Previous Page Next Page 
సీతాచరితం పేజి 5


    భూస్వామ్య సమాజంలో రెండు వర్గాలకు మాత్రమే పరిమితమైన సాహిత్యం, ధనస్వామ్య సమాజంలో ఒక అంతస్తు దిగి మధ్యవర్గం దాక వచ్చేసింది. ఏదో కొందరికి అర్ధం కావాలని ఛందస్తులో రచించిన రచనలకు, కాలదోషం పట్టి వచనానికి ప్రాధాన్యత వచ్చింది. రాజులు, రాణులు వారి ప్రేమలు, విరహాలు అంతరించి, సాహిత్యంలో మధ్యతరగతి మనిషి జీవితగాథలు చోటుచేసుకున్నాయి. పారిశ్రామిక విప్లవం సాధించిన ఒక విశిష్టమైన సాహితీ ప్రక్రియ నవల. నవలలో సాధారణ మనిషి సుఖదుఃఖాలు అతని బాధలు, గాధలు వర్ణించడం జరిగింది. నవలాప్రక్రియ సాహిత్యాన్ని ఆకాశాన్నుంచి నేలకుదించి అందులో మట్టి వాసనను గుభాళించుకుంది. సాహిత్యం మధ్యతరగతి దాకా వచ్చి నిలిచిపోయింది. ధనస్వామ్య సమాజంలో సామాన్యంగా సాహిత్యంలో శ్రామిక వర్గాలకు తావు వుండదు. ఎంచేతంటే రచయితలు మధ్యతరగతివారు, వారికి తెల్సింది మధ్యతరగతి జీవితం. వారు వ్రాయగలిగింది దానిగురించే -


    ధనస్వామ్యంలో సాహిత్యం సైతం ధనస్వామ్యుల గుప్పిట్లో ఉంటుంది. ఇందుకు కారణం అచ్చుయంత్రాలు, పత్రికలు వారి ఆధీనంలోనివే. పరోక్షంగా సాహితీ పథ నిర్దేశం చేసేవారు ధనస్వాములు. ఈ వలయంలో రచయిత నామ మాత్రుడు మాత్రమే సాహిత్యంలో చైతన్యముండడం ధనస్వామ్యులకు గిట్టని పని. కాబట్టి సాహిత్యం సాధ్యమైనంతవరకు మత్తుమందులా వుండేట్లు చూడడం ధనస్వామ్యుల ఉద్యోగం. మనిషిలోని బలహీనతను వాడుకొని డబ్బుచేసుకొనే సాహిత్యసృష్టి ఎక్కువగా జరుగుతుంది. ఐతే ధనస్వామ్యం ప్రసాదించిన ఆలోచనా స్వేచ్ఛ కారణంగా అక్కడక్కడ ప్రగతి సాహిత్యం వస్తూనే వుంటుంది. సంఖ్యాపరంగా ధనస్వామ్యంలో వచ్చినంత సాహిత్యం బహుళః మానవుడు పుట్టిననాటి నుంచి, ఎన్నడూ వచ్చివుండదు.

    
    శ్రమ స్వామ్యం


    సమాజం భూసామ్య దశనుంచి ధనస్వామ్య దశకు పరిణామం చెందుతున్న దశ, ధనస్వామ్యాన్ని ప్రసవించడానికి పురుటినొప్పులు పడుతున్న తరుణమిది. గ్రామవ్యవస్థ చిన్నాభిన్నమై, వృత్తి పనులవారు తమ వృత్తులు కోల్పోయి కడుపు చేతబట్టుకుని లండన్ మహా నగరానికి తరలి వెళ్లారు. ధనస్వాములు నిర్ణయించిన కర్మాగారాల్లో, పొట్టకూటికి కూలీలుగా మారిన వృత్తి పనివారు మురికిపేటల్లో నివసిస్తూ, కర్మాగారాల్లో పనిచేయడం ప్రారంభించారు. ధనస్వామ్యుల ధనపిపాసకు అంతులేదు. కూలీలతో రోజుకు 14 నుండి 18 గంటలు పనిచేయించి పొట్టకూటికి చాలని కూలిని ముఖానపారేసి ఇంటికి పంపారు. శ్రామికుని శ్రమను మూల్గులతో పేల్చి ధనస్వామ్యం తమ బొక్కసాన్ని నింపుకోసాగారు. కార్మికులు చేరిన మురికివాడల్లో కనీస సౌకర్యాలు లేక, తినతిండి లేక కలరాలు వండి దుర్భరమైన వ్యాధులు వ్యాపించి లండన్ నగరం యావత్తును కలుషితం చేశాయి. కార్మికులను కనీసం మనుషులుగా చూడని పైశాచిక విధానాన్ని గురించి అనేకమంది మేధావులు ఆలోచించసాగారు. మానవత హృదయం తపించింది. క్షోభించింది. ఈ దురాగతాన్ని, ఈ దోపిడీని, ఈ పైశాచికతను అంతం చేయడానికి అనేకమంది మేధావులు తమ మేధస్సును కర్పూరంగా వెల్గించి వెల్గుబాటను పరచడానికి ప్రయత్నించారు. వారిలో విజయవంతంగా సక్రమ మార్గాన్ని కనుగొన్న మహామేథావి 'కారల్ మార్క్స్'


    ధనస్వామ్య సమాజంలో జరుగుతున్న దోపిడీని కారల్ మార్క్స్ హృదయం పరితపించినంతగా మరొకరి హృదయం పరితపించి వుండదు. ఇతడు మహామేథావి - మహామనీషి. మానవతా మూర్తి. శ్రామికులు రక్తాన్ని పీల్చి బొర్రలు పెంచుకుంటున్న వారి ఎత్తులను, జిత్తులను బయటపెట్టి ఈ ఊబినుంచి బయటపడ్డానికి సశాస్త్రీయమైన ఒక చక్కని మార్గాన్ని కనిపెట్టిన మహర్షి అతడు.


    సమాజంలో ఇలావుంది అని చెప్పినవాళ్లు అనేకమంది ఉన్నారు. సమాజం ఇలా ఉండాలి అని చెప్పినవాడు మార్క్సు ఒక్కడే. "ప్రపంచ శ్రామికుల్లారా ఏకం కండి." "పోరాటం జరపండి" మీ దగ్గర ఏముంది పోవడానికి. మహాపోతే బానిసత్వమే పోతుందన్న నినాదమిచ్చి శ్రామికవర్గంలోని శక్తిని పురిగొల్పినవాడు కారల్ మార్క్స్.


    దోపిడి జరుగుతోంది అని అందరూ చెప్పారు. దోపిడి ఎలా జరుగుతోందో మార్క్స్, కర్మాగారాల్లో పనిచేసే కార్మికునికి, కూలీ లభిస్తుంది కాని ప్రతిఫలం లభించడం లేదు. కూలీకి, ప్రతిఫలానికి తేడా ఏమిటో ఆలోచిద్దాం. ఒక కర్మాగారంలో కార్మికుడు వందరూపాయలు విలువచేసే ఉత్పత్తి చేస్తున్నాడనుకుందాం. అతనికి అందుతున్న కూలీ ఎంత? అతని కూలీని ఏ పద్ధతిపై నిర్ణయించడం జరుగుతోందా? లేక అతని అవసరాలను బట్టి జరుగుతోందా? ధనస్వామ్యంలో కూలీ నిర్ణయం "డిమాండ్ అండ్ సప్లయ్" అనే పద్ధతిపై జరుగుతోంది. అంటే పరిశ్రమకు కావల్సిన కార్మికులు పదిమంది అయితే అందుబాటులో వున్న కార్మికులు 20 మంది అయినపుడు తక్కువడబ్బుకు కూలీలను కొనవచ్చు, అలాగాక, అవసరమయిన 20 మంది కార్మికులకు 10 మంది మాత్రమే లభించిన పక్షంలో ఎక్కువ డబ్బిచ్చి కూలీలను కొనవల్సి వస్తుంది. ఈ విధానంలో ఎక్కడా కార్మికుడు చేసే ఉత్పత్తిని గురించిన ఆలోచనా వుండదు. కూలీ నిర్ణయించే పద్ధతి మరొకటి కూడా వున్నది. అది కార్మికుల అవసరాన్ని లెక్కకు తీసుకొని నిర్ణయించేది. కార్మికుడు బ్రతికి వుండటానికి ఎంత డబ్బు కావాలో నిర్ణయించి, అతని అంతస్తును బట్టి వేతనాన్ని నిర్ణయిస్తాను. మనం పైన తీసుకున్న ఉదాహరణలో 100, రూపాయల సరకును ఒక కార్మికుడు పది గంటల్లో ఉత్పత్తి చేస్తాడనుకుందాం. అలాంటప్పుడు అతనికిచ్చే కూలీ 10 రూపాయలనుకుందాం. 10 గంటల్లో 100 రూపాయల సరకు ఉత్పత్తి చేసే 10 రూపాయల సరుకును ఉత్పత్తి చేయడానికి 1 గంట పడ్తుంది. అంటే అతనికిచ్చిన కూలీ అతడు చేసిన ఒక గంటపనికి సరిపోతుంది. మిగతా తొమ్మిది గంటలు ధనస్వామికి ఉచితంగా పనిచేస్తున్నాడని అర్ధం. అంటే వెట్టి చేస్తున్నాడని అర్ధం. ధనస్వామికి న్యాయంగా చెందవల్సింది ఒకగంట శ్రమ మాత్రమే. మిగతా తొమ్మిది గంటల శ్రమను, అతనికి అంటే కార్మికునికి ఏమీ యివ్వకుండ దోచుకుంటున్నాడని అర్థం. ఈ దోపిడీకి మారుపేరే లాభం. లాభం అనే మంచిపేరు చాటున అమానుషమైన దోపిడి జరుగుతోంది.


    దోపిడీ నిజస్వరూపం వికృతాకారంలో బయటపడింది. నిజమే. కాని ఈ దోపిడీని నిర్మూలించడం ఎలా? శ్రామికులను, ఈ దోపిడి నుంచి విముక్తులను చేయడం ఎలా? అని ఆలోచించగా తేలిందేమంటే ఈ దోపిడీ అంతటికి ప్రధానకారణం ఆస్థి. ధనస్వాములు ఆస్థిని తమ గుప్పిట్లో పెట్టుకోవడం వలననే దోపిడి చేయగల్గుతున్నారు. ఆస్థిలేని సమాజమంటూ వుండదు. కాని ఆస్థి ఏ కొద్దిమంది చేతుల్లోనే వుండటం సమాజంలోని అశేష ప్రజానీకాన్ని దోచుకోవడానికి కారణమవుతున్నది. కాబట్టి ఈ ఆస్థి వ్యక్తుల పరం కాకుండా సామాజపరం కావాలి. అలాంటపుడు ఆస్థి అందరి హక్కు కాబట్టి ధనబలంతో మనిషి మరొక మనిషిని దోచుకోవడం జరుగదు. అందువల్ల ఆస్థి సమాజపరం కావాలనే వాదం. లేదా 'సోషలిజం'.


    ధనం వ్యక్తిపరంగా వుంటే జరిగే ప్రమాదాన్ని గురించి భాగవతంలో ఒక కథ వుంది. ఇక్కడ దాన్ని ప్రస్తావించడం సమంజసం.


    పరీక్షిత్తు సరస్వతీ నది ఒడ్డున సంచరిస్తున్నప్పుడు అతనికొక దృశ్యం కన్పించింది. ఒక ఆవును ఒక వ్యక్తి కర్రతో కొడ్తూ కాళ్లతో తంతూ బాధిస్తున్నాడు. పరీక్షిత్తు ఆ దృశ్యం చూశాడు. అతనికి ఆవును బాధిస్తున్న మనిషిమీద కోపం వచ్చింది. అతన్ని చంపడానికి బాణం తీశాడు. ఆ వ్యక్తి బాణాన్ని చూసి గడగడా వణికాడు. పరీక్షిత్తు కాళ్లపై బడి, "నేను కలి పుఋషుణ్ని. పాపం చేయడనే నా స్వభావం" అని అన్నాడు.  "ఐతే నీవు నా రాజ్యంలో వుండటానికి వీలులేదు" వెళ్లి పొమ్మన్నాడు, పరీక్షిత్తు. "ఈ ధరామండలాన్ని యావత్తు నీవే పాలిస్తున్నావు. మరి నేనుండే స్థలం నిర్దేశించు, అక్కడే వుండిపోతానన్నాడు కలి" అందుకు పరీక్షిత్తు "జూదం, పానం, స్త్రీలు, హింస అనే ఈ నాల్గింటిలో వుండు. ఎంచేతంటే జూదం అబద్ధం చెప్పిస్తుంది. పానం మదానికి కారణం అవుతుంది. స్త్రీలు సంగమ కారకులు, హింస క్రౌర్యమునకు స్థావరము. నీవు కలివి. పాపాలు చేసేవాడివి. కాబట్టి ఈ నాల్గింటిని నెలవుగా చేసికొని నివసించు" మని అన్నాడు.

 Previous Page Next Page