"అదికాదు అమ్మాయిగోరూ! మీలాంటి గొప్పింటి వోరు... ఆ తర్వాత ఏం మాట్లాడాలో తెలియక చేతులు పిసుక్కుంటూ వుండిపోయాడు ఎలమందయ్య.
అప్పటికే తాను వాళ్ళల్లో ఒక మనిషికాక అధికారంగా మాట్లాడినట్లు గ్రహించి తగ్గిపోయింది పద్మిని తగ్గి వూరుకోలేదు. గంభీరోపన్యాసం మొదలుపెట్టింది.
"ఈ సృష్టిలో అంతా ఒకటే. పేద గొప్ప అనేవి మానవుడి వెర్రి వేషాలలోని ఒక భాగం. యీ రోజు బీదగా వున్నవాడు రేపటిరోజు మహారాజు కావచ్చు. ఈనాటి మిలియనియర్ ఓనాటికి బెగ్గర్ గా వీధుల్లో అడుక్కుంటూ దర్శన మీయవచ్చు. ఇవాళ వుండి రేపు పోయే డబ్బు. ఇవాళ లేక రేపు వచ్చే డబ్బునిబట్టి పెద్ద చిన్న బేధం ఏర్పడ్డాయి. ఏర్పడ్డాయి అనుకునేబదులు మానవుడే ఏర్పడిచాడు అంటే బాగుంటుంది. నేను గొప్పదాన్ని అని నేననుకోటంలేదు. దయచేసి మీరూ అనుకోవద్దు. యీ అచ్చమ్మ మీకెంతో నేనూ అంతే."
ఎలక్షనలప్పుడు అయిదు పది తీసుకుని చప్పట్లు కొట్టటం వాళ్ళల్లో చాలామందికి అలవాటు. అభిమాన నటుడి సినిమా చూస్తున్నా చప్పట్లు కొట్టటం యీల వెయ్యటం మరో అలవాటు. ఆ అలవాటు చాలా నరాల్లో జీర్ణించుకున్న అక్కడున్న మూడొంతుల మంది ఈలలేస్తూ చప్పట్లు చరిచారు. వాళ్ళకి అభిమాన నటుడు ఎలక్షన్ లో నుంచుని వాగినట్లు గోచరించింది.
వాళ్ళంతా కలసి అలా ఆనందం ప్రదర్శిస్తూ వుంటే అది చూసి హృదయం ద్రవించిన పద్మిని ప్రియదర్శిని కళ్ళు చెమ్మగిల్లాయి. "వీళ్ళ హృదయాలు ఎంత విశాలం!" అనుకుంది.
ఆ తర్వాత...
చిన్ని వసారా రెండు చిన్నిచిన్ని గదులున్న ఒక మాదిరి రెల్లుగడ్డి గుడిశలోకి పద్మిని ప్రియదర్శిని కాలు పెట్టింది. లోపలంతా ఒకసారి కలయచూసి "పాపం చాలా పూర్" అనుకుంది.
ఎలమందయ్య గుడిశముందు కొద్దిపక్కగ లావుపాటి మానుతో పెద్దసైజు వేపచెట్టువుంది. చెట్టుకింద కూర్చోటానికి అరుగులాగా కట్టింది అచ్చమ్మ. అక్కడ సౌకర్యం ఆ అరుగు ఒక్కటే.
"బాత్ రూమ్ ఎక్కడ?" పద్మిని నలువైపులా చూస్తూ అడిగింది.
"అంటే ఏంటి?" అచ్చమ్మ అడిగింది.
"ఓ నీకు ఇంగ్లీషు రాదుకదూ! అయామ్ సారి. స్నానాలగది ఎక్కడ అని అడుగుతున్నాను" అంది పద్మిని.
"తానాలగదా?" అని కిసుక్కున నవ్వింది అచ్చమ్మ. ఆ తర్వాత యింకా వస్తున్న నవ్వుని బిగపట్టుకుని" అల్ల ఆ దడిచాటున తానమాడినా... ఉచ్చోసుకున్నా_" అని చెపుతూ చేయిచాచి తడికల గదిలాంటి దానిని చూపించింది.
తడికల గది చాలా చిన్నది. తడికలుకూడా శిధిలావస్తలో వున్నాయి. మనిషి నుంచుంటే మేడ పైనుంచి కనపడుతుంది. లోపల స్తలం ఒక బొక్కెట్టు మాత్రం పెట్టుకుని కూర్చుని స్నానం చేయటానికి సరిపోతుంది.
"బాత్ రూం అంటే అదా!" ఆశ్చర్యంగా నోరంతా తెరిచింది పద్మిని. వాళ్ళింట్లో బాత్ రూమ్ లో అయితే ఏకంగా నాలుగు కుటుంబాలు కాపురం వుండొచ్చు అన్నంత పెద్దదిగా వుంటుంది. ఆ యింట్లో చాలా రూమ్స్ కి ఎటాచ్డ్ బాత్ రూములున్నాయి. ఆరడుగుల నుంచి పది అడుగుల సైజువరకు రకరకాల రూములుంటాయి. మరీ యింత చిన్న సైజు మరీ యింత అధ్వాన్నంగా వుండే బాత్ రూమ్ ని ఏ తెలుగు సినిమాలోనూ ఏ డైరెక్టర్ చూపించిన పాపానపోలేదు.
పద్మిని ప్రియదర్శిని ఆర్టు సినిమాలు ఒకటీ చూడలేదు. కనీసం ఒకటి రెండయినా చూసినట్లయితే జనరల్ నాలెడ్జీ బోలెడు వచ్చేది.
తడికల బాత్ రూమ్ చూడంగానే నీళ్ళు కారిపోయింది ఆ ముద్దుగుమ్మ.
రోట్లో తలదూర్చిన తరువాత రోకటిపోటుకి తల వగ్గాల్సిందే. మంత్రసానివని ఒప్పుకున్న తర్వాత ఏ అసహ్యమైనా భరించాల్సిందే. ఇప్పుడు పద్మిని ప్రియదర్శిని అలాగే అయింది.
అర్జంటుగా స్నానం చేయకపోతే శరీరం భరించేటట్లు లేదు. యమర్జంటుగా కడుపులోకి ఏదో ఒకటి పంపించకపోతే ఆత్మారాముడు శాంతించేట్టులేడు.
స్నానం చేస్తే ధరించటానికి వేరే గుడ్డలు లేవు కనీసం తుడుచుకోను తువ్వాలు కూడా లేదు.
అచ్చమ్మ తెచ్చి యిచ్చిన తువ్వాలు అచ్చమైన అలుగ్గుడ్డలా కనిపించింది పద్మినికి.
అచ్చమ్మ తెచ్చిన తుండు నబ్బెట్టి వుతికిందే పద్మిని కళ్ళకి అలా కనిపించింది. అది అచ్చమ్మ తప్పుకాదు. పద్మిని తప్పు అంతకన్నా కాదు. సహజ పరిస్థితులు అలాగే వుంటాయి మరి.
ఏదన్నా తెప్పించుకుందామంటే చేతిలో డబ్బు లేదు. పోనీ అప్పు రూపేణా వాళ్ళని అడుగుదామంటే అసలే సమ్మె చేస్తూ వున్నారు జీతాలు లేవు. రోజుకూలి లేదు. ఆడాళ్ళు సంపాదిస్తుంటే మగాళ్ళు తింటున్నారు.
చేతికి జత బంగారు గాజులు రెండో చేతికి వాచి వేలికి ఎర్రరాయి ఉంగరం మెడలో బంగారు చైను. చెవికి రింగులు సింపుల్ గా ఇంట్లో ధరించేవి. వాటితో బయటికి వచ్చింది పద్మిని. ఉన్నట్లుండి బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది. ఒక బంగారు గాజు అమ్మేసి ఆ డబ్బుతో షాపింగ్ చేస్తే? తనకొచ్చిన ఆ అద్భుతమైన ఆలోచన అచ్చమ్మతో చెప్పింది పద్మిని.
"అదేదో రేపు చేయాల్సిందే అమ్మాయిగారూ! రాత్రిళ్ళు చేస్తే దొంగ అని పట్టుకెళతారు. మీరెవరన్నది పోలీసులకి చెప్పాలి. ఆ తర్వాత వాళ్ళు ఈ అమ్మాలు మీ అమ్మాయేనా అని అయ్యగారిని అడుగుతారు.
"వద్దు యింక చెప్పొద్దు" అంది పద్మిని. తండ్రి పలుకుబడితో రోజులు గడపటం ఇష్టంలేదు.
ఆ రాత్రికి గతిలేక గత్యంతరం లేక
తడికల బాత్ రూమ్ కి దుప్పటి అడ్డుపెట్టి అచ్చమ్మ పట్టుకోగా పద్మిని బాగా అరిగిపోయిన అంగుళం సబ్బు ముక్కతో బొక్కెట నీళ్ళతో స్నానం కానిచ్చింది. విడిచిన గుడ్డలే మళ్ళీ కట్టుకుంది. రూపం తెలియని కూర పుల్లమజ్జిగ కలిపిన గంజి దానిలోకి నంజుడు ఉల్లి కారంతో సరీగ రెండు గుప్పెళ్ళ భోజనం కళ్ళు మూసుకుని బలవంతానా కడుపులోకి పంపించింది.
కూర అనే పదార్ధాన్ని పక్కింట్లోంచి అమ్మాయిగారి కోసం అడిగి తెచ్చింది అచ్చమ్మ. అది కూడా తెలియదు పద్మినికి.
ఆ చిన్న గదిలో పడుకోలేక చెట్టుకింద మంచం వేయించుకుని పడుకుంది పద్మిని. నులక కుక్కిలో శరీరం కూరేసుకుపోయి అదేదో ఆసనం వేసినట్లయింది పద్మిని పని.
పద్మినికి కాపలాగ అరుగుమీద అచ్చమ్మ. ఇంకో నులక కుక్కిలో ఎలమందయ్య పడుకున్నారు.
మేమున్నామంటూ దోమలు సంగీతం పాడుకుంటూ వచ్చాయి.