Previous Page Next Page 
మేడ్ ఫర్ ఈచ్ అదర్ పేజి 6


    "పెళ్ళిచేసుకుంటాం...అది కాదు ప్రాబ్లమ్...ఏదైనా అనుకోని ఆపద వల్ల వాయిదా పడితే...ముందు జాగ్రత్త చాలా అవసరం...

 

    గౌతమి ఊఁ కొట్టింది.

 

    పది నిమిషాల తర్వాత రెస్టారెంట్లోంచి ఇద్దరూ బయటకొచ్చారు. ఆటో స్టాండ్ వరకూ ఇద్దరూ నడుచుకుంటూ వచ్చారు.

 

    మధ్య దారిలో అడిగింది గౌతమి.

 

    "నువ్వెప్పుడెళ్తున్నావ్...మీ ఊరు..."

 

    "రేపుగాని...ఎల్లుండి గానీ..."

 

    "మల్లెప్పుడొస్తావ్..."

 

    "రెండ్రోజుల తర్వాత..."

 

    "రాగానే కలుస్తావు కదా..."

 

    "కలవనా..."

 

    ఆటోలో ఎక్కి కూర్చుంది గౌతమి, ఆటో బైల్దేరుతున్న సమయంలో పక్కనే నుంచున్న అవినాష్ చేతిని తన చేతిలోకి తీసుకొని మృదువుగా నిమిరింది.

 

    ఆటో ముందుకెళ్ళిపోయింది.

 

    అప్పటికి సమయం సరిగ్గా పదినలభై అయిదు నిమిషాలు కావొస్తోంది.

 

    అప్పటికి జగదంబా జంక్షన్ నియాన్ లైట్ల వెలుగులో నిగనిగమని మెరుస్తోంది.

 

    అటూ ఇటూ చూసి అవినాష్ ముందుకి నడిచాడు.

 

    అక్కడ నుంచి అవినాష్ తన రూంకి చేరడానికి పావుగంట సమయం పడుతుంది.

 

    ఈ పావుగంట సేపూ అతనాలోచిస్తూనే ఉన్నాడు.

 

    ఆ ఆలోచనలన్నీ గౌతమి మీదే ఉన్నాయి.

 

    తాత్కాలికంగా గౌతమికి ఏ అనుమానం రాకుండా నటించాడు.

 

    కానీ రేపట్నించి ఎలా?

 

    గౌతమి కలవక పూర్వం రోష్ణి కలిస్తే ఈ సమస్యే ఉండేదికాదు.

 

    గౌతమి గర్భవతి అవుతుందని అవినాష్ ఊహించలేదు. గర్భం వచ్చినా ఎబార్షన్ చేయిస్తే పోతుందని ఊహించాడు.

 

    కానీ అన్నీ-

 

    అతనికి విరుద్ధంగానే జరిగాయి.

 

    గౌతమి అందంగా ఉంటుంది. పైగా ఉద్యోగం చేస్తోంది. అంచేత ఆమెకు వల విసిరాడు. పడింది. ప్రేమించానన్నాడు. ప్రేమించింది. పెళ్ళి చేసుకుంటానన్నాడు. తనతో గడిపింది.

 

    కానీ-

 

    అదే సమయంలో విచిత్రమైన పరిస్థితుల్లో రోష్ణి కలిసింది.

 

    రోష్ణి కాలేజి గర్ల్. వాళ్ళ నాన్న వజ్రాల వ్యాపారి.

 

    లక్షల ఆస్తి ఉంది.

 

    రోష్ణి గనక తనకు దక్కితే, తన వెనక లక్షల ఆస్తి ఉంటుంది.

 

    తనకో బంగళా, కారు, అందమైన జీవితం, ఫ్లైట్లలో ప్రయాణాలు.

 

    ఆ జీవితం తనకు కావాలి.

 

    తాను ఎన్నాళ్ళనుంచో కలలుగన్న ఆ బతుకు తనకు కావాలి.

 

    ఆ బతుకు కోసం తనేదైనా చేస్తాడు.

 

    చాలా సేపు నిద్ర పట్టలేదు అవినాష్ కి.

 

    గౌతమిని ఎలా వదిలించుకోవాలనే ఆలోచనతోనే రాత్రంతా గడిపాడు.

 

    ఎప్పుడో తెల్లవారు జామున నాలుగుగంటలకు అవినాష్ కనురెప్పల మీదకు నిద్ర వాలింది.

 

    అయినా అది మగత, మగత నిద్రే.


                                        3


    అవినాష్ కి నిద్రపట్టటం లేదు. కనురెప్పలమీద నిద్ర తేలిపోయింది.

 

    అతనికొక్కసారి గతం జ్ఞాపకాని కొచ్చింది. అతన్ని వర్తమానం ముల్లులా గుచ్చింది. రెండింటికీ మధ్యా చీకటి అంపశయ్య మీద, పేర్చుకుంటున్న దురాశల కాగితపు నిచ్చెన మీద అవినాష్.

 

    ముఫ్పై ఏళ్ళ అవినాష్.

 

    ఎక్కడో మారుమూల పల్లెలో, పదేళ్ళ వయసునాటి భయంకరమైన పేదరికం. తండ్రి తాగుడు, తల్లి ఏడ్పులు, వంటిమీదకు పువ్వులా వయసొచ్చినా పెళ్ళికి నోచుకోక, కంటికి ఎర్రగా కనబడిన ఓ కుర్రవాడితో అక్క లేచి వెళ్ళిపోవడం, ఆ తర్వాత ఆ కుర్రవాడు ఏదో కేసులో ఇరుక్కొని జైలుకెళ్ళడం, అక్క ఏడ్చుకుంటూ ఇంటికి రావడం, తల్లీతండ్రీ దాన్ని తిట్టడం...కొట్టడం...ఇవన్నీ...ఇవన్నీ...వరసగా వరసగా అవినాష్ కి జ్ఞాపకానికొచ్చాయి.

 

    ఆరోజు అవినాష్ కి చాలా జ్ఞాపకం.

 

    ఆ భయంకరమైన అనుభవాన్ని అవినాష్ ఎప్పుడూ ఎప్పుడూ మరిచిపోలేడు.

 

    ఆరోజు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో అవినాష్ స్కూలు నుంచి ఇంటికొచ్చాడు.

 

    తల్లీ, తండ్రీ ఆరోజు ఉదయాన్నే సరుకుల కోసం పట్నానికి వెళ్ళారు. చీకటి పడితే కానీ రారు.

 

    వాకిలి తలుపు తోసుకొని ఇంటి అరుగు మీదకొచ్చి, పుస్తకాల సంచిని స్తంభానికానించి, "అక్కా, అక్కా" అని పిలిచేడు. అక్క పలకలేదు. తలుపు కొట్టి పిలిచాడు. అక్క పలకలేదు.

 

    పెరటివేపు వెళ్ళాడు. పెరటి గది తలుపులు తీసున్నాయి. నెమ్మదిగా లోనికొచ్చాడు.

 

    వంటగదికి పక్కనున్న కొట్టు గదిలోంచి మాటలు వినబడితే గోడచాటున నిలబడి కిటికీలోంచి చూశాడు.

 Previous Page Next Page