అమ్మా!" అంటూ కేకేసి అలాగే వాలిపోయాడతను.
వగరుస్తూ ఒక్క క్షణంపాటు నిలబడిపోయింది సత్య. అతనివేపు చూసింది. అతనిలో చలనంలేదు.
వంగి ముఖంలోకి చూసింది.
కళ్ళు మూతలు పడ్డాయి.... తలనుంచి రక్తం కారుతోంది.
భయపడింది సత్య.
;'ఇక కొద్దిసేపట్లో యితను చనిపోతాడు" అనుకోగానే ఆమె గుండె దడదడలాడింది.
అప్రయత్నంగా రోడ్డువెంట పిచ్చిదానిలాగా పరిగెత్తసాగింది? ఎక్కడికి, ఎందుకు అనే ఆలోచన లేకుండా వెళ్ళసాగింది. ఆయాసపడుతూ ఆలోచనా రహితంగా వేగంగా పరుగెత్తసాగింది.
ఆమె మనసు ఆలోచనా శూన్యమైపోయింది.
* * *
కారు నానుకొని నించుని ఎటోచూస్తున్నాడు సతీష్.
వేకువనే లేచి కార్లో బయలుదేరి వూరికి దూరంగా వచ్చి కాసేపు నడిచి ప్రకృతిని చూస్తూ గడపడం అతనికలవాటు. అతనో చిత్రమైన వ్యక్తి. ఎప్పుడూ చుట్టూ గలగలలాడుతూ మనుషులు ఉండే వాతావరణంలోవున్నా ఏకాంతంలో ఆనందాన్ని అనుభవించడం అలవాటు.
రయ్ న రైలింజనుల ఆతురతతో ఆందోళనతో భయంతో పరుగెత్తుతూ వస్తున్న సత్యకి కారునానుకొని నిలుచున్న సతీష్ కానీ కారుకానీ దృష్టిపధంలో ఆనలేదు. వేగంగా అలాగే పరిగెత్తుతోంది.
తన కారుదాటి- ఆ వేళప్పుడు-- అలా - పిచ్చిదానిలా పరిగెడుతున్న ఆమెను చూచి ఉలిక్కిపడ్డాడు సతీష్. అతనికి ఆమె పరుగులో వురుకులో ఏదో అసహజత కనిపించింది.
"ఏమండీ!" అప్రయత్నంగా పిలిచేడు.
"..... .... ...."
"ఏమండీ!" మళ్ళీ పిలిచేడు.
కారుదాటి దాదాపు పదిగజాలు పరిగెత్తిన సత్య ఆ పిలుపు విని హఠాత్తుగా కాళ్ళకు బ్రేకు పడినట్టుగా ఆగిపోయింది.
తనూ ఆమె దగ్గరగావచ్చి "ఎక్కడికండీ అలా పరిగెత్తుతున్నారు? ఏమైందీ" అని మృదువుగా అడిగేడు.
భయంతో, అలసటతో, ఆందోళనతో ఆమె నోటివెంట మాట రాలేదు.
"కాస్సేపు ఆగి, అలసట తీర్చుకుని చెప్పండి"
అతనివైపు నిశితంగా చూసింది.
తెల్ల నిక్కరు, కాలరున్న చేతులు తెల్లబనీను.... దాదాపు అయిదున్నరడుగుల ఎత్తు.... కసరత్ చేసిన శరీరంలా గట్టిపడి మెలికలు తిరిగిన కండరాలు.... దృఢమైన దేహం.... ఎవరో డ్రిల్లు మాస్టారలా వున్నాడు అనుకుంది.
"ఎవరండీ మీరు?"
"నేను.... నేను...." తడబడింది సత్య.
"మీరు మీరేలెండి? ఏ ఊరు? ఎక్కడికి వెడుతున్నారు? ఈ వేళప్పుడు పరిగెడుతున్నారేం?"
"మా ఊరు.... నేను టౌనుకి వెళుతున్నాను మా ఫ్రెండ్ ని చూట్టానికి"
"నడిచి వెళుతున్నారా?"
"ఉహూఁ కారుమీద వెళుతున్నాను" వెటకారంగా అంది.
"గుడ్ బాగానే దెప్పుతారు!" నవ్వేడు.
"కాకపోతే? పరిగెడుతున్నానా? నిన్నుచూసి అలా ప్రశ్నిస్తే ఏమనుకోవాలి?"
"అర్జంటుగా వెళుతున్నారా?"
"ఊఁ"
"పరిగెడుతున్నారెందుకు?"
".... .... ...."
"ఎవరికయినా ప్రమాదంగా వుందా? ఇంట్లో మగవాళ్ళెవరూ లేరా? డాక్టరు వద్దకా?"
ఆప్యాయంగా అడిగేడు.
"ఎవరికీ ప్రమాదంలేదు"
"మరి...."
".... .... ...."
హఠాత్తుగా ఏదో స్పురించినట్లయి "మీ వాళ్లెవరయినా ముందుగా వెళుతున్నారా? వాళ్ళని కలుసుకోవాలా?" అని అడిగేడు.
"ఆఁ" అని, మళ్ళీ "అహఁ" అంది.
అతనికేమీ అర్ధంకాలేదు.
"ఏమండీ మరేం భయపడకండి. నేను మీ మిత్రుడిననుకోండి. మీ ఇబ్బందేమిటో చెప్పండి. ఏం భయంలేదు. చేతనైతే సహాయంచేస్తాను. అక్కరలేదంటే వెళ్ళిపోతాను"
అతని ముఖంలోకి తీవ్రంగా చూసింది.
"దారిలో వస్తూవుంటే ఎవరో నీలాగే కారున్నవాడు నన్ను అడ్డగించి కారు తగిలించేడు. నేను క్రింద పడ్డాను. నా చేతిలోని నేయి, పాలు, పెరుగు నేలపాలయ్యాయి. కోపంగా తిట్టాను. అతను నన్ను బలత్కారం చేసేడు.... నేను కొట్టి పారిపోయొస్తున్నాను. అతని తలకు దెబ్బ తగిలింది. చావుబ్రతుకుల్లో ఉన్నాడు."
గబగబా చెప్పేసింది.
ఆమె పరిస్థితి అర్ధం చేసుకున్నాడు సతీష్.
"మరేం ఫర్వాలేదు. మీ దెబ్బలకు చావడు. ఒకవేళ చచ్చినా ఫరవాలేదు. అలాంటి కీచకులకు అలాంటి దుర్మరణమే వస్తుంది. ఏం భయపడకండి. పదండి నేనూ టౌనుకే. ఇలా ఎంతదూరం పరిగెడతారు. నా కారెక్కండి. మిమ్మల్ని మీ ఫ్రెండ్స్ ఇంట్లోనో, బంధువుల ఇంట్లోనో డ్రాప్ చేస్తాను" అన్నాడు ఆమెకు ధైర్యం చెపుతూ.