంటూ చెప్పాడు ఆదిత్య.

 

    ఆదిత్యను చూడగానే ఆ విషయం గుర్తుకొచ్చింది రమేష్ చంద్రకి.

 

    "ఓ బొంబాయి యాడ్ కంపెనీకి కొత్త మేల్ మోడల్స్ కావాలంటే... ఎక్స్ పెరిమెంటల్ గా కొంతమంది స్టూడెంట్స్ ఫోటోలు పంపాను. వాటిల్లో మీ ఫోటోలు కూడా వున్నాయి. ఆ యాడ్ ఏజెన్సీ నుంచి నాకింకా రిప్లయేం రాలేదు. అందుకే మీకు ఇన్టిమేట్ చేయలేకపోయాను."

 

    ఫ్రిజ్ లోంచి కూల్ డ్రింక్ బాటిల్ ని తీసి, టీపాయ్ మీద పెడుతూ అన్నాడు రమేష్ చంద్ర.

 

    "మీకు ప్రెస్ ఐడింటిటీ కార్డుందా..." అడిగాడు ఆదిత్య.

 

    ఉందన్నట్టుగా తలూపాడు రమేష్ చంద్ర.

 

    "ఇవాళ నిజాం కాలేజీ మీటింగ్ ని కవర్ చెయ్యడానికి వెళ్తున్నారా..." అడిగాడు ఆదిత్య.

 

    "లేదండీ... పర్సనల్ వర్క్ వుంది..." చెప్పాడు రమేష్ చంద్ర.

 

    "మీరు నాకో హెల్ప్ చెయ్యాలి. నాకు ఫోటోగ్రఫీ హాబీ. ఆ ప్రోగ్రామ్ ను నేను కవర్ చెయ్యాలనుకుంటున్నాను. నా పర్సనల్ ఆల్బమ్ కోసం... మీ ఐడింటిటీ కార్డు. మీ కెమేరా నాకివ్వగలరా..."

 

    ఆదిత్య ముఖ్యంలోకి సూటిగా చూశాడు రమేష్ చంద్ర.

 

    "నా ఐడెంటిటీతో మీరు వెళ్ళడం క్రైమ్... మీరు పోలీసులకు దొరికితే నా కార్డు కేన్సిల్ చేస్తారు..." సిన్సియర్ గా చెప్పాడు రమేష్.

 

    "లేదు... ఐ కెన్ మేనేజ్ ఇట్. రాజీవ్ గాంధీ మీటింట్స్ లాంటి వాటికే ప్రెస్ వాళ్ళని తనిఖీ చెయ్యడం లేదు." ఆదిత్య మాటల్లోని వ్యంగ్యాన్ని అర్ధం చేసుకున్నాడు రమేష్ చంద్ర.

 

    ఆలోచనలో పడ్డాడతను.

 

    "మీ కెమేరాతో నాకు రెండుగంటలు మాత్రమేపని. ఐ విల్ పే యు... రీజనబుల్ రెంట్..."

 

    ఆ మాటకు రమేష్ చంద్ర కళ్ళు మెరిశాయి.

 

    "నాది కాస్ట్ లీ కెమేరా" డిటైల్స్ చెప్పాడు రమేష్ చంద్ర.

 

    విషయం అర్ధమైంది ఆదిత్యకు.

 

    "టూ అవర్స్ కీ, టూ థౌజండ్ రూపీస్ యిస్తాను... ఓ.కేనా?" చెప్పాడు ఆదిత్య.

 Previous Page Next Page