"నువ్వు షాక్ తిని కిందపడిపోతావేమో..." అన్నాడు అహోబలపతి.
"నాకు పొలిటికల్ లీడర్స్ లో ఫ్రెండ్స్ లేరు."
"నాకు తెలుసులే, చెప్తాను విను..." అని ఆదిత్య, నిజాం కాలేజీలో ఎవర్ని చంపాలో, ఆ పేరు చెప్పాడు అహోబలపతి.
ముందు తను విన్నదేమిటో అర్థంకాలేదు ఆదిత్యకు. అర్ధంకాగానే బాంబుమీద కాలేసినట్లు భయపడిపోయాడు.
అర్ధం కానట్లు కొన్ని క్షణాలు అహోబలపతికేసే అయోమయంగా చూశాడు.
అహోబలపతి స్ట్రాటజీ జీర్ణంకాగా పిచ్చి చూపులు చూస్తూండిపోయాడు.
ఒకింత సేపటికిగాని తేరుకోలేకపోయాడు. తేరుకొని 'నీకేమన్నా పిచ్చి పట్టిందా, మతి భ్రమించిందా' అన్నట్లు ఆహోబలతికేసి చూశాడు.
అతను మాత్రం ప్రశాంతంగా చూస్తున్నాడు.
"ఈజిట్... ట్రూ... ఎందుకు... ఎందుకు?!!"
"నో మోర్ క్వశ్చన్స్... ఫైవ్ లాక్స్ ఇచ్చుకుంటూ... నిన్ను నేను... కన్విన్స్ చేసుకునే పరిస్థితి నాకు లేదు."
"ఎస్... అఫ్ కోర్స్... బట్..."
"కానీల్లేవు... ఆదిత్యా! నువ్వు మర్డర్ ప్లాన్ చేయాల్సింది. మర్డర్ చేయాల్సిందీ నన్నే... ఎస్... ఈ అహోబలపతినే... పొలిటికల్ గేమ్ లో యిదో పార్ట్... అంతకంటే నేనేం చెప్పలేను."
"తనను తానే మర్డర్ చేయించుకొనేందుకు ఎవరయినా, ఎప్పుడయినా, ఎవరి దగ్గరికయినా వెళతారా?!"
"ఏమో నాకు తెలీదు... ఇందిరాగాంధీ చనిపోతే ఎవరు పదవిలోకొచ్చారు? రాజీవ్ గాంధీ చనిపోతే ఏ పార్టీ పదవిలోకొచ్చింది? మాగంటి రవీంద్రనాథ్ చౌదరి చనిపోతే ఆయన భార్య మంత్రయిపోలేదా? సిరిమావో బండారు నాయక్ శ్రీలంకకి ఎలా ప్రధానయ్యింది? ఖలీద్ జియా బేగం, బెనజీర్ బుట్టో సంగతి?
సానుభూతి రాజకీయాలు మన దేశంలోనే కాదు... విదేశాల్లోనూ వున్నాయి. మొన్నటికి మొన్న ప్రసన్నకుమార్ రెడ్డి కోవూర్ లో ఎమ్.ఎల్.ఎ. ఎలా అయ్యాడు? అదన్నమాట సంగతి... నాకూ పుల్లలు వున్నారు. వాళ్ళు ఎమ్.ఎల్.ఏ. లు, ఎంపీలు, మంత్రులు కావాలని నాకుండదా? ఉంటుంది... ఇకింతకు మించి నేనేం చెప్పను... పని జరిగాక నేనేం ఆశించింది నీకే అర్ధమైపోతుంది" అన్నాడు అహోబలపతి ఎక్కడో ఆలోచిస్తూ.
విషయం అర్ధమైపోయింది ఆదిత్యకు.
"మీరు చచ్చి... మీ కొడుకుని మంత్రిని చేస్తారన్నమాట? గొప్ప త్యాగమే! ఇండియన్ పాలిట్రిక్స్ కొత్తమలుపు తిరుగుతున్నాయి మీలాంటి వాళ్ళ మూలంగా."
"అంతేగదా మరి" నర్మగర్భంగా అన్నాడు అహోబలపతి.
"మరి... మీరు మర్డరైపోతే నన్నెవరు సేవ్ చేస్తారు?" ఆదిత్య మనసులో భయం ప్రవేశించింది.
"నువ్వు పోలీసులకు దొరక్కుండా తప్పించుకోలేవా? నీ క్రిమినల్ నాలెడ్జ్ మీద నీకు నమ్మకం లేదా?" లేచి నిలబడ్డాడు అహోబలపతి.
"చూడు మిస్టర్ ఆదిత్య... ఈ రహస్యం... నీకూ నాకూ తప్ప మరెవ్వరికీ తెలీదు. రేపుదయం నీ పోగ్రామ్స్ నువ్వు డిసైడ్ చేసుకో... ఇంకొక విషయం... మర్డర్ దేంతో చేస్తావ్?"
"ఇంకా నిర్ణయించుకోలేదు" టక్కున జవాబిచ్చాడు ఆదిత్య.
"నేనే నీకు పిస్టల్ ఇస్తున్నాను... టూ రౌండ్స్ బులెట్స్ తో" అని ఓ చిన్న ప్లాస్టిక్ బాక్స్ ను అందించాడు అహోబలపతి.
ఆ ప్లాస్టిక్ బాక్సును విప్పి చూశాడు ఆదిత్య.
అంతవరకూ పిస్టల్, రైఫిల్ గురించి - క్రైమ్ స్టోరీస్ లో డిటెక్టివ్ మేగజైన్స్ లో చదవడమే తప్ప, అదే మొట్టమొదటిసారి... పిస్టల్ ని చూడడం.
"బీ... కేర్ ఫుల్" అహోబలపతి ఆ గదిలోంచి బయటికెళ్ళాడు.
కర్టసీసీక్ గా ఆదిత్య కూడా ఆ గదిలోంచి బయటకు రాబోయాడు.
"నువ్వుండు మిస్టర్ ఆదిత్యా! నువ్వెలా ఉంటావో మా వాళ్ళకు తెలీడం నాకిష్టంలేదు" గబగబా ముందు కెళ్ళి మెట్లు దిగడానికి మలుపు తిరిగాడు అతను.
అప్పుడు సరిగ్గా రాత్రి 2 గంటలయ్యింది.
అహోబలపతికి, తనకీ జరిగిన సంభాషణ గురించి, అనుకోకుండా వచ్చే అయిదు లక్షల గురించి, చెల్లెలు గురించి ఒంటరిగా ఆలోచిస్తూ చాలాసేపు కూర్చుండిపోయాడు ఆదిత్య.
మంచమ్మీద ఓపెన్ చేసిన ప్లాస్టిక్ బాక్సులోంచి రాత్రి వెలుగులో నిగనిగలాడుతూ మెరుస్తోంది పిస్టల్.
* * * * *
అప్పుడు సరిగ్గా రాత్రి రెండు గంటలయ్యింది.
అహోబలపతి ప్రత్యర్ధి, గుర్రం పెద్దబ్బాయి నగరంలోని మలక్ పేట పోలీస్ స్టేషన్ లోంచి బయటికొచ్చి మారుతీ కారెక్కాడు. అతన్ని సాగనంపడానికి సర్కిల్ ఇన్స్ పెక్టర్ గేటువరకూ వచ్చాడు.
బాగా వెతికించయ్యా... ఇన్స్ వెట్రూ... ఆ పిస్టల్ కి లైసెన్స్ వుంది. రెండ్రోజులుగా దానికోసమే వెతుకున్నాను" అన్నాడు గుర్రం పెద్దబ్బాయి.
"డోన్ట్ వర్రీ పెద్దబ్బాయిగారూ! మరోసారి ఇంటిలో వెతకండి... ఆ మధ్య మీ రాజంపేట ఎమ్మెల్యే కూడా తన పిస్టల్ పోయిందని కంప్లెయింట్ యిస్తే యిల్లంతా వెతికాం. బెడ్ రూమ్ లో బాంబులు దొరికాయండీ బాబూ... పిస్టల్ కేసు కాదుగానీ, ఆ బాంబు కేసుని ఎట్లా డీల్ చేయాలో తెలీక మధ్యన మేం చచ్చాం" నవ్వుతూ అన్నాడు సర్కిల్ ఇన్స్ పెక్టర్ ధర్మనారాయణ.
"అపోజిషన్ వాళ్ళ దగ్గర ఏవుంటాయయ్యా? శ్రీశైలం డామ్ కాంట్రాక్ట్ లా? మెడికల్ కాలేజీ పర్మిషన్లా? బీరు ఫ్యాక్టరీల లైసెన్స్ లా? నువ్వు భలేవాడివయ్యా! బాగా వెతికించు" మారుతీకారు పెరుగెత్తడానికి సిద్ధంగా వుంది.
"ఎందుకు దొరకవు సార్? కారు షెడ్డులో కరెన్సీ బాక్సులు దొరుకుతాయి" నవ్వుతూ అన్నాడు ధర్మనారాయణ.
"నీకు చాలా విషయాలు తెలుసుగానీ... ముందు... నా పిస్టల్ సంగతి చూడు" చిరాగ్గా అన్నాడు గుర్రం పెద్దబ్బాయి.
నల్ల తారు రోడ్డుమీద తెల్ల మారుతీకారు సర్రున జారిపోయింది.
అప్పుడు రాత్రి సరిగ్గా మూడు గంటలయ్యింది.
* * * * *
ఇంకా పూర్తిగా తెల్లవారలేదు.
విశాలమైన ఆర్ట్స్ కాలేజీ రోడ్డుమీద జాగింగ్ చేస్తున్నాడు ఆదిత్య.
రాత్రంతా నిద్రలేకపోవడంవల్ల కళ్ళు మండుతున్నాయి. అహోబలపతి రావడం, మాట్లాడటం అంతా ఒక కలలాగా వుంది. భయంకరమయిన కల...