Previous Page Next Page 
హైజాక్ పేజి 5

మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న హోటల్ ముందు ఆగింది మోటర్ సైకిల్. కౌంటర్ దగ్గరికి వెళ్ళి ప్రొప్రయిటర్ని పలకరించాడు రెడ్డి.
ఆ హోటలుకి మర్యాదస్తులయిన కస్టమర్సు చాలా తక్కువమంది వస్తారు. అది సంఘవ్యతిరేక శక్తులకి అడ్డా - అంటే కూడలి లాంటిది. ఆ ప్రొప్రయిటరు నేరస్థుల తాలూకు డైరెక్టరీలాంటివాడు. అతను బయట పెద్దదలుచుకుంటే రౌడీల అడ్రసులూ, వాళ్ళు చేసిన, చెయ్యబోతున్న నేరాలూ, అన్నీ లిస్టులా చదివెయ్యగలడు.
టీ తాగుతూ అతనితో ఇరవై నిమిషాలు మాట్లాడినా తనకు కావలసిన సమాచారం ఏమీ తెలియలేదు రెడ్డికి.
అక్కడనుంచి బయలుదేరి, ఊరంతా తిరుగుతూ, ప్రతి ప్రాంతంలోని దాదాలనీ, గూండాలనీ, పిక్ పాకెట్ గాళ్ళనీ వరసపెట్టి కలుసుకున్నాడు రెడ్డి. వాళ్ళెవరికీ బ్యాంకు దోపిడీతో సంబంధం ఉన్నట్టు తోచలేదు అతనికి. మోటర్ సైకిల్ ని పోలీస్ స్టేషన్ దారి పట్టించాడు.
చీకటిగా ఉన్న ఒక సందులోకి మలుపు తిరుగుతూ ఉండగా వినిపించింది పెద్దకేక! భయభ్రాంతురాలయి పోయిన స్త్రీ కంఠం!
అత్యవసరమైన పనిమీద వెళుతున్న భార్యభర్తలు స్కూటర్ క్లచ్ వైరు తెగిపోవడంతో దాన్ని తోసుకుంటూ నిర్జీవమైన ఆ సందులో నడుస్తున్నారు. రాష్ గా వచ్చి వాళ్ళపక్కనే ఆగింది ఒక యజ్డీ మోటరు సైకిలు. స్టోన్ వాష్ డ్ జీన్సూ, షర్టులూ వేసుకుని ఉన్న కుర్రాళ్ళు దానిమీద నుంచి దిగారు. ఒకడు చాకుతో భర్తని బెదిరిస్తూ ఉంటే, రెండో కుర్రాడు చొరవగా ఆ అమ్మాయి మీద చెయ్యి వేశాడు.
అర్భకుడిలా ఉన్న ఆ భర్త "ఏయ్! ఏయ్!" అంటున్నాడు కీచు గొంతుతో.
అతని చెంపమీద బాంబు పేలినంత శబ్దం వచ్చేలా ఫెడీమని కొట్టాడు మొదటి కుర్రాడు. రెండోవాడు మరింత చనువుగా ఆ అమ్మాయి చుట్టూ చేతులేసి మొరటుగా దగ్గరికి లాక్కున్నాడు.
అదే క్షణంలో అక్కడికి చేరుకున్నాడు రెడ్డి. మోటర్ సైకిల్ స్టాండ్ వేసి, ఉరికి, ఆ కుర్రాళ్ళ మెడలని చేతులతో గట్టిగా పట్టుకున్నాడు.
వాళ్ళు సబ్ ఇన్ స్పెక్టరుని చూసికూడా బెదరలేదు.
"ఇన్ స్పెక్టర్ సాబ్! వదులు! నేనెవరో నీకు తెలీదు!" అన్నాడు ఆ రెండో కుర్రాడు పౌరుషంగా.
"బద్మాష్! నువ్వెవడివైతే నాకేమిరా!" అంటూ వాళ్ళిద్దరినీ పోలీస్ స్టేషన్ వైపు లాక్కెళ్ళాడు రెడ్డి. అతనితోబాటు నడిచారు ఆ భార్యభర్తలు.
రిపోర్టు తీసుకున్న తర్వాత, ఒక కానిస్టేబుల్ ని సాయం యిచ్చి వాళ్ళని ఇంటికి పంపించేశాడు రెడ్డి.
అప్పటికి తూరుపు తెలతెల వారుతోంది.

                                                      *    *    *    *

ఆ ఇద్దరు కుర్రాళ్ళమీద కేసు బుక్ చేసి, వాళ్ళని లాకప్పులో పెట్టి, తర్వాత ఒక కప్పు కాఫీ తాగాడు రెడ్డి. ఒకసారి వళ్ళు విరుచుకుని లేచి మళ్ళీ మోటారుసైకిల్ ఎక్కాడు.
అతను బ్యాంకుకి చేరేసరికి పదకొండు గంటలయింది. సుజాతని ప్రశ్నించడం మొదలెట్టాడు.
"మిస్ సుజాతా! రాత్రి అంతా ఇదే పనిమీద తిరుగుతూ ఉన్నాను నేను. నాకు తెలిసినంత వరకూ పాత నేరస్థులు ఎవరూ చేసిన పనిలా లేదు ఇది, నిశ్చయంగా ఎవరో కొత్తవాడు చేసి ఉండాలి. దయచేసి జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఇంకేమన్నా గుర్తులు చెప్పగలరా?"
నిస్పృహగా తల ఆడించింది సుజాత.
రెడ్డి గొంతు కొంచెం కఠినంగా మారింది. "మిస్ సుజాతా! ఒకసారి విజయవంతంగా నేరం చెయ్యగలిగినవాడు ఆ ఉత్సాహంతో మరింత పెద్ద నేరం చేసే సాహసం చెయ్యగలడు. వాడిని ఇప్పుడే ఆపాలి మనం! అందుకని, ప్లీజ్, ఆలోచించండి!"
భయభ్రాంతురాలయి పోయి చూసిందే తప్ప, ఏమీ జవాబు చెప్పలేకపోయింది సుజాత.

                               *    *    *    *

రూంలో చాపమీద నిశ్చలంగా పడుకుని పైకప్పువంకే చూస్తున్న శతృఘ్న ఒక నిశ్చయానికి వచ్చిన వాడిలా చటుక్కున లేచి కూర్చున్నాడు.    
 "చేసిన ఎడ్వంచరే మళ్ళీ చేయడంలో థ్రిల్లు లేదు ఇక్బాల్! అలా చేస్తే తెలివితక్కువ, రిస్కు ఎక్కువ! ఈసారి మళ్ళీ బ్యాంకు రాబరీ కాదు, ప్లేన్ ని హైజాక్ చేద్దాం - విక్టర్ గాడు చెప్పినట్లు!" అన్నాడు. రాత్రంతా తీవ్రంగా ఆలోచిస్తూ, మేలుకునే ఉండడం వల్ల అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి.
సిగరెట్ పొగ లోపలికి పీల్చబోయిన ఇక్బాల్ ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు ఈ మాటలు విని. కొరబోయింది అతనికి.
"ఏమిటీ? విక్టర్ గాడు చెప్పాడా? వాడు చెప్పలేదురా! తాగి వాగాడు! సీరియస్ గా తీసుకుంటున్నావా? ప్లేన్ ని హైజాక్ చేద్దామా? అసలు మనల్ని విమానంలో ఎక్కనిస్తారా అని"
సహనంగా నవ్వాడు శతృఘ్న.
ఇక్బాల్ మొహంలో రిలీఫ్ కనబడింది. "అదిగో! నవ్వుతున్నావ్? నవ్వు తాలూకే అన్నావ్ కదూ?"
"కాదు"
వెర్రిగా చూశాడు ఇక్బాల్ "కాదా? ప్లేన్ ని నిజంగానే హైజాక్ చేస్తామా? ఎలా చేస్తాం అసలు? చేసినా మనకు ఒరిగేదేముంది?"
"ఏం కావాలంటే అది! ఇక్కడనుంచి శాలిని ఢిల్లీ వెళ్ళే విమానం అంటే అది బ్రహ్మాండమైన జెట్-ఎయిర్ బస్ అన్నమాట! రెండొందల డెభ్బైఎనిమిది సీట్లే ఉంటాయి. దాన్లో ఒక పైలట్, ఒక కో=పైలట్, ఒక ఫ్లయిట్ ఇంజనీరూ ఉంటారు. నలుగురు ఎయిర్ హోస్టెస్ లు ఉంటారు. ఇంతమంది ప్రాణాలని మన గుప్పెట్లో ఇరికించుకుని బేరం మొదలెడితే, షిట్, కొండ మీది కోతి కావాలన్నా దిగి వస్తుంది. తెరమీద సినిమా తార నీ ఒళ్ళో వాలిపోతుంది. బ్యాంకులోని డబ్బు నీళ్ళలా నీ జేబుల్లోకి ప్రవహిస్తుంది. మనం గుంజిళ్ళు తియ్యమంటే గుంజీలు తీస్తారు ఈ ఆఫీసర్లు. బడా బడా నాయకులంతా కాళ్ళబేరానికి వస్తారు. మన పేర్లు పేపర్లు అన్నింటిలోనూ మారుమోగిపోతాయి" అని ఆగి ఇక్బాల్ చేతిలోని సిగరెట్ తీసుకుని దమ్ములాగి "చెప్పలేనంత థ్రిల్ కలుగుతుంది" అన్నాడు.

 Previous Page Next Page