కానీ కొన్ని బ్రహ్మ రహస్యాలు ఉంటాయి. అవి మాత్రం బయటపడవు!
కానీ ఈ 'రహస్యం' దాచటానికి ఎదుటిపక్షం ఏమాత్రం ప్రయత్నించినట్లు లేదు. పై పెచ్చు, అది తన తండ్రి పక్షానికి తెలిసిపోయేటట్లు చెయ్యడానికి తాపత్రయపడ్డాడేమో కూడా!
ఆ రహస్యం ఏమిటో తలుచుకుంటే ఇప్పటికీ ఒళ్లు చచ్చిపోయినట్లవుతుంది సుధకి.
తనవాళ్ళకి అందిన సమాచారం ప్రకారం__
రాధా, రాజూ చనిపోయాక వాళ్ళిద్దరి అంత్యక్రియలూ ఒకేరోజున, ఒకే స్మశానంలో వేర్వేరు చితులమీద జరిగాయి.
రెండు గ్యాంగులమధ్యా స్మశానంలోనే దారుణమైన యుద్ధం జరగకుండా, సెక్యూరిటీ ఏర్పాట్ల కోసం దాదాపు వందమంది పోలీసులు వచ్చారు. సూపరింటెండెంటు ఆఫ్ పోలీసు స్వయంగా అరేంజ్ మెంట్స్ సూపర్ వైజ చేశాడు.
ఏ అవాంఛనీయమైన సంఘటనా లేకుండానే గడిచిపోయింది ఆ రోజు.
ఆ రాత్రికి....
మరిడేశ్వరరావు గ్యాంగులోని మెయిన్ మెంబర్స్ అందరూ కలిసి కాన్ఫరెన్స్ పెట్టారుట!
మరిడేశ్వరరావు ఇంట్లో ఉన్న "కాన్ఫరెన్స్" హాలు ఎలా ఉంటుందో కూడా విన్నది తను.
గదికి ఒకవైపు అంతా గోడకి బదులుగా అంతమేరా ఒక పెద్ద చలువరాతి ఫలకం ఉంటుందిట.
ఆ ఫలకం మీద__
గ్యాంగువార్స్ లో చనిపోయిన గ్యాంగుమెంబర్స్ అందరి పేర్లూ ఎర్రటి అక్షరాలతో చెక్కి వుంటాయి.
రక్తాక్షరాలతో చెక్కి వుంటాయి....క్షణక్షణం గుర్తుకు వచ్చేటట్లు.... ప్రస్పుటంగా.
ఆ అక్షరాలు చూడగానే మళ్ళీ గుండెలు మండాలి! మరో మారణ హోమానికి మనసులు సిద్ధమవ్వాలి.
గ్యాంగులోని ఇంపార్టెంట్ మెంబర్స్ అందరూ వచ్చాక అప్పటికప్పుడే ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాడు.
ఆ నిర్ణయాన్ని శాసనంగా ప్రకటించాడు మరిడేశ్వరరావు.
"వాడి కూతురు నా కొడుకుని తగులుకుంది. అన్నెంపున్నెం ఎరగకుండా అమాయకంగా ప్రేమలో పడిపోయాడు నా కొడుకు. మోసం చేశారు వాడిని....మాయ చేశారు. అన్యాయంగా నా కొడుకుని చంపేశాడు దుర్గేష్. దెబ్బకి దెబ్బ తియ్యాలి మనం. రక్తానికి రక్తం కళ్ళ చూడాలి.... ప్రాణాలకి ప్రాణాలు తియ్యాలి!
వాడి కూతుర్ని ప్రేమించినందుకే నా కొడుకుని చంపేశాడు దుర్గేష్. వాడి కూతుర్నీ చంపుకున్నాడు ఎందుకు? నా కొడుకు అంత అంటరానివాడా? నా కొడుకుతో కలిసి వున్నందుకు కన్నకూతుర్ని కూడా చంపేశాడంటే అసలు వాడు మనిషి కాడు.... ఇంకా మాట్లాడితే పశువు కూడా కాడు.... పశువులు కూడా అంత ఘోరం చెయ్యవు. మనం వాడి మదం అణచాలి."
శ్రద్ధగా వింటున్నారు గ్యాంగు మెంబర్లు.
"వాడికింకో కూతురుంది. దాని పేరు సుధ" మరిడేశ్వరరావు అన్నాడు.
"నాకూ ఇంకా ఇద్దరు కొడుకులున్నారు. రాజుని వాళ్ళు చంపినా అఖిల్ ఇంకా బ్రతికే వున్నాడు.
అఖిల్ తీరుస్తాడు నా పగ!
ఆ రాధని ప్రేమించినందుకే ఘోరంగా చంపారు రాజుని.
ఇప్పుడు అఖిల్ వాడి కూతుర్ని ప్రేమించడు.
వెళ్ళి దాన్ని దారుణంగా రేప్ చేసి వస్తాడు.
ఆ తర్వాత బ్రతికినన్నాళ్ళూ శవంలా బ్రతుకుతుంది అది.
బండలయిపోయిన దాని బ్రతుకును చూసి, క్షణానికో చావు చావాలి దుర్గేష్.
తప్పదు ! రేయ్ అఖిల్ !
అక్కడే వున్న అఖిల్ తల ఎత్తి తండ్రి కళ్ళలోకి సూటిగా చూశాడు.
"చెప్పింది విన్నావా?" అన్నాడు మరిడేశ్వరరావు రంకె వేస్తున్నట్లు.
నిదానంగా తల వూపాడు అతను.
"రేయ్ మల్లేష్! వాడికి ఒక క్వార్టర్ ఇవ్వు" అన్నాడు మరిడేశ్వరరావు.
మల్లేష్ అనే అనుచరుడు లేచి ఒక క్వార్టర్ బాటిల్ విస్కీ తెచ్చి అఖిల్ కి యిచ్చాడు.
"తాగు....తాగెళ్ళి దాన్ని చెడగొట్టేదాకా మళ్ళీ నాక్కనబడకు.... వెళ్ళు" అన్నాడు మరిడేశ్వరరావు.
మృగంలా మారిన మనిషిలా వున్నాడతను ఆ క్షణంలో!
సాలోచనగా తల పంకించాడు అఖిల్. విస్కీబాటిల్ ఓపెన్ చేశాడు. కిటికే దగ్గరకెళ్ళి నిలబడ్డాడు.
"ఆపరేషన్ సక్సెస్ చేయడం గురించి అతను ఆలోచిస్తున్నాడని అర్ధం అయ్యింది మరిడేశ్వరరావుకి.
తన కొడుకు ఏ పని చేసినా పకడ్బందీగా చేస్తాడని మరిడేశ్వరరావుకి తెలుసు.
తమలాగా మోటు మనిషి కాడు అఖిల్. చాలా చురుకయినవాడు....చాలా తెలివయినవాడు.... బాగా చదువుకున్నవాడు.... ఇలా అందిస్తే చాలు అలా అల్లుకుపోతాడు.
ఆ తర్వాత ఎక్కడ నొక్కెయ్యాలో అక్కడ నొక్కేసి ప్రాణాలు తీసెయ్యగల సత్తా వుంది అఖిల్ కి.
కిటికీలోనుంచి చీకట్లోకి చూస్తూ అయిదు నిమిషాలపాటు అలాగే నిలబడ్డాడు అఖిల్.
ఆ తర్వాత తన ఆలోచనే తనని అయస్కాంతంలా లాగేస్తున్నట్లు నెమ్మదిగా బయటికెళ్ళిపోయాడు.... కనీసం వెళుతున్నానయినా ఎవరికీ చెప్పకుండా.
క్షణాల్లోనే....
"అఖిల్ సుధని చెడగొట్టడానికి వచ్చేస్తున్నాడు" అన్న వార్త కార్చిచ్చులా వ్యాపించింది.
కలవరం మొదలయింది తమ క్యాంపులో.
నాన్న ఆగ్రహంతో ఊగిపోయాడు.
అప్పటికప్పుడే ఆజ్ఞ జారీ చేసేశాడు తన అనుచరులకి.
"ఆ అఖిల్ గాడు ఎక్కడ దొరికితే అక్కడ అప్పటికప్పుడే, అక్కడక్కడే చంపెయ్యాలి. అఖిల్ గాడు చేతికి దొరికినా చంపలేనివాడు నా చేతిలో చస్తాడు" అని.
ఆజ్ఞ అందగానే అందరూ అలర్ట్ అయిపోయారు.
అఖిల్ ని చంపెయ్యాలి !
అఖిల్ ని చంపెయ్యాలి !!
అఖిల్ చంపెయ్యాలి !!!
నాన్న మనుషులందరూ మహిషాసురుల్లాగా మారిపోయి, రక్త దాహంతో ఊగిపోవడం మొదలెట్టారు.
అఖిల్ తనని చెడగొట్టడానికి ముందే అతన్ని చంపడానికి ప్లాన్ మొదలయ్యాయి.
ఆయుధాలు బయటకొచ్చాయి.
నాన్న కొత్తగా కొని దాచిన ఎ.కె. 47 రైఫిల్ కాలనాగులా బయటికి వచ్చింది.
బాకులు, చాకులు, కత్తులు, కటార్లు, ఖడ్గాలు, తుపాకులు, తపంచాలు, పిస్టళ్లు, రివాల్వర్లు, ఈటెలు, బరిశెలు, బాంబులు....
అవీ ఇవీ అని లేదు!
తోటి మనిషిని చంపడానికి సాటి మనిషి తయారుచేసిన ఆయుధాల్లో అర్ధభాగం అక్కడే వున్నాయి.
ఉద్విగ్నంగా, ఉద్రేకపూరితంగా అయిపోయింది ఆ ఊరి వాతావరణం !
తను టెన్షన్ తో అన్నం, నీళ్ళూ ముట్టడం మానేసింది.
కంటికి కునుకు దూరమైపోయింది !
క్షణక్షణం ఒకే ఒక్క ఆలోచన.
ఏమవుతుంది! ఏమవుతుంది? ఏమవుతుంది?
అఖిల్ తనని పాడు చేస్తాడా?
అంతకుముందే అతన్ని తన తండ్రి చంపిపారేయిస్తాడా?
ఇద్దరు గ్యాంగ్ స్టర్స్ మధ్య చెలరేగిన పగలకీ, ప్రతీకారాలకీ ఫణం ఒక ఆడపిల్ల శీలమా?
ఏ యుగం ఇది ?
కనీసం కలియుగం కూడా కాదా?
ప్రతిక్షణం.... అనుక్షణం....ఆరాటం....ఆరాటం....
ఏమవుతుంది?
ఏమవుతుంది??
ఏమవుతుంది???
అలా ఆరాటంతో మనసు అలిసిపోతూ....ఆ రోజు రాత్రి కలతనిద్రలో....పీడకల కంటూ వుండగా....
హఠాత్తుగా ఎవరో దూకినట్లు శబ్దం అయ్యింది.
వెర్రికేక పెట్టి చటుక్కున లేచి కూర్చుంది తను.
కేక పెట్టాననుకుంది తను.
కానీ భయంతో గొంతు పెగలలేదు. కేక గొంతు దాటి బయటకి రాలేదు.
ఎదురుగా నిలబడి ఉన్నాడు అఖిల్.
అతనే అందమైన పిశాచం!
బద్ధకంగా, నిర్లక్ష్యంగా చూసే కళ్ళు, ఎక్సర్ సైజు చేసి కండలు తిరిగిన ఒళ్ళు, విశాలంగా వున్న భుజాలు, సన్నటి నడుం.
నడుముకి వున్న లెదర్ బెల్టు తీశాడు అతను.