Previous Page Next Page 
రాగవాహిని పేజి 5

 

    "నేనా? నీ కార్లోనా?" అనుమానంగా అడిగింది.

    "అవును"

    "ఉహూఁ నేను రాను. నాకు యీ కార్లవాళ్ళంటే అసహ్యం"

    "ఏమండీ ఈ కారు నాదికాదు. నేనీ కారు డ్రైవర్ని మాత్రమే. నేనూ నీలాటి బీదవాడినే!"

    "నమ్మలేనట్టు"గా చూసింది.

    "నిజం-మీ మీదొట్టు ఈ కారు నాదికాదు. నేను డ్రైవర్ని మాత్రమే నాకూ యీ కారున్నవాళ్ళంటే మంట!"

    ఆశ్చర్యంగా చూసింది.

    "బ్రతుకుతెరువు కోసం ఉద్యోగం చేస్తున్నాను. అంతే"

    "అందుకే ఆ కారువాడి తల పగలగొట్టేను."

    "మంచిపని చేసేరు. చావనీ వెధవ."

    అతను కసిగా అన్నమాటకి తృప్తిగా చూసింది.

    "పదండి వెళదాం."

    డోర్ తీశాడు.

    తటపటాయిస్తూ సందేహంగా కూర్చుంది.

    అతను తిరిగొచ్చి డోర్ వేసి, తిరిగివెళ్ళి తన సీట్లో కూర్చుని కారు స్టార్టు చేశాడు.

    ఏదో అవ్యక్తమైన భయంతో, ధైర్యంతో అలాగే కూర్చుండి పోయింది సత్య.

    కొంతదూరం వెళ్ళాక రోడ్ మీద వున్న కారు, ఆ ప్రక్కనే పడివున్న వ్యక్తి కనిపించారు.

    కారుదాటి కొంచెం వెళ్ళగానే ఆపుచేసి అతను దిగి ఆ వ్యక్తి వద్దకి వెళ్ళి చూసేడు. నిట్టూర్చేడు.

    తిరిగి వచ్చి కూర్చుని కారు స్టార్టుచేశాడు.

    "ఏమైంది?" ఆతురతతో ప్రశ్నించింది సత్య.

    "చచ్చాడు" తాపీగా బదులిచ్చేడు.

    "అమ్మయ్యో!" భయంగా అంది సత్య.

    ఒక్క క్షణం తర్వాత ముఖం అరచేతుల్లో దాచుకుని వెక్కివెక్కి ఏడవసాగింది.

    సతీష్ మాత్రం కారుని నెమ్మదిగా పోనిస్తున్నాడు.

    అంతకంతకీ ఆమె ఏడుపు ఉధృతం కాసాగింది.

    మరికొద్దిదూరం వెళ్ళాక కారుని ఆపేడు.

    "చూడండి!"

    ".... .... ...."

    "మీ పేరు."

    "సత్య...."

    "అలా ఏడవకండి. ఏడ్చేవాళ్ళంటే నాకసహ్యం. ఏం చిత్రంగా వుందా? అవును, మనమీ భూమ్మీదికి వచ్చింది హాయిగా సుఖంగా బ్రతకటానికి కానీ ఏడ్వటానికి కాదు. కష్టాలొచ్చాయనుకోండి. ధైర్యంగా ఎదుర్కోవాలి. ఆపదలొచ్చాయి-ఎదురు తిరగాలి."

    అతనాగేడు.

    ఏడ్పుమాని, చిన్నపిల్లలా కళ్ళప్పగించి చూస్తున్న ఆమెనిచూస్తే అతనికి ముచ్చటేసింది.

    "మీరు నాకు నచ్చేరు. మీ హీరోయినిజమ్ నచ్చింది. మీ మీదికి దండెత్తి వచ్చిన దుర్మార్గుడ్ని శీలం కాపాడుకునేందుకు చంపేరు. తప్పేంవుంది?"

    "తప్పుకాదా?" అది.... అది....హత్య...."

    పకపక నవ్వేడు.

    ఆమె ముఖంలోకి నిశితంగా చూసేడు.

    "పూర్ గర్ల్.... నువ్వుచేసింది తప్పుకాదు. హత్య అంతకంటే కాదు. రావణుడు సీతని చెరపట్టేడు రాముడు అతడ్ని చంపేడు. చూస్తే మీరు చదువుకున్నట్టున్నారు. ఎక్కడయినా రాముడు హంతకుడినీ, హత్య చేసేడనీ చదివేరా? నో...."

    ".... .... ...."

    "ద్రౌపదిని కామించేడు. కీచకుడు, మైనం ముద్దలా నలగ్గొట్టేడు భీముడు. మరి భీముడు హంతకుడన్నారా ఎవరైనా? భార్య శీలాన్ని కాపాడిన వీరుడున్నారు."

    "అలాగే దుర్యోధన, దుశ్శాసనుల్నీ భీముడే చంపాడు. దానిక్కారణమూ అంతే! ఒకడు వలువలొలిచేందుకు ప్రయత్నం చేశాడు. మరొకడు తొడకొట్టి పిలిచేడు, శిక్ష అనుభవించేరు. మరి భీముడు హత్యలు చేశారన్నారా ఎవరైనా?"

    ".... .... ...."

    ధన మాన ప్రాణాలు కాపాడుకోవటానికీ ఎదిరిస్తే- అందులో తప్పులేదు. మీరు సరయిన పనే చేశారు."

    "కానీ నన్ను బలవంతం చేయబోయాడనటానికి ఆధారమేముంది?"

    "ఆ మాటకొస్తే అతన్ని మీరే చంపారనేందుకు సాక్ష్యాధారమేమిటి?" ఎదురుప్రశ్న వేశాడు సతీష్.

    జవాబివ్వలేకపోయింది సత్య.

    "కాబట్టి-గాభరా పడకండి. ఏడవకండి. ధైర్యంగా వుండండి"

    అంతలో కారు టౌన్ పరిసరాల్లోకి వచ్చింది.

    "మీరు ఎక్కడికి వెళ్ళాలి?"

    ".... .... ...."

    "ఎక్కడ దింపెయ్యను"

    "మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి. కానీ .... కానీ---"

    "చూడండి.... నేనోమాట చెప్పనా?"   

 Previous Page Next Page