విహ్వలంగా చూసింది తను.
ఊహాతీతమైన వేగంతో అఖిల్ చెయ్యి కదిలింది. లెదర్ గాలిని కొస్తున్న శబ్దం.
మరుక్షణంలో లెదర్ బెల్టు తన భుజాన్ని తాకింది.
ఎర్రగా కాల్చిన ఇనుపకడ్డీ చర్మానికి తగిలినట్లు మంట....
షాక్ తో భుజంవైపు చూసుకుంది సుధ.
బెల్టు తగిలినంతమేరా జాకెట్ చిరిగింది.
ఎర్రగా తెగింది చర్మం.
మళ్ళీ గాలిని కోస్తూ వచ్చింది బెల్టు. జాకెట్టుకి, చీరెకీ మధ్య నగ్నంగా ఉన్న నడుముని తాకింది.
"అబ్బా!" అంది తను బాధ భరించలేక.
బెల్టు వెనక్కి తిప్పాడు అఖిల్.
ఇప్పుడు మెటల్ బక్కిల్ తనని గురి చూస్తోంది.
"ఈసారి బక్కిల్ తో కొడితే చస్తావ్!" అన్నాడతను కూల్ గా. "నాకు దయాదాక్షిణ్యాలు లేవు. అరచి గోల చేయొద్దని చెప్పడానికి యిది హెచ్చరిక. బెదిరింపు కాదు" అన్నాడు.
అంటూనే టకప్ చేసిన షర్టు ప్యాంటులో నుంచి బయటికి లాగాడు. బటన్స్ విప్పి, షర్టు పక్కన పడేశాడు.
భయకంపితురాలై పోయింది తను. గట్టిగా కళ్ళు మూసుకుంది. కళ్ళు మూసుకునే, తడబడుతూ చెప్పింది.
"చూడు! నీకూ నాకూ మధ్య శతృత్వం లేదు!
నీ తండ్రికీ, నా తండ్రికీ ఉన్న పగ కారణంగా నువ్వు నన్ను పాడుచెయ్యాలనుకోవడం పాశవికం."
"నీకు దణ్ణం పెడతాను! నన్ను వదిలెయ్" అంది తను.
సమాధానంగా అడుగుల చప్పుడు.
అతను తనమీదికి ఒంగినట్లు తన మొహానికి తగులుతున్న శ్వాస వల్ల తెలుస్తోంది.
"ప్లీజ్....ప్లీజ్...." అంది తను.
అతను తనను మోటుగా రెండు చేతులతో భుజాల దగ్గర పట్టుకుని వెనక్కి నెట్టాడు.
తీవ్రంగా ప్రతిఘటించింది తను.
వెనక్కి నెట్టెయ్యబోయింది.
జారిపోతున్న పమిటని సరిచేసుకోబోయింది.
ఏదీ సాధ్యం కాలేదు.
వెనక్కి విరుచుకుపడిపోయింది తను.
అప్పుడు పెట్టింది ఒక వెర్రికేక.
ఊరంతా వినబడేంత పెద్దగా.
కేకతో బాటు చటుక్కున మెలకువ వచ్చేసింది తనకు.
ఒళ్ళంతా చెమటలు కారుతుండగా గజగజ వణుకుతూ లేచి కూర్చుంది తను.
అయితే అంతా ఉత్త కలేనన్నమాట!
అలా అనుకునేలోపలే....కింద కలకలం వినబడింది. ఆ వెంటనే అడుగుల చప్పుడు.
వందమంది పరిగెడుతున్నట్లు దడదడదడ అడుగుల శబ్దం!
ఊపిరాగిపోయినట్లయ్యింది తనకి!
కింద నుంచి కేకలు వినబడుతున్నాయి.
"చంపండి! చంపండి! వదలొద్దు"
దడేల్ మని ఎవరో కిందపడ్డ శబ్దం. కొడుతున్నట్లు శబ్దాలు.
మూలుగు__
గొడ్డలేదీ....? గొడ్డలేదీ....?
"అమ్మో...." అని పెద్దగా చావుకేక.
చటుక్కున తలుపు తెరుచుకుంది.
అమ్మా, తమ్ముడూ లోపలికి వచ్చారు.
"సుధా! నీకేం కాలేదు కదా?" అంది అమ్మ ఆదుర్దాగా.
తను జవాబు చెప్పేలోగానే కింద నుంచి తండ్రి గొంతు.
"చచ్చాడా నా కొడుకు?"
"ఆ!"
ఒక్క క్షణం నిశ్శబ్దం.
తర్వాత తండ్రి గొంతు అగ్నిపర్వతం బద్దలైనట్లు వినబడింది.
"చచ్చింది వాడు కాడ్రా! మనోడే!"
వెంటనే హాహాకారాలు!
"నీ....చెత్త లం....కొ....ల్లారా! వాణ్ణొదిలేసి మనోణ్ణే చంపుతారుట్రా?"
"అదికాద్సార్ ...."
"పేగులు పీకేస్తా....నీ...."
"సార్! సార్ వాడు గోడెక్కి పారిపోతున్నాడు సార్!" ఇంకో గొంతు.
వెంటనే రివాల్వర్ లు పేలాయి.
మళ్ళీ కలకలం.
కొద్దిక్షణాల తర్వాత సద్దుమణిగింది.
తర్వాత పటపటపట ఎవర్నో చెంపపగిలేలా కొట్టిన శబ్దం.
మళ్ళీ నిశ్శబ్దం.
ఐదు నిమిషాల తర్వాత తండ్రి పైకి వచ్చాడు.
"పారిపోయాడు వెధవ!" అని గొణుక్కుని "నీకేం కాలేదుగదా అన్నాడు. ఆ ప్రశ్న అప్పుడే తట్టింది అతనికి.
ముందు పగ__
ఆ తర్వాతే ప్రేమ!
ఈ మనిషి మారడు.
విరక్తి పుట్టింది తనకి!
ఆ మర్నాడే తను మకాం ఢిల్లీకి మార్చేసింది. ఇక్కడ ఉద్యోగంలో చేరిపోయింది.
తర్వాత నాలుగేళ్ళు ఓ మోస్తరుగా గడిచాయి.
మళ్ళీ ఇప్పుడు, ఇక్కడ ఈ రాక్షసుడు హఠాత్తుగా కళ్ళముందు ప్రత్యక్షమయ్యాడు.
బాంబు పేల్చింది ఇతనేనా?
పరిశీలనగా అతని మొహంలోకి చూసింది.
ఏ భావం కనబడటంలేదు అతని మొహంలో. నిర్నిమేషంగా, నిశితంగా తనవేపే చూస్తున్నాడు.
చటుక్కున తలొంచుకుంది సుధ.
అప్పుడు కనబడింది అతని కాలికి ఉన్న గాయం.
మెకానికల్ గా మందులు తీసింది సుధ.
ఇతను తన శత్రువే కావచ్చు.
కానీ ఇప్పుడితను ట్రీట్ మెంటు ఇవ్వవలసిన పేషెంటు కూడా.
అప్రయత్నంగానే చేతులు ముందుకు జాచింది డాక్టర్ సుధ.
చటుక్కున కాళ్ళు వెనక్కి తీసుకున్నాడు అఖిల్. విసురుగా వెనుదిరిగి నడుస్తూ అక్కడి నుంచి వేగంగా నడిచి వెళ్ళిపోయాడు.
వెంటనే ఫైరింజన్ల మోత వినబడింది. పోలీసు వ్యాన్ల సైరన్లు వినబడ్డాయి.
ఆ తర్వాత పోలీసులు....హడావిడి....ప్రశ్నలు....ఇంటరాగేషన్.
దానితో, ఇంక హాస్పిటల్ కి వెళ్ళే టైమే లేకపోయింది.
బాంబు పెట్టింది ఎవరో పంజాబు తీవ్రవాదులట.
ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి అయ్యేసరికి 'ఫ్లయిట్ టైమ్ అయ్యింది'
హడావిడిగా సెక్యూరిటీ చెక్ పూర్తిచేసుకుని విమానం ఎక్కింది డాక్టర్ సుధ.
లగేజ్ రాక్ లో మందుల బ్యాగ్ పెట్టి, సీట్లో కూర్చుని యధాలాపంగా పక్కకి తిరిగి చూసింది డాక్టర్ సుధ. తక్షణం గుండె లయ తప్పినట్లయింది.
ఆమె పక్కనే కూర్చుని ఉన్నాడు అఖిల్.
అతను సుధని గమనించినట్లు లేదు. తన చేతిలో వున్న టెలిగ్రామ్ వేపు తదేకంగా చూసుకుంటున్నాడు.
టెలిగ్రాంలోని మెసేజ్ ని అతని పెదిమలు అప్రయత్నంగానే పైకి ఉచ్చరించాయి.
"ఎమర్జెన్సీ: స్టార్ట్ ఇమ్మీడియట్ లీ: మరిడేశ్వరరావు"
విమానంలో 'నో స్మోకింగ్' అన్న ఎర్రటి అక్షరాలు వెలిగాయి. సీటు బెల్టులు బిగించుకోమన్న అభ్యర్ధన వినబడింది.
ఉరుములాంటి ధ్వనితో నెమ్మదిగా కదిలింది ఎయిర్ క్రాఫ్ట్. 'బే'లో నుంచి రన్ వే మీదికి వచ్చి ఒక కొసకి వెళ్ళి, అక్కడ పరుగందుకుని, విపరీతమైన వేగం పుంజుకుని రన్ వే రెండో కొసకి వచ్చేసరికి గాల్లోకి లేచింది ఎయిర్ క్రాఫ్ట్.
కొద్ది నిమిషాల తర్వాత, విమానం ఆకాశంలో సూటిగా ముందుకు దూసుకుపోవడం మొదలెట్టాక, జేబులో పెట్టుకున్న టెలిగ్రాంని మళ్ళీ బయటకు తీసి చూశాడు అఖిల్.
తక్షణం ఊరికి వచ్చెయ్యమని మెసేజ్.
ఎందుకు?
ఏమయి వుంటుంది?
అక్కడ అందరూ బాగానే ఉన్నారా?
లేకపోతే ఎవరికన్నా, ఏమన్నా అయిందా? అందరికంటే ముఖ్యం, అమ్మ ఎలా వుంది?
మెదడు మీద యాసిడ్ చుక్కలుపడి కాల్చేస్తున్నట్లు ప్రశ్నలు, సందేహాలు, అనుమానాలు, భయాలు.
దానితో జ్ఞాపకాల రిజర్వాయర్ కి కంతపడినట్లు గతం తాలూకు జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా బయటపడటం మొదలెట్టాయి.
దుర్గేష్ తన అన్న రాజుని చంపేశాడు. అన్నయ్య అంత్యక్రియలు ముగిశాక, ఆ రోజు రాత్రి కాన్ఫరెన్స్ హాల్లో తన తండ్రికి దగ్గర వాళ్ళందరూ మీటయ్యారు.
పగ తీర్చుకోవాలని, ప్రతీకారం చెయ్యాలనీ ఏకగ్రీవంగా తీర్మానం జరిగిపోయింది.