Previous Page Next Page 
అనురాగ జలధి పేజి 5

    అనవసరమైన ప్రశ్న. అయినా తలూపేడు శ్రీకర్. మరో పదినిముషాలు ఆ యువకుడు ఏదేదో చెప్పుకుపోయాడు. శ్రీకర్ కి అతని మాటలు వినాలన్న ఆసక్తి లేకపోయినా కాలక్షేపం కోసం వింటున్నట్లు తలూపుతూ వున్నాడు.
    గంట గడిచింది. ఇంటర్వ్యూ చేసే అభ్యర్థులు అయిపోయారు.
    అంతా రిజల్ట్సు కోసం యెదురు చూడసాగారు.
    అంతమందిలో అదృష్టం ఎవర్ని వరించనున్నదో.
    మరో పదినిమిషాల తర్వాత రిజల్ట్సు వచ్చేసాయ్!
    శ్రీకర్ గుండెలు వడివడిగా కొట్టుకున్నాయి. జనాన్ని తప్పించుకుంటూ ముందుకి వెళ్ళి బోర్డుమీద పేరుచూశాడు. అంతే అతని ముఖం మతాబులా వెలిగిపోయింది. పట్టరాని ఆనందంతో బోర్డుమీదున్న తన పేరును పైకి ఉచ్చరించాడు.
    అంతా అతన్ని వింతగా చూసారు! ఇతనేనా ఆ శ్రీకర్! లక్కీఫెలో మంచి ఛాన్సు కొట్టేశాడన్నట్లు చూశారు చాలామంది.
    ఎవర్నీ పట్టించుకునే స్థితిలో లేడు శ్రీకర్.
    అతనికి పట్టపగ్గాలు లేకుండా వుంది.
    "జ్యోతీ! నాకు ఉద్యోగం వచ్చింది! నేను నీవనుకునేంత అసమర్దుడ్ని కాదు. ఉద్యోగం సంపాదించగలిగాను. నా కాళ్ళమీద నేను నిలబడగలను. ఇక నువ్వే నన్ను వెదుక్కుంటూ రావాలి!" గర్వంగా అనుకున్నాడు మనసులో.
    ఈ విషయం అమ్మా నాన్నకి చెప్పాలని ఎగిరిపడే హృదయాన్ని నొక్కిపెట్టి ఇంటివేపు బయలుదేరాడు శ్రీకర్.
    అతని నడకలో మార్పు!
    అతని వదనంలో వింతకాంతి వెల్లివిరుస్తోంది.
    అది ఉద్యోగం తెచ్చిన మార్పు!
    అది అతని వ్యక్తిత్వానికి గుర్తింపు దొరకటంతో వచ్చిన మార్పు!
    జీవితం ఎంత చిత్రమైంది!
    క్షణాల క్రింద ఆశ నిరాశల పోరాటం! వాటిమధ్య సతమతమవుతోన్న స్థితి! ఈ ఆధారం దొరికితే తప్ప బ్రతుకులో సుఖశాంతులు లేవన్నంత విషాదయోగం!
    కానీ ఎంతలో ఎంత మార్పు?
    నడిసముద్రంలో నావ పగిలి ప్రవాహంలో కొట్టుకుపోతున్న జీవచ్చవంలాంటి వ్యక్తికి చేయి అందించే మహానుభావుడు దొరికితే! మండుటెండలో దాహంతో అలమటించే మనిషికి మంచినీరు దొరికితే! కారు చీకటిలో పయనించే వ్యక్తికి టార్చిలైట్ దొరికితే!
    ఆలంబన ఎంత చిన్నదైతేనేం? అది ప్రాణాన్నిస్తుంది! ప్రాణాన్ని నిలుపుతుంది. బ్రతుకుని వెలిగిస్తుంది!
    శ్రీకర్ కొత్త ధైర్యంతో ఇంటికి నడిచాడు.
                                         5
    ఆఫీసుముందు నుంచున్నాడు శ్రీకర్.
    పదంతస్థుల మేడ అది! నిన్న లోపలికి వెళ్ళాలంటేనే కాస్త జంకాడు. అయినా నిరుద్యోగి, బిచ్చగాడూ, వ్యభిచారిణీ సిగ్గుపడితే ఎలా అనుకుని వెళ్ళాడు. ధైర్యంగా ఇంటర్వ్యూ చేశాడు.
    ఆయన్ని చూసిన వేళావిశేషమో ఏమో ఆయన వేసిన ప్రశ్నలకి తనిచ్చిన సమాధానాల ప్రభావమో తను ఈ గేట్లో అడుగుపెట్టిన ఘడియబలమో ఏమో! తనకి వెంటనే ఎపాయింట్ మెంట్ ఇచ్చారు. వీధివీధికి అరడజను మంది నిరుద్యోగులున్న ఈ రోజుల్లో వెంటనే ఉద్యోగం దొరకటం తన అదృష్టం కదా?
    "జ్యోతీ! నన్ను మరీ అంత చులకనగా చూడొద్దు నన్ను కించపరచి అందువల్ల ఆనందం పొందాలనుకోకు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నీకు సుఖంగా వుందనిపిస్తే నేనీక్షణాన్నయినా వెళ్ళిపోగలను వెళ్ళి ఉద్యోగం సంపాదించుకోగలను. నా మెరిట్, నా యోగ్యతాపత్రాలు నాకు ఉద్యోగాన్నిస్తాయి. నేనూ, నీవూ సుఖంగా జీవించవచ్చు. కానీ నన్ను తరమవద్దు.
    జ్యోతితో తను ఛాలెంజ్ గా అన్నమాటలు అక్షరాలా యదార్ధాలయ్యాయి. నెల తిరక్కముందే! ఆమెతో అన్నట్టుగానే ఉద్యోగం కూడా వచ్చింది. మరి ఇక భవిష్యత్తు ఎలా సాగుతుందో!
    ఆలోచనలని పారద్రోలి గేటుదాటి లోపలికి వెళ్ళి రిజిష్టర్ లో సంతకం చేశాడు కొద్దిగా వేళ్ళు వణికినట్టనిపించింది.
    వెళ్ళి సీట్లో కూర్చున్నాడు.
    ఒక్కరొక్కరే రాసాగారు. రిసీవ్ చేసుకోవటాలు, గ్రీట్ చేసుకోవటాలు, సీట్లో కూర్చోవటాలు అన్నీ యాంత్రికంగా టకటకా జరిగిపోతున్నాయి.
    పక్కసీటు ఖాళీగా వుంది. టేబుల్ పై మిషన్ కు కప్పిన కవరు టైపిస్టు యింకా రాలేదని గుర్తుచేస్తుంది.
    అయ్యగారు పిలుస్తున్నారు! ఎటెండర్ వచ్చాడు.
    లేచి ఎటెండర్ వెంటనడిచాడు పిలిచింది పి.ఎ.
    "కమిన్! ఇదో యీవిడ నీలవేణి...ఎం.బి.ఏ. మీ సెక్షన్ లోనే పనిచేస్తోంది. మీ ఇద్దరి సీట్లకి కనెక్షన్ వుంటుంది. ఆవిడ కొంతవర్క్ తెలియచెబుతుంది. శ్రద్ధగా నేర్చుకోండి చెప్పాడు పి.ఎ. మధుమూర్తి.
    "నమస్తే"
    "నమస్కారం"
  నీలవేణి గొంతులో మార్దవం వుంది. మధువులాంటి నిషాయిచ్చే మాదకతవుంది. దానికితోడు చిరునవ్వు.... అందం...అలంకరణ...ఒక్క సెకనులో కొలిచేశాడు ఆమెను.
    "రండి"
    ఇద్దరూ బయటికి వచ్చారు.
    ఆమె తన సీటువద్దకి దారితీసింది. "మీ కుర్చీ ఇటు లాక్కోండి. ఇదో యీ ఫైలు చూడండి. ఇది మన బ్రాంచి ఆఫీసులో ఓ క్లర్క్ పెట్టుకొన్న అప్లికేషన్. ఇతనికి లోన్ కావాలిట. ఇతని నంబరు 616 ఇతని పర్సనల్ రికార్డు రికార్డ్ రూంలో వుంటుంది. బాయ్ ని పిలిచి చెప్తే తెస్తాడు. అది చదవండి. సేవింగ్ పర్టికులర్స్, శాలరీ అవీ ఎంటర్ చేసి వుంటాయి! చెక్ చేయండి, తర్వాత మీ అభిప్రాయం రాయండి సామాన్యంగా గ్రాంట్ చేస్తారు. అఫ్ కోర్స్ మీ నిర్ణయం ఫైనల్ కాదు. కేవలం ఫైల్ ని ఫార్వర్డుచేయటం అంతే!"
    నీలవేణి మేష్టారయితే బావుండేదనుకున్నాడు శ్రీకర్.
    ఫైలు తీసుకొనివెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు. ఒక్కసారిగా బ్రాంచి ఆఫీసు గుమాస్తా ఉద్యోగం, లోన్ అప్లికేషన్ ఫాం అన్ని చదివేశాడు. బోయ్ ని పిలిచాడు ఫైల్ తెమ్మన్నాడు, అప్లికేషన్ చూడగానే ఎలాగయినా లోన్ కి రికమండ్ చేయాలనుకున్నాడు పాపం! భార్య జబ్బుతో వుందట మరి డబ్బు అవసరం కదా! ప్రయివేట్ కంపెనీలో పనిచేసేవారికి అప్పెవరిస్తారు. కంపెనీ ఇవ్వకపోతే అనుకున్నాడు. 
    అంతలో రికార్డు వచ్చింది. శ్రద్ధగా చదివాడు చదువుతూ వుంటే క్షణక్షణానికి అభిప్రాయం మారింది. ఇతనొట్టి అప్పుల్రావులాగున్నాడే ఇంత అప్పుపెట్టుకొని మళ్ళీ లోన్ కి అప్లయ్ చేశాడేమిటి? జీతం ఎంత? ఫార్టిపర్సెంట్ కటింగ్సా? మళ్ళీలోనా? మైగాడ్! నో! నో! అనుకున్నాడు.
    ఆ ఫైల్ చేతపట్టుకొని తిరిగి నేలవేణి వద్దకి వెళ్ళాడు.
    నుదుటిమీద వాలుతున్న ముంగురుల్ని సుతారంగా సవరించుకొని తీయగానవ్వి "ఎస్" అంది. అది చూడగానే అంతా ఆడవాళ్ళనే ఎపాయింట్ చేస్తే ఆఫీసులో పనిట్రీమ్ గా వుంటుందేమో అనుకున్నాడు.
    "ఇతని లోన్ రిజెక్టు చేద్దాం?"

 Previous Page Next Page