కాస్సేపు సభ్యులంతా మౌనంగా ఉండి ఆలోచించడం మొదలుబెట్టారు.
ఇంతకీ తాము అందరూ ఎందుకు కొట్టుకున్నట్టు?...
మినిష్టర్ మిన్నారావు కిసుక్కున నవ్వాడు.
ఆయన నవ్వడం చూడగానే అందరికీ గుర్తొచ్చింది తామెందుకు బూతులు తిట్టుకుంటూ కొట్టుకున్నారో.
"మిన్నారావు బామ్మర్ది ఇంట్లో జరిగిన దొంగతనం గురించి పోలీసులు పట్టించుకోడానికి వీల్లేదు..." అని అరిచాడు ఒక ప్రతిపక్ష సభ్యుడు.
"పోలీసులు పట్టించుకు తీరాలి!...' ప్రతిగా అరిచాడు అధికార పార్టీ సభ్యుడు.
"పట్టించుకోడానికి వీల్లేదు..." ఇంకా గట్టిగా మూడు నాలుగు గొంతులు అరిచాయ్.
"దొంగతనం జరిగితే దొంగని పట్టుకోవద్దంటారేం?" మిన్నారావు విసుగ్గా మొహం పెడ్తూ అన్నాడు.
"ఏం?... దొంగతనం మీ బామ్మర్ది ఒక్కడి ఇంట్లోనే జరిగిందా? ఊళ్ళో అందరిళ్ళలోనూ జరగడంలేదా?..." ఒక ప్రతిపక్ష సభ్యుడు ప్రశ్నించాడు.
"దొంగతనం జరిగిన వాళ్ళు అధికార పార్టీలోని వాళ్ళకి ఎవరికో ఒకరికి బామ్మర్ది అవుతేనే పోలీసులు పట్టించుకుంటారు సార్..." మరో ప్రతిపక్ష సభ్యుడు కామెంట్ చేశాడు.
ఆ కామెంట్ కి ప్రతిపక్ష సభ్యులంతా ఘొల్లున నవ్వారు.
వాళ్ళలా నవ్వుతుంటే ఊర్కే కూర్చుంటే బాగుండదని అధికార పార్టీ సభ్యులు బల్లలు గుద్దుతూ "షేమ్ షేమ్..." అంటూ అరిచారు.
దాంతో రెండు పక్షాలకి సంబంధించిన సభ్యులూ మళ్ళీ వాగ్వివాదానికి దారి తీశారు.
"ఇట్టగయితే నేనెళ్ళిపోతానంతే...." అంటూ బుంగమూతి పెట్టాడు స్పీకర్.
"ఇకముందు ఎవరింట్లో దొంగతనం జరిగినా మా పార్టీ సభ్యుల బామ్మర్దుల ఇళ్లలో దొంగతనం జరిగినట్టుగా ఫీలయి పోలీసులు దొంగల్ని పట్టుకుని సొమ్ములు అప్పచెప్పేలా చేస్తామని హామీ ఇస్తున్నాను. అంతేకాదు... ఒక ముందు దొంగతనాలు జరక్కుండా కట్టుదిట్టమైన ఏర్పాటు చేయిస్తాం..." అంటూ హామీ ఇచ్చాడు ముఖ్యమంత్రి.
ఆరోజు అసెంబ్లీ సెషన్స్ ముగిశాక ముఖ్యమంత్రి పోలీసు కమీషనర్ ని పిలిచి నగరంలోని దొంగతనాల నివారించడం గురించి చర్చించాడు.ఇకముందు దొంగతనాలు జరక్కుండా చూడమని చెప్పాడు.
ఆ మర్నాడు పోలీసు కమీషనర్ సీనియర్ పోలీసు ఆఫీసర్ల మీటింగ్ ఒకటిపెట్టి నగరంలోని దొంగతనాలను నివారించడం గురించి చర్చించాడు.ఈ దొంగతనాలని అరికట్టే బాధ్యత డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ డింభకరావుకి అప్పగించాడు పోలీసు కమీషనర్.
డింభకరావు ఎన్ని చర్యలు తీస్కున్నా దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి.
ఒక విషయాన్ని గమనించిన డింభకరావుకి చాలా ఆశ్చర్యం కలిగింది.అదేమిటంటే నగరంలో అన్నిచోట్లా దొంగతనాలు జరుగుతున్నాయ్. కానీ కొన్ని కొన్ని ప్రాంతాల్లో అస్సలు ఒక్క దొంగతనం జరగలేదు...కారణం ఏమిటి?...
అలా అస్సలు దొంగతనం జరగని ఏరియాలు... మలక్ పేట, సలీమ్ నగర్, ముసారాంబాగ్ ఇంకా కొన్ని ప్రదేశాలు!
డింభకరావు సంగతి తెల్సుకుందామని అతని ఇంటికి దగ్గర్లో ఉన్న మలక్ పేట కాలనీకి వెళ్ళాడు. ఆ కాలనీలోని ఒక ఇంటికి వెళ్ళి ఇంటాయనకి తనని తాను పరిచయం చేస్కున్నాడు డింభకరావు.
"మీ కాలనీలో అస్సలు ఒక దొంగతనం కూడా జరగలేదు... మీ కాలనీ వాళ్ళేమైనా రాత్రిపూట గస్తీ తిరుగుతున్నారా?..." అడిగాడు డింభకరావు ఆ ఇంటాయన్ని.
"లేదే?..." ఆశ్చర్యంగా అన్నాడాయన.
"మరి మీ కాలనీలో ఒక్క దొంగతనంకూడా ఎందుకు జరగలేదు?"
"అదేంటిసార్ అలా అడుగుతారు?... ఇంట్లో అందరూ గాఢంగా నిద్రపోతున్నప్పుడు కదా దొంగలు పడ్తారు. మా కాలనీలో ఒక్కరుకూడా నిద్రపోరుగా... మరి దొంగలెలా పడ్తారు?..."
"ఒక్కడుకూడా నిద్రపోడా?'...అదేం??..." డింభకరావు ఆశ్చర్యంతో తలమునకలవుతూ అడిగాడు.
"ఎలా నిద్రపోతామండీ... మా కాలనీ దగ్గరేగా మూసీనది ఉంది. మూసీనది ఉందంటే చచ్చేన్ని దోమలు ఉంటాయ్ కదా ?... ఎవడికి నిద్ర పట్టిచస్తుంది చెప్పండి.అందుకే మూసీనది ఉన్న ఏరియాల్లో జనాలకి నిద్రపట్టదు,దొంగతనాలు కూడా జరగవు..."
అది వింటూనే డింభకరావు సంతోషంతో కెవ్వున కేకేశాడు.
దొంగతనాలు ఎలా అరికట్టాలో అతనికి తెల్సిపోయింది.
డింభకరావు పరుగునవెళ్లి పోలీసు కమిషనర్ కి విషయం చెప్పాడు. పోలీసు కమీషనర్ సంతోషంతో గుండెలు బాదుకుంటూ ఛీఫ్ మినిష్టర్ దగ్గరికెళ్ళి చెవులు కొరికాడు.
"హమ్మా ...ఇదా సంగతి?" అయితే ఇహనుండి హైదరాదాద్ నగరంలో దొంగతనాలు బంద్ " అన్నాడు చెవులు రుద్దుకుంటూ చీఫ్ మినిష్టర్.
చీఫ్ మినిష్టర్ ఆదేశాలతో పని వెంటనే ప్రారంభం అయ్యింది.
మూసీనది నుండి కాలవలు తీసి హైదరాదాద్ లోని ప్రతి ప్రదేశానికి పారే ఏర్పటు చేస్తున్నారు. డ్రైనేజి నీరు కలిసే ఆ కుళ్ళు నీళ్ళు నగరం మొత్తం పారుతుంటే నగరం మొత్తం దోమలతోనిండి ఒక్కడికీ రాత్రిళ్ళు నిద్రపట్టదు. ఆ విధంగా నగరంలోని దొంగతనాలు అరికట్టవచ్చని ప్రభుత్వం ఆలోచన!...
* * *