Previous Page Next Page 
గిఫ్ట్ పేజి 5

    "ఉదయంనుంచీ రాత్రిదాకా పుస్తకంలో తలదూర్చి నడుంవంచి, ఆ లెక్కలురాసి, పూర్తిగా శక్తిని కోల్పోయి, రెండు వందల యాభై రూపాయలు సంపాదించేకన్నా, చిప్ప పట్టుకుని ముష్టెత్తుకుంటూ మూడువీధులు తిరిగితేచాలు. రెండువందల యాభై రూపాయిలకు సరిపడా చిల్లర డబ్బులు రెండున్నర గంటల్లో ముష్టి చిప్పలోకి వచ్చిపడతాయి. ఈ దేశంలో పాపాత్ములూ, భక్తులూ చెరీ సమానంగా వున్నారు.

    పాపాత్ములు తమ పాపం పోవడానికి, భక్తులు పుణ్యలోకాలకి వెళ్ళడానికి, పదిపైసల దగ్గర నుండి పావలా వరకూ విదిలిస్తూ వుంటారు. అన్నిటికన్నా బెటర్ అడుక్కోవటం." బోసుబాబు పెద్దగా నవ్వుతూ అన్నాడు.

    "మరిదిగారికి చిన్న ఉద్యోగాలు చెయ్యటం ఇష్టంలేదులే. ఆయనగారి తెలివితేటలకి ఏ కలెక్టరో అవుతాననుకుంటున్నాడు! ఆలూలేదు, చూలూలేదూ అల్లుడి పేరు సోమలింగం అన్నట్లు." బోసుబాబు ముఖం చూసి అక్కడితో ఆగిపోయింది సామ్రాజ్యలక్ష్మి.

    "కలెక్టర్ ఉద్యోగానికి ఆశపడటంలేదు గానీ చిన్న ఉద్యోగం మాత్రం ఛస్తే చెయ్యను" బోసుబాబు తన అభిప్రాయం గట్టిగా చెప్పేశాడు.

    "అవునన్నయ్యా! నీ చదువుకీ, నీ తెలివితేటలకీ చిన్న ఉద్యోగాలు పనికిరావు. చేసినా అసహ్యంగా వుంటుంది. 'ఒక కెరటం ఎగిరిపడింది' నవలలో హీరో అచ్చం నీలాంటి వాడే...."

    "చాలు! ఇంక నోర్ముయ్యి. పెదవి కదిపితే చాలు సినిమా, లేకపోతే నవల. దిక్కుమాలిన నవలలూ, దిక్కుమాలిన సినిమాలూ యువతరాన్ని సగం చెడగొడుతున్నాయి. ఆరోజుల్లో మహాత్మాగాంధీ...."

    "నాన్నా! నా ముందు గాంధీ పేరు ఎత్తకు." బోసుబాబు తీవ్రంగా అన్నాడు.

    "గాంధీ మహాత్ముని పేరు ఎత్తితే నీ కొంపేం మునిగిందిరా! భారతదేశ ప్రజలు బానిసత్వం నుంచీ విముక్తి పొందారంటే ఆ మహాత్ముని చలవే!"

    "చలవకాదు. ఆ మహాత్ముడు పుట్టి మనకు వేసిన శిలువ. మనం స్వాతంత్ర్యం వచ్చిన తరువాత అడుక్కోవడం ఎక్కువ అయింది. ప్రతి మనిషిలో ఆశా, స్వార్ధం పెరిగిపోయాయి. ప్రతివాడూ ప్రక్కవాడి నెత్తిన చెయ్యి పెట్టేవాడే. చిన్న చేపల్ని పెద్ద చేప మింగుతూంటే ఆ పెద్ద చేపల్ని మింగడానికి అంతకన్నా పెద్ద చేప కాచుకుని కూర్చుంది...."

    "వీడు చెప్పేది మీకేమయినా అర్ధం అవుతోందా?" అన్నట్లు భర్తవైపు చూసింది కల్యాణమ్మ.

    "ఈ దేశంలో ఏమీ లేనివాడు అడుక్కుంటున్నాడు. కుంటివాడు పని చెయ్యలేక, గ్రుడ్డివాడు చూడలేక అడుక్కుంటున్నాడు. ప్రతివాడూ దేనికో దానికి అడుక్కుంటూనే వున్నాడు. ఆఖరికి మంత్రులు కూడా అడుక్కుంటున్నారు 'ఓట్లు' ఈ అడుక్కోడమనేది మనకి స్వాతంత్ర్యం రాబట్టే ఏర్పడింది. మన ఇంగ్లీష్ వాళ్ళ చేతుల్లో బానిసలుగా పడివుంటే ఈ దేశం బాగుపడేది. మనమూ బాగుపడేవాళ్ళం.

    ఇప్పుడు బానిసత్వమూ తప్పలేదు, అడుక్కోవడమూ తప్పలేదు. అఘోరించడమూ నాదృష్టిలో గాంధీకాదు మహాత్ముడు. గాంధీని చంపిన గాడ్సే మహాత్ముడు. మనం పూజించవలసింది గాడ్సేని. మనం దండలు వేయవలసింది సెంటర్ కొక గాడ్సే విగ్రహం పెట్టి ఆ విగ్రహానికి" చాలా ఆవేశంగా అన్నాడు బోసుబాబు.

    "ఒరేయ్! ఒరేయ్! నీకేం పుట్టిందిరా?" కల్యాణమ్మ వాపోయింది.

    "లేదమ్మా! అన్నయ్య చెప్పిన దానిలో కూడా అర్ధం వుంది. "భారతం తిరగరాయండి!" సినిమాలో హీరో ఆఖరి క్షణాల్లో చనిపోతూ ఇలాంటి మాటలే అంటాడు" అంది సుమతి.

    "వాడిని కాదే ఇప్పుడు నిన్ను కూడా నోరుముయ్యమంటున్నాను."

    "పనీ పాటాలేక ఉద్యోగంలేక పిచ్చిపిచ్చి ఆలోచనలతోపాడై పోతున్నావు. ఈ కాలంలో ఉత్తరం ,దక్షిణం లేకుండా ఉద్యోగం రమ్మంటే ఛస్తే రాదు. ఆ పాట్లేవో మేము పడతాము. ఉద్యోగానికి అప్లికేషన్లు పెట్టు" లక్ష్మణమూర్తి చెప్పాడు.

    ఈ దేశంలో పిలిచి పిల్లనైనా ఇస్తారు గానీ, పిలిచి ఉద్యోగం మటుకు ఎవరూ ఇవ్వరు. ఇంత చిన్న సత్యం మరిదిగారికి తెలియదు లెండి!" సామ్రాజ్యలక్ష్మి అలవాటు ప్రకారం మూతి తిప్పి మరీ చెప్పింది.

    వీళ్ళిలా మాట్లాడుకుంటూ వుండగానే, అసలు తామందరూ హాల్లో ఎందుకు సమావేశమయ్యారో, జగన్నాధానికి గుర్తుకు వచ్చింది.

    "నువ్వు నీ గదిలో తలుపులు వేసుకుని చేస్తున్నదేమిటి?" మధ్యలో అడిగాడు జగన్నాధం.

    "ఒక మనిషిని ఎన్ని రకాలుగా వురి తీయవచ్చో పరిశోధన చేస్తున్నాను" వ్యంగ్యంగా చెప్పాడు బోసుబాబు.

    "ఒరేయ్ ! నువ్వు నిజం దాచాలని ప్రయత్నించిన కొద్దీ మాకు తెలుసుకోవాలన్న ఆత్రుత ఎక్కువవుతుంది. మాకు తెలుసుకోవాలన్న ఆత్రుత ఎక్కువైన కొద్దీ నిజం తెలుసుకోటానికి ప్రయత్నిస్తాం" జగన్నాధం అన్నాడు.

    "అంటే మీ వుద్దేశ్యమేమిటి? తలుపులు బద్దలుకొట్టి చూద్దామనా ?"

    జగన్నాధం మాట్లాడలేదు.

    అక్కడున్న ఎవరూ కూడా పెదవి కదపలేదు.

    అందరి ముఖాలు ఒకసారి కలయజూసి, "నా గదిలో మంత్రాల మర్రిచెట్టూలేదు. నేనేంక్షుద్ర ప్రయోగమూ చెయ్యడం లేదు. నేను ఒకటి అనుకున్నాను. అది చేసుకుంటున్నాను. దాని వల్ల మీరెవరూ నష్టపోరు. నేను లేనప్పుడు నా గది తలుపులు తీసి చూశారో, ఆ తరువాత నేనేం చేస్తానో నాకే తెలియదు. ఒకటి మాత్రం బాగా గుర్తు వుంచుకోండి. నేను గాంధీమహాత్ముడివి కాను. గాడ్సేని" అంటూ విసురుగా లేచి బయటకి వెళ్ళిపోయాడు బోసుబాబు.

    ఒక్కక్షణం.

    సూది కిందపడితే చప్పుడు వినిపించేంత నిశ్శబ్దం తాండవించింది అక్కడ.

    మరుక్షణానికి.

    అక్కడ పరిస్థితి చేపల మార్కెట లా తయారయ్యింది.


                                         3


    ట్రైను ప్లాట్ ఫాం విడిచింది.

    ట్రైను కనుమరుగైనదాకా చూస్తూ, చేయి గాలిలో వూపుతూనే వున్నాడు ఛటర్జీ.

    ట్రైను పూర్తిగా కనుమరుగై పోయిన తరువాత, ఛటర్జీ ప్లాట్ ఫామ్ విడిచి ఇవతలకి వచ్చాడు. ట్రైను వెళ్ళడంవల్ల ఫ్లాట్ ఫామ్ మీద సందడి పూర్తిగా తగ్గిపోయింది.

    ప్లాట్ ఫామ్ మీద అవీ, ఇవీ అమ్మిన వాళ్లుకూడా, మౌనంగా సర్దుకుంటూ వుండిపోయారు.

    "బంగారు తల్లి! మెడిసిన చదువుతున్నందుకు సంతోషించాలా అక్కడ హాస్టల్లో వుండి మెడిసిన్ చదవాల్సిరావడంవల్ల విచారించాలా? ఇంటిపట్టున వుంటే అన్నీ తను చూసుకునేవాడు మెడిసిన్ లో సీటు రాబట్టే కదా!  షాలిని అక్కడా తను ఇక్కడా వుండిపోవాల్సి వచ్చింది. ఇంకెంత ఒక సంవత్సరం కష్టపడితే అయిపోతుంది. తన కూతురు డాక్టర్ కావడం తనకెంత గర్వకారణం" ఛటర్జీ ఆలోచిస్తూ ఫ్లాట్ ఫామ్ మీంచి ఇవతలకి వస్తూండగా, స్నేహితుడు ముకుందరావ్ తారసపడ్డాడు.  

 Previous Page Next Page