మూడడుగుల దూరం నుంచే కొడుకుని చూసిన అరుణాచలం కంగారు పడిపోయాడు.
రాకూడని టైమ్ లో షాపు దగ్గరకు వచ్చాడే అని అతని పిత్రుహృదయం వ్యాకులానికి గురైంది.
అరుణాచలం నించుని వున్నాడు.
అచ్యుత్ అనుచరుల్లోని ఒక వ్యక్తి అరుణాచలం కూచునే సీటులో కూర్చుని కళ్ళు మూసుకొని కుర్చీని లయబద్దంగా వూపుతూ అంకెలు లెక్కపెడుతున్నాడు.
"టెన్.....లెవన్...."
అంతటా నిశ్శబ్దం అలుముకుని వుంది.
అతను చదువుతున్న అంకెలు స్పష్టంగా అందరికీ విన్పిస్తున్నాయి.
అరుణాచలానికి ఏం చేయాలో తోచటం లేదు. భయంతో అతని నోట మాట పెగలడంలేదు.
ప్రక్క షాపులవైపు చూశాడు. వాళ్ళు వణికిపోతూ కనిపించారు.
ఏ వేపు నుండి సహాయం అందేలా లేదని గ్రహించాడు.
దానికి తోడు కొడుకు ఆ సమయంలోనే రావటం ఆయనలో మరింత భయాన్ని కలిగించింది.
వాళ్ళు అడిగినంత చందా ఇస్తే దాన్ని పెంచుకుంటూ వెళ్తారు వాళ్ళు. అప్పటికే షాపు మీద కూతురు చదువు కోసం అప్పు చేసి వున్నాడు. ఆ షాపు అంత బాగా నడవడం లేదు.
స్పేసియస్ షోరూమ్స్, సెంట్రల్ ఏసి, ఖరీదైన ఫర్నిచర్, ఎక్సోటిక్ డిజైన్స్ తో కళకళలాడే ఖరీదైన రెడీమేడ్ బట్టల షాపుల ముందు తన చిన్న షాపు నిలబడలేదని అరుణాచలానికి తెలుసు. తెలిసినా చేతిలో తడి లేనపుడు చేయగలిగేదేముందని చాలా సార్లు తలపోశాడు.
ఒకరి దగ్గరకెళ్ళి చెయ్యి చాపకుండా గుట్టుగా వ్యాపారాన్ని కుటుంబాన్ని లాక్కొస్తున్న అరుణాచలం మరీ అంత పిరికివాడేం కాదు.
అందుకే ఆ వీధిలో ఎవరూ చేయని సాహసం చేశాడు.
పోలీసుల సహాయాన్ని అర్ధించాడు.
ఫలితం కనిపించలేదు.
ప్రక్క షాపులవాళ్ళ సపోర్టుని ఆశించాడు.
అయినా లాభం లేకపోయింది.
మనసు పొరల్లో ఓ మూల దాగివున్నా ఆత్మాభిమానం, అన్యాయాన్ని ఎదుర్కోవాలనే చైతన్యం బయటికొచ్చి అతన్ని మొండివాణ్ణి చేసాయి.
ఎదురు తిరిగినప్పుడైతే ఆవేశంగా ఎదురు తిరిగాడు కానీ తీరా పరిస్థితులు విషమించబోతూ కనిపించేసరికి డీలా పడిపోయాడు. షాప్ మెట్ల వరకు వచ్చిన కొడుకు కేసి చూస్తూ కళ్ళతోనే వెళ్ళిపొమ్మన్నట్లుగా అర్ధించాడు.
అభిరామ్ కి తండ్రి కళ్ళద్వారా పంపిన సందేశం అర్ధమైంది.
అయినా లెక్కచేయనట్లుగా షాప్ మొదటి మెట్టు మీద కాలేశాడు.
భయపడకపోవడం అన్నది చిరుతపులి లక్షణం భయపడదేం అని గుమికూడిన మిగతా జంతువులనుకుంటే మాత్రం చిరుతపులి వేటాడ్డం మానేస్తుందా?
మిగతా రెండు మెట్లు కూడా ఎక్కాడు అభిరామ్.
సరిగ్గా ఇప్పుడతను అచ్యుత్ ప్రధాన అనుచరుడికి అభిముఖంగా రెండడుగుల దూరంలో వున్నాడు.
బళ్ళారి సెంట్రల్ జైల్లో తలారిలా ఉరి తీయబడేవాడు. ఎంత పెద్ద రాక్షసుడయితేనేం, పరమ కిరాతకుడయితేనేం నేను ఉరి తీయడం మానుతానా అన్నట్లు నిర్భయంగా, నిఠారుగా నించుని రెండు అరచేతుల్లో మఫ్లర్ చివరి భాగాలనుంచుకొని దాన్ని అటూ ఇటూ గుంజుతూ ప్రధాన అనుచరుడికేసి చూస్తున్న అభిరామ్ వాళ్ళకో పెద్ద పజిల్ అయిపోయాడు.
"......ఎయిటీస్....నైన్ టీస్" అతనింకా కుర్చీలో విలాసంగా ఊగుతూ సంఖ్యను లెక్కిస్తూనే వున్నాడు.
పరిస్థితి చేయి దాటవచ్చని అనుమానించిన అరుణాచలం వాళ్ళడిగిన నాలుగువేల నూటపదహార్లు యిచ్చేందుకు సిద్దమౌతుండగా వినిపించింది రెండో కంఠం.
"టెన్ నైన్" కౌంట్ డౌన్ మొదలయింది. కొడుకు నోటి నుండి అని తెల్సుకున్న అరుణాచలం చిగురుటాకులా వణికిపోయాడు.
"ట్వంటీ" అచ్యుత్ అనుచరులు అన్నారు.
"ఎయిట్" అభిరామ్ అదే స్థాయిలో అన్నాడు. ఏం జరుగుతుందో తెలీక అందరూ పిచ్చెక్కిపోయి చూస్తున్నారు.
"ట్వంటీవన్"
"సెవెన్"
ఎపుడు ఏ షాపుకెళ్ళినా ఎవరయినా చందా యివ్వడానికి అంగీకరించకపోతే ఒకటి నుండి ముఫ్ఫై వరకూ సంఖ్యల్ని లెక్కపెట్టి ఆ పైన షాపుని ధ్వంసం చేయటం అచ్యుత్ అనుచరులకు అనాదిగా వస్తున్న ఆనవాయితీ.
ఆ ఆనవాయితీ మొట్టమొదటిసారి ఇరవై రెండేండ్ల యువకుడి చేతిలో విచ్చిన్నం అవుతుందని వాళ్ళెప్పుడూ ఊహించలేదు. వాళ్ళేకహ్డు ఆ నగరంలోని ఏ వ్యక్తీ ఊహించలేదు. ఊహించలేరు కూడా.
తన చిన్న గురువుకి పోటీ మరొకడు సంఖ్యల్ని లెక్కించటం షాప్ బయట వున్నవాళ్ళకు కోసం తెప్పించింది.
ఐతే అప్పటివరకూ వాళ్ళు ఆగిపోడానికి వేరే కారణముంది. సాధ్యమయినంత వరకు షాపుల ముందు గలాభా సృష్టించవద్దని షాపుల్ని ధ్వంసం చేయవద్దని పరిస్థితి చేయి దాటితేనే రంగంలోకి దిగాలని అచ్యుత్ వాళ్ళకు స్టాండింగ్ ఇన్ స్ట్రక్షన్స్ ఇచ్చి వున్నాడు.
అరుణాచలం కొడుకు భుజాన్ని పట్టుకుని అనునయిస్తున్నట్టుగా "నువ్వు ఇక్కడినుండి వెళ్ళిపో వీళ్ళు పరమ దుర్మార్గులు" చిన్నగా అభిరామ్ కి మాత్రమే వినిపించేలా అన్నాడు.
అరుణాచలం అభిరామ్ తో అన్నదేమిటో వినపడకపోయినా వాళ్ళిద్దరికీ ఏదో సంబంధం వుందని అర్ధం చేసుకొని ఏం చేద్దామన్నట్టు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు షాపు బయట వున్నవాళ్ళు.
కౌంట్ డౌన్ లెక్కపెడుతూనే తల మాత్రం తండ్రికేసి తిప్పి భయపడొద్దని కళ్ళతోనే ధైర్యం చెప్పి తిరిగి తండ్రి సీట్లో కూర్చున్న వ్యక్తి వేపు తల తిప్పాడు.
ఈలోపే 180 డిగ్రీల కోణంలో కళ్ళను తిప్పి షాప్ ముందున్న అచ్యుత్ అనుచరుల మూమెంట్స్ ని క్షణకాలంలో చూశాడు అభిరామ్.
"ట్వంటీ ఎయిట్"
"త్రీ" అన్నాడు అభిరామ్.
అప్పటివరకు కళ్ళుమూసుకొని కౌంట్ చేస్తున్న వ్యక్తి ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా ఓ వ్యక్తి తనకేసే చూస్తూ నిబ్బరంగా నిలుచుని వుండటం అతనికి ఆశ్చర్యం కలిగించింది.
అతనెవరు? ఎప్పుడు షాపులోకొచ్చాడు? అంతవరకు తన మనుష్యులేం చేస్తున్నట్టు? పోలీస్ ఆఫీసరా? లేదంటే మామూలు సివిలియన్ కి తన ఎదురుగా నిలుచుని అంకెల్ని లెక్కబెట్టె ధైర్యం ఎక్కడ వస్తుంది? క్షణ కాలంలో ఎన్నో అనుమానాలు అతని ఆలోచనల్లో చోటు చేసుకున్నాయి.
ఒక్కక్షణం అతన్ని చుట్టుముట్టిన ఆలోచనలు, అనుమానాలు అతని కైంటింగ్ కి అంతరాయం కలిగించింది.
అహం తలపుకి రావడంతో తిరిగి కౌంటింగు మొదలెట్టాడు.
"ట్వంటీ ఎయిట్" ఆ కంగారులో అన్న సంఖ్యనే తిరిగి అన్నాడు.
"టూ" నవ్వుతూ అభిరామ్-
కొడుకు ధైర్యమేమిటో అరుణాచలానికి అంతుబట్టడం లేదు.
"ట్వంటీ నైన్"
రెండు కొదమసింహాలు ఢీ కొనబోతున్న ఉద్విగ్నత అక్కడిప్పుడు చోటు చేసుకుంది.
"ఒన్" అంటూనే అభిరామ్ చిరుతపులిలా అతని మీదకు దూకాడు.
జరిగిందేమిటో ముందు అర్ధంకాలేదు బయట వున్న అనుచరులకు అర్ధం కాగానే ఒక్కసారి ముందుకు దూకబోతూ తమని ఎవరో బలంగా పట్టి ఆపినట్లు అందరూ చతుక్కున వెనుదిరిగి చూసి షాక్ తిన్నారు.
ఎక్కడ నుండి వచ్చారో తెలీదు.
దాదాపు పాతికమంది యువకులు అచ్యుత్ అనుచరుల కాలర్స్ పట్టుకుని ముందుకు ఒక్క అడుగు కూడా వేయకుండా ఆపేశారు.
ఆ హటాత్ పరిణామానికి ఆ పదిహేను మంది చేష్టలు దక్కి నిల్చుండి పోయారు.
అప్పటికే అభిరామ్ ఆ వ్యక్తిని తన తండ్రి కూర్చునే సీట్లోంచి లాగిపడేశాడు. అదే అభిరామ్ కి మరింత కోపాన్ని తెప్పించింది.
ఆఖరి అంకెను కూడా అనేసి విధ్వంసానికి సిద్దపడదామని ఆలోచిస్తున్న ఆ వ్యక్తి కొద్దిసేపట్లోనే డిఫెన్సీలో పడిపోయాడు. రెండే రెండు దెబ్బలతో ప్రధాన అనుచరుడు అభిరామ్ కబంధ హస్తాల మధ్య ఇరుక్కు పోయాడు.
"ఇప్పుడు చెప్పండి నాన్నగారు. వీడేం అడిగాడు?" కలయా వైష్ణవ మాయా అన్నట్లు కళ్ళ ముందు జరిగిందాన్ని జీర్ణించుకోలేక పోయాడాయన.