Previous Page Next Page 
నిశీథి నియంత పేజి 5

    ఆత్రుత లేదు - ఆలోచన వుంది.

    పసలేని పనికిమాలిన ప్రశ్నలు కావవి.

    తన పథకానికి పేర్చుకొనే మెట్లవరసలవి.

    "నిజంగా నిజం! హత్యానేరం మీద జైలుకొచ్చాను" వివేక్ కంఠం జీరగా వుంది. ఆ జీర వెనుక బిగబట్టుకుంటున్న పుట్టెడు దుఃఖం వుంది.

    "నేను నమ్మను."

    "మీరు నమ్మినా, నమ్మకపోయినా హత్యానేరం మీదే జైలుకొచ్చాను" ఏడుపును దిగమింగుకుంటూ అన్నాడు వివేక్.

    "హత్యానేరం మీదే! హత్యచేసి మాత్రం కాదు కదూ?" రామదాసు మాటలు వివేక్ ని ఒకింత తికమక పెట్టాయి ముందు. ఆ తరువాత అతని మాటల్లోని తేడా అర్ధమయింది.

    విస్మయంగా రామదాసు కేసి చూశాడు.

    "హత్య చేశానని ఒప్పుకున్నావా?" తిరిగి ప్రశ్నించాడు రామదాసు.

    "ఒప్పుకున్నాను."

    "ఒప్పించారా? ఒప్పుకున్నావా?"

    వివేక్ అయోమయంగా చూశాడు రామదాసుకేసి.

    "ఒప్పించి వుంటారు బలవంతంగా. కాదు, ఒకవేళ నువ్వే ఒప్పుకుని వుంటే, ఎవరో చేసిన హత్యని, వారిని రక్షించటం కోసం, నువ్వే చేశానని ఒప్పుకొని వుంటావ్" తీర్మానిస్తున్నట్లుగా అన్న రామదాసుకేసి దిగ్ర్భాంతిగా చూశాడు వివేక్.

    "నాకు నిజం చెప్పటానికేం? చెప్పు....నువ్వు హత్య చేయలేదు. ఎవరో చేసిన హత్యని నెత్తినేసుకున్నావు-ఐ యామ్ ష్యూర్ ఎబౌటిట్" స్థిరంగా అన్నాడు రామదాసు.

    రామదాసు మాట్లాడే తీరు, ప్రశ్నల వెనుక దాగుండే లాజిక్, మనస్తత్వ పరిశీలనా, ఇంగ్లీషు పదాల ఉచ్ఛారణ, అంతా వింతగా వుంది వివేక్ కి. ఇంతకీ ఇతనెవరు? లాయర్స్ ని, కోర్టుని, జడ్జీనే తికమక పెట్టగల నేర్పున్న ఇతను జైలుశిక్షని తప్పించుకోలేకపోయాడా?!!

    ఓ పక్క బాధ, మరోపక్క ఆసక్తి.

    ఓ పక్క దుఃఖం, మరోపక్క విస్మయం.

    క్రమంగా వాటినుంచి తేరుకొని-

    "రెండవది తరువాత....మొదటిదాన్ని ఎలా ఖచ్చితంగా చెప్పగలరు?" వివేక్ ప్రశ్నించాడు.

    "ముఖాన్ని బట్టి, చూపుల్ని బట్టి, మాటల్ని బట్టి, ప్రవర్తనని బట్టి" వేదాంతిలా అన్నాడు రామదాసు.

    "మరిదే ముఖాన్ని, ఇవే చూపుల్ని, మాటల్ని, ఇదే ప్రవర్తనని పోలీసులు చూశారు- విన్నారు. లాయర్లు చూశారు- విన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ చూశారు- విన్నారు. చివరకు జడ్జిగారు కూడా చూశారు- విన్నారు. అయినా నాకీ శిక్ష ఎందుకు పడింది....?" వివేక్ వివేకంగానే అడిగాడనిపించింది రామదాసుకి.

    అయినా నవ్వాడు రామదాసు.

    "పోలీసులు, లాయర్లు, పి.పి. ఆపైన న్యాయమూర్తి, ఎవరూ ప్రాయిడ్ శిష్యులు కాదు. మానసిక శాస్త్రవేత్తలం అంతకన్నా కాదు. వాళ్ళు మనుషుల్నే చూస్తారు. మనసుల్ని కాదు. పోలీసులు పరిశోధిస్తారు - లాయర్లు పరిశీలిస్తారు. పి.పి. ప్రకోపిస్తారు. జడ్జీ ప్రమాణీకరిస్తారు. కేసు ముగుస్తుంది. శిక్ష పడుతుంది. శిక్షపడటం అన్నది తప్పుచేసిన దానికి ప్రమాణికమా? కాదే, తప్పు చేసిన వాడికి శిక్ష పడచ్చు, అలా అని శిక్షపడిన ప్రతివాడు తప్పుచేసినట్లు కాదు."

    ఎంతో అనుభవమున్న లాయర్ లా వాదిస్తున్న ఈయనెవరు?

    పూర్వాశ్రమంలో నిజాయితీపరుడైన పోలీసాఫీసరా? లాయరా? పి పి లేక జడ్జీనా?!

    తన కేసు నడిచిన కోర్టులో ఈయన జడ్జీగా వుండి వుంటే....?

    అదే ప్రశ్న పైకి వేశాడు. మీరయితే ఏం చేసేవారన్నట్లు.

    రామదాసు నిర్లిప్తంగా నవ్వాడు - నిస్తేజంగా చూశాడు.

    "మనకు వేసేది కనబడే ఇనుప సంకెళ్ళు - జడ్జీల కేసేది కనిపించని, తుప్పు పట్టిన, ఐ.పి.సి. సంకెళ్ళు. నేనయినా నీకు శిక్ష వేయక తప్పేది కాదేమో....నీ వ్యతిరేక సాక్ష్యాలు బలంగా వుంటే...." 

    వివేక్ మూగపోయాడు.

    వరద ప్రవాహంలా పొంగుకొస్తున్న వేదనని పళ్ళ బిగువున ఆపుకుంటున్నాడు.

    "సో.... ఒకటి నిజమని ఒప్పుకున్నావు?"

    ఏమిటన్నట్లు చూశాడు వివేక్.

    "హత్య నువ్వు చేయలేదని, మోపబడిందని."

    వివేక్ తలదించుకున్నాడు.

    "నిజంగా చేదుగా వున్నప్పుడు, అన్యాయమైనదైనప్పుడు మౌనమో, తల వంచుకోవడమో అంగీకార సూచకంగా తీసుకోవచ్చు. లేనప్పుడు నువ్వెందుకు తల దించుకోవటం?"

    "తలే తీసేయబోతున్నప్పుడు వంచుకున్నా, దించుకున్నా మిగిలేది మొండెమేగదా?" ఈసారి మాత్రం ఆపుకోలేక ఏడుస్తూనే అన్నాడు వివేక్.

    చిన్నపిల్లాడిలా వెక్కిపెట్టి ఏడుస్తున్న అతన్ని చూసి కదిలిపోయాడు రామదాసు. వివేక్ ఎలాంటి నేరం చేసుండడనే స్థిరమైన అభిప్రాయానికొచ్చాడు ఫైనల్ గా.


                                *    *    *    *


    ఉదయం 9.30....

    జూబ్లీ వేలీ ఎన్ క్లేవ్ లోని....

    అపోలో మెడికల్ కాలేజీ రోడ్ లో ఒక పాత అంబాసిడర్ కారు వచ్చి ఆగింది.

    అందులోంచి సత్యమూర్తి ముందు దిగాడు.

    "రా....ఖలీల్ భాయ్....ఇదే యిల్లు" అన్నాడు సత్యమూర్తి ఇంటి కేసి దారితీస్తూ.

    ఖలీల్ మైనల్ షాక్ కి గురయ్యాడు.

    అంత పోష్ కాలనీలో ఇంట్లో సామానంతా అమ్ముకొనేవాళ్ళా? కాలింగ్ బెల్ నొక్కాడు సత్యమూర్తి. కొద్దిక్షణాల్లోనే తలుపులు తెరుచుకున్నాయి.

    ఎదురుగా వేదవతి....

    ఎన్నో ఏళ్ళుగా పగబట్టి ఉన్న పాము కాటు వేయలేకపోయానే అనే కసితో, పగతో చిక్కి శల్యమైనట్లుగా వుంది వేదవతి. ఆమె కళ్ళ లోతులలో కనిపిస్తున్న చురుకైన భావాల్ని చదివేసిన సత్యమూర్తి ఒడలు భయముతో గగుర్పొడిచాయి.

    "వచ్చాడా....?" పొడిగా అడిగింది, తమ్ముడిమీంచి తన దృష్టిని ఆగి వున్న కారు మీదకు మళ్ళిస్తూ.

    "వచ్చాడు" అన్నాడు సత్యమూర్తి.

    "సామాను తీసుకువెళ్ళటానికి లారీని తీసుకురాలేదేం ఆ అర్భకుడు....?"

    ఖలీల్ కి అర్భకుడన్న పదానికి అర్ధం తెలీలేదు- ఆ పదాన్ని విన్నా.

    "బేరం కుదరాలిగా.... అందుకని...." నసిగాడు సత్యమూర్తి.

    "కుదరాలిగా.... కావాలిగా.... జరగాలిగా.... లాంటి పదాన్ని ఇకపైన ముందు వుచ్చరించకు."

    వేదవతి తన తమ్ముడ్ని మందలిస్తున్నట్లుగా అంది. ఒకప్పుడు తన అక్క నోటివెంట వ్రతాలు, నోములు, శాంతి, సుఖం, సౌఖ్యం, పరోపకారం, సహనం, బాధ్యతలు, బరువులకీ సంబంధించిన మాటలు తప్ప మరేమీ వచ్చేవికావు.

    కానిప్పుడు....? పరిస్థితులు సున్నిత మనస్కుల్ని కఠినాత్ములుగా మారుస్తాయేమో.... ఎంతలో ఎంత మార్పు? బంధువులయినా ఇంటికొస్తే పైటచెరగును నెత్తిమీదకు లాక్కుని, గుమ్మం చాటున నించుని నెమ్మదిగా, మృదువుగా పలకరించే తన అక్క నోటివెంట ఎలాంటి 'అన్ లాపుల్ వర్డ్స్ వస్తున్నాయి?!

    "సరే లోనకు రమ్మను" అంది వేదవతి లోనకు నడుస్తూ అసహనంగా.

    మరో గంటకి పట్టెమంచాలు, పళ్ళాలతో సహా బేరానికి సిద్ధమయ్యాయి.

    ఖలీల్ నగరంలో బ్రతికి చెడిన కుటుంబాలనుంచి వాడిన వస్తువుల్ని కొని, నాంపల్లిలో లతటాకీస్ పక్కనున్న తన ప్లాట్ ఫాం షాప్ లో పెట్టి మారు బేరానికి సొమ్ము చేసుకుంటూంటాడు.

    కాంట్ బట్ పొజిషన్ లో అలా అమ్ముకొనే వాళ్ళ ముఖాల్లో కదలాడే నీలి నీడల్ని ఎంతో ప్రేమతో, కోరికతో కొనుక్కొని, మరెంతో మక్కువతో వాటిని చూసుకొంటూ ప్రాణంలేని ఆ వస్తువులతో వాళ్ళు ముడివేసుకొని వున్న సైకలాజికల్ ఏంకర్స్ ని ఖలీల్ అర్ధం చేసుకోగలడు. అలాంటి ఖలీలే వేదవతి ప్రవర్తనకు నిర్ఘాంతపోయాడు. కట్ త్రోబ్ బేరగాడు, వ్యాపారస్తుడూ వుండడం చూశాడుగానీ, కస్టమర్ ని చూడలేదు.

    మొత్తం మీద యాభైవేలకు బేరం కుదిరింది. వేదవతి చూపుల్లో కనిపిస్తున్న వాడిని, వేడిని భరించలేని ఖలీల్ - అప్పటికప్పుడే యాభైవేలు క్యాష్ చెల్లించి, పక్కనే వున్న స్టెల్లామేరీస్ కాలేజీకి వెళ్ళి జూబ్లీ వేలీ ఎన్ క్లేవ్ కి లారీ పంపించమని చెప్పి వచ్చాడు.

    అప్పటికే చాలావరకు సామాన్లని బయట పడేసింది వేదవతి.

    పగ, ప్రతీకారాల మొదళ్ళపై మొలిచిన మంటలా వుంది వేదవతి మోము.

    ఎందుకో ఖలీల్ కి ఆమె వైపు చూడడానికి ధైర్యం చాలలేదు. వరండాలోనే నించుని, రాబోయే లారీ కోసం ఎదురు చూస్తూ, దృష్టిని మాత్రం జూబ్లీహిల్స్ అంచున వున్న మెహర్ బాబా టెంపుల్ కేసి సారించాడు.

    ఇంట్లో గోడలకు కుటుంబ సభ్యుల ఫోటోలు వేలాడుతూ కనిపించాయి. ఇప్పుడు చూస్తే తనొక్కతే వుంది. కుటుంబ సభ్యులు ఏమైపోయినట్లు? విదేశాలు కట్టకట్టుకు వెళ్ళారా? తెల్సుకోవాలనే ఆసక్తి వున్నా ధైర్యం చాలక వూరుకుండిపోయాడు.

    సమయం- ఉదయం- 11.00

    లారీతోపాటు కొందరు కూలీలు కూడా వచ్చారు.

    అరగంటలో ఇల్లు ఖాళీ అయి, లారీ నిండిపోయింది.

 Previous Page Next Page