Previous Page Next Page 
కోరికలే గుర్రాలైతే పేజి 5

    సరే, ఇంకా వాళ్ళు నచ్చిందని రాయాలిగదా. దేముడి దయవల్ల నచ్చలేదని రాస్తే బాగుండును. ఏ గొడవా లేకుండా పోతుంది అనుకుంది జ్యోతి.
    కాని ఆ దేముడు జ్యోతి మొర ఆలకించలేదు. పిల్ల నచ్చింది అని రాసిన ఉత్తరం చూసి తల్లీ, తండ్రి సంబరపడిపోతూంటే, జ్యోతికి ఏం చెప్పాలో తెలియక ఏడుపువచ్చింది.
    జ్యోతిని ఆమె అభిప్రాయం అడగకుండానే వాళ్ళిద్దరూ కట్నకానుకలు, ముహూర్తాల గురించి మాట్లాడుకుంటుంటే జ్యోతి పళ్ళు కొరుక్కుంది కసిగా. జ్యోతికి తండ్రంటే ఎలాగైనాభయం. ఆయన ఎదుట పడి తెగేసి చేసుకోను అని చెప్పడం ఎలాగో అర్థంకాలేదు.
    "దాన్ని అడిగావా, దాని ఉద్దేశం ఏమిటో ఒకసారి అడుగు" తండ్రి తల్లితో ఆఖర్న అనడం విని "అమ్మయ్య" అనుకుని ఇష్టంలేదని చెప్పడానికి నిర్ణయించుకుంది.
    రాత్రి తల్లి అడగగానే "నాకు నచ్చలేదు" అంది జ్యోతి కటువుగా. జానకి తెల్లబోయింది. "అదేమిటి?" అంది కాసేపటికి తేరుకుని. అంతా సెటిల్ అయిపోయిందనుకున్నది, కూతురిలా తెగేసి చెప్పేసరికి కోపం వచ్చింది."ఏం, నచ్చకపోవడానికి ఏం లోటు వచ్చిందతనికి?" తీవ్రంగా అడిగింది.
    "లోటు ఏంలేదని అడుగు, ఏం వుందని చేసుకోవాలి? అందమా, చదువా, ఉద్యోగమా? ఇంతోటి గొప్పవాడు, ఇంకెవరూ లేనట్టు మాట్లాడుతున్నావు" తను చెప్పదలచుకున్నది ధైర్యంగా ఇప్పుడు చెప్పకపోతే - ఎంత నష్టపోవాలో గుర్తించి, గుండెనిబ్బరం తెచ్చుకుని ధైర్యంగా అనేసింది.
    ఒక్క నిముషం జానకి కూతురివంక చూసింది. "ఇంతకంటే గొప్ప వాళ్ళు లక్షలమంది వుండచ్చు. కాని మనకి అందుబాటులో వున్నంతలో మంచి సంబంధం ఇది. ఇంతకంటే గొప్ప సంబంధం మీ నాన్నగారు తేలేరన్నది తెలుసుకో" అంది మందలిస్తున్నట్టు.
    జ్యోతి మొహం ముడుచుకుంది.
    "అసలింతకీ నీకు నచ్చకపోవడానికి కారణం చెప్పు....?" అంది జానకి.
    జ్యోతి మాట్లాడలేదు, విసురుగా తల తిప్పుకుంది.
    "ఆరువందలు తెచ్చుకుంటున్నాడు." జానకి ఏదో అనబోయింది.
    "బోడి ఆరువందలు, ఏదో వేలు తెస్తున్నట్టు పదిసార్లు గొప్పగా చెప్తున్నావు" మధ్యలోనే జ్యోతి గయ్ మంది. "ఆరువందల జీతగాడ్ని కట్టుకుని సుఖపడమనేనా నీ ఉద్దేశ్యం?"
    జానక్కి కూతురి మనసు అర్థం అయింది. "డబ్బుతోనే ఆనందం, సుఖం దొరుకుతుందనుకుంటున్నవా? వైవాహిక జీవితంలో ముఖ్యంగా కావాల్సింది ఇద్దరిమధ్య అన్యోన్యత. అది లేనినాడు ఎన్ని వేలు తెచ్చేవాడైనా ఒక్కటే. నా పెళ్ళికి మీ నాన్నకి నూటఏభైరూపాయలు జీతం" కూతురికి నచ్చచెప్పసాగింది.
    "ఈ కబుర్లు చెప్పకు. ఆఁ.... ఆ రోజులు వేరు, ఆ అవసరాలు వేరు, ఇప్పటి సంగతి వేరు. అప్పటి నూరు ఇప్పుడు వెయ్యితో సమానం. కనీసం వెయ్యిరూపాయలైనా లేందే బతకడం కష్టం" జ్యోతి స్థిరంగా చూస్తూ అంది.
    జానక్కి కోపం వచ్చింది.
    "వెయ్యేం ఖర్మ.... పదివేలు తెచ్చినా ఖర్చుపెట్టచ్చు. డబ్బుకి అంతెక్కడ, ఇంతకీ ఏం చెప్పమంటావు మీ నాన్నకి? మరోసారి బాగా ఆలోచించి చెప్పు."
    "ఆలోచించక్కరలేదు" ఠకీమని జవాబిచ్చింది జ్యోతి.
    "ఆలోచించమన్నది అతను నచ్చాడా లేదా అనికాదు. మీ నాన్నగారి తాహతు ఎంతో, ఆయన బాధ్యతలు ఎన్నో - ఆయన తాహతుకి ఇంతకంటే మంచి సంబంధం ఇప్పుడు కాకపోయినా ఎప్పుడూ కూడా తేలేరన్నది గుర్తించి, ఆలోచించి జవాబు చెప్పు" జానకి దృఢంగా అంది.
    "పోనీలే! కాకపోతే హాయిగా చదువుకుని ఉద్యోగం చేసుకుని బతకగలను" ధీమాగా అంది.
    కూతురి ఆలోచనలు ఎలా సాగుతున్నదీ, ఎంత అమాయకంగా ఆలోచిస్తున్నదీ గుర్తించింది జానకి. పసితనం తీరని ఆ మాటలు పట్టుకుని బాధ్యతగల తామూ ఆమెని వదిలేయడమేనా?
    "హు! ఉద్యోగం. నీ బి.ఏ. చదువుకుని నీ కాళ్ళముందు ఉద్యోగాలు వచ్చి వాలుతాయిలే, నీకసలు బుద్ధిలేదు. వెధవ పుస్తకాలు, చెత్త సినిమాలు చూసి కాస్తో కూస్తో ప్రపంచజ్ఞానం కూడా పోగొట్టుకుంటున్నావు. కాస్త కలలోంచి కళ్ళుతెరచి చుట్టూ చూసి నీవేమిటో తెలుసుకో. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టు. చెప్పినట్లు విను, బాగుపడతావు" తీవ్రంగా అని జ్యోతి ఆలోచించుకోవడానికి కాస్త వ్యవధి ఇవ్వాలని నిర్ణయించుకుని అక్కడనుంచి వెళ్ళిపోయింది జానకి. జ్యోతి మొహం మాడ్చుకుని తల్లివంక కోపంగా చూసింది.
    వంటింట్లో పనిచూసుకుంటూ జానకి తనలో తాను మధనపడసాగింది. భర్తకి ఎం చెప్పడం? జ్యోతికి ఎలా నచ్చచెప్పడం? అసలు దాని ఉద్దేశ్యం ఏమిటి?
    కాస్త యుక్తవయసు వచ్చిన దగ్గరనించి ప్రతిదానికీ కాల్చుకుతింటూనేవుంది జ్యోతి ఆమెని. వచ్చిన సినిమాఅల్లా చూడాలని, చూసిన బట్టల్లా కొనాలని, మిగతా క్లాస్ పిల్లలు ఇంకా మంచివి కడ్తారు. నాకీ చీరలా అంటూ సాధించేది.
    ఎప్పటికప్పుడు నచ్చచెపుతూ, సముదాయిస్తూ, నాలుగడిగినచోట ఒకటి కొంటూ, మందలిస్తూ కాలం నెట్టుకొచ్చింది జానకి. ఈరోజు అలాగే ఆ చీరవద్దు. నాకు నైలెక్స్ కావాలి అంటే కొనడమే తమ తరంకాలేదే, ఈ మొగుడు వద్దు వెయ్యిరూపాయలు తెచ్చే మొగుడు కావాలంటే ఎలా తేవడం? ఆమె వ్యధ ఇది.
    పంధొమ్మిదేళ్ళు వచ్చినా తాము ఏమిటో గుర్తించని కూతురిని ఏం చెయ్యాలి? భర్తకి చెపితే మండిపడతాడు. ఇటు యిక్తవయసు వచ్చిన కూతురు, అటు భర్త. ఎలా చెప్పడం?
    తాను చెప్పదలచింది చెప్పేసింది కనుక ఇంక తనని బలవంతపెట్టరు. ఇప్పటికి గండం గడిచిపోయింది అని మనసులో సంతోషించింది జ్యోతి.

 Previous Page Next Page