"నువ్వు చెప్పేదంతా ఏమిటో తికమకగా ఉంది నాకు! అసలు శేషాద్రి ఎవరు? మీ మమ్మీ అడవిలో ఎందుకుంది ? నాకు ఒక ముక్కా అర్థం కావడం లేదు."
అపనమ్మకంగా అతనివైపు చూశాడు సందీప్. "ఆల్ రైట్! నీకు గుర్తువచ్చేలా కథ అంతా చెబుతాను విను."
"చూడు కుర్రాడా! మీ మమ్మీ గురించి, డాడీ గురించిన సొద అంతా నాకెందుకు..."
'షిట్!' అనుకున్నాడు సందీప్. మేలుకునే నిద్ర నటిస్తున్నవాడిని లేపడం ఎంత దుర్లభమో, అన్నీ తెలిసివుండీ ఏమీ తెలియనట్లు నటించేవాడికి అర్థమయ్యేటట్లు చెప్పడం కూడా అంత కష్టమే!
"నువ్వెప్పుడన్నా పబ్లిక్ గార్డెన్ కి వెళ్ళావా భూతాలరాజూ?"
"వెళ్లాను-ఎప్పుడో పదేళ్ళక్రితం జైల్లో పడకముందు. ఏం?"
"అక్కడ ఆర్కియాలజీ డిపార్టుమెంట్ వారి మ్యూజియం ఉంది, అందులో ఉంది ఒక మమ్మీ చూశావా."
"అసలు మమ్మీ అంటే ఏమిటి ?"
చిరాగ్గా చూశాడు సందీప్. "మమ్మీ అంటే ఎప్పటికీ చెడిపోకుండా భద్రపరచబడిన శవం."
పెద్దగా నవ్వాడు భూతాలరాజు. "నేనేం వెర్రోడిననుకున్నావా కుర్రాడా? శవాన్ని ఒక్కరోజు అట్టిపెడితే కుళ్ళిపోతుంది. భరించలేని దుర్వాసన వస్తుంది. అలాంటిది, శవాన్ని శాశ్వతంగా పాడైపోకుండా ఉండడం అంటే మజాకానా?"
ఒకసారి భూతాలరాజుని పరీక్షగా చూసి చెప్పడం మొదలెట్టాడు సందీప్. "ప్రాచీనకాలంలో ఈజిప్షియనులు శవాలని పాడయిపోకుండా ఉంచే పద్ధతిని పర్ ఫెక్టు చేశారు. శవం పొట్టను పదునైన రాతితో కోసి, లోపల ఉన్న జీర్ణకోశం, లివరూ, తదితరమైన అవయవాలు తీసేసి బోలుగా చేస్తారు. గుండెని మాత్రం యథాస్థానంలో ఉండనిస్తారు. కళ్ళు ఉండవలసినచోట వజ్రాలూ, రత్నాలూ ఉంచుతారు. శవానికి రకరకాల రసాయనాలూ, సుగంధద్రవ్యాలూ పూసి, దాదాపు నలభైరోజులపాటు ఉంచుతారు. అప్పటికి మానవ శరీరంలో మూడువంతులు ఉండే నీరు ఇగిరిపోతుంది. ఆ తర్వాత ఎన్నో మీటర్ల పొడుగువుండే పల్చటి మస్లిన్ బట్టలు చుట్టి, ఆ చనిపోయిన మనిషి తాలూకు వస్తువాహనాలూ, ఆభరణాలూ, విలాస వస్తువులూ, ఆహారధాన్యాలతో సహా సమాధులలో ఉంచేవారు. ఆ శవాలు రాజకుటుంబీకులవైతే, బ్రహ్మాండమైన 'పిరమిడ్లు' అనే కట్టడాలలో ఉంచేవారు."
ఎగతాళిగా చూశాడు భూతాలరాజు. "చచ్చిన వాళ్ళని కాల్చి పారెయ్యడమో, పాతెయ్యడమో చెయ్యక ఈ తతంగం అంతా ఎందుకూ ?"
"మనిషి చనిపోయిన తర్వాత కూడా రెండవ జీవితం కొనసాగుతుందని నమ్మేవాళ్ళు ప్రాచీకకాలపు ఈజిప్షియనులు. ఆ రెండో జీవితం సుఖమయంగా జరిగిపోవడం కోసం ఈ శరీరం, ఆహారం, విలాస వస్తువులూ- ఇవన్నీ అనవసరమని భావించేవాళ్ళు."
"వెర్రిమాలోకం !"
"చనిపోయిన వ్యక్తి మొహాన్ని ఒక కొయ్యఫలకం మీద పెయింట్ చేసి, మమ్మీకి అమర్చడం ఆచారంగా ఉండేది. అదే రాజవంశీయుల మమ్మీలకి అయితే, ఈ మాస్కులని పోత పోసిన బంగారంతో చేసేవారు. తొమ్మిది సంవత్సరాల లేత వయసులోనే ఈజిప్టు సింహాసనం అధిష్టించి, నిండా పద్ధెనిమిది సంవత్సరాల వయసు రాకుండానే అంతుబట్టని పరిస్థితులలో మరణించిన రాజు 'టూట్ ఆంఖ్ అమున్' తాలూకు మమ్మీని నిలువెత్తు బంగారపు మాస్కులో ఉంచారు. ఆ మాస్కులో టూట్ ఆంఖ్ అమున్ పోలికలు స్పష్టంగా కనబడతాయి. ఈజిప్టులో మృతదేహాలను మమ్మీలుగా మార్చే ప్రక్రియ పరాకాష్ఠ చేరుకున్నదనడానికి సూచనగా టూట్ ఆంఖ్ అమున్ మమ్మీని ఉదహరిస్తారు."
"చూడు నాయనా ! ఈజిప్టు దేశపు చరిత్ర అంతా ఏకరువు పెట్టి ఎందుకు నా బుర్ర బద్దలు కొడతావ్? నీ దగ్గర పొగాకు ఉందా? ఉంటే ఒక కాడ ఇటు పడెయ్."
అతని మాటలు పట్టించుకోకుండా చెబుతూనే ఉన్నాడు, సందీప్.
"ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే మరణం తర్వాత కూడా జీవితం కొనసాగుతూనే ఉంటుందనే నమ్మకం, ఆ రెండో జీవితానికి కూడా ఈ దేహం అవసరమనే విశ్వాసము, అందుకుగానూ మృతదేహాల్ని పాడైపోకుండా భద్రపరచడం- ఇవన్నీ కేవలం ఈజిప్టుకే పరిమితమయినవని భావిస్తారు.