" నీ బొంద? నీకు మాట్లాడటం రాదు, చావదు" అని అబ్బులు పైకే కసురుకుని వ్యాకర్ణని పక్కకిలాగి బామ్మగారి ముందు నుంచున్నాడు వినయంగా.
" బామ్మగారు!" అన్నాడు అబ్బులు అతిఅమాయకంగా.
" ఏంటి నాయనా, నిన్నూ క్షమించాలా?" అంది బామ్మగారు.
కిసుక్కున నవ్వాడు వ్యాకర్ణ.
అబ్బులు గతుక్కుమని, ఆపై కళ్ళజోడుతీసి నిప్పులు కక్కే కళ్ళతో వ్యాకర్ణని చూసి మళ్ళీ కళ్ళజోడు తగిలించుకుని బామ్మాగారివైపు తిరిగి వినయమూ చిరునవ్వూ తనకే తగునన్నట్లు ముఖం పెట్టి - " బామ్మగారూ! నా ముఖం యిప్పుడెల వుంది!" అన్నాడు సీరియస్గా.
" వాడిపోయింది నాయనా!" అంది బామ్మగారు.
" కరెక్ట్. బామ్మగారు కాబట్టి అదీ పెద్దావిడ అన్నీ తెలిసిన ఆవిడ కాబట్టి వెంటనే నాముఖారవిందం ఎలావుందో కనిపెట్టగలిగింది" అని వ్యాకర్ణతో-
ఆపై బామ్మగారితో , " బామ్మాగారూ! నా ముఖం వాడిపోయిందని పెద్దవారు మిరొప్పుకున్నారు.
మిరొప్పుకున్నారంటే అందులో అణుమాత్రం అబద్ధం లేనట్లే ( కొయ్ కొయ్) నా ముఖం వాడిపోయింది. ఇహ కమిలిపోవటం ఆపై హ్హో... హ్హో..." అని.
కల్లజోగు తీసి జేబులోంచి కర్చీఫ్ తీసుకుని కళ్ళుతుడుచుకుని కర్చీఫ్ జేబులో పెట్టుకొని కళ్ళకి జోడు పెట్టుకుని దీనంగా కళ్ళజోడులోంచి బామ్మగారిని చూస్తూ ఉండిపోయాడు.
" వీడి ముఖం. విడి ప్లాను ఏడ్చినట్లే వుంది. వీడు నాటకాలలో తెరవెనుక పాత్రకి కూడా పనికిరాదు. నా ప్రతాపం చూపిస్తాను, అనుకుని వ్యాకర్ణ ఓ అడుగు ముందు కేశాడు.
సరిగ్గా అప్పుడే బామ్మగారు అబ్బులతో " ఏడ్వకు నాయనా!" అంది"
" నేనెక్కడేడ్చానూ! ఛా ఛా ..." అన్నాడు అబ్బులు.
" కళ్ళుతుడుచుకున్నావుగా!" అంది బామ్మాగారు.
" నలక పడ్డది" అనేశాడు అబ్బులు.
" కళ్ళజోడు వుండంగానే?" ఆశ్చర్యపోయింది బామ్మగారు.
" మికు తెలీదు బామ్మగారూ! కళ్ళజోడు వుండగానే నలకలు పడటమే కాదు, కామెర్లు, కళ్ళకలక కూడా రావచ్చు,"
" నిజమే నాయనా! నాకూ కళ్ళజోడుందిగా. ఓసారి ఏమయిందనుకున్నావు? ఓ చీమ కళ్ళజోడు పక్కనించి పాకి కంట్లో పడింది.
అప్పుడు కళ్ళజోడున్నా బాధలు తప్పవని ఒప్పుకుంటూ " తన కళ్ళలోపడ్డ చీమ కధ నిముషాలు చెప్పింది బామ్మగారు.
మిత్రులు ఓపిగ్గానుంచుని కధ విన్నారు.
కధ పూర్తిచేసి బామ్మగారు నెత్తిన గుడ్డ సవరించుకుని యిలా అంది-
" మి కష్టమేమిటో నాతో చెప్పనేలేదు. చెప్పేలోపలే కళ్ళు - కళ్ళజోళ్ళు - కష్టనష్టాలు చెప్పుకున్నాము. ఎంతటి వారి కయినా తప్పవు నాయనా! మా తల్లితండ్రులు ( ఎంతమంది తండ్రులు) నాకు ద్రౌపతి అని పేరు పెట్టారు.
ఆయన సాక్షాత్తూ ధర్మరాజే అనుకో . ( చూళ్ళేదుగా! అనుకుంటాం) నన్ను దేవతలా చూసుకున్నారు. కాలు కింద పెట్టనిచ్చేవారుకారు. ( నెత్తినిపెట్టుకు తిరిగేవాడా?) ఏ కష్టం ఎరక్కుండ ఏడేళ్ళు కాపురం చేశాను.
ఆ తర్వాత ఓ రోజు నన్నన్యాయం చేసి వారిదోవ వారు చూసుకున్నారు. (లేచిపోయాడా ఏం ఖర్మ?)
బామ్మగారు తన కధ చెపుతుంటే అర్దమయిందా? అన్నట్టు చూశాడు వ్యాకర్ణ.