Previous Page Next Page 
మండు వెన్నెల పేజి 5

దుఃఖాన్ని అతికష్టం మీద ఆపుకున్నాడు రఘురాం. "దేవుడికి అందరి మీదా ఇష్టం ఉంటుందమ్మా! అందరినీ తన దగ్గరికి పిలిపించేసుకుంటాడు. కాస్త ముందూ, వెనుకా! అంతే! ఈ లోపల మన బతుకు మనం బతకాలి కదా? అందుకని, నిన్ను చూసుకునే వాళ్ళు ఉండాలని, ఒక కొత్త అమ్మని తెచ్చానమ్మా!"
"ఈ కొత్త అమ్మ నాకొద్దు నాన్నా! మీరుంటే చాలు!" అంది భానూ నెమ్మదిగా.
"తప్పు బేబీ! అలా అనకూడదు! కొత్త అమ్మ ఎంత మంచిదో తెలుసా? నీ చెల్లెలు పింకీ ఎంత గుడ్ గర్లో తెలుసా?"
"నాన్నా దట్ గర్ల్ ఈజ్ నాట్ గుడ్! షీ ఈజ్ వెరీ నాటీ! నన్ను ఏడిపిస్తుంది నాన్నా!"
"ఏం చేసింది డార్లింగ్?"
"నా పింకీని ఎత్తుకెళ్ళిపోయి చేతులూ, కాళ్ళూ వంచేస్తోంది."
"నేను ఇప్పిస్తాగా! దా!"
కూతురి భుజం మీద చెయ్యేసి నడిపిస్తూ బయటికి తీసుకొచ్చాడు రఘురాం. అక్కడ పడిఉంది నీలికళ్ళు బయటికొచ్చేసి గోలీల్లా నేలమీద దొర్లుతున్నాయి.
గబుక్కున దానిపక్కనే కూలబడిపోయింది భానూ. ఆమె కళ్ళెంబడి ధారాపాతంగా కారిపోతున్నాయి నీళ్ళు.
"అమ్మతో బాటు పింకీ కూడా దేముడి దగ్గరికెళ్ళి పోయిందా నాన్నా?" అంది వెక్కుతూ.
ఆమె సవతి తల్లీ, రఘురాం రెండో భార్య అయిన విలాసిని సరిగ్గా అదే సమయానికి షాపింగ్ నుంచి తిరిగివచ్చింది. భానురేఖ మాటలు చెవిన పడగానే వళ్ళుమండిపోయింది ఆమెకి.
"పిచ్చి ముదుర్తోందా ఏమిటి? నా పిండీ దేముడి దగ్గరికెళ్ళిపోవడమేమిటి? నోటికి అడ్డూ అదుపూ లేదూ?" అంది విసురుగా.
"పింకీ అంటే మన పింకీ కాదు విలాసినీ! భానూ చిన్నప్పటి బొమ్మ! దాన్ని విరక్కొట్టేసింది మనమ్మాయి" అన్నాడు రఘురాం సర్దిచెబుతున్నట్లు.
"ఇది మరీ బాగుంది! బొమ్మ విరిగిపోతే మనిషి ఎగిరిపోయినట్లు శోకాలెందుకూ. నాకు తెలుసు! ఈ ఇల్లు పిచ్చాసుపత్రిగా మారిపోతుంది!"
"విలాసినీ!" అన్నాడు రఘురాం తీవ్రంగా. "అమ్మాయి ఎనిమిదేళ్ళ నుంచి కోమాలో ఉండి తిరిగి వచ్చింది. వయసు పెరిగింది గానీ మనసు పెరగలేదు తనకి. తను మళ్ళీ మామూలు మనిషి అయ్యేదాకా పసిపాపలా చూసుకోవాలి మనం. మర్చిపోకు!"
తప్పు గ్రహించినట్లు మొహం పెట్టింది విలాసిని. తను స్వతహారా చెడ్డది కాదు. మామూలు మనిషి. కాని ఎనిమిదేళ్ళపాటు మంచం దిగకుండా ఉండిపోయిన భానురేఖని కనిపెట్టుకుని ఉండీ ఉండీ విసిగిపోయింది. భాను అంటే అదోరకమైన అయిష్టత ఏర్పడిపోయింది ఆమెకు, తనకు తెలియకుండానే.
"నాతో రా స్వీటీ! నీకు బోలెడు కొత్త బొమ్మలు కొనిస్తా!" అన్నాడు రఘురాం, లేని ఉత్సాహం తెచ్చిపెట్టుకుని.
ఇష్టం లేనట్లు చూసింది భాను. "అమ్మపోతే కొత్త అమ్మా, బొమ్మ పోతే కొత్త బొమ్మనా నాన్న?" అంది దిగులుగా.
అది వినగానే, అప్పుడే కొంచెం ప్రసన్నంగా మొహం పెట్టుకోబోయిన విలాసిని మళ్ళీ మొహం ముడుచుకుంది.
"రామ్మా!" అని భానూ చెయ్యి పట్టుకున్నాడు రఘురాం. ఇద్దరూ కదిలారు. వెంటనే ఫోన్ మోగింది.
రిసీవ్ చేసుకుని, విన్నాడు రఘురాం. భానువైపు తిరిగాడు. "సారీ బేబీ! చాలా అర్జంటుగా మెడ్రాసెళ్ళి రావాలి నేను. నీకు బోలెడంత డబ్బు ఇస్తాను. తర్వాత అమ్మతో కలిసెళ్ళి బొమ్మల షాపంతా కొనేసుకో! ఏం సరేనా?"
మాట్లాడలేదు భానురేఖ. రఘురాం కప్ బోర్డు తెరిచి పది రూపాయల కట్ట ఒకటి తెచ్చి భానూకి అందిస్తూ "చాలా తల్లీ?" అన్నాడు నవ్వుతూ.
మాట్లాడకుండా ఉండిపోయింది భానురేఖ.
హడావుడిగా సూట్ కేసులో రెండు జతల కట్టలు కుక్కేసుకుని అందరికీ 'బై' చెప్పి, త్వరత్వరగా బయటికెళ్ళిపోయాడు రఘురాం!
వెంటనే భానువైపు తిరిగింది సవతి చెల్లెలు పింకీ.
"ఇంత పెద్దయ్యాక ఇంకా మొద్దమ్మాయిలా బొమ్మలతో ఆడుకుంటావా నువ్వు? షేమ్ షేమ్!" అంది వెక్కిరింపుగా నవ్వుతూ. ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తున్నా తన కూతురిని వారించలేదు విలాసిని. పైగా, తను మనసులో అనుకుంటున్న మాటలు పింకీ పైకి అనేసినందుకు ఆమెకు కొంచెం సంతోషం కూడా కలిగింది. ఇన్నాళ్ళు జీవచ్చవంలా బతికి ఇప్పుడు మేలుకున్న భానురేఖకి తన భర్త ఇలాగే డబ్బంతా దోచిపెడతాడేమో, తన కూతుర్ని నిర్లక్ష్యం చేస్తాడేమో అన్న భీతి కూడా కలుగుతుంది ఆమెకి.
ఆ పిల్లని చూస్తేనే బెదిరిపోతున్న భానూ, భయంగా అక్కడ నుంచి వెళ్ళిపోయింది.

                                       * * * *
అతి పెద్ద డిపార్ట్ మెంటల్ స్టోర్సు అది. అందులో 'టై' సెక్షనులో నిలబడి నెక్ టైలు సెలెక్టు చేసుకుంటున్నాడు రవిచంద్ర. చాలా హాండ్సమ్ గా ఉన్నాడు మనిషి. ఎం.బి.యే. చదివి, పాతికేళ్ళు రాకముందే ఒక పెద్ద మల్టీ నేషనల్ కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ లెవెల్ ఉద్యోగానికి సెలెక్టు అయ్యాడు అతను. బ్రిలియంట్ స్టూడెంట్స్ ని కాలేజీ దశలోనే సెలెక్టు చేసుకుని, చదువు పూర్తయిన తర్వాత తమ దగ్గర సీనియర్ పొజిషన్లోకి తీసుకునే పద్ధతి ఉంది ఆ కంపెనీలో. ఎం.బి.యే. చదువుతుండగానే రవిచంద్రని సెలెక్టు చేసుకుంది ఆ కంపెనీ.
మొన్ననే అతనికి పోస్టింగ్స్ ఇచ్చారు. బాంబేలో ఉద్యోగం. క్వార్టర్సు, ఫర్నిచరు, కారు, పెట్రోలు, బోనస్, ప్రావిడెంట్ ఫండ్, ఒక క్లబ్బులో మెంబర్ షిప్పు. ఛాలెంజింగ్ జాబ్ అది. కష్టపడిన కొద్దీ ఫలితం ఉండే ఉద్యోగం!

 Previous Page Next Page