"ఏమండోయ్ చూడగా చూడగా మీ వరస నాకేం బాగుండలేదు. ఆపదలో వున్న అబల పోనీలే సాయం చేద్దాం అని దయ తల్చి నా ఆమోదం తెలియజేస్తే నన్ను గోతిలోకి దింపేటట్లు వున్నారే! ప్రేమా దోమా అన్నారంటే నాకు చలిజ్వరం వచ్చినట్లు వుంటుంది"
"మీకు ఉత్త చలి జ్వరంతోనే ఆగింది. నాకు ప్రేమ అన్న రెండు అక్షరాల మాట వింటే చాలు డబుల్ టైఫాయిడ్ వచ్చినట్లు వుంటుంది. నా ముఖం చూడండి. మోసగత్తెగా కనబడుతున్నానా!"
చంద్ర అవంతి ముఖంలోకి తీక్షణంగా పరిశీలిస్తూ చూశాడు.
రెండు జడలు, విశాలమైన నుదురు, ఆ నుదుటిమీద ఎర్రగా మెరిసిపోతూ అతికించిన బొట్టుబిళ్ళ. విశాల నేత్రాలలోంచి వెలువడుతున్న అమాయకమైన చూపులు. డొంకతిరుగుడు వ్యవహారం కాని అందంగా బారుగా వున్న ముక్కు. మూతి బిగింపులో బలవంతాన నొక్కిపట్టిన చిరునవ్వు. ఆ నుంచున్న తీరులో అణుకువ. చీర జాకెట్టు. చేతికి రెండే రెండు గాజులు మరో చేతికి వాచీ. మెడలో గొలుసు. సింపుల్ గా వుంది.
చంద్ర చూడగా అవంతిలో అమాయకురాలైన అబల తప్ప మోసగత్తె కానరాలేదు.
"నువ్వు మోసగత్తెవు కావు" చంద్ర అన్నాడు.
అవంతి ఆనందంగా నెమ్మదిగా నవ్వింది.
"అవంతీ! నీకు నేను సాయం చేయటానికి నిశ్చయించుకున్నాను. కాని ప్రేమికుల్లాగా అన్నావే అది నాకు అంతగా నచ్చలేదు."
"నిజమే భాయి సాహెబ్! నాకు మాత్రం నచ్చిందా, గత్యంతరం లేక...."
అవంతి మాటలకు అడ్డు తగిలి చంద్ర మధ్యలో అన్నాడు "నన్ను.... నన్ను భాయి సాహెబ్, అన్నావా ?"
"హో భాయి సాహెబ్! ఈ పార్కులో వున్న పచ్చని చెట్ల సాక్షిగా మాట యిస్తున్నాను. మనసా వాచా నిన్ను ఈ నిముషం నుంచి నా సోదరుడిగా తలుస్తాను, చాలా. యింకా మాట యివ్వనా!"
"చాలు" చంద్ర ముఖం ఆనందంతో వెలిగిపోయింది.
"బైట వాళ్ళకి అనుమానం రాకుండా వుండటానికే మనం ప్రేమికులుగా నటించాలి అంతే. నీవూ నేను చెట్టా పట్టా లేసుకుని పార్కులోంచి బైటదాకా నడుస్తాము. నీవు జోక్స్ చెపుతుంటావు...."
"ఇప్పటి కిప్పుడు నాకేం జోక్స్ వస్తాయి?"
"జోక్స్ రానక్కరలేదు. అసలు జోకులే అక్కరలేదు. నాకు వినిపించేటంత నేమ్మద్గా ఏదో ఒకటి మాట్లాడుతూ వుండు. రేఖ యాక్షన్ చాలా గొప్పగా వుంటుంది. వంకాయ కూర కమ్మగా వుంటుంది. బాదం పాలు రుచిగా వుంటాయి. ఇందిరా ప్రియదర్శినికి మించిన గొప్ప నారీమణి వేరొకరు లేరు. ఇలలో ఇహ పై పుట్టబోరు. ఇలా నీ యిష్టం ఏది మాట్లాడినా సరే నెమ్మదిగా మాట్లాడితే సరి నీవు మాట్లాడేది జోక్ అయినట్లు నేను నవ్వుతుంటాను. నేను నాటకాల అమ్మాయిని నీవు జోకులు వేయకపోయినా పడిపడి నవ్వుతున్నట్లు నటించగలను. మన్ని చూసినవాళ్ళు మనని ప్రేమికులనుకుంటే చాలు."
"ప్రేమికులంటే యింతేనా! ఇంకా ప్రేమించాలేమో. విరహ గీతాలు వగైరా వుంటాయని భయపడ్డాను."
అవంతి నవ్వీ నవ్వనట్లు నవ్వింది. "సాయంత్రం పూట పార్కులోకి ప్రేమికులు వస్తారు. అందుకే ఈ నాటకం ఎన్నుకున్నాను. పార్కులోంచి బైటికి వెళ్ళంగానే మనం రిక్షా ఎక్కుదాం. నీవు మధ్యలో దిగి పోదువుగాని అంతే."
"సరే యింక వెళదామా!"
"ఊ"
అవంతి భుజంమీద చంద్ర చేయి వేశాడు. అవంతి చంద్ర భుజంమీద తల ఆనించింది. అలాగే అంటి పెట్టుకుని నడుస్తూ ఇరువురూ పార్క్ లోంచి బైటికి వచ్చారు.
ఏదో ఒకటి మాట్లాడవచ్చని చంద్రతో చెప్పటం వల్ల చంద్ర నోటి కొచ్చింది వాగుతున్నాడు. అవంతి నవ్వుతున్నది అల్లరిగా.
"ఈ రోజు ఉదయం నేను మామూలుగానే లేచాడు" చంద్ర అన్నాడు.
"భలే.... భలే...." అంటూ అవంతి నవ్వింది. "మామూలుగానే పళ్ళు తోముకున్నాను."
"అబ్బ ఏం జోకులు బాబు! పొట్ట పగిలిపోతున్నది."
ఇలా యిరువురూ జోక్స్ వేసుకుంటున్నట్లు మాట్లాడుకుంటూ పార్క్ లోంచి పూర్తిగా బైటికి వచ్చి రోడ్డు ఎక్కారు. అటూ యిటూ చూడవద్దని అలా చూస్తే ఆ రౌడీలకి అనుమానం వస్తుందని ముందే అవంతి చెప్పటం వల్ల చంద్ర అలాంటి పిచ్చి పని చేయలేదు.
రోడ్డుమీద ఖాళీ రిక్షాలు తిరగటం లేదు. రోడ్డుకి అవతలి వైపు కొంత దూరాన ఆటోలు ఆగి వున్నాయి.
"నీవు యిక్కడే వుండు. ఆటో వస్తుందేమో నేను మాట్లాడివస్తాను" అవంతి అంది.
"నేనూ వస్తాను పద" చంద్ర అన్నాడు.
"వాళ్ళు మధ్య మధ్య యిటే చూస్తున్నారు. వాళ్ళకి అనుమానం రాకుండా వుండాలంటే నేను ధైర్యంగా నిన్ను వదిలి ఆటో దాకా వెళ్ళాలి. డోంట్ వర్రీ ఆటో మాట్లాడి వస్తాను" అని అవంతి చకచక రోడ్డు దాటింది.
అవంతి ఆటో అతనితో మాట్లాడటం. అవంతి ఆటో ఎక్కటం ఆటో అటునుంచి అటే పరుగు తీయటం. ఆపై కళ్ళముందు నుంచి మాయం కావటం క్షణాలలో జరిగిపోయింది.
"మోసం దగా వంచన" చంద్ర అరుద్దామనుకున్నాడు. రౌడీల మాట గుర్తుకు రావటంతో నోరు నొక్కుకున్నాడు. నెమ్మదిగా తల తిప్పి అక్కడక్కడ వున్న మనుషులని దొంగ చూపులతో చూశాడు.
మామూలుగా వున్న ఓ నలుగురు ముగ్గురు రౌడీలు లాంటివాళ్ళు ఒక బిచ్చగాడు. బీడీలు తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్న ఇద్దరు పోలీసులు చంద్ర కళ్ళకి కానవచ్చారు. అంతేకాదు వాళ్ళంతా చంద్రని గుచ్చి చూస్తున్నట్టు అనిపించింది. చంద్రకి అరికాళ్ళలోంచి వణుకు బైలుదేరి నరనరాన వ్యాపించి నట్లయింది.