Previous Page Next Page 
త్రినేత్రుడు-1 పేజి 5


    "ఆ సమస్యకు పరిష్కారం కనుక్కోవటం చాలా కష్టం. ఒకవేళ ఎవరన్నా కనుక్కోగలిగినా దాన్ని నీకు అమ్మే బదులు డైరెక్ట్ గా వారికే ఇచ్చి పేరు, బహుమతి రెండూ కొట్టేస్తారు" మరలా అందామ్మాయి హేళనగా.

    "వాళ్ళిచ్చే బహుమతికి నాలుగురెట్లు పెద్ద బహుమతి ఇస్తాను."

    "ఇవ్వచ్చు. అసలేం బహుమతి ఇస్తారో ప్రకటనలో యివ్వలేదుగా....?"

    "ఏ బహుమతి ఇచ్చినా చిన్నదే వుంటుంది. పరిష్కారానికి అయ్యే ఖర్చు లక్ష మించగూడదని నిబంధన పెట్టారంటే బహుమతి లక్షగాని, ఆ లోపుగాని వుంటుంది. కనుక రెండు లక్షలు పెట్టి కొంటాను."

    మాట్లాడుకుంటూనే ప్రియాంక కారున్న వేపు నడుస్తున్నారు అందరూ.

    "మేడమ్ పొగరు అణగకొట్టే ఛాన్స్ ని ఇన్నాళ్ళకు నీ చేతుల్లోకి తీసుకున్నావు. కంగ్రాచ్యులేషన్స్" అంది ఓ అమ్మాయి ఓరగా ప్రియాంకను చూస్తూ.

    ప్రియాంక బ్యాక్ డోర్ తెరిచి పట్టుకొన్న డ్రైవర్ వంక చూస్తూ "బంజారాకి పోనివ్వు" అంది సీట్లోకి బుక్స్ విసిరేస్తూ.

    పదకొండుమంది అమ్మాయిల్ని ఎక్కించుకున్న మెర్సిడస్ సిక్స్ సిలిండర్ కరు మెత్తగా రోడ్డుమీదకు దూసుకుపోయింది.


                      *    *    *    *


    రాత్రి ఒంటిగంట అయింది.

    ఊరికి దూరంగా బిక్కుబిక్కుమంటూ ఓ రెండు గదుల ఇల్లు... రేపో మాపో కూలిపోవచ్చనే భయం కలిగిస్తూ- ముందు గదిలో ఇద్దరు యువకులు మోకాళ్ళ మధ్య తలలు పెట్టుకొని దీర్ఘంగా ఆలోచిస్తున్నారు.

    "ఇక తప్పదురా సిద్దప్ప. మీ అమ్మకు ఆపరేషన్ చెయ్యాలి" తల పైకెత్తకుండానే అన్నాడు తిమ్మడు మెల్లగా.

    సిద్ధప్ప ఓసారి తలెత్తి తిమ్మడివేపు అయోమయంగా చూశాడు.

    తిమ్మడేం మాట్లాడలేదు. ధీమాగా కనిపించాడు.

    సిద్ధప్పకి సర్రున కోపం వచ్చింది.

    "అదిగో ఆ ధీమా అంటేనే నాక్కోపం..." చిరాకుగా అన్నాడు సిద్ధప్ప.

    "ఆపరేషన్ కి ఎంతవుద్ది?" తిమ్మడు చాలా తాపీగా అడిగాడు.

    "రెండు వేలవుద్ది... ఏం- నీ దగ్గర మూల్గుతున్నాయా...?" తన తల్లిని రక్షించుకోలేకపోతున్నానే అన్న కసి, కోపం లోంచి వస్తున్నాయా మాటలు.

    "లేవనుకో... ఏదో చేద్దాం..." అంటూ లేచాడు తిమ్మడు. సిద్ధప్ప విస్మయంగా చూస్తుండిపోయాడు.

    తిమ్మడి సంగతి సిద్ధప్పకి బాగా తెలుసు. సాధారణంగా ఒక మాట అనడు. అంటే మాత్రం అది నెరవేరే వరకు నిద్రపోడు.

    సిద్ధప్ప ఆలోచిస్తూ బయటకు వచ్చేసరికి తిమ్మడు చాలా దూరం వెళ్ళి పోతున్నాడు. అతని చంకలో కుక్కపిల్ల వుంది. వడివడిగా వెళ్ళిపోతున్నాడు.


                                                  *    *    *    *


    సమయం రాత్రి 7-30 అవుతోంది.

    ఇంజనీర్ కి ఆకలిగా వుంది. చింతకాయ పచ్చడి, ఆవకాయ పచ్చడి వేసుకుని కూడా పరమాన్నంలా తృప్తిపడేంత ఆకలిగా వుంది.

    మరో రెండు నిమిషాల్లో స్టవ్ మీంచి అన్నాన్ని దింపేయవచ్చు. కానీ రెండు నిమిషాలు ఈ స్టవ్ వెలుగుతుందా?

    ఖాళీ కడుపుతో ప్రొద్దుటి నుంచి నీళ్ళు తాగి, తాగి కడుపులో తిప్పుతోంది. కళ్ళు తిరుగుతున్నాయి.

    స్టవ్ గుప్పు గుప్పుమంటోంది. ఏ క్షణాన్నయినా ఆరిపోయేందుకు సిద్ధంగా వుంది.

    త్వరగా వస్తే బావుండ్ను, అందరూ కలిసి తినటం ఒక ఆచారంగా పెట్టుకోవటం... ఇంజనీర్ ఆలోచనలు అక్కడే ఆగిపోయాయి.

    వేడి, వేడి అన్నంలో గొడ్డుకారమైనా రుచిగా వుంటుంది.

    ఇంజనీర్ లేచి ముందుగదిలోకి వచ్చి ప్రహరీ గోడమీంచి వీధిలోకి చూసాడు. ఎక్కడా వారి జాడ లేదు. లైట్లు వెలుగుతున్నాయి. ఓ క్షణం నిట్టూర్చి మరలా వచ్చి స్టవ్ ముందు కూర్చున్నాడు.

    మంట బాగా తగ్గిపోయింది. అన్నం ఉడికిందో లేదో తెలియదు.

    ఆ ఆజ్ బెస్టాస్ గదుల్లో ముగ్గురు కాపురముంటున్నారు. ఆ ఇల్లు స్కూల్ టీచర్ విజయరామారావుగారిది. పాతికేళ్ళ క్రితం ఎంతో కష్టంమీద నాలుగు వందల గజాల స్థలం కొనుక్కొని వెంటనే పక్కా ఇల్లు కట్టుకోలేక ముందు ఖాళీ స్థలం వదిలేసి, వెనుక వేపు రెండు గదులు ఆజ్ బెస్టాస్ రేకులతో కట్టించుకొని, అందులో కొన్నాళ్ళు కాపురం వుండి కాలప్రవాహంలో నాలుగు డబ్బులు కూడబెట్టుకుని వచ్చాడు. గదులు కట్టించుకుని, అప్పులపాలై అవి తీర్చుకొనే ప్రయత్నంలో ముందు ఇంటిలో తనుంటూ, వెనుక గదులు ముగ్గురు నిరుద్యోగులకు అద్దెకిచ్చాడు.

    7-55 అవుతుండగా సైంటిస్ట్ వచ్చాడు. పగలంతా ఎండలో, ఆకలితో తిరిగిన నీరసం, అలసట, ఆకలి అతనిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. వచ్చీ రాగానే "అన్నం వండావా?" అన్నాడు ఇంజనీర్ వైపు ఆశగా చూస్తూ.

    "వండాను. కాని ఏం ప్రయోజనం...." అన్నాడు కడుపుమీద చేత్తో రుద్దుకుంటూ.

    "మేడమ్ బిజీగారింకా రాలేదా...?" అన్నాడు ఆకలి మంటతో సైంటిస్ట్.

    రాలేదన్నట్టు తలూపాడు ఇంజనీర్.

    ఇద్దరూ కూడబలుకున్నట్టు ఆ ఉడికి, ఉడకని అన్నం గిన్నెని, కారం సీసాలను తెచ్చి ముందుగది మధ్యలో పెట్టారు. ఒకరు మంచినీళ్ళు తెచ్చిపెడితే, మరొకరు ఉల్లిపాయ ముక్కలు కోశారు.

    ఏర్పాట్లు అయ్యాయి. ఆమే ఇంకా రాలేదు.

    "ఏమయింది?" అంత ఆసక్తి కనపడలేదు ఇంజనీర్ కంఠంలో.

    "ఏమవుతుంది? అనుభవం లేదట. దానికోసం అప్రెంటిస్ గా చేరమన్నారు" నిస్పృహగా అన్నాడు సైంటిస్ట్.

    "ఎంతిస్తారట!"

    "ఆ... ఎంతిస్తారు? నెలకు మూడొందలు."

    "నువ్వేమన్నావ్?"

    "నేను యూనివర్శిటీ గోల్డ్ మెడలిస్ట్ వి. నాకు రెండువేలకు తక్కువయితే వద్దన్నాను" అన్నాడు గర్వంగా సైంటిస్ట్.

    "అంతే... అంతే... తిండిలేకపోతే మాడయినా ఛస్తాంగాని దిక్కుమాలిన చప్రాసి ఉద్యోగాలు చేయం" ఇంజనీర్ స్థిరంగా అన్నాడు.

    "అసలీ దేశాన్ని తగలెట్టాలి. దరిద్రపు దేశం. అసలు మనం ఏ అమెరికాలోనో, జపాన్ లోనో పుట్టాల్సింది. మన ఖర్మగాలి ఈ ఖర్మ భూమిలో పడ్డాం" సైంటిస్ట్ కడుపులోని ఖాళీ కోపంగా మారింది.

    "అసలు మనలాంటి మేధావుల్ని ఉపయోగించుకోని ఈ ప్రభుత్వాలు గుడ్డివి. ఇరవైమూడు అసెంబ్లీ భవనాల్లో, పార్లమెంట్ భవనం స్తంభాల్లో బాంబులు పెట్టాలి" ఇంజనీర్ మాటలు పూర్తయ్యాయి. ఆమె వచ్చింది.

    పరిస్థితి ఆమెకు అర్ధమయింది.

    "సారీ ఫ్రెండ్స్, కాస్త ఆలస్యం" అంటూ హడావుడిగా లోపలకు వచ్చింది హిందూ.

    ఆ ఇద్దరూ కోపంగా చూస్తున్నారు.

    వారి చూపుల్ని లెక్కచేయకుండా పరిగెడుతున్నట్టుగా రెండో రూమ్ లోకి వెళ్ళి, ఒక జెగ్ నీళ్ళు కాళ్ళమీద వంపుకొని కాసిని నీళ్ళు చేతిలో పోసుకొని ముఖం మీద చిలకరించుకొని పరిగెత్తుకొచ్చి వారి సరసనే కూర్చుంటూ "పెట్టేయండి... పెట్టేయండి, ఆకలి దంచేస్తోంది" అంది.

    అప్పటికప్పుడు హిందూతో గొడవ పెట్టుకోవాలనివున్నా దానివలన మరింత ఆలస్యం అవుతుందని ఆత్రంగా అన్నం, పచ్చడి ముగ్గురూ ముందున్న న్యూస్ పేపర్స్ లో వడ్డించేసుకున్నారు.

    నోట్లో పెట్టుకున్న ముద్దను నమిలేంత తీరుబడి ఆకలి కాదు వాళ్ళది. అమాంతం మ్రింగేంత ఘోరమైన ఆకలి. ఆ కారానికి ఇద్దరి కళ్ళవెంట నీళ్ళు వస్తున్నాయి.

    నవ్వుతూ ఇద్దరివేపు చూసింది హిందూ.

    "ఆకలితో ఏడుపు... కన్నీళ్ళు... ఆ ఆకలిని తీర్చుకొనేప్పుడు కూడా నీళ్ళు" అంది వేదాంతిలా చూస్తూ.

    వాళ్ళిద్దరూ పట్టించుకోలేదు.

    మూడు నిమిషాలకే గిన్నె ఖాళీ అయింది. ఊపిరి తిరిగి వచ్చినట్లయింది.

    ముగ్గురూ ముందు గదిలో చాపలు పర్చుకున్నారు. ఎవరికీ నిద్ర రావటం లేదు.

    హిందూ పక్క సర్దుకుంటూ అంది "నేను ఆలస్యం చేశానని కోపం వచ్చింది గదూ? కాని రేపటి ఆకలికి సమాధానం చెప్పటానికే ఇంతాలస్యం అయింది" అంది పక్కమీద ఒరిగిపోతూ.

    ఇద్దరూ అర్ధం కానట్లు చూసారు.

    "ఏం లేదు. ప్రొద్దున ఓ ఇంటర్వ్యూకి వెళ్ళాను" ఇద్దరూ చటుక్కున సర్దుకు కూర్చుని "వచ్చిందా?" అన్నారు ఒకేసారి.

    గదిలో ఓ మూలగా గోడ ప్రక్కన పడుకున్న హిందూ ఓ క్షణం బాధగా చూసింది.

    "అంత తేలిగ్గానా?"

    ఇద్దరికీ మరలా నీరసం వచ్చింది.

    "ఇంటర్వ్యూ నుంచి వస్తూండగా ఓ గమ్మత్తు జరిగింది..." తిరిగి ఇద్దరూ నిస్పృహగా పక్కమీద వాలిపోయారు.

    "ఏముంటుందిలే. ఏదో చిట్కా ఉపయోగించి పదో వరకో కొట్టేసుంటావ్. అంతేగా...." తేలిగ్గా అన్నాడు సైంటిస్ట్ హిందూ వైపు నిరసనగా చూస్తూ.

    "కొట్టేయలేదు ది గ్రేట్ సైంటిస్ట్. నా తెలివి తేటలు ఉపయోగించి సంపాదించాను."

    "వాడి మాటలకేంగాని నువ్వు చెప్పు, ఏం చేసావో..." హిందూ తెలివితేటలపై ఇంజనీర్ కి గొప్ప అడ్మిరేషన్. 

    "అదో చిన్న కాకా హోటల్. అక్కడ ఓ ఇద్దరు మూర్ఖులున్నారు."

    "అంటే హోటల్ కి వెళ్ళిపోయి బాగా మెక్కేసావా?" సైంటిస్ట్ ఉక్రోషంగా అన్నాడు.

    "అదే వద్దన్నాను. నీకు ఊహించుకోటాలు, ఉపద్రవం గురించి ఆలోచించుకోటాలు ఎక్కువ."

    "అబ్బ... నువ్వు చెప్పు..." ఇంజనీర్ సైంటిస్ట్ వైపు చిరాగ్గా చూసి అన్నాడు.

    "ముందు లైటార్పేద్దాం. లేదంటే మరో ఐదురూపాయలు ఎక్కువ కట్టాల్సి వస్తుంది" అంటూ లైటార్పేసింది.

    "దరిద్రపు దేశం... కరంటు కూడా ప్రియమే" పైకే విసుక్కుంటూ అన్నాడు సైంటిస్ట్.

    "ఇక వినండి. మన దేశంలో పనికిమాలిన వాళ్ళు, సోమరిపోతులు ఎక్కువగా రోడ్ల ప్రక్క హోటల్స్ లో టీ త్రాగుతూ కాలం వెళ్ళబుచ్చుతారు. ఎవరైనా వెర్రిబాగులవాళ్ళు దొరక్కపోతారా అని వెళ్ళాను. నేననుకున్నట్లే ఇద్దరు దొరికారు..." అని ఓ క్షణం ఆగి చీకట్లోనే నవ్వుకుంది.

    తెరచి వున్న ముందు గది ద్వారంలోంచి పల్చటి వెన్నెల గదిలోకి కొంత మేరకు వచ్చి ఆగిపోయింది. చల్లని గాలికి ప్రహరీ గోడ పక్క మొక్కలు కొద్దిగా కదులుతున్నాయి.

    ఉండుండి గాలి కొద్దిగా గదిలోకి కూడా వస్తోంది. పక్క మేడలోని మొదటి అంతస్తు ముందు గదిలో లైటు వెలుగుతుంది. హిందూ చెప్పేది వింటూనే ఆ గది గురించే ఆలోచిస్తున్నాడు సైంటిస్ట్.

    "ఆ ఇద్దరిలో ఒకరికి ఒక చిక్కు ప్రశ్న తెలుసు. అతను మరో అతన్ని అడిగాడు. తన ప్రశ్నకు సమాధానం చెబితే పదిరూపాయలు ఇస్తానని. రెండవవాడు ఒప్పుకునేవాడు కాదేమోకాని అక్కడే నేనున్నానుగా అందుకుని ధైర్యం లేకపోయినా ఒప్పుకున్నాడు. అప్పుడు వేశాడు మొదటివాడు ప్రశ్న-

    ఒక రైల్లో ఇద్దరు పాకిస్తానీ వాళ్ళు, ఇద్దరు భారతీయులు ప్రయాణం చేస్తున్నారు. పాకిస్థానీ వాడు ఇండియావాళ్ళతో "మేమిద్దరం ఒక టిక్కెట్ మీద ప్రయాణం చేస్తున్నాం తెలుసా" అన్నాడు ఇండియన్ రైల్వేస్ అసమర్ధతని ఎత్తిచూపుతూ. ఇండియన్స్ వీళ్ళకెలా గుణపాఠం చెప్పాలా అని యోచించారు. ఆ తరువాత ఈ రెండు జంటలు పాకిస్థాన్ ట్రైన్ లో ప్రయాణిస్తూ మరలా కలుసుకున్నారు.

 Previous Page Next Page