Previous Page Next Page 
మగబుద్ధి పేజి 5


    మరో పదినిముషాలకు దూరంగా ఏదో వాహనం వస్తున్నట్టనిపించి సగం రోడ్డు మీదకు వచ్చాడు.

 

    తెల్లటి మారుతీకారు అతని కళ్ళల్లో చుక్కలా ప్రతిబింబించింది.

 

    భగవంతుడ్ని మనసులోనే ప్రార్థిస్తూ చేయి వూపడం ప్రారంభించాడు.

 

    స్పీడ్ గా వచ్చిన కారు అతన్ని దాటుకుని వెళ్ళి కాస్తంత ముందుగా సడన్ బ్రేక్ తో ఆగింది.

 

    పరుగున అక్కడికి వెళ్ళాడు.

 

    గ్లాస్ డోర్స్ నిశ్శబ్దంగా కిందకు దిగాయి.

 

    కారు లోపల మొత్తం నలుగురు అమ్మాయిలున్నారు. "అందరూ బాగానే వున్నారు. డ్రైవింగ్ సీట్లో వున్న అమ్మాయి అద్భుతంగా వుంది" అంత కంగారులోనూ, అంత టెన్షన్ లోనూ అతడి మనసు గ్రాఫ్ గీసేసింది.

 

    "సారీ ఫర్ ది డిస్ట్రబెన్స్ మేడమ్. అర్జెంటుగా గాంధీబజార్ దగ్గరికెళ్ళాలి. అక్కడ ఓ ఇంటర్వ్యూకి హాజరవ్వాలి" ప్రాధేయపడుతూ అడిగాడు అతను.

 

    "బస్సుకు వెళ్ళచ్చుగదా. ఇలా రోడ్డుకడ్డంపడి కార్లు ఆపకపోతే" వెనుక కూర్చున్న ఓ అమ్మాయి సీరియస్ గా అంది.

 

    "బస్సుకే బయల్దేరాను. మధ్యలో కండక్టర్ బలవంతంగా దించేశాడు."

 

    "ఎందుకు?" స్టీరింగును సుతారంగా తిప్పుతూ అడిగింది డ్రైవింగు సీట్లో కూర్చున్న అమ్మాయి.

 

    నిజం చెప్పాలా వద్దా అన్నట్టు ఓ క్షణంపాటు ఆలోచించాడతను. అబద్ధం చెప్పాలంటే స్ఫురించలేదు. అందుకే నిజం చెప్పాడు.

 

    "టికెట్టుకు పదిపైసలు తక్కువైంది" తలవంచుకున్నాడు.

 

    కిసుక్కున నవ్వింది వెనుకనున్న మరో అమ్మాయి.

 

    "సరూ! కాస్త సర్దుకో" అంది డ్రైవ్ చేస్తున్న అమ్మాయి.    

 

    ఆ మాటతో వెనుక డోర్ తెరిచి, లోపలకు తలదూర్చాడు నరేష్.

 

    అతను కూర్చున్నాక కారు కదిలింది.

 

    కష్టం దాటిపోగానే రిలాక్స్ గా ఫీలయ్యాడు అతను.

 

    డ్రైవ్ చేస్తున్న అమ్మాయిపై అతని చూపులు తుమ్మెదల్లా వాలాయి.

 

    "ఎవరీ సౌందర్యపు గని. అవి కళ్ళా! కాదు అరవిరిసిన పద్మాలు. అది ముక్కా సంపెంగ మొగ్గ. అవి బుగ్గలా! కాదు అరుణిమ పుట్టిళ్ళు, అవి పెదవులా! కాదు అమృతాన్ని తాగి, మాధుర్యపు వత్తిడితో విచ్చుకున్న గులాబీలు అది కంఠమా! కాదు కోయిలగానం.

 

    ఈ పుత్తడి బొమ్మకు ఇరవైమూడేళ్ళుకన్నా ఒక ఏడు తక్కువ వుండదు. ఈమె లేచి నిలుచుంటే ఖచ్చితంగా అయిదూ పాయింట్ అయిదడుగులు వుంటుంది. ఈమె మనసు ఇతరుల బాధ చూసి కరిగిపోయే వెన్న తప్ప మరొకటి అయి ఉండదు.  

 

    అతను ఇంటర్వ్యూ సంగతి పూర్తిగా మరిచిపోయాడు. ఆ కారు అలా సాగిపోతూ వుంటే తన్మయత్వంతో రెప్ప వాల్చకుండా ఆమెను చూస్తూ వుండిపోయాడు.

 

    కారు భగత్ సింగ్ పార్కుదాటి, లాల్ బహదూర్ శాస్త్రి బజారులోకి తిరిగింది.

 

    వాళ్ళకి తెలియకుండా ఆ కారునే ఫాలో అవుతూ వస్తున్న నల్ల అంబాసిడర్ కూడా మలుపు తిరిగింది.

 

    తను దిగాల్సినచోటు వచ్చేస్తుంటే దిగులుగా అనిపించింది నరేష్ కి. నలుగురు అమ్మాయిల్తో మారుతీకారులో ప్రయాణిస్తుంటే జీవితం రంగుల కలలా అనిపిస్తోంది. మనసంతా రకరకాల భావనలతో మూర్చనలు పోతోంది.

 

    కారు ఓ పక్కగా ఆగడంతో ఈ లోకంలోకి వచ్చాడు అతను.

 

    "ఇదే గాంధీ బజార్ మీరెక్కడి కెళ్ళాలి?" గేరు మార్చుతూ అడిగింది ఆమె.

 

    "స్మితా ఎక్స్ పోర్టింగు కంపెనీకి" చెప్పాడు.

 

    "ఇక్కడినుంచి చాలా దగ్గర దిగి నడిచి వెళ్ళండి. జస్ట్ టూ మినిట్స్ వాక్" అంది ఆమె.

 

    "ఓకే! చాలా థేంక్సండి" అంటూ డోర్ తీసుకుని దిగాడు.

 

    ఇక కారు కదులుతూ వుందనగా "మీ పేరు తెలుసుకోవచ్చా?" వినమ్రంగా అడిగాడు.

 

    ఎక్సలేటర్ తోక్కబోతున్న ఆమె ఆగి "రజని" అని చెప్పింది.

 

    "కారులో వచ్చింది కాక పేరు అడుగుతున్నావ్ ఏం కథ? ప్రేమా దోమా అంటూ మా రజనీతో ప్రేమలో పడవుకదా" అంది వెనుకనున్న సరూ అనబడే సరళ నవ్వుతూ.

 

    అతను ఆ మాటలకు కొంత షాక్ తిన్నాడు. అంతలో తమాయించుకుని "గొప్ప సహాయం చేశారామె. మర్యాదకోసం అడిగాను అంతే" అన్నాడు.

 

    "అలా అయితే ఓకే. ప్రేమించానన్న వుద్దేశ్యం మాత్రం ఉంటే ఇప్పుడే ఫుల్ స్టాప్ పెట్టేసుకో" వ్యంగ్యంగా అంది సరళ.

 

    "ఛీ. నోర్ముయ్" అని కసురుకుని కారును కదిలించింది రజని.

 

    "సరూ తల్లీ! నువ్వు మాత్రం మహా ఘటికురాలివి. నా మనసులో మాట కనిపెట్టేశావు. నీ ఫ్రెండ్ ని పొగడాలని నువు అలా అన్నా ఆ మాట మాత్రం నిజం. నీ స్నేహితురాలు రజనీని ప్రేమించని జన్మకూడా ఒక జన్మేనా? ఆడపిల్లను చూసి మాత్రం ఆనందించే నా హృదయంలో ఈ మార్పేమిటి? జీవితంలో మొదటిసారి కలుగుతున్న ఆ భావనను 'ప్రేమ'అని అంటారని నీకెలా తెలుసు సరూ అమ్మడూ! అవునూ!నీకు ఆ దోసకాయ పిందిబొట్టు ఏమీ బాగులేదు గుండ్రటి బొట్టే బావుంటుంది నీకు. కోలగా ఉండే ఆడపిల్ల దోసకాయపింది బొట్టు పెట్టుకుంటే నప్పదు. ఈసారి ఎప్పుడైనా కనిపిస్తే సలహా ఇస్తాలే"  

 

    మనసులోనే అనుకుంటూ అలా నిలబడిపోయాడు.

 

    రజని అందాన్ని తాగిన కళ్ళనుంచి ఆనందం ఓవర్ ఫ్లో అవుతూ వుంది.

 

    "ఐ లవ్ యు రజని" చిన్నగా పెదవుల్ని కదిల్చాడు.

 

    దూరంగా నిలబడి అతన్నే గమనిస్తున్న ఆ వ్యక్తి నరేష్ పెదవులు ఏమని ఉచ్ఛరించాయో కనిపెట్టేశాడు.

 

    ఆ వ్యక్తి ఎక్కి కూర్చోగానే నల్లటి అంబాసిడర్ కారు కూడా కదిలింది.

 

    ముప్పై అడుగుల దూరం నుంచి పెదవుల కదలికను బట్టి నరేష్ ఏమనుకున్నాడో గ్రహించిన ఆ వ్యక్తి పేరు బ్రహ్మానందం.

 

                              *    *    *    *    *

 

    నరేష్ బితుకు బితుకుమంటూ "స్మిత ఎక్స్ పోర్టింగ్ కంపెని" అన్న బోర్డు వున్న గేటును తీసుకుని లోపలకు అడుగుపెట్టాడు.

 Previous Page Next Page