చిదంబరం వగర్చుకుంటూ లోపలికొచ్చి పక్కగదిలో కెళ్ళగానే, అప్పలరాజు ముఖం విప్పారి, తను కూడా మరోసారి "ఎక్స్యూజ్ మీ" అని చెప్పి లోనకు వెళ్ళాడు.
"సార్... సార్... శివరంజని, స్టార్ డస్టూ దొరికాయి సర్... సితార దొరకలేదు. మిగతా సిన్మా పత్రికలేవీ లేవు... సిన్మా పత్రికలు తెమ్మన్నారు గదాని... కొన్ని తమిళ, మలయాళీ సిన్మా పత్రికలుంటే తెచ్చాను సర్" ఆ పుస్తకాలిస్తూ చెప్పాడు చిదంబరం.
"తమిళం, మళయాళమా? ఆ భాషలు నాకు రావు గదయ్యా?" విసుక్కున్నాడు అప్పలరాజు.
"భాషలు రావాలేంటి సార్... టీవీ. క్విజ్ ల్లా 'విజువల్స్' చూపించి ప్రశ్నలెయ్యండి సర్."
"మీ వైజాగోళ్ళకి బుర్రనిండా అయిడియాలేనయ్యా... వెళ్ళిపో... నువ్వు ముందెళ్ళిపో" అని చిదంబరాన్ని పంపించి, ఆ రూంలో ఆ పత్రికలు తిరగేస్తూ, వ్యాసాలు చదువుతూ, బొమ్మల్ని చూస్తూ వుండగా....
పావుగంట గడిచింది....
అరగంట గడిచింది....
బాస్ రూమ్ లో కూర్చున్న ఆంజనేయులు 'డ్రీమ్స్'లో కెళ్ళి పోయాడు.
"ఎస్ మిస్టర్ ఆంజనేయులూ" అనుకుంటూ లోనకు ఠీవిగా ప్రవేశించిన అప్పలరాజు అక్కడ దృశ్యాన్ని చూసి అవాక్కయిపోయాడు.
బాస్ టేబిల్ మీద వాలిపోయి గుర్రుపెడుతూ నిద్రపోతున్నాడు ఆంజనేయులు.
నిద్రలేపక తప్పదు... ఇంటర్వ్యూ చెయ్యకా తప్పదు... అని చేత్తో కొట్టి నిద్ర లేపాడు అప్పలరాజు.
ఆ దెబ్బతో గబుక్కున మేలుకొని "అప్పుడే స్టాపొచ్చిందా" అని లేచి నిలబడ్డాడు ఆంజనేయులు.
"స్టాప్ రావడం ఏవిటోయ్... దుర్యోధనుడుగానీ కలలోకొచ్చేడా? డోంట్ వర్రీ... ఆంజనేయ మంత్రం జపించుకో. వెళ్ళి అక్కడ మొహం కడుక్కొని వస్తే ఇంటర్వ్యూ ప్రారంభిద్దాం."
తనెక్కడున్నాడో గుర్తుకు తెచ్చుకోవడానికి రెండు నిమిషాలు పట్టింది ఆంజనేయులుకి. సిటీ బస్సులో లేడని నిర్ధారించుకుని మొహం కడుక్కొని వచ్చి ఆవలిస్తూ కూర్చున్నాడు ఆంజనేయులు.
"అడగండి సార్" విసుగ్గా అన్నాడు ఆంజనేయులు.
అడగడానికి కొత్త ప్రశ్నలు దొరికాయనే ఉత్సాహంలో వున్నాడు అప్పలరాజు.
"హెన్నా అనే సినిమాలో హీరోయిన్ గా వేసిన జేబా భక్తియారే ఎవరు? ఆ అమ్మాయిది ఏ దేశం?"
హెన్నా?! ఆ పేరే వినలేదు ఆంజనేయులు.
"అది మలయాళం సినిమా కద సర్?" మొహం కడుక్కోడానికి వెళ్ళినప్పుడు లోన గదిలో టీపాయ్ మీద అతనికి తమిళ, మలయాళీ మాగజైన్లు కన్పించాయి. అది గుర్తుకు తెచ్చుకుని అన్నాడు ఆంజనేయులు.
"ఎస్... మలయాళం సినిమాయే... యూ ఆర్ కరెక్ట్ మై బోయ్" అన్నాడు చింకి చేటలా నవ్వుతూ. 'హెన్నా' సినిమా హిందీయా, మళయాళమా లోన గింజుకు ఛస్తున్నాడు అప్పలరాజు.
"ఆ అమ్మాయి కొత్త ఫేసు సర్. హీరోయిన్ లక్ష్మి వుంది కదా? ఆవిడ కూతురు సర్."
"గుడ్... గుడ్... నెక్ట్స్ కొణిదెల నాగవెంకటసత్య వరప్రసాద్ అంటే ఎవరోయ్" అతనెవరయింది అప్పలరాజుకి కూడా తెలీదు.
ఆ పేరు వినగానే కన్ ఫ్యూజ్ అయ్యాడు ఆంజనేయులు. ఆ పేరు ఎక్కడో విన్నట్టు బాగా జ్ఞాపకం. ఎక్కడ? ఎక్కడ?
తన ఇష్టమైన గాడ్ దుర్యోధనుడ్ని జ్ఞాపకం తెచ్చుకోగానే టక్కున అతనికి ఖైదీ, ఛాలెంజ్, కొండవీటి దొంగ, రౌడీ అల్లుడు, జగదీకవీరుడు అతిలోకసుందరి, ఘరానా మొగుడు, ప్రతిబంధ్, ఆజ్ కా గూండా రాజ్ సినిమాలు, అందులో హీరో చటుక్కున గుర్తుకొచ్చేశాడు.
"య్యా... హూ...." అని అరచి "చిరంజీవి సర్" అని గబుక్కున చెప్పేడు.
"గుడ్... గుడ్... సితార... సిన్మా పత్రిక ఏ వూళ్ళో ప్రింటగును" అడిగాడు అప్పలరాజు.
"ఒక్క నిమిషం సర్" సితార తనెక్కడ చూశాడో జ్ఞాపకం రావడానికి ఒక్క నిమిషం పట్టింది. సితారను తను అమలాపురం బస్టాండులో చూశాడు. అంటే ఆ చుట్టుపక్కల ఎక్కడో ప్రింటవుతోందన్న మాట.
"అమలాపురం సర్."
"అమలాపురమా? కాదనుకుంటానోయ్? నాక్కూడా అయిడియా లేదుగానీ, ఈ క్వశ్చను 'తూబొడ్డుంబాల్' అనుకో. ఓ.కే.నోయ్. నీ జనరల్ నాలెడ్జ్ నాకు నచ్చింది. ఎందుకంటే, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కి ఇలాంటి నాలెడ్జీ ఎక్కువ అవసరం. ఈ అప్పలరాజు సప్లయింగ్ వరల్డ్ కంపెనీకి నిన్ను పి.ఆర్.ఓ గా సెలక్ట్ చేస్తాను. కానీ ఒక షరతు... ట్వంటీఫోర్ అవర్సూ నువ్వు ఆఫీసుకి అందుబాటులో వుండాలి... వుంటావా?"
"అంటే..." అర్థంకాక అడిగాడు ఆంజనేయులు.
"నీ రెసిడెన్స్ ఈ ఆఫీస్ దగ్గర్లోనే వుండాలి... నువ్వు పి.ఆర్.ఓ.వి కాబట్టి. నీ సేవలు ఇరవై నాలుగు గంటలూ, కంపెనీకి ఉపయోగపడాలని"
"నిజమేనండీ... కానీ... ఈ చుట్టుపక్కల రూమ్ దొరకొద్దూ?" అయోమయంగా అన్నాడు ఆంజనేయులు...
"చాకులాంటి నీ బ్రెయిన్ నాకు నచ్చిందయ్యా. నీ కె.జి బ్రెయిన్లోని జి.కె నాకు నచ్చిందయ్యా - పి.ఆర్.ఓ జాబ్ నీకుఖాయం... నువ్వు ఆఫీసు దగ్గర్లో ఇల్లు చూసుకోవాలి... అలా నీకు ఇల్లు దొరికినట్టు... ఆ ఓనర్ చేత, ఆ ఏరియాలోని పోస్టుమాన్ చేత ధ్రువీకరణపత్రాలు నువ్వు తీసుకొచ్చి చూపించు... వెంటనే నిన్ను అపాయింట్ చేస్తాను... ఓ.కే... యూ కెన్ గో..." తనే ముందులేచి నిలబడ్డాడు అప్పలరాజు.
ఎవరితోనైనా డిస్ కషన్ అయిపోయాక తనే ముందులేచి నిలబడి పోతాడు అప్పలరాజు. అలా అయితే అవతలి వ్యక్తి వెంటనే వెళ్ళిపోతాడని-
బయటి కొచ్చేశాడు ఆంజనేయులు.
"ఇంతసేపు ఇంటర్వ్యూ చేసేరేమిటండీ..." అడిగింది ఇందాకటి అమ్మాయి. చటుక్కున ఆ అమ్మాయెవరో అప్పుడు జ్ఞాపకాని కొచ్చింది ఆంజనేయులికి.
ఆర్ట్స్ కాలేజీ దగ్గర ఆర్ట్స్ కాలేజీ ఎన్టీ.ఆర్. కట్టించాడని తనకు చెప్పిన అమ్మాయి.
"పి.ఆర్.ఓ. జాబ్ కు సెలక్ట్ అయ్యానండి... అందువల్ల... స్పెషల్ గా నన్ను ఇంటర్వ్యూ చేశారండి... మీరే పోస్టుకొచ్చారు..." అడిగాడు ఆంజనేయులు.
"టైపిస్టు పోస్టుకండి..." వినయంగా చెప్పిందామ్మాయి. ఆ అమ్మాయి చేతిలో టైపుకీ, షార్ట్ హేండ్ కీ సంబంధించిన ఏవో పుస్తకాలున్నాయి ఆ పుస్తకాల వేపు చూసి-