Previous Page Next Page 
పడుచుదనం రైలుబండి పేజి 5


    సుందర సుకుమారి మీద పంచప్రాణాలు పెట్టుకొని బ్రతకడంవల్ల ఆమె ఇంకా గట్టిగానే ఉంది. "తన మనవరాలిని ఒక అయ్య చేతిలో పెట్టి అక్కడ కూడా వాళ్ళు తన మనవరాలిని సున్నితంగా...సుకుమారంగా చూసుకున్ననాడే తనువు చాలిద్దాం" అన్నంత గట్టిగా ఉంది.


    బామ్మగారు రకరకాల పిండివంటలు చేయడం... ఆ పిండి వంటలని కూడా పిండిమరలో వేసినట్టు నోట్లో వేసుకుని తినేయటం... మొత్తానికి "నాకు నీవు...నీకు నేను" అన్నట్లు ఇద్దరూ బానే వున్నారు.


    "ఈ ప్రయాణానికి మా బామ్మని ఒప్పించడం చాలా కష్టం" ముక్తసరిగ చెప్పింది సుందర సుకుమారి.


    "అదేమిటి?" వందన అడిగింది.


    "ఏమిటంటే ఏం చెబుతాను. నా బొంద యాత్రలు చేసి వస్తాను బామ్మా అంటే "ఏమిటి కాశీ యాత్రా?" అంది. కావాలంటే నీ నలుగురికి తోడుగా నేను... మన వెనకింటి కామమ్మగారు... ఆమె భర్తగారు వస్తారంది.


    "చచ్చితిమి...చచ్చితిమి" అంది రాణి.


    "దాన్ని సాంతం చెప్పనీ. మధ్యలో నీ చావుగోల ఏమిటి?" కోప్పడింది ప్రమద.


    "కాశీయాత్ర అని ఎందుకు చెప్పావే?" వందన అడిగింది.


    "చెప్పలేదు తల్లీ! అలా అని మా బామ్మ అనుకొంది. నేను ఏమీ చెప్పక్కరలేదు అలా అని మా బామ్మ అనుకొంటూంటుంది. అది మా బామ్మ అలవాటు."


    "నువ్వు విడమర్చి చెప్పాల్సింది" వందన అంది.


    "మేం వెళ్ళేది కాశీ, రామేశ్వరాల్లాంటి పుణ్యక్షేత్రాలు కాదని... ఎడ్వంచర్" అని ఇంగ్లీషులో చెప్పేశాను. "అయితే అక్కడ ఏ దేముడుంటాడని" అడిగింది. మా బామ్మ దృష్టిలో యాత్రలు చెయ్యడమంటే అదేదో దేముడిని చూడటానికి పుణ్య తీర్థానికి వెళ్ళడమనే అనుకుంటుంది...


    సుందర సుకుమారి మాటలకి అడ్డంవచ్చి "పోనీ చిన్న అబధం ఆడేస్తే పోయేది కదా. మన యాత్రలో నానా రకాల దేముళ్ళు తగులుతారని చెబితే సరిపోయేది. మన ప్రయాణానికి అడ్డు చెప్పేది కాదుకదా" అంది ప్రమద.


    "సరేలే! దేముడి పేరులో "దే" అన్న అక్షరం చాలు మా బామ్మ నాకన్నా ముందే బయల్దేరుతుంది. అందుకని వున్నమాట చెప్పేశాను. చెప్పినందుకు ఇవాళ చేసిన మిఠాయితోపాటు నాలుగు అక్షింతలు కూడా తిన్నాను. "ఆడది ఇంటిపట్టున ఉంటేనే గౌరవప్రదమని" అరగంట గీత బోధించింది. దాంతో నాకు ఒళ్ళు మండిపోయి ఇలా వచ్చేశాను."


    "పెద్ద చిక్కే వచ్చిపడిందే! బామ్మగారు ఒప్పుకుంటే మా అమ్మ ఒప్పుకొనేదే. మన ప్రయాణం చాలా ఈజీగా సాగేది. ప్రయాణం మొదట్లోనే ఇన్ని ఆటంకాలయితే ఎలాగ? మనం ఇంక సాహసయాత్ర చేసినట్టే" దిగాలుగ అంది వందన.


    "నువ్వలా డీలాపడితే మేమంతాకన్నా డీలా పడిపోతాం. మన నలుగురిలో కాస్త పెద్ద బుర్ర ఉంది నీకే తల్లీ" అంది ప్రమద.


    వందనాదేవి ఎక్కువ ఆలోచించకుండానే ఏదో ఉపాయం తట్టగ "మీ బామ్మకున్న పెద్ద వీక్ నెస్ ఏమిటే సుందరి?" అని అడిగింది.


    "మా బామ్మకు ఎటువంటి వీక్ నెస్ లు లేవు. మా బామ్మ పోలికలతో పుట్టిన నాకూ ఎటువంటి వీక్ నెస్ లు లేవు. ఎంత తిన్నా మేము అరిగించుకోగలం. ఎంతసేపు మాట్లాడినా మాకు నీరసం రాదు..."


    "అబ్బబ్బా! వీక్ నెస్ అంటే ఇదికాదే తల్లీ! ప్రతి మనిషిలో వీక్ పాయింట్ ఒకటి ఉంటుంది. మనకి అవసరం వచ్చినప్పుడు అది పట్టుకుని సాధించాలన్నమాట. ఇంతకి మీ బామ్మలో వున్న వీక్ ఏమిటి?" వందనాదేవి అడిగింది.


    "వీక్ పాయింటా!" అంటూ సుందర సుకుమారి కొద్దిసేపు ఆలోచనలో పడింది. "వీక్ కి మరోపేరు భయమని అనొచ్చా?" అడిగింది.


    "రెండింటికి దగ్గర సంబంధం వుందిలే. ఇంతకీ మీ బామ్మకి దేన్ని చూస్తే భయం? ఏ విషయంలో వీక్?"


    "నా కవిత్వమంటే మా బామ్మకి చచ్చేంత భయం. పైత్యం ప్రకోచించినప్పుడే కవిత్వం పేరుతో ఏదేదో వాగుతానని మా బామ్మ భయం. శ్రీశ్రీ అని ఒక పెద్ద కవి వున్నాడు. ఇంగ్లీషులో చెప్పాలంటే పొడి అక్షరాలలో యస్ యస్. అలాగే నేను కూడా ఆడవాళ్ళలో పెద్ద కవయిత్రిని. పొడి అక్షరాలలో నా పేరు సు...సు. ఇదే ఇంగ్లీషులో అయితే యస్.యస్. శ్రీశ్రీకి యస్.యస్ యే... నాకు యస్.యస్ యే..."


    "ముందు నోరు మూస్తావా నలుగు వుతకమంటావా? మీ బామ్మ వీక్ నెస్ ఏమిటే? అని నేనడిగితే కవిత్వం గురించి చెబుతావేమిటి? నేనడిగింది నీ విషయంలో దేనికి మీ బామ్మ భయపడుతుంది? అని" విసుక్కుంది వందనాదేవి.


    అప్పటికి అర్థం చేసుకున్న సుందర సుకుమారి "ఓ...అదా!" అంది.


    "ఆ... అదేలే! చెప్పు... చెప్పు" తొందర చేసింది వందన.


    "నేను సన్నబడటం అన్నది బామ్మ కలలో కూడ కాంచని విషయం. తిండి తినకపోతే సన్నబడతానని బామ్మ భయం. పెళ్ళీడు వచ్చిన ఆడపిల్ల ముద్దబంతి పువ్వులానో... వయసొచ్చిన ఆడపిల్ల కంది బద్దలా ఉండాలంటుంది మా బామ్మ."


    "కంది బద్దేమిటే నీ బొంద! ముద్దబంతి పువ్వు పేరు విన్నాం కాని కంది బేడలు... పెసర బేడలు ఎక్కడా వినలేదు" అంది ప్రమద.

 Previous Page Next Page