Previous Page Next Page 
ఋగ్వేద సంహిత - 1 పేజి 6


    ఉపమానాలు సహితం అతిసాధారణములు. గ్రామ జీవితానికి సంబంధించినవి. ఎంతో సుందరములు వాస్తవములు.

                                                 ఛందస్సు

    ఛందస్సు ఋగ్వేదంలో ప్రశంసించుట భజించుట అనే అర్థం వస్తుంది. క్రియగా ఛందస్సుకు అర్థం ప్రసన్నులను చేయడం. దీనిని దేవతలను వశపరచుకొనునది అని కూడా వాడబడింది.

    1. రసోవై ఛందాంసి 2. ప్రాణావై ఛందాంసి 3. ఛందాంసి దేవ్యః 4. ఛందోభిర్వై దేవా ఆదిత్యా స్వర్గలోకమాహరన్ 5. ఛందోభిర్హి స్వర్గలోకం గచ్చంతి.

    ఛందస్సు అక్షర సంఖ్యా నియమం గల పద్యం. ఋగ్వేదంలో ప్రధానంగా ఏడు ఛందస్సులు ఉన్నాయి. అవి అక్షర సంఖ్య సహితంగా ఇలా ఉన్నాయి.

    1. గాయత్రి 24, 2. ఉష్ణిక్ 28, 3. అనుష్టుప్ 32, 4. బృహతి 36, 5. పంక్తి 40, 6. త్రిష్టుప్ 44,
7. జగతి 48.

    పింగళ వేదాంగం వీటికి ఏడు స్వరాలు సూచించింది.

    1. గాయత్రి షడ్జమం 2. ఉష్ణిక్ ఋషభం 3. అనుష్టుప్ గాంధర్వం 4. బృహతి మధ్యమం. 5. పంక్తి పంచమం. 6. త్రిష్టుప్ దైవతం 7. జగతి నిషాదం.

                                               వినియోగం

    ఆచార్య శాయణుడు ప్రతి సూక్తానికీ వినియోగం సూచించాడు. అది ఆ సూక్తం వాడవలసిన విధం.

    యజ్ఞ యాగాది క్రతువులకు మంత్రాలను వాడవలసిన విధం, వేళలు మున్నగువాటిని వినియోగం నిర్దేసిస్తుంది.

    ఈ వినియోగం మూలంగానే మన ఏలికలైన ఆంగ్లేయులు మనను అనాగరికులుగా అర్థం చేసుకున్నారని ఆంగ్లేయుల పాలనలోని వేదవ్యాఖ్యాతల అభిప్రాయం. అందువల్ల వారు వినియోగం వదిలేశారు.

    నేను వినియోగం చేర్చకపోవడానికి కారణం మంత్రం లేకపోవడం. అనువాదం అర్థంచేసుకోవడానికి గాని దానికి మంత్రప్రభావం లేదు.

                                              ఆలోచనామృతం

    అక్కడక్కడ ఆయా సూక్తాలను గురించి అభిప్రాయాలను ఆలోచనామృతంగా వ్రాశాను. ఈ పద్ధతి 1960లో శ్రీ మద్రామాయణంలో ప్రారంభించాను. చదువరులు దాన్ని ప్రశంసించారు. శ్రీమద్భాగవతంలో కూడా ఆ పద్ధతిని అనుసరించాను. 1993లో ముగించిన శ్రీ మహాభారతంలో "ఆలోచనామృతం" అనే శీర్షిక కింద నా భావాలను వ్యక్తపరచాను.

    ఋగ్వేద సంహితలో సహితం 'ఆలోచనామృతం' శీర్షికన నా భావాలను వ్యక్తం చేశాను. ఇది సహితం భగవానుడు వ్యక్తం చేయించినవే అని నా విశ్వాసం. అయినా ఇవి నాకు గల కొద్ది పరిజ్ఞానంతో చేసినవి. చదువరులు నా అభిప్రాయాలతో ఏకీభవించాల్సిన అక్కర ఏ మాత్రం లేదు. ఆలోచన కలిగించడమే నా ఉద్దేశ్యం. ఆలోచనామృతం చదివి మరోరకంగా ఆలోచించి వివరిస్తే నేను సఫలీకృతుణ్ణి అయినట్లు భావిస్తాను.

                                            వేదార్థమ - వ్యాఖ్య

    కౌత్స ఋషి వేదానికి అర్ధం ఉండదనీ, తెలుసుకోరాదనీ అన్నాడు.

    క్రీస్తుకు వేయి సంవత్సరాల పూర్వపు యాస్కుడు "నైవస్థాణోపరరాధః యదేనం ఆంధోవపశ్యతి. పురుషాపరాధః సభవతి" కనిపించే స్తంభాన్ని చూడకపోవడం స్తంభపు తప్పుకాదు. చూచేవాని తప్పు అన్నాడు.

    "స్థాణురయం భాదవాహః కిలాభూత్ అధీత్యవేదాన్ నవిజానాతియోర్థమ్
    యోర్థజ్జ ఇత్ సకలం భద్రమశ్నుతే నాకమేతి జ్ఞాన విధూతపాప్మా"

    వేదం చదివి అర్థం తెలిసికొనని వాడు బరువు మోయు స్థాణువు వంటివాడు. వేదం చదివి అర్థం తెలుసుకున్నవాడు జ్ఞానియై, పాపరహితుడై స్వర్గానికి చేరుకొంటాడు అన్న యాస్కుడు రచించిన నిరుక్తమే నేటికీ వేదార్థమునకు ఆధారం.

    తరువాత 1. స్కందస్వామి 2. ఉద్గీత 3. వేంకటమాధవులు వేదానికి వ్యాఖ్యానం రచించారు. స్కందస్వామి వల్లబి నివాసి. ఖమ్మం జిల్లాలో వల్లభి అనే గ్రామం ఉంది. అతడి పేరు బట్టి వేంకట మాధవుడు తెలుగువాళ్లేననిపిస్తున్నారు. అట్లని మనం గర్వించవచ్చు. మనం చెప్పుకుంటామా?

    వేదాలకు అధికార పూర్వక వ్యాఖ్య చేసినవాడు సాయణాచార్యులు. అతడు 1315లో జన్మించి తన డెబ్బై రెండో ఏట 1387లో పరమపదించారు.

    ఆచార్య శాయణుడు రాజనీతి విశారదుడు. అతడు మండలాధీశుడైన కంపనికి మంత్రిగాను బుక్కరాయ హరిహరరాయలకు మంత్రిగానూ పనిచేశాడు.

    దక్కన్ - దక్షిణా పథంలో అన్యమతస్తుల రాజ్యాలు స్థిరపడి విస్తరిస్తున్నప్పుడు విద్యారణ్యుడు హరిహర బుక్కరాయలచేత విజయనగర సామ్రాజ్యం స్థాపింపచేశాడు. బుక్కరాయలు వేదధర్మాన్ని ఉద్దరించదలచి సాయణాచార్యులను వేదములకు వ్యాఖ్య చేయవలసిందని అర్థించారు. శాయణుడు ఋగ్వేదపు తొలి అష్టకపు ఆశ్వా సాంతగద్యంలో

    "ఇతి శ్రీమద్ రాజాధిరాజ పరమేశ్వర వైదిక మార్గ ప్రవర్తక వీర బుక్క భూపాల సామ్రాజ్యదురంధరేణ సాయణాచార్యేణ విరచితే" అని చెప్పుకున్నాడు.

    సాయణాచార్యుడు ఆంధ్ర బ్రాహ్మణుడు.

    అతనిది భరద్వాజ గోత్రము. బోధాయన సూత్రము. మాయన-శ్రీమతి అతని తలిదండ్రులు.

    సాయణునికి ఒక రాజు యొక్క రాజకీయ, ఆర్ధిక బలం లభించింది. మహా విద్వాంసుడు వేదాలను వ్యాఖ్యానించడానికి సమర్ధుడు, తృష్టగలవాడు కావడానికి అనేక మంది పండిత ప్రకాండులను కూర్చుకొని వేదవ్యాఖ్య ప్రారంభించాడు.

    వ్యాఖ్య మధ్యలోనే బుక్కరాయలు అస్తమించాడు. రెండవ హరిహరరాయలు కూడా తన తండ్రివలెనే సాయణుని వేదవ్యాఖ్య బృహత్కార్యాన్ని సకల విధాల పోషించాడు. అతని పాలనలోనే సాయణుడు అథర్వవేద వ్యాఖ్య పూర్తిచేశాడు.

    "అభూద్ హరిహరోరాజా క్షీరాబ్దేరివచన్ద్రమాః
    తన్మూలభూతం ఆలోచ్య వేదమాధర్విణామిధమ్
    ఆదిశత్ సాయణాచార్య తదర్ధస్య ప్రకాశనే"

    అని శాయణుడు అథర్వవేద వ్యాఖ్యలో చెప్పాడు.

    శాయణాచార్యులు వేద సంహితలనేకాక 1. తైత్తరీయ బ్రాహ్మణము 2. తైత్తరీయ అరణ్యకము 3. ఐతరేయ బ్రాహ్మణము 4. ఐతరేయ అరణ్యకము 5. శతపథ బ్రాహ్మణము 6. తాండ్య బ్రాహ్మణము 7. సద్వింస బ్రాహ్మణము 8. సమవిధాన బ్రాహ్మణము 9. ఆర్షేయ బ్రాహ్మణము 10. దేవతాధ్యాయ బ్రాహ్మణము 11. ఉపనిషద్ బ్రాహ్మణము 12. సంహితోపనిషద్ బ్రాహ్మణము 13. వంశ బ్రాహ్మణములను వ్యాఖ్యానించాడు. 

                                               ఆధునిక వ్యాఖ్యాతలు

    వేదాన్ని అధ్యయనం చేసిన పాశ్చాత్య విద్వాంసులు మాక్సుముల్లర్, కీత్, గ్రిఫిత్, పిశల్, గ్లేడ్నర్, త్సిరర్, వేవర్, ఓల్డన్ బర్గ్, బ్లూమ్ ఫీల్డ్ మున్నగువారు సాయణుని వాఖ్య ఆధారంగానే వేదాలను అర్థం చేసుకున్నారు. కాని కొంచెపు పాశ్చాత్య దృక్పథంవల్లనూ విశాల భారతీయ తాత్త్విక చింతన అర్థంకాకపోవడం వల్లనూసాయణుని వ్యాఖ్య అర్థంకానప్పుడూ తమకు అనుకూలం కానపుడు సాయణున్ని తప్పుపట్టారు. దూషించారు.

    అన్నీ తమకు అనుకూలంగా ఉండాలనేది తెల్లదొంగల దురహంకారం.

    ఆధునికం భారతీయ వేదవ్యాఖ్యాతల్లో మహర్షి దయానంద సరస్వతి అగ్రగణ్యులు. వారు ఋగ్వేద వ్యాఖ్య పూర్తి చేయకుండానే పరమపదించారు. మహర్షి వేదాన్ని వ్యాఖ్యానించడమే కాదు. అంతకుముందు ఎరుగనంతటి వేద ప్రచారం చేశారు. దయానందుడు గొప్ప సంఘ సంస్కర్త. అతడు వర్ణ వర్గవ్యత్యాసం లేకుండా అందరికీ వేదం ఉపదేశించాడు. ఆర్య సమాజం, స్థాపించి ఆసేతు హిమాచల పర్యంతం అందరినీ ద్విజులను చేశారు. ఆర్య సమాజం మునుపటి నిజాం రాజ్యంలో విజయవంతంగా మతాంతరీకరణమును ఎదుర్కొంది. ఇప్పటికీ ఆర్య సమాజ మందిరాలు, అనుయాయులు తెలంగాణంలో ఎక్కువగా ఉన్నాయి, ఉన్నారు.

    దురదృష్టం ఏమంటే అన్ని మతాలు, కులాల వలెనే ఆర్య సమాజం ఒక శాఖగా నిలిచిపోయింది. మహర్షి ఆశించిన స్ఫూర్తి, శక్తి లోపించాయి.

    మహర్షి వేదాన్ని ఏకేశ్వరోపాసనగా వ్యాఖ్యానించడానికి ప్రయత్నించారు. ఒకే ఈశ్వరుడు భిన్నరూపాలలో దేవతలయినారు అంటారు. వేదంలోని యజ్ఞం వంటి పదాలకు విస్తృత వ్యాఖ్యలు చెప్పి వాటికి ఇహ పదార్థాలు వివరించారు.

    దయానందుడు వేదాన్ని కర్మమార్గంగా అంగీకరించడు. వేదం జ్ఞానమనీ ఆధ్యాత్మిక ఔన్నత్యమనీ వ్యాఖ్యానించారు.

    మహర్షిమీద క్రైస్తవ ప్రభావం ఉందని నా అభిప్రాయము. భారత జాతికి క్రైస్తవంవలె ఒకే గ్రంథం ఒకే ఈశ్వరుడు ఉండాలనుకున్నారు. అందుకు అనుగుణంగా వేదం భారతీయుల ఒకే గ్రంథమనీ భారతీయులకు పరమేశ్వరుడు ఒకడేనని ప్రతిపాదించారు.

    భారతజాతి స్వభావం ఒక్కదానికి మాత్రమే పరిమితం కాకపోవడం. భారతజాతి జ్ఞానం, తాత్వికచింతన, వేదాంతం అన్నీ ఏకములుకావు. అనేకములు.

    ఒక్కటి, భారతజాతి తత్వంకాదు. పెక్కులు భారతజాతి తత్వం.

    భిన్నత్వంలో ఏకత్వం మన సంస్కృతి.

    వేదాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణములు, పురాణాలూ, కావ్యాలు అన్నీ విభిన్న తాత్వికచింతనగలవైనా సహజీవనం చేస్తాయి. భారతీయుడు ఇవన్నీ నావే ననుకుంటాడు.

    వేదాలకు భిన్నములైన జైన భౌద్ధమతాలతో మనం సహజీవనం చేశాం.

    ఎల్లరు మతప్రవక్తలు తమకన్నముందేమీలేదని తామే ప్రారంభిస్తున్నామన్నారు. అంతకుముందటి దానిని సహించలేదు. ఉండనీయలేదు. ఊడ్చి వేసినారు.

    అలాకాక భారతదేశంలో అనేక తాత్వికచింతనలు, సిద్ధాంతాలు, శాఖలు, ఉపశాఖలూ వచ్చాయి. మన స్వప్రయోజనపరులు కొన్నింటిని నిర్మూలించ ప్రయత్నించినమాట వాస్తవం. కాని పవిత్ర గంగా ప్రవాహం వంటి ఆలోచనా ధోరణి అనాదిగా నిరంతరం ప్రవహిస్తున్నది. ప్రవహిస్తుంటుంది.

    భారతీయులంగా మనం బహుదేవతల ఆరాధకులం. ఇది నా మతం. నా జాతి స్వభావం. నా నాగరకత. నా సంస్కృతి.

    నేను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పాటు పోచమ్మ, యల్లమ్మ, మల్లమ్మ, ముత్యాలమ్మ, మరిడమ్మలను పూజిస్తూ భారతీయుణ్ణిగా గర్విస్తాను.

    ఒకజాతి సమైఖ్యతకు ఒకే ఆరాధనా విధానం ఉండాలన్నది నియంతృత్వ మతాలు, సిద్ధాంతాల పూనకం. భారతీయులంగా మేము ప్రజాస్వామ్యులం. ఎవరి ఇచ్చవచ్చిన దేవుణ్ణి వాళ్లు ఆరాధిస్తారు. అయినా మాది ఒకే భారతజాతి.

    మేము భారతీయులంగా నాటి ఇంద్రుని నుంచి నేటి సాయిబాబా వరకు, రానున్న వారిని సహితం ఆరాధిస్తాం. అందుకు మేం సిగ్గుపడం. ఎవడిని అనుకరించడానికో మేము ఒకే గ్రంథాన్ని, ఒకే దేవుణ్ణి మాత్రమే ఆరాధించం.

    శంకర భగవత్పాదులు తమ అద్వైతం ద్వారా ఒకే ఈశ్వరుని ప్రతిపాదించారు. అయినా వేరు వేరు దేవతలను స్థాపించారు. ఉపాసించారు.

    ఒకజాతి స్వభావానికి భిన్నంగా సిద్ధాంతాలను ప్రవచించడం అసాధ్యం.

    శ్రీమద్రామానుజయ విశిష్టాద్వైతం ద్వారా ఏకోనారాయణుని ప్రతిపాదించ ప్రయత్నించారు. వారు చేసిన సేవ అపారం. అయినా భారతదేశంలో శ్రీమన్నారాయణునితో పాటు అనేక దేవతలను ఉపాసించడం జరుగుతున్నది.

    మనం బహు దేవతారాధకులుగానే ప్రారంభం అయినాం. బహుదేవతారాధకులంగా ఉన్నాం. బహుదేవతారాధకులుగా ఉంటాం.

    వేదాన్ని వ్యాఖ్యానించిన మరొక మహర్షి అరవిందుడు. వారు వేదాన్ని నవ్య దృక్పథంతో వ్యాఖ్యానించారు.

    వీరిరువురూ ఆంగ్లేయులకు వంటపట్టని వారికి నచ్చని కర్మ పరమైన సాయణుని వ్యాఖ్యను పూర్తిగా ఆమోదించలేదు. సాయణుని వినియోగాన్ని నిరసించారు. తమవ్యాఖ్యల్లో చేర్చలేదు.

                                          ఋగ్వేద సమాజం

    ఋగ్వేదం ఒక పరిపూర్ణ, శాంతియుత, స్వయం సమృద్ధ సమాజాన్ని సృష్టించింది. అయోమయంలో ఉండి, అడుగంటనున్న నేటి ప్రపంచ మానవ సమాజానికి ఆదర్శప్రాయం ఋగ్వేద సమాజం.

    ఈనాటి రాక్షస ఉత్పత్తి విధానం డబ్బును తప్ప మనిషని బతకనీయదు. మనిషి విసిగిపోయి ఈ రాక్షస యంత్రాలమీద దాడిచేసి ధ్వంసం చేసేరోజు ఎంతో దూరంలేదు.

    అప్పుడే విసిగి వేసారిన మానవజాతి అభివృద్ధి చెందామని భ్రమలో ఉన్న దేశాల ప్రజలు మనశ్శాంతి కోసం మత్తుమందులు మింగడమో ఆత్మహత్యలకు పాల్పడడమో చేస్తున్నారు.

    వారికి ఋగ్వేదంలో వంటి గ్రామం ఏర్పరచి ఇవ్వండి. వారు మందులు మ్రింగరు ఆత్మహత్యలు చేసికోరు స్వరంలోవలె ఆనంద తరంగాలలో ఓలలాడ్తారు.

    ఋగ్వేద సమాజంలో ఒక స్థిరమైన రాజకీయ వ్యవస్థ ఉంది. మానవ సంబంధాలు స్థిరపడ్డాయి. ఉమ్మడి కుటుంబాలు, ప్రేమాభిమానాలు. అనుబంధాలు అమృతప్రాయములైనాయి.

    గ్రామాల్లో శాంతి సహకారం సద్భావం అవతరించాయి.

    కృషి, గోరక్ష, వాణిజ్యం ఆరోగ్య వాతావరణంలో అభివృద్ధి చెందాయి. ధనం వివిధములు అని చెప్పాడు. అది ఆర్ధిక శాస్త్రవేత్తలు పరిశీలించవలసిన విషయం. సంతానం, పశువులు, గృహములు ఇత్యాదిని సంపదలుగా పేర్కొన్నాడు.

    స్త్రీలకు ఆస్తిహక్కు, కుటుంబ యాజమాన్యం కలిగించారు. సూక్తులు రచించిన ఋషికలు ఋగ్వేదంలో ఉన్నారు.

    ఋగ్వేద సమాజాన్ని గురించి మరింత వ్రాయాలని ఉన్నది. కాని ఇక్కడ అప్రస్తుతం.

    ఋగ్వేద జీవన విధానమే ప్రపంచమంతటా కొనసాగింది. క్రైస్తవం, ఇస్లాం విశ్వాసాలను మార్చాయి తప్ప జీవనం మార్చలేదు. పారిశ్రామిక విప్లవం ఈ జీవన విధానాన్ని ఛిన్నాభిన్నం చేసిందని అనేకమంది ఆంగ్లకవుల ఆవేదన కవితలుగా నవలలుగా వెలువడింది.

    నా చిన్నతనంలో మా ఊళ్లో వేదకాలంనాటి వెతలెరుగని జీవన విధానాన్ని అనుభవించాను. అది సాంద్రచ్చాయవంటిది.

    ఇన్ని వేల సంవత్సరాలు నిరంతరాయంగా కొనసాగిన జీవన విధానాన్ని మానవజాతికి అందించిన ఋగ్వేదాన్ని నమోవేదమాత అనడంకన్న మనం ఏం చేయగలం?

                                              తెలుగులో ఋగ్వేదం

    నన్నయ భట్టు భారతాన్ని ఆంధ్రీకరించడానికే వెనుకాడాడు. తిక్కన సోమయాజి భారతంలో భీష్మపర్వం వ్రాస్తూ భగవద్గీతను అంటీ అంటక వదిలారు.

    వావిళ్ల వారు సమస్త గ్రంథలను ప్రచురించారు. కాని వేదం కనీసం తెలుగు లిపిలో ప్రచురించలేదు. అనువదింప చేయడానికి ప్రయత్నం కూడా చేయలేదు.

    నేమాని వేంకట నరసింహశాస్త్రిగారు 1920-30 మధ్యకాలంలో ఋగ్వేద సంహిత అసంపూర్ణంగా పద్యానువాదం చేశారు. ప్రచురించడానికి ధనలోపంవల్ల వ్రాత ప్రతిని రాజమహేంద్రవరంలోని గౌతమీ గ్రంథాలయంలో భద్రపరచారు. వడ్లమూడి గోపాలకృష్ణయ్యగారు దానిని సేకరించారు. మిగిలిన భాగం పూర్తి చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు 1981లో గ్రంథాన్ని మూలమంత్రాల సహితంగా ప్రచురించారు.

    బ్రహ్మణ బ్రహ్మణేతర అసమానత్వమును తొలగించుటకు వేదవేదాంగములను ఆంధ్రీకరించి ఆంధ్రులకెల్లరకు హస్తగత మొనర్చుట భావ్యమని రాంబొట్లపాలెం గుంటూరు జిల్లాలో గొల్లపూడి సీతారామశాస్త్రి గారు వినయాశ్రమము స్థాపించారు. ఆ ఆశ్రమాన్ని మహాత్మగాంధీ 23. 12. 1933న ప్రారంభించారు.

    వినయాశ్రమం వారు బంకుపల్లె మల్లయ్య శాస్త్రిగారు ఋగ్వేద ఆంధ్రవచనానువాదాన్ని మూలమంత్రసహితంగా ఒక సంపుటిలో ద్వితీయాష్టకంలోని తృతీయాధ్యాయం వరకు ప్రచురించారు. తరువాత ప్రచురణ నిలిచిపోయింది.

    ఈ గ్రంథం 1940లో వెలువడింది. దీనివలె రెండు రూపాయీలన్నర. ఇందులో 481 పేజీలున్నాయి.

                                         శ్రీమదాంధ్ర వచన ఋగ్వేద సంహిత

    మానవ జాతికి అమూల్య సంపద వేదం. ఇది భారత భూమి మీద అవతరించింది నిజం. కాని సూర్యునివలె సకల ప్రపంచానికి వెలుగు ప్రసాదించింది.

    జ్ఞానం గాలి వంటిది. నది వంటిది. వెలుగు వంటిది. ఇది సర్వజనులకు అందాలి. దాన్ని ఎంతటివాడూ ఆపలేడు. ఆపరాదు.

    కొందరు వేదం చదువరాదని స్వప్రయోజనం పరులు నిషేధం విధించారు. ఈ మధ్యనే 'ఒక శంకరాచార్యులు' స్త్రీలు వేదం చదువరాదు అని మహిళల వ్యతిరేకతను చవిచూచారు.

    స్త్రీలు వేదంలోని సూక్తాలూ రచించారు. అలాంటప్పుడు వారు వేదం చదువరాదనడం అజ్ఞానం, అహంకారం.

    మేము వేదద్వారాలు తెరిచాం.

    రండి అందరు వేదం చదవండి

    నేను ఋగ్వేదాన్ని పూర్తిగా అనువదించాను. అందులోని ఏ మంత్రాన్ని వదల్లేదు. ఇది సంపూర్ణ ఋగ్వేదం. ఇది మంత్రానువాదం. ఇందుకు నేనే ఆద్యుణ్ణి.

    అనువదించేప్పుడు తేట తెలుగు తేలిక తెలుగు వాడడానికి ప్రయత్నించాను. వేదం ఎల్లరకూ అర్థం కావాలనేది నా తపన. ఏ మాత్రం తెలుగు తెలిసిన వాడికైనా అర్థం అయ్యేట్లు అనువదించాను.

    మూల మంత్రాలు అచ్చువేయడం చదవడంలోగల కొన్ని ఇబ్బందులవల్ల చేర్చలేదు. అంతేకాని మంత్రాలను దూరంగా ఉంచాలనే దురభిప్రాయంకాదని మనవి. ఈ విషయంలో మమ్ము అపార్థం చేసికోరాదని విన్నపం. అవసరం అనుకున్నచోట అక్కడక్కడా మంత్రాలు చేర్చాను.

    ఈ అనువాద మహా యజ్ఞంలో పరమాత్ముడు పరాత్పరుడు పరమేశ్వరుడు అహర్నిశలు నాయందుండి నాతో ఈ మహత్కార్యం చేయించాడు.

    "నకశ్చిన్నాపరాధ్యతి" తప్పుచేయనివాడెవడు? అని వాల్మీకి ప్రశ్నించాడు. నేను మానవ మాత్రుణ్ణి ప్రేమాదోధీమతామపి, ధీమంతులు కూడా పొరపాట్లు చేస్తారని ఆర్యోక్తి.

    మహత్తరమైన ఈ అనువాద కార్యంలో తెలియక నేనూ తప్పులు చేసి ఉండవచ్చు. ఇందులోని మహత్తుకు పరమేశ్వరుడు కారణం. తప్పులుంటే అవినావేనని సవినయంగా మనవి చేస్తున్నాను.

    మనకు పితరులు సహితము దేవతలే! వారి వలననే మనకు ఈ తనువు, గుణగణములు జ్ఞానము వచ్చాయి. మన గుణాలు, ఆరోగ్యం, వ్యాధులు, రూపం, ధ్వని మున్నగునవి అన్నీ పూర్వపు ఏడు తరాలనుంచి సంక్రమిస్తాయంటారు. అందుకే ఏడేడు జన్మలబంధం అనే నానుడి.

    మా పితామహులు దాశరథి లక్ష్మణాచార్యుల వారు భద్రాచలంలో జన్మించి 85 సంవత్సరాల వయసులో యువనామ సం|| 1935-36 వైశాఖ అమావాస్యనాడు ఖమ్మంలో పరమపదించారు. వారు మహావైద్యులు-విద్వాంసులు చెన్నపట్నంలో వైద్యంచేసి, మా నాయనగారిని మద్రాసు విశ్వ విద్యాలయంలో విద్వాన్ చదివించారు. మా నాయనమ్మ బుచ్చమ్మగారు వరంగల్ జిల్లా మానుకోట తాలూకా చిన్నగూడూరు గ్రామంలో జన్మించి ఖమ్మంలో ప్రమాదినామ సంవత్సర 1939-40 శ్రావణ శుక్ల సప్తమినాడు పరమపదించారు.

    వారి వారసత్వంగానే నాకు ఈ మాత్రం జ్ఞానం కలిగిందని నా విశ్వాసం. అందుకు కృతజ్ఞతగా శ్రీమదాంధ్ర వచన ఋగ్వేద సంహితను వారికి భక్తి పురస్సరంగా అంకితం సమర్పిస్తున్నాను.

    అరవై అయిదు సంవత్సరాల క్రితపు వారి ఛాయచిత్రం భద్రపరచి ఇందులో చేర్చగలగడం మా మాతామహుల పూర్వపుణ్య విశేషంగా భావిస్తున్నాను.

    సర్వేపి సుఖినస్సుంతు - అందరూ సుఖంగా ఉండాలి.
    సర్వేసంతు నిరామయాః - అందరూ నిరామయులు కావాలి.
    సర్వేభద్రాణి పశ్వంతు - అందరూ శుభములనే చూడాలి.
    మా కశ్చిదఃకభాగ్భవేత్ - ఏ ఒక్కడూ దుఃఖితుడు కారాదు.

                                                 విపులాచపృథ్వీ

    అసమాన్య వేదాలను వెన్నెల వచనంలో సామాన్యులకు అందించాలని తపస్సు చేశాను. స్వామి కరుణించాడు. నాలుగు వేదాల అనుసృష్టి చేయగలిగాను.

    వేదాలను అందంగా సముచిత మూల్యంలో అందించడానికి విశాలాంధ్ర రాజేశ్వర రావు గారు ఎంతో కృషి చేశారు. వారికి, వారి కుటుంబానికి శుభమస్తు.

                                              సమస్య సన్మంగళాని భవంతు!
                                                                      తథాస్తు!!

    15-1-2008                                                             ఇట్లు,
    సంక్రాంతి                                                                               బుధజన విధేయుడు
                                                                                                       దాశరథి రంగాచార్య.

 Previous Page Next Page