"నా కోరికకి అనర్హత వుందని మీరు భావిస్తున్నారా....?" ధైర్యంగానే అడిగింది మాయాదేవి.
కొద్దిక్షణాలు అక్కడ నిశ్శబ్దం అలుముకుంది.
టేప్ రికార్డర్ అక్కడ వినిపించే అతి చిన్న శబ్దాన్ని సైతం రికార్డు చేసుకుంటూ పోతోంది.
"మిస్టర్ మనోహర్....మీకు నాదో చిన్నసలహా.....ఈకేసును విత్ డ్రా చేసుకుంటే అందరికీ బావుంటుందేమో ఆలోచించకూడదూ...." అనినయమ్గా చెప్పారు మహిళా న్యాయమూర్తి జస్టిస్ ప్రమీలారాణి.
"సారీ యువరానర్....మీరే ఉద్దేశ్యంతో ఈ సలహా ఇచ్చారో నేను అర్ధం చేసుకోగలను. తప్పనేది స్త్రీ చేసినా, పురుషుడు చేసినా తప్పు తప్పే అవుతుంది కానీ ఒప్పుకాదు. ఈ కేసుని కొనసాగించటం మూలంగా ఎదురయ్యే పర్యవసానాన్ని ఎదుర్కోటానికి నేను సిద్దంగానే వున్నాను...." స్థిరంగా అన్నాడు మనోహర్.
"యుగధర్మం మరో రీతిలో ప్రారంభం కాబోతుందనటానికి ఈ ఈ కేసే ఒక ఉదాహరణ. ఇక అసలు విషయానికొస్తాను. మిస్ మాయాదేవి నువ్వు అతన్ని ప్రేమించావా.....?" అడిగాడు జస్టిస్ ప్రమీలారాణి.
"ప్రేమించాను...." ఎలాంటి జంకు లేకుండా అంది మిస్ మాయాదేవి.
"నీది ఆకర్షణ అని నేనంటాను. నువ్వేమంటావ్.....?"
"సారీ.....ఆకర్షణకి, వ్యామోహానికి, ప్రేమకి, ఆరాధనకి తేడా తెలియని వయసుకాదు నాది. నాకిపుడు ఇరవై నాలుగు సంవత్సరాలు. ఎవ్వరడిగినా, ఎక్కడడిగినా, ఎప్పుడడిగినా నాదొక్కటే సమాధానం. నేను మనోహర్ని గాఢంగా ప్రేమించాను."
"అతను నిను ప్రేమించాడా......?" జస్టిస్ మెహతా ప్రశ్నించారు.
"ప్రేమించాడు...."
"అని నువ్వే అనేసుకున్నావా.....? లేక అతని చర్యలనిబట్టి అర్ధం చేసుకున్నావా....?"
"అది నా నమ్మకం...."
"ఇక్కడ నమ్మకాలకంటే ఆదారాలకే విలువ ఎక్కువ వుంటుంది. అది నీకు బాగా తెలుసనుకుంటాను...."
"మనుష్యులు కోర్టుకొస్తే ఆ మనుష్యులే న్యాయం గురించి మిమ్మల్ని అడిగితే మీరన్నది కరెక్ట్ కావచ్చు...."
"మరి....?!"
"ఇక్కడ మనసులు కోర్టుకొచ్చాయి. మనుష్యులు కాదు....దయచేసి ఇది దృష్టిలో పెట్టుకుంటే న్యాయం జరుగుతుంది."
"న్యాయం మీకు జరగాలో, అతనికి జరగాలో వాదనల చివర మేము నిర్ణయిస్తాం. ప్రస్తుతానికి అడిగిందానికి సూటిగా సమాధానం చెబితే చాలు...." కొంచెం గట్టిగా అన్నాడు జస్టిస్ మెహతా.
"సారీ యువరానర్! అడగండి...."
"ప్రాణం వున్న జీవిని సొంతం చేసుకోవాలనుకోవటంలో తప్పు లేకపోవచ్చు. కానీ అది చట్టబద్దమైనదా, కాదా అని ముందు ఆలోచించాలి. ప్రాణమున్న జీవే అయినా ఒక పులిని తెచ్చి నీ యింట్లో పెంచుకోవడం వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం తప్పవుతుంది. అవునా?"
జస్టిస్ మెహతా కేసును ఎటువైపు లాక్కెళుతున్నారో, ఏ మలుపు తిప్పుతున్నారో, వెంటనే మాయాదేవికి అర్ధంకాలేదు.
కానప్పటికే లాయర్ ఆదిత్య మొఖంలో సీరియస్ నెస్ చోటు చేసుకుంది. తనను వాదించమని, తనకు వకాల్తా యిచ్చి, ఇప్పుడు స్ట్రెయిట్ గా మాయాదేవి తన తరపున తానే వాదించుకోవటం ఆదిత్యకెందుకో నచ్చలేదు. అదే పద్దతిలో జస్టిస్ మెహతాకి, మాయాదేవికి వాదన జరిగితే మాయాదేవి ఓటమివైపు మొగ్గుచూపక తప్పదు. ఆ నిర్ణయానికొస్తూనే లాయర్ ఆదిత్య మాయాదేవి చెవిలో చిన్నగా ఏదో చెప్పాడు. అయినా ఆమె వినేస్థితిలో లేదు.
"వెనుకటి రోజుల్లో హత్యలు, దొంగతనాలు తక్కువగా జరిగేవి. అప్పుడు మనిషి తననితాను రక్షించుకోవడానికి, తన ఇంటి కాపలాకి ఒక డాబర్ మేన్ డాగ్ ని తెచ్చి కాపలాగా పెట్టుకుంటే సరిపోయేది. మరి ఇప్పుడు....? పట్టపగలు నగరం నడిబొడ్డులో దొంగతనాలు, దోపిడీలు జరుగుతున్నా, మనిషి తనను తన ఆస్థిని కాపాడుకోలేని నిస్సహాయ స్థితిలో కూరుకుపోయాడు. ఈ పరిస్థితుల్లో ఒక మనిషి పులిని తనింటికి రక్షణగా పెట్టుకుంటే తప్పేమిటి.....?"
"చాల విచిత్రమైన వాదన....."
"ఆ పులి కట్టు తెంచుకుని బయటపడితే మిగతా ఇళ్లలో నివశించే మనుషుల మాటేమిటి....?"
"హింసలో పులికంటే నేటి రాజకీయ నాయకుడు వందరెట్లు ఎక్కువ స్థాయిలో వున్నాడు. సామాన్య మానవులకు అందవలసిన ఫలాలని కొద్దిమంది రాజకీయ నాయకులు దిగమింగేస్తుంటే అది తప్పు కిందకు రాదా? దాన్ని హింసగా గుర్తించరా.....?"
"ఇక్కడ మనం వ్యవస్థ ప్రక్షాళన గురించి మాట్లాడుకోవటంలేదు. అదిప్పుడు మనకు ప్రధానాంశం కాదు. ప్లీజ్ కమ్ టు ద పాయింట్. నీకిష్టం వచ్చినదాన్ని నీ ఇష్టం వచ్చిన రీతిలో సొంతం చేసుకోవడం తప్పా.....కాదా....?"
"ఇదే ప్రశ్న ఒక మగవాడ్ని మీరు అడగగలరా?" జస్టిస్ మెహతా ఒక్క క్షణం మాట్లాడలేదు.
"పురుషాధిక్యత అంగుళం విస్తరించుకుపోయిన ఈ సమాజంలో పురుషుడు ఏది కోరుకున్న అది తప్పవటంలేదు. మొదట్లో అది తప్పుగా అనిపించినా, ఈ సమాజం మగవాడికి కల్పించిన అవకాశాలతో, అది తర్వాతయినా ఒప్పుగానే మారుతోంది. అదే స్త్రీ విషయంలో ఎందుకు జరగటం లేదు.....?" నిర్భీతిగా అడిగింది మాయాదేవి.
"తిరిగి నువ్వు వివక్షత వైపు నీ దృష్టిని సారిస్తున్నావు...."
"సారీ యువరానర్.....ఇప్పుడిక్కడికి వచ్చిన కేసు ఒక స్త్రీ - ఒక పురుషుడి మధ్య జరిగిన ఒక అనుభవం కారణంగానే కదా.....?"
"ఐ అబ్జెక్ట్ యువరానర్....మా ఇద్దరిమధ్య జరిగినదానికి అనుభవం అని పేరు పెడితే నేను ఒప్పుకోను. అది కేవలం ఒక దురదృష్టకరమైన సంఘటన మాత్రమే...." ఒకింత ఆగ్రహంతో అన్నాడు మనోహర్.