3. అధ్యాయం :- అధ్యాయం కొన్ని అనువాకములు గలదు. అధ్యాయాలుకాగానే అష్టకంతో ముగుస్తుంది.
4. అనువాకం :- అనువాకం కొన్ని సూక్తాల మాలిక. అనువాకం అధ్యాయంతో ముగియాల్సిన అవసరంలేదు. అధ్యాయం తరువాత కూడా కొనసాగుతుంది. అధ్యాయానికీ, మండలానికి ముడిలేనట్లే అనువాకానికి అష్టకానికీ ముడిలేదు.
అనువాకం మండలంతో మొదలవుతుంది. అనువాక సంఖ్య మండలంతో ముగుస్తుంది. ప్రతి మండలం ఒకటవ అనువాకంతో మొదలవుతుంది.
5. సూక్తం :- సూక్తం కొన్ని మంత్రాల మాలిక. ఇందులో ఇన్ని మంత్రాలు ఉండాలనే నియమంలేదు. కొద్ది మంత్రాలవీ ఎక్కువ మంత్రాలవీ ఉంటాయి. ఇది అనువాకంవలె మండలంతో మొదలై మండలంతో ముగుస్తుంది.
మంత్రంతో ప్రారంభిస్తే 1. కొన్ని మంత్రాల సూక్తం 2. కొన్ని సూక్తాలు అనువాకం 3. కొన్ని అనువాకాలు అధ్యాయం 4. కొన్ని అధ్యాయాలు మండలం 5. ఎనిమిది అధ్యాయాలది అష్టకం అవుతుంది.
ప్రతి సూక్తానికి 1. ఋషి 2. దేవత 3. ఛందస్సు 4. వినియోగం ఉంటాయి. వాటిని గురించి తెలుసుకుందాం.
6. మంత్రం దీన్నే 'బుక్' అంటారు. ఇదే వేదానికి మూలం. మంత్ర సంఖ్య సూక్తంతో మొదలవుతుంది. సూక్తంతో ముగుస్తుంది. దీనికి సంఖ్యానియమం లేదు.
ఇవికాక వర్గం అనే మరొక విభజన ఉంది. వర్గంలో నాలుగైదు ఒక్కొక్కసారి అంతకుమించి మంత్రాలు లేక ఋక్కులు ఉంటాయి. నేను వర్గం పాటించలేదు. చూపలేదు.
ఋషి
సూక్తం ఋషి - దేవత -ఛందస్సు వినియోగం సూచిస్తుందని చెప్పాం. ఆ క్రమంలో ఋషిని గురించి తెలిసికొందాం.
ఋషిని సాయణుడు అతీంద్రియదర్శి అన్నాడు. మనకున్న చక్షురాదా ఇంద్రియాలకు అతీతంగా ఇతరులు చూడని దానిని దర్శించువాడని అర్థం.
'నావృష్టిః కురుతే కావ్యం' అన్నదాన్ని ఆవిధంగా అర్థం చేసుకుంటే కవిలేక రచయిత దృగ్గోచరం కాని విషయాలను దర్శించువాడు కావాలని అర్థం.
వేదం అపౌరుషేయం. అంటే మానవ ప్రోక్తం కాదు. ఋషులు వేదద్రష్టలు. స్మర్తలు. వారు అపౌరుషేయమైన వేదాన్ని దర్శించి మనకు అందించారు.
వృష్టే శర్ధాయ సుమభాయ వేధసే నోధః సువృక్తిం ప్రభరామదుర్భ్యః"
అని 1. మండలం 64 సూక్తపు తొలి మంత్రంలో 'నోధస్సు' అనే ఋషిని మరుత్తులను స్తుతించే మంత్రం వ్రాయమని కోరడం కనిపిస్తుంది.
"యశోనపక్వం మధుగోషన్తరా భూతాంశో అశ్వినోః కామమప్రాః"
అని భూతాంశుడను నేను ఈ స్తోత్రము రచించి అశ్వినుల మనోరథము పూరించానని 10వ మండలం 9వ అధ్యాయం 107వ సూక్తపు 11వ ఋక్కున చెప్పబడింది.
ఇంకా చాలచోట్ల ఋషులు తామే సూక్తాలు రచించినట్లు చెప్పారు. కొన్నిచోట్ల సంపన్నులను నుతించి ధనం పొందినట్లు కూడా ఉంది.
అంతమాత్రాన వేదం మానవప్రోక్తం అందామా ! కాదు అలా అనడానికి వీల్లేదు.
ఈ సమస్త చరాచర సృష్టి ఈశ్వరీయం. ఇది సాంతం భగవంతుడు సృష్టించింది. ప్రకృతి సూత్రములు పరాత్పరుడు చేసినవి. మానవుడు పుట్టిననాటినుంచి నేటి వరకు ఇకముందు కూడా ప్రకృతి శాస్త్రాన్ని మార్చజాలడు. మనం ఈనాడు చూస్తున్న మహా మహా ఆవిష్కరణలన్నీ భగవంతుని శాసనానికి అనుగుణంగానే జరిగాయి జరుగుతాయి. ఈ మహామహా ఆవిష్కర్తల్లో ఎవరూ సృష్టించింది ఏమీలేదు. వారు ద్రష్టలు మాత్రమే. వారు దర్శించి మనకు అందించారు.
అలాగే ఋషులు సహితం కర్తలుకారు. తాము ద్రష్టలం అని చెప్పుకున్నారు.
ఎంతటి మహా సైంటిస్టైనా ఉన్నదానిని కనుగొనవలసిందే గడ్డిపరకను సృష్టించలేడు! కావున అందరూ ద్రష్టలే!! స్రష్టలు కాలేరు!!!
ఒక్క పరాత్పరుడే సృష్టికర్త. అందువలన శ్రూయతే దృశ్యతేపివా వినిపించేది, కనిపించేదీ సకలం అపౌరుషీయమే! వేద ద్రష్టలను ఋషుల పేర్లు పురాణ ఋషుల పేర్లు కనిపించినా వీరు వారూ ఒకటికారు. నామ సారూప్యమే. వేదాలూ పురాణాలమధ్య కాలవ్యత్యాసం చాలా ఉంది. అందువలన పేరు ఒకటైనంత మాత్రాన ఋషి ఒకడే అనుకోవడానికి వీల్లేదు.
వేద విశ్వామిత్రునికీ - రామాయణ విశ్వామిత్రునికీ - పురాణ విశ్వామిత్రునికీ పేరులో తప్ప సామ్యం కనిపించదు.
ఋగ్వేదంలోని ఋషులకు కోప, తాప, శాపాలు కనిపించవు. పురాణ ఋషులకు ఈ మూడూ ఉంటాయి. అసలు కోపమే ప్రధానంగా గల పురాణ ఋషులున్నారు.
వేద, పురాణ ఋషులకు నామసామ్యం తప్ప మరేదీలేదు. వేద ఋషులను పురాణ ఋషులని భ్రమించరాదు.
దేవత
యాస్కుడు మున్నగు వేదవేత్తలు ప్రతి మంత్రానికి సూక్తానికి దేవత ఉండాలన్నారు. కాత్యాయనుని బుక్స్ ర్వానుక్రమణిని అనుసరించి సాయణాచార్యులు దేవతలను ఏర్పరచినాడు.
1. దివావైనో భూదితి తద్ దేవానాం దేవత్వం 2. యథావైమనుష్యా ఏవందేవా అగ్ర ఆసన్ 3. ప్రాచీన ప్రజననావై దేవాః ప్రాచీన ప్రజననా మనుష్యాః 4. ప్రాణా దేవాః 5. చక్షు దేవాః 6. మనోదేవః 7. వాగేవ దేవః 8. పరోక్షంవై దేవాః 9. జాగ్రతి దేవాః 10. నవై దేవాః స్వపన్తి 11. సత్యసంహితావై దేవాః 12. సత్యమేవ దేవాః అనృతం మనుష్యాః 13. దయోవై సర్వేషాం దేవానా మాయతనం 14. పృథీవీవై సర్వేషాం దేవామాయతనం 15. దేవగృహావై నక్షత్రాణి 16. నదోవై దేవానాం గ్రామః
దేవతలను వివిధ రీతులుగా చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా "దేవా మహిమానః" దేవతలు మహిమలు గలవారు. "అమృతా దేవాః" దేవతలు అమృతులు అని చెప్పుకోవచ్చు.
"త్రయవై దేవాః వసదో రుద్రా ఆదిత్యాః" దేవతలు మూడు విధములు. 1. వసువులు 2. రుద్రులు 3. ఆదిత్యులు. ఈ లెక్కలను అష్టౌవసవః + ఏకాదశరుద్రా + ద్వాదశాదిత్యాః 8+11+12=31 అవుతుంది.
దేవతావావ త్రియంస్త్రిణోశోష్టౌవసవః + ఏకాదశరుద్రాః + ద్వాదశాదిత్యాః + ఇమే ఏవద్యావా + పృథివీ ఈ విధంగా దేవతలు ముప్పది ముగ్గురు. 8 మంది వసువులు + 11 మంది రుద్రులు + 12 మంది ఆదిత్యులు + 1ద్యావా + 1పృథ్వి = 33
మరొక పద్ధతిన దేవతావ త్రయస్త్రింశోప్టౌ వసవ + ఏకాదశ రుద్రా + ద్వాదశాదిత్యాః + ప్రజాపతిశ్చ + వషట్కారః" దేవతలు ముప్పది ముగ్గురు. 8 మంది వసువులు + 11 మంది రుద్రులు + 12 మంది ఆదిత్యులు + 1 ప్రజాపతి + 1 వషట్కారము = 33. "ప్రాణోవై వషట్కారః" అని శతపథము.
దేవతల సంఖ్యను ముప్పది మూడుగా నిశ్చయించారు. వారిలో
11 మంది భూమి మీది వారు. వీరు అగ్ని మున్నగువారు.
11 మంది అంతరిక్ష వాసులు. వాయువు ఇంద్రాదులు
11 మంది ద్యులోకవాసులు సూర్యచంద్రాదులు.
అయితే దేవతలు ఈ సంఖ్యవద్ద ఆగినట్లు కనిపించదు. రోలు, మండుకము, సోమము, ఋభువులు, రాజులు పెక్కురు దేవతలున్నారు. మొత్తం మీద ఈ సంఖ్య 40 దాటవచ్చు.
"యస్యవాక్యం స ఋషిః య.ఆతేనోచ్యతేసః దేవతా" అన్నాడు కాత్యాయనుడు. ఋక్సర్వాసుక్రమణిలో, చెప్పినవాడు ఋషి, చెప్పబడినవాడు దేవత అని దేవతల సంఖ్యను పరిమితము లేనట్లున్నది.
దేవతలు ఎవరు?
మానవులకు, మానవ సమాజానికి హితవు చేకూర్చిన వారు దేవతలు అనవచ్చు. ప్రకృతి శక్తులయిన సూర్య, చంద్ర, అగ్ని, వాయువులు మున్నగువానివలననే మానవుడు జీవిస్తున్నాడు. కావున పృథివి, నీరు, తేజస్సు, వాయువు, ఆకాశము. స్థూలముగా దేవతలు. అవికాక వృక్ష లతా గుల్మాదులు, పర్వతాదులు దేవతలే.
ఇంద్రుడు. అశ్వినులు, ఋభువులు తమకర్మల వలన దేవతలయినారు. వారికి సూర్యచంద్రాదులవలె స్వయంశక్తిలేదు. వారు స్వశక్తితో పనులు సాధించి దేవతలయినారు.
ఇంద్రుడు వృత్రుని వధించడం జలమును ప్రవహింపచేయడం ఇలాంటి వాటివలన మానవ సమాజానికి మహోపకారం చేశాడు. ఇంద్రుడు సాధించిన విజయ పరంపరను గురించి ఋగ్వేదంలో అనేకచోట్ల చెప్పడం జరిగింది. అలాగే ఇతర దేవతలను గురించి కూడా చెప్పబడింది.
భారతదేశం కర్మభూమి, 'కర్మ' అనే పదాన్ని 'ఖర్మ'గా వికృతం చేశారు. ఈ పదానికి "అదృష్టం" అనో "పూర్వజన్మ ఫలితం' అనో అనర్థం కల్పించారు.
మేలిమి బంగారంకన్న నకిలీ బంగారం ఎక్కువ మెరుస్తుంది! కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా! అన్నాడు వేమన.
'కర్మ' అసలు అర్థం కన్న అనర్థపు అర్థానికే ప్రాచుర్యం ఏర్పడింది. అసలు అర్థం చెపితే తప్పుగా భావించే రోజులు వచ్చాయి.
వాల్మీకి తన రామాయణంలో అహల్యను రాతిగా చూడలేదు. లక్ష్మణరేఖలు, రావణుడు సీతను భూమి సహితంగా పెకిలించుకుపోవడం చెప్పలేదు. అయితే వాల్మీకి చెప్పనివాటికే అధిక ప్రాచుర్యం వచ్చింది.
కర్మ, పదం కూడా అలాంటిదే. కర్మ అంటే పని. కార్మికుడు, అంటే పని చేసేవాడు. కర్మ వలన దేనినైనా సాధించవచ్చునన్న దేశం కాబట్టి మనది కర్మభూమి అయింది.
కాని కర్మ, అంతా అదృష్టం మీద ఆధారపడిందని చెప్పే పలాయనవాదం కాని సోమరివాదం కాదు మనది. మనది కర్మవాదం అయ్యుంటే మనకు వేదాలు, ఉపనిషత్తులు, బౌద్ధజైనాదులు, రామాయణ, భారత భాగవతాలు, పురాణాలు, కావ్యాలు ప్రపంచాన్ని ఆకర్షించిన అర్థ, పరమార్థ సంపదలు అజంతా ఎల్లోరావంటి శిల్ప సంపదలు. బేలూరు, కంచి, మధుర, రామేశ్వరం వంటి నిరుపమాన దేవాలయాలు, నృతాది కళలు కలిగేవీకావు.
వేయ్యేండ్లు పైబడిన పరాయి పాలనలో, పాలకులో, పాలకుల భజనపరులగు స్వప్రయోజనపరులో జనానికి ఖర్మ, అనే మత్తుమందు ఎక్కించి నిర్వీర్యులను చేశారు. ఈ మత్తునుంచి మనం ఇంకా బయట పడలేకున్నాం. ఇప్పుడు మరిన్ని మత్తుల్లో కూరుకుపోతున్నాం. పరాయి మెరుగులను చూచి మురుస్తున్నాం. మనకున్న సూర్యప్రకాశాన్ని గమనించలేకున్నాం.
కర్మను గురించి ఇంత వివరించింది ఎందుకంటే ఇంద్రాదులు తమ స్వయంకృషితో దేవతలయినారు! ఋభువులు తమవైపు పుణ్యంతో దేవతలయినారు.
కర్మ అంటే పని, కృషి నైపుణ్యం వలన మానవుడు దేవత కాగలడని నిరూపించింది మన విధానం. 'అహం బ్రహ్మాస్మి' అనిపించింది మన తాత్వికచింతన.
ప్రకృతి శక్తులు, తమ స్వయంకృషితో దేవతలైనవారు కాక మానవ సమాజ వికాసానికి తోడ్పడిన పనిముట్లు దైవతలైనారు. ఒకచోట మండుకాన్ని దేవతనుచేసి స్తుతించడం జరిగింది. అపహాస్యం చేయడం మన జీవిత విధానం అయింది. కాని కప్పలు అరుస్తే వాన వస్తుందని సూచన! బొద్దింకల వింత ప్రవర్తన భూకంపం రావడాన్ని సూచిస్తుందని చైనాలో కనుగొన్నారు.
ఈవేళ సైన్సు ఒక మూఢనమ్మకం అయింది. పెరుగన్నం మంచిదనడానికీ, తల్లిపాలు పనికివస్తాయి అనడానికీ, వేప, తులసి మహిమలు తెలుసుకోవడానికి పరిశోధనలు చేయడం సైన్సువంతు అయింది.
ఈనాటి సైన్సు పారిశ్రామిక సంపన్నుల చేతి కీలుబొమ్మ అయింది. వారు సైన్సును తమ బొక్కసాలు నింపుకోవడానికి వాడుకుంటున్నారు. ఇది ఖర్మను మించిన నల్లమందు. ఇది మానవాళిని అంతం చేయకమానదు.
ఒక మండలం సాంతం సోమమును కీర్తించడానికి అంకితం అయింది. వాస్తవంగా సోమానికి అంత శక్తి ఉండిందేమో! అదే ఇంద్రాదులకు శక్తి కలిగించి ఉండవచ్చు. అంత శక్తివంత సోమము తరువాత కాలంలో అంతరించి ఉండవచ్చు.
అవతరించుట - అంతరించుట ప్రకృతి ధర్మం.
అవతరించటం - అంతరించటం దేవతలకూ వర్తిస్తుంది. ఋగ్వేద దేవతలకు ఈనాడు ఆరాధనలేదు. దేవతలు కూడా కొత్తవాళ్లు అవతరిస్తారు. రామకృష్ణాద్యవతారాలు వారికి ఆలయాల్లో ఆరాధనలు మనకు తెలిసిన విషయం. బుద్ధుడు, జైన తీర్థం కరులకూ ఆలయాలూ ఆరాధనా ఉన్నాయి. ఆదిశక్తి పరాశక్తికి జానపద దేవతలు, ముత్యాలమ్మ, మదిడమ్మ, పోశమ్మ మున్నగువారికీ ఆరాధనలున్నాయి.
ఈ మధ్య కూడ కొత్త దేవతలు అవతరించారు. సాయి- సత్యసాయి- సంతోషిమాత- రాఘవేంద్రస్వామి వంటివారు.
ఋగ్వేదంలో దేవతలు ఎక్కువగా నిరాకారులుగానే పూజించబడ్డారు. ఆరాధన ఎక్కువగా యజ్ఞముల ద్వారానే జరిగింది. ప్రతి దేవతను కామ్యంగానే ఆరాధించడం జరిగింది.
ఆరాధనలన్నీ కోర్కెలు తీర్చుకోవడానికే! ఇవన్నీ కామ్యకర్మిలే!
కామ్యకర్మలు సాధారణంగా యజమానులు స్వయంగా చేయరు. పురోహితులచే చేయిస్తారు.
కామ్యకర్మలు సాధారణంగా కాయికములు అవుతాయి. మనసుతో అంతగా పని ఉండదు.
ఈ విధానమే నేటికీ అన్ని మతాల ఆరాధనలో అగుపిస్తుంది.
హెచ్చు, తగ్గుగా ప్రపంచమంతటా సాకార, నిరాకార ఆరాధన వేదంలో వలెనే జరిగింది. క్రైస్తవం వచ్చిం తరువాత, క్రైస్తవం అవలంబించిన ప్రాంతాల్లో ఆరాధనలో మార్పు వచ్చింది. ఇస్లాం సాకార ఆరాధనను నిషేధించింది.
అంటే కలకాలం ప్రపంచమంతటా భారతీయ దేవతల ఆరాధనా విధానమే వేరు పేర్లతో కొనసాగింది. సాగుతున్నది. భగవంతుడు వేరు.
ఈ దేవతలు వేరువేరు గాని అందరు కలిసిగాని పరాత్పరుడు ఈశ్వరుడు సర్వేశ్వరుడు పరమేశ్వరులుకారు.
పరమాత్మ సత్యస్వరూపుడు. సత్యస్వరూపుడగు పరమేశ్వరుని కొఱకు మానవజాతి సాంతము దేశకాల వ్యత్యాసము లేక అన్వేషిస్తున్నది. సృష్టికర్త అగు ఆ పరమేశ్వరుడు అగమ్యగోచరుడు. అనిర్వచనీయుడు, అందడు. అందని వానికి మానవుడు అనేక రూపములు కల్పించుకున్నాడు.
పరమాత్మ సాకారమా? నిరాకారమా? దీనిని గురించి చర్చలు, సిద్ధాంతాలు, తాత్విక చింతనలు జరుగుతున్నాయి. కాని నిర్ణయం జరగలేదు.
అతడు అందినకదా - కనిపించినకదా - దర్శనమిచ్చినకదా అతనిని గురించి తెలియునది. ఆ పరాశక్తి గుణగణములు మానవునకు ఎట్లు తెలియును? అతడు మనిషికి అందని మహోన్నతుడు.
మానవుని జ్ఞానము పరాత్పరుని ఎరుగుటకు అత్యంత అపర్యాప్తము.
ఆ శక్తియే - ఆ పరాత్పరుడే ఈ సమస్తమును సృష్టించినాడు. ఆధారములేకనే భూమిని, సూర్యచంద్రాదులను నిలిపి ఉంచినాడు.
భూమి, సూర్య, చంద్ర గ్రహ, నక్షత్రాదులకు ఆధారము పరమేశ్వరుడు.
ఆ పరమేశ్వరుడే ఈ సమస్త చరాచర ప్రపంచంలో కంటికి కనిపించేదీ, చెవికి వినిపించే వాటిని అన్నింటినీ ప్రకృతిలో దేనికీ సత్యస్వరూపుడు. శాశ్వతుడు. ప్రకృతిలో దేనికీ సత్యస్వరూపము, శాశ్వతములు లేవు.
భగవానుడు కల్పించిన ఈ ప్రకృతినే మానవుడు ఇంతవరకు తెలిసికొనలేక పోయినాడు. ఒక వ్యక్తి తన సమస్త జ్ఞానమున తన మనస్తత్వమును తెలియలేకున్నాడు - గెలుచుట చేతకాని పని !
"లోకములన్నియున్ గడియలోన జయించినవాడ వింద్రియా
నీకము జిత్తమున్ గెలువనేరవు" అన్నాడు భాగవతంలో ప్రహ్లాదుడు.
ప్రకృతిని - తన ప్రకృతిని - ఎరుగలేని దుర్బలాతి దుర్బలుడు మానవుడు. అయినా తనకు అన్నీ తెలుసునని బీరాలు పలుకుతాడు.
మానవుని వద్ద ఒక మహత్తున్నది. అది ఆలోచన. అన్వేషణ. అతడు పుట్టిన్నాటినుంచి అన్వేషిస్తున్నాడు. మానవుని భగవదన్వేషణ ఆగలేదు - ఆగదు. అతనికి భగవంతుడు లభించడు. ఏలనన కూటిలో రాయితీయలేనివాడు ఏటిలోనిరాయి తీయలేడు.
తననే ఎరగనివాడు సకల చరాచర సృష్టికర్తను ఎరుగుట దుర్లభము. కాని అన్వేషణ ఆగదు. ఆ అన్వేషణ యందలి భాగమే ఈ దేవతలు, ఈ మహాత్ములు, ఈ ప్రవక్తలు.
వీరిలో ఎవరూ పరాత్పరులుకారు. ఎవరూ సర్వేశ్వరుని సాంతంగా దర్శించలేదు. మహామహులు యోగులు ఋషులు ఆచార్యులు ప్రవక్తలు అందరూ భగవదంశాన్ని మాత్రమే దర్శించగలిగారు.
ఈ అంశం తెలియజేయడానికీ తిరువనంతపురపు అనంత పద్మనాభస్వామిని దర్శించడానికి మూడు వాకిళ్లు ఏర్పరచినారు.
అయితే మహాత్ములు చూపిన దేవతలను ఆరాధించడం దోషంకాదు. అతడు అందనివాడు. వారు అందినవారిని మనకు చూపినారు. ఆరాధించడమే మన పని. పరాత్పరుడు సత్యము. దేవతలు విశ్వాసము.
సత్యము కనిపించనపుడు విశ్వాసమే మహత్తము.
సముద్రం చూడనివాడు కూపాన్నే సముద్రం అనుకోవాలి.
దేశంలో ప్రభుత్వం అంతటా ఉంటుంది. గ్రామస్తునికి గ్రామాధికారియే ప్రభుత్వం. ఏ శాఖ వానికి ఆ శాఖ ప్రభుత్వం అవుతుంది. అందువల్ల అవి మాత్రమే ప్రభుత్వం కాదు. ప్రభుత్వం వేరే ఉంది. అది సర్వబలోపేత.
గ్రామస్తునికి గ్రామాధికారి వంటి వారే అనేక దేవతలు.
యేప్యన్న దేవతా భక్తా యజన్తే శ్రద్ధయాన్వితాః |
తేపిమా మేమ కౌన్తేయ యజస్త్యని విధిపూర్వకమ్ ||
అన్నాడు శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీతలో 9-23లో
ఇతర దేవతల భక్తులు ఆ దేవతలను భక్తి శ్రద్ధలతో పూజించాలి. అలాంటివారు నన్నే పూజించినట్లవుతుంది. అయితే అవిధి పూర్వకంగా.
పన్ను వసూలు చేసే వానికి ఇచ్చిన పన్ను ప్రభుత్వానికే చెందుతుంది కదా !
"ఏకం సద్విప్రాబహుధావదంతి" అంటుంది వేదం. ఒకే సత్యాన్ని పండితులు అనేక విధాలుగా చెపుతారు అని.
సత్య స్వరూపం అగోచరం. అలాంటపుడు పండితులు దాన్ని అనేక విధాలుగా చెప్పే అవకాశం ఏది? కాబట్టి పండితులు చెపుతున్నది సత్యపు ఏదో ఒక అంశాన్ని మాత్రమే.
ఏకం సద్విప్రాబహుధా వదంతి, అంటే సూర్యచంద్రాది దేవతలందరు పరమాత్మ స్వరూపులని అర్థంకాదు.
సూర్య చంద్ర, గ్రహ, నక్షత్రాది సమస్త సృష్టికర్త భగవానుడు.
భగవానుడు కర్త. సూర్యచంద్రాదులు సృష్టిమాత్రమే. వారు అశాశ్వతులు. వారికి అంతం ఉంది.
తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్యధీమహి దియో యోనః ప్రచోదయాత్
3-4-62-1 ఈ మంత్రద్రష్ట విశ్వామిత్రుడు. "ఏ సవిత మా బుద్ధికి ప్రేరణ కలిగించునో ఎవడు సమస్త శ్రుతులందు ప్రసిద్ధుడో అట్టి ద్యోతమాన లోకస్రష్ట యొక్క పరబ్రహ్మాత్మక తేజమును మేము ఉపాసింతుము"
ఆ పరింజ్యోతి ఏది? ఏదైనను దానినే ఉపాసింతుము.
ఇదే మనం ప్రస్తుతం ఉపాసిస్తున్న గాయత్రి మంత్రం.
ఋగ్వేదం 10వ మండలం 7వ అధ్యాయం 121వ సూక్తం 1-10 మంత్రాల్లో పరాత్పరుని గుణగణాలను వర్ణిస్తూ "కస్మైదేవాయ హనిషా విధేమ?" అనే ప్రశ్న కనిపిస్తుంది.
మానో హింపీజ్జనితాయః పృథివ్యాయోవాదివ సత్యధర్మాజజాన
యశ్వాపశ్చన్ద్రా బ్రహతీర్జనాన కస్మైదేవాయ హవిషావిధేమ
ఎవడు భూమిని సృష్టించినాడో ఎవని బలము సత్యమగునో ఎవడు ఆకసమును సృష్టించినాడో ఎవడు ఆనంద వర్ధకమగు విస్తీర్ణ జలరాశిని సృష్టించినాడో అట్టి ఏ దేవతకు హవిస్సులు అర్పించవలెను?
ఇంతేకాక అనేక చోట్ల సమాధానములేని ప్రశ్నలు ఉన్నవి. ఆలోచనము అన్వేషణము ప్రశ్నలమయము. అన్ని ప్రశ్నలకు సమాధానములు ఉండవు.
"ఎవ్వనిచే జనించు జగమెవ్వనిలో పలనుండు లీనమై
యెవ్వనియందు డిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం
బెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వముదానెయైన వా
డెవ్వడు వానినాత్మభపు నీశ్వరు నేశరణంబువేడేదన్" అన్నాడు పోతనామాత్యుడు.
ఒక విషయం సృష్టం. ఒక్కొక్క మతానికి ఒక్కొక్క భగవంతుడు. పరాత్పరుడు పరమాత్మ ఉండడు. ఉన్నది ఒకే సర్వేశ్వరుడు సృష్టి స్థితిలయ కర్త. భగవానుడు ఒక్కడే. ప్రవర్తకులు అనేకులు.
భూగోళం ఒక్కటే. దేశాలు అనేకం. ఆకాశం ఒక్కటే. గ్రహ నక్షత్రాదులు అనేకం. సముద్రం ఒక్కటే నదులు అనేకం.
ఏకోవైబ్రహ్మనాద్వితీయం
ఋగ్వేదంలోని దేవతలు ప్రత్యక్షంకారు. మాయంకారు. వరాలివ్వరు. ఈనాటి నవలలు, కథల్లో ఉన్నలాంటి అవాస్తవాలు అద్భుతాలూ ఉండవు.