Previous Page Next Page 
రివర్స్ గేర్ పేజి 5

    "అబ్జెక్షన్ సస్ టెయిన్డ్. యుకెన్ ప్రొసీడ్ మిస్ మాయాదేవి...." అని మనోహర్ వేపు తిరిగి "ఆమె చేసింది తప్పా, ఒప్పా అనేది తేల్చటానికే ఈ కోర్టు ఇక్కడ సమావేశమయింది. జరిగిందానికి ఏ పేరు పెడదామనే మీమాంసతో ఇక్కడ వాదన ప్రారంభం కాలేదు...."
   
    "థాంక్యూ యువరానర్....ఈ ప్రపంచంలో అనుకున్నదాన్ని సాధించే విషయంలో మగవాడికున్న హక్కుల పరిధి ఎంతో విస్తృతమైంది. స్త్రీ జాతి పరిధిని ఆవగింజ మందంలోకి కుదించటంతో మీకు వివక్షత కనిపించటంలేదా....?" ఆమె మాటల్లో తీవ్రమైన సాంద్రతతో కూడుకున్న భావోద్వేగం విస్పుటమవుతుంది.
   
    జడ్జీలు ఇద్దరూ ఏం మాట్లాడలేదు.
   
    "I do not like Men...when
    they are defensive....
    they make false promises....   
    they speak for effect.....   
    they smoke and drink majorly   
    they are parasities...   
    they are egotists....
   
    అయినా నేను మనోహర్ ని ప్రేమించాను. ఎందుకు ప్రేమించాను....?"
   
    జస్టిస్ మెహతాకు ఒక్కక్షణం దిగ్బ్రాంతిగా అనిపించింది. తన ముప్పై ఏళ్ళ సర్వీసులో అలా వాదించిన యువతిని, ఎప్పుడూ చూడలేదు. ఒక యువతి నేటి పురుషాధిక్య సమాజంలో ఎంతో ఫ్రాంక్ గా, మరెంతో నిర్భీతితో, ఇంకెంతో ధైర్యంతో మాట్లాడటం మాయాదేవిలోనే చూస్తున్నారాయన.
   
    "పురుషుడ్ని నేను ప్రేమించను" అని నువ్వు చెప్పటం సృష్టి ధర్మానికి విరుద్దం, నువ్వు కోరుకున్న లక్షణాలు వున్న మగవాడు ఈ ప్రపంచంలో ఎక్కడో ఒకచోట వుండకపోడు కదా......?
   
    అలా వున్న మనోహర్ నే నువ్విప్పుడు ప్రేమించానంటున్నావ్....అతనిలో నీకు నచ్చిన లక్షణాలు ఏమిటి....? జస్టిస్ మెహతా ముఖంలో ప్రస్తుతం సీరియస్ నెస్ లేదు. ఆసక్తి, ఆతృత మాత్రమే తొంగిచూస్తున్నాయి.
   
    "Who are not afraid of expressing their vulner able side...
    Who are subtle and sharp at the same time....
    Who love animals and nature.....   
    Who are physically fit and do not abuse them selves....
    Who have a way with children.....
   
    ఇవి నాకు నచ్చిన లక్షణాలు, ఈ లక్షణాలు ఈ రోజుల్లో ఏ మగాడికైనా వున్నాయా....? పోనీ మీకున్నాయా....?" సూటిగా మాయాదేవి అడిగేసరికి జస్టిస్ మెహతా ఒక్కక్షణం ఉలిక్కిపడ్డాడు.
   
    పక్కనే వున్న జస్టిస్ ప్రమీలారాణి సన్నటి చిరునవ్వుతో జస్టిస్ మెహతావేపు చూశారు.
   
    "భాషమీద తనకున్న ఆధిపత్యంతో, మిస్ మాయాదేవి వాదనని తప్పుదారి పట్టిస్తుందేమోనని నాకు అనుమానంగా వుంది" అని అన్నాడు మనోహర్ ఉక్రోషంగా.
   
    అందుకు జస్టిస్ ప్రమీలారాణి చిన్నగా నవ్వారు.
   
    "గతంలో నిన్నెవరైనా.....ప్రేమించారా...." ఈసారి జస్టిస్  ప్రమీలారాణి అడిగారు.
   
    "బోలెడుమంది....ఐమీన్ కౌంట్ లెస్...."
   
    "ఎందుకు అంతమంది నిన్ను ప్రేమించారంటావ్......?"
   
    "నా అందం చూసికావచ్చు.....అంగసౌష్టవం చూసి కావచ్చు.....కనుముక్కు తీరు చూసి కావచ్చు....మాట్లాడే విధానం చూసి కావచ్చు.....నా కళ్ళలో పలికే భావాలను చూసి కావచ్చు....."
   
    "నువ్వు గొప్ప అందగత్తెనని అనుకుంటున్నావా......?"
   
    "అనుకోవటమేమిటి అది నిజం.....నా అందం మీకు కనిపించటం లేదా....? ఖచ్చితంగా నేను చాలా గొప్ప అందగత్తేని. అందులో నాకే మాత్రం సందేహంలేదు. ఇందులో మరెవరికైనా సందేహం వుండాల్సిన అవసరం కూడా లేదు. అయితే నేను ఎప్పుడూ నా అందంపట్ల గర్వంగా ఫీలవ్వలేదు. నా మనసులో పలికే భావాలపట్లే నేను ఎప్పుడూ గర్వపడుతుంటాను. వ్యక్తిత్వం అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఓ ప్రత్యేకమైన వ్యక్తిత్వం వుంది. నా వ్యక్తిత్వం మీద నాకు పరిపూర్ణమైన గౌరవాభిమానాలు వున్నాయి. నా అభిరుచుల్ని, ఇష్టాఇష్టాల్ని, అలవాట్లని చంపుకొని సగటు భారత స్త్రీలాగా నేను బతకలేను. అందుకే మనోహర్ ని స్వంతం చేసుకోవాలని ప్రయత్నించాను."
   
    "మనోహర్ ని వదిలేస్తే నీకు బాగా నచ్చిన పురుషులెవ్వరు....?"
   
    "జవహర్ లాల్ నెహ్రూ.....వాజ్ పేయి....ఎన్.టి. రామారావు....జాకీషరాఫ్.....అంజాద్ ఆలీఖాన్..... జార్జియో అర్కానీ.....అల్ ఫసీకో పురుషత్వం ఉట్టిపడే మగధీరులు వీళ్ళు. ఇంకా చెప్పాలంటే లార్డ్ శివ అంటే నాకు చాలా ఇష్టం. శివుడు చిత్రపటాన్ని మొట్టమొదటసారిగా ప్రంపంచంలో ఎవరు చిత్రించారో నాకయితే తెలియదుగానీ, అతనికి నేను చేతులెత్తి నమస్కరిస్తాను."
   
    "ఇంత ఖచ్చితమైన అభిప్రాయాలు వున్న యువతిని నిన్నే మొదటిసారిగా నేను చూస్తున్నాను" మెచ్చుకోలుగా అన్నారు జస్టిస్ ప్రమీలా రాణి.
   
    "ఇతరులను ఆదుకోవచ్చు....అభిమానించవచ్చు. వారికి చేతనైన సహాయం చేయవచ్చు. కానీ ఇతరుల మెప్పుకోసం, సమాజం ఇచ్చే ఐ.ఎస్.ఐ. ముద్రకోసం క్షణం క్షణం మనం చస్తూ ఆత్మవంచన ముసుగులో ఇతరులకోసం బతకటం కంటే హీనమయినది. ఈ ప్రపంచంలో మరొకటి వుండదు. స్వేచ్చకు అర్ధం నచ్చని కప్పుకింద నలిగిపోతూ, సంసారంచేస్తూ,  గడప దాటే ముందు నాకీ సమస్యలు లేవనే అబద్దాన్ని కళ్ళద్వారా అభినయిస్తూ, బయటకొచ్చే స్త్రీలను చూస్తే నాకు జాలి. జీవితంలో ఎప్పుడో ఒకసారి నటించటంలో తప్పు లేదేమో కానీ జీవితాన్ని నటనగా మార్చుకోవటం కంటే హీనమైనది మరొకటి వుండదు" చెప్పటం ఒక్కక్షణం ఆపింది మాయాదేవి.

 Previous Page Next Page