"ఊఁ"
"ఇప్పుడు నా వెంట రండి. ఈ పూట విశ్రాంతిగా వుండండి.
నేను మళ్ళీ టౌనులోకి వెళ్ళి విచారిస్తాను. విషయాలు కనుక్కుందాం, పరిస్థితి చూచి మీ ఫ్రెండ్ ఇంటికి వెళుదురుగాని, ఒకరోజో, రెండురోజులో మా ఇంట్లో వుండండి"
"మీ ఇల్లా?"
"అదే మా ఇల్లంటే-మా అయ్యగారి ఇల్లు...."
"నీకు వేరే ఇల్లు లేదా?"
"ఊహుఁ"
"అమ్మా.... నాన్నా...."
"ఊహుఁ ఎవరూ లేరు. చిన్నప్పుడే పోయారు. మేనత్త వాళ్ళు పెంచి పెద్ద చేశారు...."
"మీ అయ్యగారింటిలోనే వుంటున్నావా?"
"అవును."
"ఇంకెవరున్నా రక్కడ."
"ఆయనకీ నాలాగే ఎవరూలేరు. ఇంటిలో వంటమనిషి, పనిమనిషి, వాచ్ మన్ అంతే! ఎవరూలేరు. లంకంత ఇల్లు. విశాలమైన తోట. ఆయనెప్పుడూ బిజినెస్ మీద తిరుగుతూ వుంటారు. ఇల్లంతా నా స్వాధీనమే...."
"బావుంది."
"బావుందా? బావుందా? బ్రహ్మాండంగా వుంది. అందుకే డ్రైవర్ గానే బ్రతికేద్దామని నిశ్చయించుకున్నాను."
"మంచిపనే."
"ఇంతకీ నాతో వస్తారా?"
"మీ అయ్యగారు...."
"మా అయ్యగారు ఊర్లో లేరు. ఢిల్లీ వెళ్ళేరు."
"పనిమనిషి...."
"అతనేం అడగడు."
"వంటమనిషి"
"ఆమేం అనదు."
"వాచ్ మన్."
"అతనికీ నా మాట సుగ్రీవాజ్ఞ."
"అందరూ నీ మాటే వింటారా?"
"ఆ మాటకొస్తే నా కనుసన్నట్లో బ్రతుకుతారు."
"మీ అయ్యగారిలాగా దర్జా వెలగబెడతావన్నమాట."
"నేనే అయ్యగారన్నట్టుగా వుంటారు వాళ్ళు."
సత్య మరేం అడగలేదు.
"మరి అక్కడికే వెళ్ళిపోదామా?"
"ఊఁ మీ వంట మనిషితో వుంటాను."
"వద్దులెండి. గెస్టురూం వుంది. దాంట్లో వుండండి, ఆ ప్రక్కనే కిచన్. అందులోనే వుంటుంది వంటమనిషి."
"అలాగే!"
"అదిగో అదే మా బంగళా!"
దూరంగా అతను చూపినవేపు చూసింది.
రోడ్ కి ఫర్లాంగు దూరంలో ఒంటరిగా ఆకాశంలో చందమామలా వుందా బంగళా....
అది బాగా ధనవంతులుండే ప్రాంతం.
దూరదూరంగా కట్టుకున్నారు ఇల్లు.
ప్రతి ఇంటికి కాంపౌండ్.
కాంపౌండ్ మధ్యన ఇల్లు.... విశాలంగా.... అధునాతనంగా అన్ని సౌకర్యాలతో....
కారు మెయిన్ రోడ్ దిగి, మామూలు రోడ్డువెంట పరిగెత్తీ ఆ బంగళా ముందాగింది.
వాచ్ మన్ పరిగెత్తుకుంటూ వచ్చి గేటు తీసేడు.
అప్పుడు సరిగ్గా ఆరుగంటలయింది.
తూర్పున పగటిదీపం వెలిగింది.
గేటుగుండా, గార్డెన్ మధ్యలో ఇంటివరకూ వేసిన సిమెంట్ రోడ్ పై రివ్వున పరిగెత్తింది కారు.
కారు ఆగగానే బొంయ్ మని హారన్ మ్రోగింది.
పనిమనిషి పరిగెత్తుకుంటూ వచ్చేడు.
కారు తలుపు తీసేడు.
ఠీవిగా దిగేడు సతీష్.
అతని చూపుల వెంట పరిగెత్తి అటువేపు డోర్ తెరిచాడు.
భయం భయంగా తొలిసారి ఆఫీసులోనో, అత్తారింట్లోనో అడుగుపెట్టే వధువులా అడుగు పెట్టింది.
"గుడ్! కుడికాలు పెట్టేరు."
జవాబివ్వలేదు సత్య.
"రామయ్యా! అమ్మాయిగారు కొత్తగా వచ్చేరు. జాగ్రత్తగా తీసికెళ్ళి మాన కిచెన్ ప్రక్క రూంలో దించెయ్. వెంటనే రా. ఏమేం కొనాలో చెపుతాను."
చిత్తం అన్నట్టు తలూపేడు, కదిలేడు.
సత్య అతన్ననుసరించింది.
"కారు గారేజ్ లో పెట్టివస్తాను. స్నానం చేయండి తర్వాత టిఫిన్ వద్ద కలుద్దాం"
తిరిగి కార్లో కూచుని కారు కదిలించేడు సతీష్.
పనిమనిషి వెంట కదిలింది సత్య.
వెళుతోన్న సత్యని చూసి "ఈ అమ్మాయి చాలా అమాయకరాలిలా వుంది! మంచులో తడిసిన తెల్లమల్లెలాటి సౌందర్యం, అచ్చమైన స్వచ్చమైన పైరగాలి లాటి నెమ్మది తనం మూర్తీభవించినట్టుగా వుంది.