Previous Page Next Page 
ఋగ్వేద సంహిత - 1 పేజి 7


                      మొదటి అష్టకము

   
               శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |
              ప్రసన్న వదనం ధ్యాయే త్సర్వవిఘ్నోపశాంతయే ||

     ఓం నతా మనన్తి మాయినో నధీరా వ్రతా దేవావాం ప్రథమా ధ్రువాణి |
             నరోదసీ అద్రుహ వేద్యాభిర్న పర్వతాని సమేత స్థివాంసః ||

         మొదటి మండలము - మొదటి అధ్యాయము - మొదటి అనువాకము
             మొదటి సూక్తము - ఋషి - వైశ్వామిత్ర మధుచ్చందుడు,
                            దేవత - అగ్ని, ఛందస్సు - గాయత్రి.


    1. అగ్ని మీ"ళే పురోహి'తమ్ యజ్ఞప్య' దేవ మృత్విజ"మ్ | హోతా"రం రత్నధాతమమ్ ||

    అగ్ని యజ్ఞమునకు పురోహితుడు. అగ్ని దేవతల ఋత్విజుడు. అగ్ని హోత అగును. అగ్ని సమస్త సంపదల ప్రదాత. అటువంటి అగ్నిని అర్చింతుము.

    2. అగ్ని శాశ్వతుడు. అగ్నిని పూర్వఋషులు పూజించినారు. ప్రస్తుత ఋషులు పూజించుకున్నారు. అగ్ని దేవతలను యజ్ఞములకు తోడ్కొని వచ్చును.

    3. అగ్ని వలన ధనము, విజ్ఞానము, సంపద, శక్తి, సమృద్ధి సంపద కలుగుచున్నవి. అగ్ని వలన యశస్సు, సంతానము కలుగుచున్నవి.

    4. అగ్నియే యజ్ఞములను కాపాడుచున్నవి. ఆ యజ్ఞములు దేవతలకు అందుచున్నవి.

    5. అగ్ని హోమద్రవ్యముల కారకుడు అగును. అగ్ని విశేష విజ్ఞానవంతుడు అగును. అగ్ని సత్యము అగును. అగ్ని సకల యశస్వి. అగ్ని దేవతల సహితుడయివచ్చును.

    6. అగ్నీ ! నిన్ను యజించువారలకు నీవు శుభములను సమకూర్తువు. ఆ శుభములు మరల నీకే అందుచున్నవి.

    7. అగ్నీ ! మేము నిన్ను దివారాత్రములు స్తుతించుచున్నాము. నీవు మా దోషములను దూరము చేయుచున్నావు. మేము నీదరికి చేరుదుము. నీకు నమస్కరింతుము.

    8. అగ్ని ప్రకాశవంతుడు. అగ్ని యజ్ఞముల రక్షకుడు. అగ్ని ఫలప్రదాత. అగ్ని గృహములందు నిత్యనివాసి. అట్టి అగ్నికి నమస్కరింతుము.

    9. తండ్రి తన సంతానమునకు సకల శుభములు కలిగించును. అగ్నీ ! నీవు మాకు తండ్రివలె సమస్తము సమకూర్చుము.               
    ఆలోచనామృతము :

    1. నిరంతర అన్వేషణయే జీవితము. వ్యక్తి, కుటుంబ, సమాజ, దేశ, లోక జీవితములందు అన్వేషణమే గోచరించుచున్నది.


    అన్వేషణము లేనిదాని కొఱకు కాదు, ఉన్నదానికి కొఱకే. ప్రకృతి తనలో అనంతములయిన రహస్యములను దాచుకున్నది. వాటి కొఱకు అన్వేషణ సాగినది, సాగుచున్నది, సాగనున్నది.

    ఒక వస్తువు ఎదుటనే ఉండును. కనిపించదు. వెదుకుచుందుము. ఇది జీవితానుభావము. బాల్యమున బొమ్మలకొఱకు - యవ్వనముల తోడుకొఱకు, సంతానము కొఱకు - వార్థక్యమున శాంతికొఱకు అన్వేషణయే జీవితము. జీవితము ముగియును. అన్వేషణ ముగియదు.

    అన్వేషణమే వేదము. ఈ సమస్త చరాచర ప్రకృతికి మూలము ఏది ? ఏది దీనిని కాపాడుచున్నది ? ఏది దీనిని అంతమొందించుచున్నది. వీటిని కనుగొను అన్వేషణమే వేదము. సత్యమును కనుగొనువరకు అన్వేషణ ఆగదు. సత్యము దృగ్గోచరమగుట మానవునకు సాధ్యము కాదు. అయినను అన్వేషణ ఆగదు.

    అగ్నియే సమస్తము అనుచున్నాడు.

    సృష్టి సమస్తము వెలుగు-వేడి-శక్తి మీద ఆధారపడి ఉన్నది. ఈ మూడును అగ్నివలననే కలుగుచున్నవి. అగ్ని కర్రల మంట మాత్రముకాదు. సూర్యుడు, విద్యుత్తు మున్నగు వెలుగు-వేడి-శక్తిని ఇచ్చునవి అన్నియు అగ్నియే.

    సూర్యుని వలన రాత్రి, పగలు కలుగుచున్నవి. మేఘములు వర్షమునకు కారణము అగుచున్నవి. వర్షము వలన సమస్తము ఫలించుచున్నవి. జీవితము నిలుచున్నది. కావున అగ్నియే జీవిత కారకము.

    సమస్త పరిశ్రమలు - సాంతము పారిశ్రామిక నాగరికత విద్యుత్తు మీద ఆధారపడి ఉన్నది. విద్యుత్తు అగ్ని అగును. అగ్నియే పరిశ్రమలకు ఆధారమగును.

    మనిషి బ్రతుకు వేడియే యగును. వేడి లేనిది మృత్యువు అగును. జీవము లేని దేహమును ఇంట ఉంచరాదు. అందుకే శవము తలవద్ద దివ్వె ! శవయాత్రలో అగ్గి పట్టినవాడు ముందు నడుచును. అగ్ని అగ్రమున ఉన్నది. కావున జీవము ఉన్నట్లు. దేహ దహనము సహితము అగ్నియే చేయుచున్నది.

    మనిషి పుట్టినది మొదలు గిట్టు అగ్నియే ఆధారమయి ఉన్నది.

    3. మానవుడు బయటికి కనిపించేవాడు మాత్రంకాడు. అతనికి అంతరము ఉన్నది. అదియే వాస్తవ మానవుడు.

    వేదమునకు సహితము బాహిరము - అంతరము ఉన్నవి. బాహిరర్థములు వేరు. అంతరార్థములు వేరు. రెంటిని తెలుసుకొనవలసి ఉన్నది. గ్రహించవలసిన స్థూల పద్ధతి :- (i) అగ్నిమయము. కనిపించునది. ఈ అర్థమున అగ్ని కంటికి కనిపించు మంట - శక్తి అగును. (ii) మనోమయము. కంటికి కనిపించదు. కాని వంటిలో ఉండును. జఠరాగ్నివంటిది. దీనిని ఎరుగుట. (iii) జ్ఞానమయము. బయట - లోన ఉన్న అగ్ని యొక్క స్వరూప స్వభావ పరిజ్ఞానము. (iv) ఆనందమయము. తనలోని జ్యోతిని ఎరిగి జ్యోతి కరాకమయిన పరాత్పరుని ఎరుగుట.

    వేదమును ఇట్లు అర్థము చేసికొనవలెను.

    4. సమస్త సృష్టి, స్థితి, లయములకు పంచభూతములు (భూమి, నీరు, వెలుగు, వాయువు, ఆకాశము) ఆధారములు. మన మహర్షులు భూతములు ప్రాణముగలవని భావించినారు. మానవులకు వలెనే భూతములకు ఆవేశకావేషములు, అనురాగ అనుగ్రహములు ఉన్నవని గ్రహించినారు. వాస్తవముగా వానికి క్రోధము ఉన్నదని తుఫానులు, భూకంపములవంటివి వచ్చినపుడు గ్రహించవచ్చును. మంచి మనసునకు భూతములు పులకించును అను విషయము విజ్ఞానము ఇప్పటికి గ్రహించలేదు. ముందు గ్రహించవలసి వచ్చును.

    భూతములను మనము సంతోషపరచిన అవి మనసు సంతోషపరచును.

    ప్రస్తుత కాలమున మానవుడు పంచ భూతములకు దుఃఖము కలిగించుచున్నాడు. దుఃఖమును అనుభవించుచున్నాడు.

    5. నరునకుగల మానవతా లక్షణములలో కృతజ్ఞత ప్రధానమయినది. మనకు ఉపకారము చేయు వానిని తలచుకొనుట, ప్రత్యుపకారముచేయుట కృతజ్ఞత అగును. ఉపకారిని తలచకుండుట, ప్రత్యుపకారము చేయకుండుట కృతఘ్నత.

    రామాయణమున రాముడు వాలిని వధించి సుగ్రీవునకు ఉపకారము చేసినాడు. సుగ్రీవుడు రాజ్యమును, రమణులను పొందినాడు. ఉపకారము మరచినాడు. రాముడు సుగ్రీవునకు గుర్తుచేయదలచినాడు. లక్ష్మణుని పంపినాడు. లక్ష్మణుడు సుగ్రీవునకు కృతఘ్నతను ఎరుకపరచినాడు.

                              బ్రహ్మఘ్నేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా |
                              నిష్కృతిర్వహితా సద్భిః కృతఘ్నేనాస్తి నిష్కృతిః ||


    బ్రహ్మహత్యకు, సురాపానమునకు, దొంగతనమునకు, వ్రతభంగమునకు పెద్దలు ప్రాయశ్చిత్తము విధించినారు. కృతఘ్నతకు నిష్కృతిలేదు.

    శ్రీమహా భారతమున 'కృతఘ్నుని మాంసము కుక్కలు సహితము తినవు' అను ఒక కథ ఉన్నది. కావున మనిషి అయినవాడు ఉపకారమును తలచుకొనవలసి ఉన్నది.   

    పంచభూతములు మనకు అనంతములయిన ఉపకారము చేయుచున్నవి. పంచభూతములకు కృతజ్ఞత తెలియపరచుట మానవుని కనీస కర్తవ్యము. కృతజ్ఞత సంకేతము మాత్రమే. పరమాత్ముడు మనకు ప్రసాదించినదే మనము స్వామికి అర్పింతుము. పత్రం, పుష్పం, ఫలం, తోయం చాలును అన్నాడు భగవానుడు.

    వేదము యజ్ఞమును విధించినది. యజ్ఞముచేసి కృతజ్ఞత తెలియపరచమన్నది.

    6. పురోహితుడు అనగా పూర్వము ఉండినవాడు. సృష్టికి పూర్వము ఉన్నవాడు. పరాత్పరుడు. ఈశ్వరుడు.

    పురోహితుడు యజ్ఞమునకు అవసరము అయిన పదార్థములను సేకరించువాడు.

    పురోహితుడు ముందు జరగవలసిన హితమును ఎరుగువాడు. ఎరుకచెప్పువాడు. హిత కార్యములు చేయించువాడు. పురోహితము ఒక సంస్థ అయినది. ఒక వ్యవస్థగా ఏర్పడినది. ఇది సమాజమునకు ఉపకరించుటకు ఏర్పడిన వ్యవస్థ.

    పురోహితుడు సామాజిక శాస్త్రజ్ఞుడు. ఒక వ్యక్తి, ఒక సంఘపు సుఖ దుఃఖములను వినువాడు. సుఖ జీవనమునకు అవసరమగు సలహాలు ఇచ్చువాడు. అతడు ఆచార్యునివలె, వైద్యునివలె, మిత్రునివలె ఉపకరించువాడు.

    ఈనాడు వాస్తవ పురోహితుని అవసరము సమాజమునకు ఎంతయిన ఉన్నది. ఇంగ్లండులో పారిశ్రామిక విప్లవమున పురోహిత వ్యవస్థ అంతమైనది. అందుకు గోల్డ్ స్మిత్ మహాకవి విలపించినాడు. పాశ్చాత్య నాగరికత ప్రభావమున మనము పురోహిత వ్యవస్థను రూపుమాపినాము.

    పారిశ్రామిక నాగరకత ప్రకృతిలోని, మానవునిలోని మంచి విలువలను లుప్తము చేసినది. ఆధునిక మానవుడు అంతరించిన విలువల కొఱకు అన్వేషణ ప్రారంభించినాడు. మానసిక వ్యధలను భరించలేకున్న మనిషి, తిరిగి పురోహిత వ్యవస్థను గుర్తించు దిశలో పయనించుచున్నాడు.

    సృష్టి సాంతము వలయము వంటిది. కావున బయలుదేరిన చోటికి చేరుట అనివార్యము. వేదము చూపిన పురోహితము, మరల ఊపిరి పోసికొన వచ్చును.

    7. హోత - యజ్ఞమును చేయించువాడు.

    8. ఋషి - ఈ విశ్వము - విశ్వాంతరాళము - గ్రహములు - నక్షత్రములు మున్నగు సమస్తము సర్వేశ్వరుని సృష్టియే ! మానవుడు ఇంతవరకు దేనినీ కొత్తగా సృష్టించలేదు. సృష్టించలేడు. మానవుడు ఉన్నదానినే కనుగొన్నాడు. అతడు కనుగొన్నది భగవంతుని సృష్టిలో ఆవగింజంత. అంతకే తృళ్లిపడుచున్నాడు. తనను తాను ధ్వంసము చేసికొనుచున్నాడు.

    వేదము మానవ నిర్మితము కాదు. వేదము అపౌరుషేయము. వేదము శ్రుతి. విన్నది మాత్రమే. వేదమునందలి మంత్రములను, సూక్తములను ఋషులు కనుగొన్నారు. వారు ద్రష్టలు-చూచినవారు; స్మర్తలు- గుర్తుంచుకున్నవారు మాత్రమే.

    వేదములందరి ఋషులపేర్లు అనంతర కాలమున పురాణములకు ప్రాకినవి. వేదములకు ఆదిలేదు. పురాణములు ఈ మధ్యవి. వేదములందలి ఋషులు, పురాణములవారని భ్రమించరాదు. వేదములందలి ఋషుల పేర్లను పురాణములందు వాడుకున్నాము.

    అమ్మ మనకు అన్నము తినుట నేర్పినది. మనకు తినుట వచ్చినది. నిత్యము తినుచున్నాము. అమ్మ మనకు తినుట నేర్పినదని గుర్తించుచున్నామా ! అట్లనిన అమ్మలేదనియా ! ఉన్నది. మనము మరచినాము. అమ్మవలె మానవునకు సమస్తము వేదమే నేర్పినది. మానవుడు సమస్తము వేదమునుండి నేర్పినాడు. వేదమును తల్లివలె మరచినాడు. స్తుతోమయా వేదమాతా అంటున్నది వేదము.

    9. పితేవ సూనవే తండ్రి తనయుని చూచినట్లు తనను చూడమని అగ్నిని ప్రార్థించుచున్నాడు!

    తండ్రి తనయునకు సమకూర్చనిది లోకమునందున్నదా! జీవితము సహితము సమస్తము తండ్రి సమకూర్చినదే కదా ! తనయుని కొఱకు ప్రాణములు అర్పించిన తండ్రులు ఉన్నారు.

                                            పుత్రులు చెడ్డవారు ఉందురు.
                                            తండ్రులు చెడ్డవారు ఉండరు.


              రెండవ సూక్తము - ఋషి - వైశ్వామిత్ర మధుచ్ఛందుడు, దేవతలు - 1-3 వాయువు,
                       
4-6 ఇంద్రవాయువులు, 7-8 మిత్రావరుణులు, ఛందస్సు - గాయత్రి.

    1. వాయువా! నీవు దర్శనీయుడవు. నీ కొఱకు సోమములు సిద్ధముచేసి ఉంచినాము. నిన్ను ఆహ్వానించుచున్నాము. యజ్ఞమునకు విచ్చేయుము. సోమమును స్వీకరించుము.

 Previous Page Next Page