కంగారుగా ;లోపలికి వచ్చిన ఎయిర్ హోస్టెస్ ని చూసి కన్ను గీటాడు పైలట్.
"వాట్ డియర్! వాట్ హజ్ హాప్ఫెన్ద్ద్!" అన్నాడు సరదాగా.
"ట్రబుల్!" అని, తను చూసింది చెప్పింది ఎయిర్ హోస్టెస్. పెదిమలు బిగపట్టి, కొద్ది క్షణాలు ఆలోచించాడు పైలట్.
ఆ తర్వాత కంట్రోల్ టవర్ ని కాంట్రాక్ట్ చేసి, ఇంజన్లని ఆపేశాడు.
కో పైలట్ తో కలసి కిందికి దిగి వెళ్ళి , లాంజ్ లో ఎక్కువ జనం లేని ఒక చోట నుంచి తన ఎయిర్ లైన్స్ కంపెనీకి ఫోన్ చేశాడు.
"గిరీ! ఐ వాంట్ టు టాక్ టు ద టాప్ బాస్ " అన్నాడు అర్జంటుగా.
కంపెనీ ఓనరు లైన్లో కి వచ్చాడు.
"యస్ ! వాటీజ్ ఇట్!" అన్నాడు అసహనంగా. అర్దారాత్రి నిద్రలేపారు అతన్ని. అందుకే అసహనంగా వున్నాడు.
"సర్! నేను తీసుకేళ్ళుతున్న ఎయిర్ క్రాప్ట్ సరైన కండిషన్ లో లేదని నా అనుమానం."
"అనుమానమా? నిజమా?" అన్నాడు కంపెనీ ఓనరు పదునుగా.
కాస్త అలోచించి, "అనుమానమే " అన్నాడు పైలట్.
"అనుమానం పెనుభూతం అన్నారు విన్లేదా -- వెళ్ళు -- ఆ పాసెంజరు మందల్ని డిల్లీలో దింపు" అన్నాడు ఓనరు.
"కానీ"
"వాదన వద్దు. గుర్తుంచుకో -- ఇది కరువు కాలం. నిరుద్యోగ పర్వం. మీ పైలట్ లకు ఉద్యోగాలు దొరకటం గగనమైపోతుంది. లేని పగుళ్ళు చూసి గుండెలు పగిలిపోయే పిరికి పందలు నాకు అక్కర్లేదు . అర్ధమయిందా?"
'అర్ధమయింది " అన్నాడు అప్పటిదాకా భయంతో బిక్కచచ్చిపోయి ఉన్న పైలట్.
ప్రాణభయం కన్న బతుకు భయం ఇంకా చెడ్డది గదా!
ఉద్యోగం లేకపోతే తనూ, తనతో బాటుగా తన భార్యా బిడ్డలూ రోడ్డున పడక తప్పదని అతనికి తెలుసు.
"నీ సలహా ఏమిటి ?' అన్నాడు కో పైలట్ తో.
"విమానం క్రాష్ అయితే ఓనర్ గాడికి నష్టం లేదు. వాడికి ఇన్సురెన్స్ వస్తుంది. డ్యూటీ చెయ్యకపోతే మనకి నష్టం! వేరే ఉద్యోగం దొరుకుతుందన్న ష్యూరిటీ లేదు" అన్నాడు కో పైలట్.
"దట్ సేటిల్స్ ఇట్ !" అని తిరిగి వచ్చి , కాక్ పిట్ లోకి వెళ్ళాడు పైలట్, కో పైలట్ అతన్ని అనుసరించాడు.
"ఏమయింది ?" అన్నాడు రాజు ఎయిర్ హోస్టెస్ తో.
"ఏమీ కాలేదు. అన్నీ మీ భయాలు " అంది ఎయిర్ హోస్టెస్ , తన భయాలను బయటపదనివ్వకుండా.
కొద్ది నిమిషాల తర్వాత విమానం గాల్లోకి లేచింది.
విమానంలో ఉన్న డిఫెక్ట్ తెలిసిన వాళ్ళు క్షణ క్షణం గండంగా ఫీలవుతుండగా తెలీని వాళ్ళు మగత నిద్రలో ఉన్నారు.
అందరికీ దిండ్లు సరిచేసింది ఎయిర్ హోస్టెస్. రాజుకీ, సృష్టి కీ గుడ్ నైట్ చెప్పి , కాక్ పిట్ లోకి నడిచింది.
"కమ్ !' అన్నాడు పైలట్.
"మే ఐ హావ్ ఏ సీట్?" అంది ఎయిర్ హోస్టెస్ వగలుపోతూ.
"ఇక్కడ కూర్చో!' అని తన వడి చూపించాడు పైలట్ విలాసంగా.
వాళ్ళకి ఇట్లాంటివి రొటీనే.
ఒక గంట ప్రయాణం తర్వాత - కో పైలట్ అన్నాడు.
'అరె! అరెరే! సడెన్ లీ వీ ఆర్ లూసింగ్ అల్టిట్యూడ్ ! అనుకోకుండా భూమిని సమీపిస్తున్నాం మనం !"
వెంటనే అలర్ట్ అయ్యాడు పైలట్.
అప్పటికే ఎయిర్ క్రాప్ట్ ముందు భాగం భూమిని గుద్దేసేటంత దగ్గరికి వచ్చింది.
"గెయిన్ అల్టిట్యూడ్..... గెయిన్ అల్టిట్యూడ్" అంటున్నాడు కోపైలట్ విహ్వలంగా.
సడెన్ గా విమానాన్ని పైకి మళ్ళించాడు పైలట్.
నేలకి తాకబోతున్న విమానం ముందు భాగం పైకి లేచింది.
కానీ -
పూర్తిగా పైకి లేవని వెనక భాగం మాత్రం భూమిని తాకింది !
వెంటనే -- బ్రహ్మండమైన శబ్దంతో , విమానం మధ్యకి రెండుగా విరిగింది.
దాని తోక భాగంలో మంటలు లేచాయి.
* * *
ముక్కులోకి పొగ పోతూ, కాలికి సెగ తగులుతూ ఉండేసరికి రాజుకి స్పృహ వచ్చింది.
ఒక్క క్షణం పాటు తనెక్కడ ఉన్నాడో , జరిగింది ఏమిటో అర్ధం కాలేదు.
నేలమీద వెల్లకిలా పడి ఉన్నాడతను.
ఏమయింది ?
వెంటనే స్పురించింది.
ప్లేన్ క్రాష్!
మరి ..... తన ప్రక్కన వుండిన ఆ అమ్మాయి , సృష్టి , ఏమయింది ?
అతి కష్టం మీద పక్కకి తిరిగి చూశాడు.
అల్లంత దూరంలో సృష్టి, స్పృహ లేకుండా పడి వుంది.
లేవబోయాడు రాజు.
కానీ వళ్ళు స్వాధీనంలో లేదు.
మెడ మాత్రం తిప్పి అన్ని వైపులా చూశాడు.
ఎటు చూసినా మృతదేహాలూ, విమానం తాలూకు శకలాలు.
అతని మనసు బాధతో మూలిగింది.
ఎంత మంది మరణించి ఉంటారు?
ఇంతమందిలో తను ఒక్కడే బతికి బయటపడ్డాడా!
చిత్రంగా - తులసీరావు గారు చెప్పినట్లుగానే అంతా జరుగుతోందే! కాకతాళీయం అంటే ఇదే కాబోలు!
తను టైటిలు గెల్చుకోవడం తప్పనిసరి అన్నాడు అయన.
అట్లాగే తిరుగు ప్రయాణంలో యాక్సిడెంటు అయి తను మరణించడం కూడా తప్పదన్నాడు.
బహుశా , ఇంకొద్ది క్షణాల్లోనే నిమిషాల్లోనో తను చనిపోతాడు కాబోలు!
రాజుకి ఇంకో ఆలోచన కూడా వచ్చింది . అలా కాకపోతే తను ఇప్పటికే చనిపోయాడా?
చనిపోయిన మనుషులు మళ్ళీ కొద్ది నిమిషాల పాటో , గంటల పాటో బతికి తిరిగి చనిపోయిన సంఘటనలు ఉన్నాయి.
అదంతా గుర్తు వచ్చింది రాజుకి.