ఈ విషయంలో డాక్టర్ రేమాండ్ మూడీ జూనియర్ మొదలగు వాళ్ళు కొంతమంది పరిశోధనలు చేశారు.
క్లినికల్ డెత్ అంటారు దాన్ని.
అన్ని పరీక్షలలోనూ వాళ్ళు చనిపోయారనే తేలుతుంది.
కానీ మళ్ళీ అంతలోనే బతుకుతారా?
శవాలని పాడె మీద తీసుకెళ్ళి, శ్మశానంలో చితి మీద పెట్టి నిప్పు పెట్టాక వాళ్ళు లేచి కూర్చున్న సంఘటనలని గురించి వింటూనే వుంటాం గదా!
అలా లేవడానికి ఇంకో కారణం కూడా చెబుతారు. చితి మీద ఉన్న శవం మీద కట్టెలు గనక సరిగ్గా పెర్చకపోతే , చితి అంటించగానే వేడిమికి శవంలో మార్పులు వచ్చి అది స్ప్రింగ్ యాక్షన్ లాగా లేచి కూర్చోవడం -
అయితే అది ప్రాణం వచ్చినట్లుగా కాదు.
కొన్ని కేసుల్లో -- మనిషి చనిపోకుండానే చనిపోయినట్లు పొరబాటుగా నిర్ధారణ చేసి చితి వెలిగించటం.
కానీ మూడో రకం కేసులు ఆసక్తి కలిగిస్తాయి.
ఒక మనిషి నిశ్చయంగా చనిపోతాడు.
కానీ , చితి వెలిగించగానే లేచి కూర్చుంటాడు .
లేదా - యాక్సిడెంటు అయిన మనిషిని హాస్పిటల్ కి తీసుకువస్తారు. అతను చనిపోయాడని నిర్ధారిస్తారు డాక్టర్లు .
కానీ , అతను మళ్ళీ కాసేపు "బతుకుతాడు"
"కూలీ " సినిమా టైం లో అమితాబ్ బచ్చన్ ని ఒక పైటింగ్ సీన్ లో పునీత్ ఇస్సార్ ఒక దెబ్బ కొడితే అది తగలరాని చోట తగిలి , అమితాబ్ హాస్పిటల్ పాలయ్యాడు గదా!
ఆ సమయంలో నిజంగానే తను చచ్చిబతికానని చెబుతాడు అమితాబ్.
ఒక్కసారిగా తల విదిలించాడు రాజు.
ప్లేన్ క్రాష్ అయింది.
తన చుట్టుతా మృతకళేబరాలు.
ఇలాంటి టైంటో తను లేచి చెయ్యవలసినది ఏమిటో చేయకుండా ఇప్పుడు ఈ ఆలోచనలు ఏవిటి?
శాయశక్తులా తనకు చేతనయింది తను చేయవద్దూ?
ఇంతకీ తను బతికి ఉన్నాడా?
అందరితో బాటుగా చనిపోయాడా?
చనిపోయి బతికడా?
బతికి తిరిగి చనిపోతాడా?
అప్పుడు హటాత్తుగా ఒకటి స్పురించింది రాజుకి.
డెలిరియం అంటే బహుశా ఇదే కాబోలు -- మరణానికి ముందు సంధి -- లేదా చావు తెలివి !
కొడిగట్టే దీపం ప్రకాశవంతంగా కొద్ది క్షణాలపాటు వెలిగినట్లుగా చనిపోయే ముందర ఈ ఆలోచనలు తనని చుట్టూముడుతున్నాయా?
అసలు చావు అంటే ఏమిటి?
అతనికీ మళ్ళీ డాక్టర్ రేమాండ్మూడీ జూనియర్ పరిశోధనలు గుర్తువచ్చాయి.
"క్లినికల్ డెత్" ని ఎజ్స్ పీరియెన్స్ చేసి, తిరిగి బతికిన అనేకమంది తాలుకూ కేసులుని పరిశోధించాడు రేమాండ్ మూడీ. వాళ్ళలో రకరకాల మతాలకు చెందిన వాళ్ళు ఉన్నారు.
వాళ్ళలో చాలామంది అనుభవాలు దాదాపు ఒకే రకంగా ఉండడం గమనించాడు రేమాండ్ మూడి.
ఒక మనిషి చనిపోతాడు.
కానీ అతని ఆత్మ వెంటనే శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోదు. అయితే అది తన 'శరీరంతో సంబంధం లేకుండా అటూ ఇటూ తిరిగే శక్తి కలిగి ఉంటుంది. శవం హాస్పిటల్ బెడ్డు మీద ఉందనుకుందాం. బంధువులు గొల్లున ఏడుస్తుంటారు. ఆత్మ పై కప్పు లెవల్లో నుంచి ఇదంతా చూస్తూ వుంటుంది. నేను ఇక్కడే వున్నాను ఏడవకండి " అని వాళ్ళని ఓదార్చాలని వుంటుంది. కానీ , ఆత్మ చెప్పేది వాళ్ళకు వినబడదు . ఎవరి దోవ వాళ్ళదే!
చనిపోయిన తర్వాత కలిగే అనుభవాలు ఏమిటి?
చాలామంది చెప్పే దాని ప్రకారం, ఆత్మని ఎవరో సొరంగంలాంటి దానిలో నుంచి బరబర బయటికి లాక్కేళుతున్న భావన కలుగుతుంది. గంటలు మొగిస్తున్నట్లుగా శబ్దాలు వినబడతాయి. ఆ తర్వాత ఒక దివ్య ప్రకాశం దగ్గరికి వాళ్ళు చేరుకుంటారు. "నీకు ఇచ్చిన జీవితంలో నువ్వేం చేశావ్?" అని దివ్యశక్తి వాళ్ళని అడుగుతున్నట్లుగా అనిపిస్తుంది. ఆ ప్రశ్నలో కోపతాపాలు వుండవు. నిష్టూరం వుండదు. వెంటనే, ఒక్కసారిగా తన జీవితం అంతా ప్లాష్ బ్యాక్ లా గిర్రున తిరిగినట్లు అనిపిస్తుంది ఆత్మకు.
అంతే!
అక్కడిదాకా అందరి అనుభవాలు కూడా !
ఆ తర్వాత వాళ్ళు, ఎట్లా జరిగిందో తెలియకుండా తమ శరీరాల్లోకి తిరిగి ప్రవేశిస్తారు .
అలా ఒకసారి చావుని ప్రత్యేక్షంగా 'అనుభవించిన ' వాళ్ళకి తిరిగి బతికాక జీవితం యెంత అద్భుతమైనదో, ఎంత అమూల్యమైనదో బాగా అర్ధం అవుతుంది.
వాళ్ళు జీవితంలో ఆ రెండో పార్టుని సాధ్యమైనంత ఉదాత్తంగా, హాయిగా అర్ధవంతంగా గడపడానికి ప్రయత్నిస్తారు!
అదే విధంగా , ఇది తనకు పునర్జన్మా! దేవుడిని మనం భావించే ఆ అదృశ్య శక్తి ఏదో, తన చేత ఏవైనా మంచి పనులు చేయించ దలుచుకుని తనని చావకుండా బతికించిందా ? చావకుండా ఆపిందా? లేదా చనిపోయిన వాడికి ప్రాణం పోసిందా?
కష్టం మీద తల తిప్పి చూశాడు రాజు.
నిస్సహాయంగా పడి వుంది సృష్టి.
ఆమె ప్రాణాలతో వుందా?
ఆమె వుచ్చ్వాస నిశ్వాసాలతో వక్షం చలిస్తోంది.
కానీ, బ్రీతింగ్ రెగ్యులర్ గా లేదు.
వెక్కిళ్ళు వస్తున్నట్లుగా .......తెరలు తెరలుగా ......
లేవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు రాజు.
ఇంతలో ........
అడుగుల సవ్వడి వినబడింది .
ఇద్దరు మనుషులు వస్తున్నారు.
వాళ్ళని చూడగానే కొంచెం ఊరట కలిగింది రాజుకి .
వాళ్ళు పల్లెటూరి మనుషుల్లాగా వున్నారు. పొలంలో కోతలకు పోతున్నట్లున్నారు. చేతుల్లో కొడవళ్ళు వున్నాయి.
వాళ్ళు ఆగారు.
చూశారు.
మొహమొహాలు చూసుకున్నారు.