గౌతమి నోటమ్మట ఆ మాటలు ఉద్వేగంగా వచ్చాయి. "కానీ- అందుకు కారణమైన నిన్ను నేను మామూలుగా వదలను..." సూటిగా అతని కళ్ళ వేపు చూస్తూ హెచ్చరించింది గౌతమి.
ఆమె హెచ్చరిక అవినాష్ మనసులో తీవ్రమైన అలజడిని రేపింది.
ఆమెతో ప్రేమ విషయం ఇప్పటికీ అతి తక్కువమంది సన్నిహితులకు మాత్రమే తెల్సు. ఈ విషయం బైటకొస్తే తను నిర్మించుకుంటున్న ఆశల సౌధం కూలిపోతుంది.
తను మళ్ళీ చీకట్లోకి వెళ్ళిపోతాడు.
కానీ అలా జరగ్గూడదు.
ఆమెను నమ్మించాలి...నమ్మించి...నమ్మించి...
ప్రస్తుతాని కామె తనదారికి అడ్డుగా రాకుండా చూసుకోవాలి.
అయిదు నిమిషాల సేపు అవినాష్ సిగరెట్ తాగుతూ ఆలోచిస్తూ కూర్చున్నాడు.
తర్వాత-
అతని పెదవుల మీదకు చిన్న చిర్నవ్వు వచ్చింది.
ఆ చిర్నవ్వును చూసి ఆశ్చర్యపోయిందామె.
కుర్చీలోంచి లేచి-
ఆమె భుజంమ్మీద చేయివేసి-
"డియర్ లవ్లీ... డోన్ట్ వర్రీ...నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలీదా... చెప్పు... తెలీదా..." ఆమె చుబుకం పట్టుకుని అడిగాడు.
ఆ ప్రశ్నకామె జవాబు చెప్పలేదు.
"ఇదిగో నామొహం వేపు చూడు..." అని ఆమె కళ్ళల్లోకి చూస్తూ-
"మనం పెళ్ళిచేసుకుంటాం...అతి త్వరలో...నేను రేపే మా ఊరు వెళ్తున్నాను... మా డాడీని ఎలాగైనా ఒప్పిస్తాను... ఆయన ఒప్పుకో లేదనుకో... అయినా నిన్ను నేను పెళ్ళిచేసుకుంటాను...ఓ.కె. ఉత్తినే బాధపడకు... డోన్ట్ వర్రీ..."
ఆమెలో అంతవరకూ ఉన్న ఉప్పెనలాంటి కోపం చప్పున మాయమైపోయింది.
ఆమె పెదవుల మీద చిన్న చిర్నవ్వు మెరిసింది.
"యూ...నాటీ...నన్నింతసేపూ ఎందుకింత బాధపెట్టావ్..." అంటూ అతని భుజాన్ని పట్టి గట్టిగా గిల్లి, అతని నుదురుమీద ముద్దు పెట్టుకుంది.
ఆ నిశ్శబ్ద వాతావరణంలో ఆ ముద్దు పెద్ద చప్పుడు చేసింది.
సరిగ్గా ఆ సమయంలో అక్కడకు ఓ లేడి డాక్టర్ ప్రవేశించింది.
"హలో...గౌతమి...వెళ్దామా..."
ఆ లేడి డాక్టర్...గౌతమి...ఇద్దరూ ఒకే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్నారు. ఆ లేడీ డాక్టర్ కి ఇంకా పెళ్ళి కాలేదు.
లేడీ డాక్టర్ రాకతో అవినాష్ కొంచెం దూరంగా జరిగాడు.
"మీట్ మై ఉడ్ బీ...అవినాష్...లెక్చరర్..." కాలేజీ పేరు చెప్పి పరిచయం చేసింది గౌతమి అవినాష్ ని.
"ఓ...మీరేనా..." ఆవిడ అవినాష్ ని విష్ చేసి-
"మా గౌతమి మీ మెడలో దండెప్పుడు వేస్తుంది సార్..." అని అడిగింది ఆ లేడీ డాక్టర్...
ఆ ప్రశ్న ఊహించని అవినాష్ బిత్తరపోయాడు.
"వెరీ సూన్..." అంటూ ఏదో చెప్పబోయాడు. కానీ గౌతమి మధ్యలో కల్పించుకుని-
"నేను ఎబార్షన్ చేయించుకోవడం లేదు మాలా..." అని ఆనందంగా చెప్పింది.
"గుడ్...గుడ్...అయినా చేయించుకుంటే ప్రమాదం అని చెప్పాను కదా...జల్దీగా పెళ్ళి చేసేసుకోండి...ఏ బాధా ఉండదు...ఇద్దరూ జాబ్ హోల్డర్స్ కదా..." అంది.
ఆ తర్వాత అవినాష్ ఇలా అన్నాడు.
"డాక్టర్...మీరు నాకో హెల్ప్ చెయ్యాలి."
"ఏఁవిటో చెప్పండి...వీలైతే...ట్రై చేస్తాను..."
"ఏం లేదు...గౌతమి ఇప్పుడు మీతో హాస్టల్ కు రాదు...ఒక గంట తర్వాత వస్తుంది..."
"ఇదేనా... ఇంకేదో అనుకున్నాను..." డాక్టర్ మాల అంది.
గౌతమి వేపు చూచి చిర్నవ్వు నవ్వింది.
అవినాష్ ముందుకి నడిచాడు. వరండాలోకొచ్చాడు. ఆ తర్వాత గౌతమి అతని వెనకే వచ్చింది.
"ఇప్పుడెందుకు బైటకి... నేను హాస్టల్ కి వెళ్తాను..." అంది.
"లేదు జగదంబా సెంటర్లో కలిసి భోంచేద్దాం... ఆ తర్వాత నువ్వు హాస్టల్ కి... నేను రూంకి... ఓ.కె."
ఇద్దరూ ఆ నర్సింగ్ హోంలోంచి బయటికొచ్చారు.
ఆటో ఎక్కారు.
అయిదు నిమిషాల్లో జగదంబా సెంటర్లో ఉన్న స్వప్నా రెస్టారెంట్ కొచ్చారు.
ఫామిలీ రూంలో డిన్నర్ ఆర్డర్ చేసి కూర్చున్నారు.
డిన్నర్ వచ్చింది.
సగం భోజనం చేసిన వరకూ అవినాష్ ఏం మాట్లాడలేదు.
ఆ తర్వాత-
"గౌతమి. మన పెళ్ళయ్యే వరకూ నీ గర్భం విషయం ఎవరికీ తెలీకూడదు... ప్లీజ్ టేక్ కేర్..."
"నెలలు గడుస్తున్న కొలదీ తెలీదా..."
"తెలీకుండా నేను చేస్తాను...కాలేజీకి సెలవు పెడతావు... నర్సింగ్ హోంలో ఉంటావు...లేదా మన రూంలో ఉంటావు..."
"అంత బాధెందుకు... ఈ లోపల మనం పెళ్ళి చేసేసుకొంటాం కదా..." గౌతమి అంది.