Previous Page Next Page 
ఫాలాక్షుడు పేజి 7


    రమేష్ చంద్ర ఏం మాట్లాడలేదు.

 

    "పనైపోగానే మీ కెమేరాని జాగ్రత్తగా తెచ్చిస్తాను..." అన్నాడు ఆదిత్య.

 

    "కెమేరా ఎప్పుడు తీసుకెళ్తారు..." మెత్తబడ్డాడు రమేష్ చంద్ర.

 

    "సరిగ్గా ఆరుగంటలకొస్తాను. కెమెరా రెంట్ కూడా అప్పుడే యిస్తాను..." అన్నాడు ఆదిత్య.

 

    రెండుగంటలిస్తే రెండు వేలొస్తాయి. ఎందుకొదులుకోవాలనుకున్నాడు రమేష్ చంద్ర.

 

    "నెగిటివ్ ఫిల్మ్, పెన్ సెల్స్ ఖర్చు మీదే. మీ అడ్రస్సు, మీ డిగ్రీ సర్టిఫికెట్ నా దగ్గర పెట్టి కెమేరా పట్టుకెళ్ళండి. నా జాగ్రత్తలో నేనుండాలిగా..." నవ్వుతూ అన్నాడు రమేష్ చంద్ర.

 

    ఖైరతాబాద్ లోని ఆ అపార్ట్ మెంట్ లోంచి బయటికొచ్చి, ఆటో ఎక్కాడు ఆదిత్య.

 

    "మెహదీపట్నం... పోనియ్..." అని చెప్పి ఆటోలో కూర్చున్నాడు.


                           *    *    *    *    *


    మెహదీపట్నం స్టేట్ బ్యాంక్ ముందు....

 

    ఆటో దిగిన ఆదిత్య అక్కడే నిలబడి అటూ ఇటూ చూస్తుండగా బోంబే డైయింగ్ సూట్లో వున్న ఓ వ్యక్తి ఆదిత్య దగ్గర కొచ్చి...

 

    "మీ పేరేనా ఆదిత్యకుమార్..." అనడిగాడు గంభీరంగా.

 

    తలూపాడు ఆదిత్య.

 

    జేబులోంచి ఓ కవర్ ని తీసి, ఆదిత్య చేతిలో వుంచి...

 

    "ఆ కారూ... ఆ డ్రైవరూ... సాయంత్రం... ఆరుగంటల వరకూ మీ కస్టడీలో వుంటారు..."

 

    రోడ్డుకు ఎడం పక్కన పార్క్ చేసున్న బ్లాక్ అంబాసిడర్ కారుని చూపిస్తూ అన్నాడా వ్యక్తి.

 

    కవర్ లోంచి చెక్ ని తీసి చూశాడు ఆదిత్య.

 

    ఫైవ్ లాక్స్ రుపీస్ వర్త్ బేరర్ చెక్.

 

    "కారులో... ఖాళీ సూట్ కేసుంది... మీకోసం..." అన్నాడా వ్యక్తి పరిసరాల్ని నిశితంగా గమనిస్తూ-

 

    "అంటే... నన్నే బ్యాంక్ కి వెళ్ళి డ్రా చేసుకొమ్మనా?" ప్రశ్నించాడు ఆదిత్య.

 

    అవునన్నట్లు తలూపాడతను.

 

    "లేదు... మీరే వెళ్ళి కేష్ డ్రా చేసి తెచ్చి నాకివ్వండి" అన్నాడు ఆదిత్య ముందు జాగ్రత్త కోసం.

 

    అతనొక్కక్షణం ఆలోచించి ఆదిత్య చేతిలోని చెక్... సూట్ కేసు తీసుకుని బ్యాంక్ లో కెళ్ళాడు.

 

    వెళ్ళిన అరగంటకు ఆ వ్యక్తి కేష్ తో తిరిగొచ్చాడు. బరువైన సూట్ కేస్ ని ఆదిత్య కిచ్చాడు.

 

    "సీ యూ... మిస్టర్ ఆదిత్యా... ఫిర్ మిలేంగే..." అంటూ ముందుకెళ్ళిపోయి ఆటో ఎక్కేశాడు ఆ వ్యక్తి.

 

    మీ పేరు... అతన్ని అడగాల్సిన ప్రశ్న ఆదిత్య నోట్లోనే వుండిపోయింది.

 

    వెంటనే ఆ సూట్ కేస్ తో కారెక్కాడు ఆదిత్య.

 

    అతనికెందుకో చాలా ఆనందంగా వుంది.

 

    జీవితంలో మొట్టమొదటిసారి... అంత డబ్బును కళ్ళారా చూసిన ఆదిత్యకు...

 

    కలో... నిజమో అని డౌటుగానే వుంది!

 

    అకస్మాత్తుగా అతని చెయ్యి ఫ్యాంటు కుడి జేబుకి తగిలింది. ఆ జేబులో పిస్టల్ వుంది.

 

    మనిషి చేసిన కరెన్సీ, మనిషి చేసిన మారణాయుధాలు, మనిషినే కీలుబొమ్మగా ఆడిస్తాయన్న దానికి నిదర్శనంగా వుందా ప్రాణంలేని పిస్టల్.

 

    ఆ పిస్టల్ తో లోపలకు వెళ్తే ఖచ్చితంగా భద్రతా సిబ్బంది పసిగడుతుంది.

 

    మెటల్ డిటెక్టర్స్ మధ్యనుంచి వెళ్ళవలసి వస్తే మరీ ప్రమాదం. తను తేలిగ్గా దొరికిపోవటం యింటరాగేషన్ జైలు తప్పదు.

 

    తనకిచ్చిన పిస్టల్ అహోబలపతి దయ వుండదు. అతనంత తెలివి తక్కువ వాడు కాదు. అక్రమంగా సాధించిన ఆయుధాన్నే తనకిచ్చి వుంటాడు. జరిగినదంతా చెప్పినా ఎవరూ నమ్మరు.

 

    తనంత తేలిగ్గా దొరికిపోతే తనని పోలీసులు వదిలినా, అహోబలపతిరావు మాత్రం వదలడు.

 

    ఎలా... ఏం చేయాలి...?

 

    ఆదిత్య మెదడు చురుగ్గా పనిచేస్తోంది.

 

    ఆయుధాన్ని ముందే అక్కడకు చేర్చాలి... ఎస్... అదొక్కటే పరిష్కారం.

 

    ఆ ఆలోచన వస్తూనే క్షణాల్లో డ్రైవర్ కి ఎక్కడికి వెళ్ళాలో చెప్పాడు.


                                              *    *    *    *    *


    మరో పదినిమిషాలకు తెలంగాణా ప్రాంతానికి చెందిన కూలివాడి వేషంలో నిజాం గ్రౌండ్స్ లోకి ప్రవేశించాడు ఆదిత్య.

 

    తలకి పాగాలాగా ఒక తుండు గుడ్డ, అరచేతుల బనియన్, గళ్ళలుంగి, తోలు చెప్పులు, చెవిలో బీడీ, చేతుల్లో పలుగు, పార...

 

    అహోబలపతిరావు కారు డ్రైవర్ ఆశ్చర్యపోయి చూస్తుండగానే పాతిన సర్వే కడ్డీలు గట్టిగా వున్నది- లేనిది పరీక్షిస్తున్నట్టు నటిస్తూ క్రమంగా ప్రెస్ గ్యాలరీ దగ్గరకు వెళ్ళాడు ఆదిత్య.

 

    అప్పుడక్కడ వున్న చాలా మంది పనివాళ్ళు, ఎలక్ట్రీషియన్స్, పార్టీ కార్యకర్తలు ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమయి వున్నారు.

 

    ఆదిత్యను ఒకరిద్దరు చూసినా పనివాడనుకొని పట్టించుకోలేదు.

 

    పాతిన గుంజని కదిపి చూసి గట్టిగా లేదే అని దగ్గరలో వున్న పోలీసుకి వినిపించేలా అని-దాన్ని తవ్వి తీసి, ఆ గోతిని మరింత లోతుగా తవ్వే పనిలో నిమగ్నమయ్యాడు ఆదిత్య.

 

    అక్కడ కూడా వున్న పోలీసుల్ని ఓ కంట పరిశీలిస్తూనే చటుక్కున బొడ్లో వున్న పిస్టల్ ని తీసి కాళ్ళ సందున వుంచుకుని, గుంజను తిరిగి గోతిలోకి దింపి కొంత మట్టిపోసి కనురెప్పపాటులో పిస్టల్ ని అందులో వుంచి తిరిగి మట్టి కప్పాడు.

 

    శారీరక శ్రమతో, భయంతో, ఆదిత్య వళ్ళంతా తడిసిపోయింది.

 

    మూడో సర్వేకడ్డీ... అని మనసులో గొణుక్కొని మెల్లగా అక్కడినుంచి జారుకుని బయటకొచ్చి, ఎవరూ చూడటం లేదని గ్రహించాడు. చటుక్కున కారెక్కాడు.

 

    రడీగా వున్న డ్రైవర్, కారుని ముందుకి దూకించాడు.

 

    అప్పుడు రిలాక్సయ్యాడు ఆదిత్య.

 

    ఒక పనయిపోయింది. ఆయుధం చేరవలసిన స్థలానికి చేరింది. మెటల్ డిటెక్టర్స్ మధ్యనుంచి తను
వెళ్ళవలసి వచ్చినా ప్రమాదంలేదు. ప్రెస్ ఫోటోగ్రాఫర్ అని నమ్మించగలిగితే చాలు... లోపలకు వెళ్ళిపోవచ్చు. ఆపైన మూడో సర్వేకడ్డీకి దగ్గర్లో వున్న కుర్చీని ఆక్రమించుకోగలిగితే, ఆయుధం తన చేతుల్లో వుంటుంది.

 Previous Page Next Page