ఇంట్లో విషయాలు ఒక ఎత్తు - బయట ప్రోఫెషనల్ గా కూడా పెళ్ళయిం దగ్గరనించి తన బాస్ అన్నట్టు ప్రవర్తించసాగాడు.
అక్కరలేని విషయాలలో జోక్యం చేసుకోవడం, అడగని సలహాలు ఇవ్వడం, అక్కరలేని నిర్ణయాలు తీసుకోవడం, తన కేసులలో తలదూర్చి కలగచేసుకోవడం.... మొదట్లో కొన్నాళ్ళు ఏమనలేక ఊరుకున్నా, రాను రాను తలనొప్పిగా తయారైంది.
విశ్వనాథంగారైనా అడగందే సలహాలివ్వరు. కేసు ఎలా డీల్ చెయ్యాలన్నది తనకే వదిలేవారు. కాంప్లికేటెడ్ కేసయితే అడిగితే చెప్పేవారు. అలాంటిది తనని మరీ ఏమీ తెలియదన్నట్టు ట్రీట్ చేస్తుంటే చిరాకనిపించసాగింది.
వినీ వినీ ఆఖరికి ఓ రోజు "నా కేసుల సంగతి నేను చూసుకుంటాను.... అవసరమైతే నేనే అడుగుతాను ప్లీజ్" అంది కాస్త అసహనంగా.
ఆ మాత్రానికే మొహం ముడుచుకున్నాడు ప్రకాష్.
ఓ.... సారీ. నా భార్యవని సలహా ఇవ్వాలన్న ఆరాటంతప్ప నా తెలివితేటలు చూపాలని కాదు" కాస్త హేళనగా అని మొహం మాడ్చుకున్నాడు.
పెళ్ళయిన ఏడాదికి ఓ రోజు "ఇంక స్వతంత్రంగా ప్రాక్టీసు పెట్టుకుందాం అనుకుంటున్నాను... ఎన్నాళ్ళిలా జూనియర్ లాయర్ గా చేస్తాం! నా పేరు క్లయింట్స్ లో అందరికీ తెలిసింది. లాయర్ గా డైరెక్ట్ గా నా దగ్గరకొచ్చే క్లయింట్స్ నాకున్నారు. విశ్వనాథంగారితో చెప్పాలనుకుంటున్నాను" అన్నాడు.
అందులో శారద కాదనడానికి ఏంలేదు. ఎవరన్నా ఓ మూడునాలుగేళ్ళు జూనియర్ గా చేశాక స్వంత ప్రాక్టీస్ పెట్టుకోవడం మామూలే.....అనుకుంటున్నాను. అంటే తనొక్కడేనా, లేక తననీ కలవమంటాడా అన్నది అర్థంకాక అడిగేలోపలే అతనే "నీవింకా కొన్నాళ్ళుండి, నా ప్రాక్టీస్ పికప్ అయ్యేంతవరకు ఇక్కడే కంటిన్యూ చెయ్యి, తరువాత జాయిన్ అవ్వచ్చు" అన్నాడు. అదీ నిజమే! ఇద్దరిలో ఒకరినైనా నికరమైన సంపాదన వుండడం అన్నది మంచి ఆలోచనే అనిపించి తలూపింది.
వేరే ప్రాక్టీస్ పెట్టాక క్రిమినల్ కేసులు కూడా తీసుకోడం ఆరంభించాడు ప్రకాష్.
"పోలీసులు, రాజకీయ రౌడీలు, క్రిమినల్స్ ... వీళ్ళతో ఎందుకు, మామూలు కేసులు చాలవా" అంది. ప్రకాష్ ఏ కేసు పడితే ఆ కేసు తీసుకుని న్యాయన్యాయాల మాట మరిచి డబ్బు సంపాదనే ధ్యేయంగా మారిన అతని ధోరణి చూసి నచ్చక అంది.
"స్టుపిడ్! ఆస్తి కేసులు, ఎంక్రోచ్ మెంట్ కేసులు, విడాకుల కేసులు, వీటిలో ఏం ఛాలెంజ్ వుంది.... ఏం సంపాదన వుంటుంది! మర్డర్ కేసులంటే మన అసలు ప్రతిభ అప్పుడు చూపచ్చు. అరడజను సివిల్ కేసుల్లో సంపాదించేది ఒక్క క్రిమినల్ కేసులో సంపాదించవచ్చు. ఒక్కసారి పేరొచ్చిందంటే చాలు లక్షల్లో వుంటుంది రాబడి" అతని కళ్ళలో డబ్బు సంపాదించాలన్న కాంక్ష, దానికి ఎదారన్నా పరవాలేదన్న దిగజారుడుతనం స్పష్టంగా కనిపించాయి.
"ఆలోచించండి బాగా, ఈ లైనులో వుండే సమస్యలు, కష్టనష్టాలు బేరీజు వేసుకోండి" ముభావంగా అంది శారద. తను చెప్పినా అతడు వినడని తెలిసి అంతకంటే చెప్పదలచలేదు. అతను క్రిమినల్ సైడుకి వెళ్తే మాత్రం తను అతనితో కలవదు. మనసులోనే నిర్ణయించుకుంది శారద.
"మంచిది ప్రకాష్, అలాగే కానియ్. నీ అంతట నీవు ప్రాక్టీస్ పెట్టుకునే సమర్థత నీకు వచ్చింది. గో ఎహెడ్. న సలహా సంప్రదింపులు ఏమన్నా కావల్సినప్పుడు అడుగు" అన్నారు విశ్వనాథంగారు మనస్ఫూర్తిగా.
"నీ సంగతేమిటమ్మా... నీవూ, మావారూ కలిసి ప్రాక్టీస్ పెడుతున్నారా..... ప్రకాష్ స్థానంలో భానుమూర్తి అందుకుంటున్నాడు. కానీ నీలాంటి అమ్మాయి ఎవరన్నా దొరికే వరకు ఆగగలవా కొన్నాళ్ళు.... నీకు తెలిసిన ఏ అమ్మాయైనా వుంటే జూనియర్ గా తీసుకొచ్చి ట్రైనింగ్ ఇవ్వమ్మా.... ఆ ఓపిక ఇంక నాకు లేదు" అన్నారు విశ్వనాథంగారు.
"లేదుసార్. నేనింకా కొన్నాళ్ళు ఇక్కడే కంటిన్యూ చెయ్యాలనుకుంటున్నాను. నే వెళ్ళేలోగా తప్పకుండా ఇంకో అమ్మాయిని తీసుకొచ్చి పని నేర్పించే వెళతాను సార్" శారద కృతజ్ఞతగా అంది.
విశ్వనాథంగారు నిశ్చితంగా నిట్టూర్చాడు. శారద ఇంకా కొన్నాళ్ళు వుంటుంది అన్నమాట ఆయనకి నిశ్చింతనిచ్చింది.
ఏణ్ణర్ధంలో ప్రకాష్ చాలా తొందరగా సివిల్, క్రిమినల్ లాయర్ల లిస్టులో చేరాడు.
వేరే ఆఫీస్ ఓపెన్ చేశాడు. ఆఫీస్ స్టాఫ్, అతనికింద ఓ జూనియర్ లాయరు, హంగులన్నీ వచ్చాయి.
హఠాత్తుగా విశ్వనాథంగారికి స్ట్రోక్ వచ్చింది. నోటిమాట, ఎడంవైపు చేయి, కాలు పూర్తిగా చచ్చుపడ్డాయి.
ఆయన అలాంటి స్థితిలో వుండడంతో మొత్తం ఆయన ప్రాక్టీసు భారం అంతా శారద మీదే పడింది. భానుమూర్తి సాయంతో శారద మొత్తం అంతా సంబాళించుకొస్తోంది. పని భారం ఎక్కువై ఇంకో అమ్మాయి వసంతని జూనియర్ గా పెట్టుకుంది. విశ్వనాథంగారిని వారం వారం కలవడానికి వెళ్ళి కేసుల వివరాలు చెప్పేది. ఆయన ఏదన్నా చెప్పదలిస్తే కాగితం మీద రాసి చూపేవారు. శారదమీదే అంతా వదిలేస్తున్నానని, తనింకలేచి తిరగగలిగే ఆశలేదని రాసేవారు. ఆయన స్థితి చూశాక శారదకి రోజురోజుకీ నమ్మకం తగ్గిపోసాగింది. అయినా కోలుకుంటారంటూ ధైర్యం చెప్పేది.
ఆరు నెలలు గడిచినా ఆయన పరిస్థితిలో మార్పులేక దిగజారింది. తన పరిస్థితి ఆయనకీ అర్థమైంది. ఓరోజు ఉత్తరం రాసి శారదకిచ్చారు. శారద చేత విల్లురాయించి రిజిస్టర్ చేయించారు.
తన ప్రాక్టీసు అంతా ఇంక శారదదేనని, ఏం వచ్చినా ఆ రాబడి అంతా ఆమెకే చెల్లుతుందని, ఆఫీసు మరోచోటికి మార్చుకోమని, స్టాఫ్ ని వీలైనంతవరకు వుంచుకోగలిగితే సంతోషం అని, ఆ రోజునించి ఆమె ప్రాక్టీసు ఆమెకే స్వంతమని రాశారు. శారద ఏదో చెప్పబోతే వారించారు. నీకు నా ఆశీస్సులు... శుభం కలగాలి" అంటూ ఆశీర్వదించారు... శారద కనీసం స్త్రీలకేసులు అయినా మానకుండా చూడాలన్న కోరికను వ్యక్తపరిచాడు.
* * *
"ఇంక ఆ ప్రాక్టీస్ వదిలెయ్. నాతో జాయిన్ ఆవు. మనది మనం చూసుకుందాం" అన్నాడు ప్రకాష్, ఇంటికొచ్చాక రాత్రి భోజనాల దగ్గర శారద చెప్పిన మాట విని.