Previous Page Next Page 
జన్మభూమి పేజి 5

    ముగ్గురు ఆడపిల్లల తరువాత పుట్టిన కేశవరావుకి పిత్రార్జితంగా పాతికెకరాల పొలం, ఓ పెంకుటిల్లు వచ్చాయి. అతను వైజాగ్ లో డాక్టర్ చదవగానే అమెరికా పెద్దచదువులకి వెళ్ళాడు. చదువై ఉద్యోగంలో స్థిరపడి పెళ్లి అయ్యాక, యిద్దరు మనుమలు పుట్టాక ఒకరి తర్వాత ఒకరు ఏడాదిలో అతని తల్లి తండ్రి పోయారు. అతని పెద్దక్క ఆ వూర్లోనే ఉండేది. తండ్రి పోయినప్పుడు ఇండియా వచ్చిన కేశవరావు కర్మకాండలు పూర్తిఅయ్యాక కుటుంబసభ్యులందరిమధ్య ఆ వూర్లో ఉన్న పొలం, యిల్లు ఏంచెయ్యాలన్న ప్రస్థావన తెచ్చారు.
    "పొలం అమ్మకానికి పెడతాను బావగారూ - ధర వస్తే అమ్మేస్తాను. ఈ వ్యవహారం కాస్త మీరు చూడాలి" పెద్దబావగారి మీద బాధ్యత పెడ్తూ అన్నాడు.
    "అయ్యో! నిక్షేపంలాంటి పొలం అమ్మడమేమిటిరా నాయనా" పెద్ద అక్కగారు వారించింది. ఆమెకి కేశవరావుకి పదమూడేళ్ళు తేడా వుండి. చిన్నతనంలోనే పెళ్ళి అయిన ఆమెకి పిల్లలు అప్పటికే పెద్దవాళ్ళయ్యారు. పెద్దకొడుకు బ్యాంక్ ఉద్యోగం చేస్తున్నాడు. రెండోవాడైన పాండురంగడు చిన్నప్పటినుంచి ఆకతాయిగా తిరిగి చదువబ్బక యింటర్ పరీక్ష రెండు మూడుసార్లు తప్పాడు.
    "అమ్మక ఈ పొలం నేనేం చేసుకోగలను అక్కయ్యా."
    "కౌలికివ్వరా బాబూ. మీ బావగారు ఆ వ్యవహారాలు చూస్తారులే. వూర్లోనే వున్నాంగా. శిస్తులవి నీకు పంపే ఏర్పాటు చేస్తారులే" వెంకటలక్ష్మి అంది. ఆవిడ భర్త ఆంజనేయులు ఆ వూర్లో బడి పంతులు.
    కేశవరావు తాతగారు, ముత్తాతగార్లు ఆ వూరి కరణంగా వుండేవారు. ముత్తాతగారి టైములోనే పాతికెకరాల భూమి చూసుకుంటూ పెంకుటిల్లు కట్టించుకున్నారు. తాతగారు పోయాక తండ్రి ఆ వూర్లో కరణంగా వుండేవారు. వూరి పెద్దగా, మంచి వ్యవహార కర్తగా అందరికి తలలో నాలుకలా వుండేవారు. ముగ్గురు ఆడపిల్లల తరువాత పుట్టిన ఒకటే కొడుకని మంచి చదువులు చెప్పించి తమలా పల్లెటూరిలో పడివుండకుండా పట్నంలో డాక్టరు, ఇంజనీరు చదువులు చదివించాలని ఆయనకి కోరికగా వుండేది. కేశవరావు ముందునించి చదువులో చురుకుగా వుండడంతో స్కూలు ఫైనల్లో ఫస్టు వచ్చాడు. ఆ వూర్లో కాలేజీ లేకపోవడంతో పక్కన విజయవాడలో కాలేజీలో చేర్పించి హాస్టలులో పెట్టారు. ఇంటర్ మీడియట్ లో ఫస్టు క్లాసు వచ్చిన అతనికి ఇంజనీరింగు కంటే, ముందునుంచి డాక్టర్ అవ్వాలని కోరిక వుండడంతో మెడికల్ కాలేజీలో సీటు సంపాదించుకున్నాడు. నాలుగేళ్ళు అయ్యేసరికి తనతోటివారిని చూసి విదేశాలు వెళ్ళి పై చదువులు చదవాలన్న నిర్ణయానికి వచ్చాడు.
    ఒక్కగానొక్క కొడుకుని విదేశాలకి పంపడం తండ్రికి ఇష్టంలేకపోయినా కొడుకు పట్టుదలకి తలవగ్గాడు. చదువుకుని వెనక్కివచ్చేయాలన్న షరత్తు పెట్టి కొడుకుని విదేశాలకు పంపాడు తండ్రి. కాని ఓసారి అక్కడికి వెళ్ళి నాలుగేళ్ళు చదువు పూర్తయి మంచి ఉద్యోగం దొరకగానే ఉద్యోగం చేస్తూ బోలెడు సంపాదిస్తూ, యింకా స్పెషలైజేషన్ చెయ్యాలని యింకా యిప్పుడప్పుడే రానని రాసి పడేశాడు కేశవరావు తండ్రికి.
    రెండు మూడేళ్ళకి ఓసారి వచ్చి తల్లిదండ్రులను చూసిపోయేవాడు కేశవరావు. కొడుకు ఇంక ఇండియా రాడన్నది తండ్రికి అర్థమైంది. అప్పటినించే ఆయన మనసులో పదేపదే దిగులు మొదలై తరువాత నాలుగైదేళ్ళకే భార్య పోవడంతో మరీ వంటరి అయ్యి తరువాత ఏడు ఆయన పోయాడు. అప్పటికే కేశవరావుకి రాజేశ్వరితో పెళ్ళయి పిల్లలిద్దరూ పుట్టారు. మనవలిని చూసుకున్న తృప్తి చాలనుకున్నాడు ఆయన.
    తండ్రి కూడా పోయాక ఇంక ఆ పల్లెటూరితో అతను ఏం సంబంధం పెట్టుకోదల్చుకోలేదు. ఏదీ తల్లిదండ్రి కోసం మూడేళ్ళకోసారి వచ్చేవారు కష్టం మీద. ఇంకేముంది ఇక్కడ అనుకుని భూమి కూడా అమ్మకం పెట్టేస్తే ఏ గొడవా ఉండదు అనిపించింది అతనికి. అక్కగారు అన్నమాటలకి భార్య మొహం చూశాడు కేశవరావు. "మీకెందుకండి బావగారూ శ్రమ - పొలాలు చూసుకోవడం అంటే మాటలా అన్నాడు కేశవరావు.
    "శ్రమ ఏముందిలే... కౌలికిస్తే రైతు చూసుకుని శిస్తులు యిస్తాడు." వెంకటమ్మకి అలా అనడంలో ఆవిడ స్వార్థమూ వుంది. తమది వున్న కుటుంబం కాదు. బడిపంతులు జీతంతో నలుగురి పిల్లలని సాకడం చాలా కష్టంగా వుంది. పొలం శిస్తుకిస్తే తమ్ముడిక్కడ వుండబోయాడా, చూడబోయాడా. రైతుల దగ్గిర తిండి గింజలన్నా తీసుకోవచ్చు. కూర, నార, పప్పు, పాలు మొదలైనవి రైతులు ఇస్తుంటారు. ఏదో ఏడాదికింత అని శిస్తుకింద తమ్ముడికిస్తే సరిపోతుంది అన్నది ఆవిడకి తట్టిన ఆలోచన.
    "ఇప్పుడు అప్పుడే అమ్మకానికి వద్దయ్యా. చూద్దాం కొన్నాళ్ళు జరగనీ, నేనెప్పుడు చూడలేకపోతే అప్పుడు చెపుతాలే" బావగారు కూడా అన్నాక. సరే అంత అర్జంటేముంది. ఇంకోసారి చూడవచ్చులే అనుకున్నాడు కేశవరావు కూడా. విజయవాడలో బ్యాంక్ అకౌంట్ తనపేర తెరిచి శిస్తు డబ్బు డబ్బు అందులో వేసేట్టు ఏర్పాటు చేశాడు. ఆ యిల్లు ఏం చెయ్యాలి అన్న ప్రసక్తి వచ్చింది.
    "తమ్ముడూ ఒక మాట అంటే ఏం అనుకోవు గదా. యీ వూళ్ళో నీకు అద్దెకిద్దామన్నా ఎవరూ వుండరు. ఇల్లు పాడవకుండా యింట్లో దీపం పెడతా. మమ్మల్ని వుండమంటావా అందులో. మాకూ పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. ఆ కొంప చాలడం లేదు." అంది మొహమాటం విడిచి. భార్య వంక చూశారు కేశవరావు. రాజేశ్వరికి ఆ పల్లెటూరు, ఆ యింటి మీద ఏం యింటరెస్ట్ లేదు. ఆవిడ అక్కడ వున్నన్ని రోజులు ముళ్ళమీద వున్నట్టే ఉండేది" దానికేం వుండండి వదినా. యిల్లు తాళం పెట్టేకంటే మీరుంటే పాడుబడదు గదా" అంది మనస్పూర్తిగా. ఆ విధంగా అక్కగారి సంసారం ఆ ఇంట్లో చేరింది. ఓ పదేళ్ళు బావగారు బతికి వున్నన్నిరోజులు శిస్తు అంతా ఏదో బ్యాంకులో జమ అయ్యేది. ఆ డబ్బు రాజేశ్వరి ఏ మూడేళ్ళకో ఇండియా వచ్చినప్పుడల్లా చీరలు, నగలు కొనుక్కోడానికి వాడేది. బావగారు పోయాక అక్కగారికి పరామర్శ ఉత్తరం రాస్తూ తను మరుసటి ఏడు వస్తానని ఈలోగా పొలం భేరానికి ఎవరన్నా దొరికితే చూడమని రాశాడు కేశవరావు. దానికి ఆవిడ తమ్ముడిని ప్రాధేయపడుతూ పాండురంగడికి చదువబ్బలేదు, ఉద్యోగం సద్యోగం లేకుండా తిరుగుతున్నాడు. ఆ పొలం వాడు దున్నుకుంటానంటున్నాడు. అమ్మకుండా వుంచిది వాడు యిదివరకులాగే నీకు శిస్తు చెల్లిస్తాడు.
    నాకోసం యింతమాత్రం చెయ్యి అంటూ ప్రాధేయపడింది ఆవిడ. అప్పటికి కేశవరావు సంపాదన బాగా పెరిగింది. లక్షల డాలర్లకి పెరిగిన సంపాదన ముందు ఇండియాలో పొలం అమ్మితే వచ్చే డబ్బు సముద్రంలో కాకిరెట్ట. పోనీ అక్కగారి సంసారం బీద సంసారం. పోనీ వాళ్ళనే బాగుపడనీ అనుకుని అమ్మకం ప్రసక్తి మానేశాడు. పాండురంగడు ఏ ఒకటి రెండేళ్ళు శిస్తు జమ చేశాడో. తరువాత పొలం యీ ఏడు పండలేదని ఒకసారి, చీడ పట్టిందని ఓసారి, వరదలొచ్చాయని యిలా ఏదో వంకలు రాసేవాడు. కేశవరావు అడగటం మానేశాడు. దాంతో గత ముప్పైఏళ్ళుగా హాయిగా యింట్లో వుంటూ పంట, డబ్బు అన్నీ అనుభవిస్తున్న పాండురంగకి మామగారి ఈ హఠాత్ నిర్ణయం భయం, దిగులు పుట్టించింది. ఈ పల్లెటూరికి వచ్చి ఆయన వుంటానంటే తనగతేం కావాలి.
    ఈ పొలం యిల్లు వుండబట్టి తను పెళ్లాం పిల్లలు తిండికి లోటు లేకుండా యింట్లో నీడన బతుకుతున్నాను. పొలం శిస్తు కూడా చెల్లించడం మానేశాడు. యిప్పుడా పొలం అమ్మేస్తానంటే తన గతి ఏమిటి. పొలం అమ్మవద్దని ప్రాధేయపడితే, శిస్తు సరిగా చెల్లిస్తానని ప్రాధేయపడిది మావయ్య కరగవచ్చు. కాని ఈ ఇంట్లో వుంటానంటున్నాడు. తానిప్పుడు ఎక్కడికి పోవాలి.   
    రెండురోజుల క్రితం ఉత్తరం వచ్చిందగ్గిరనించి అతనికి కాళ్ళు, చేతులు ఆడడం లేదు భవిష్యత్తు తల్చుకుని. భార్య సుగుణకీ ఏమీ పాలుపోవడం లేదు. ముగ్గురు పిల్లలతో అర్థాంతరంగా తామేం కావాలి? ఆయనకీబుద్ధి ఎందుకు పుట్టిందో, ఇక్కడికి వచ్చి ఏం చెయ్యదలిచాడో ఆయన వస్తేగాని అర్థంకాదు.

 

 Previous Page Next Page