"ప్రజలకు సేవ చేయటానికే రాజకీయాల్లోకి వచ్చామని మేం చెప్పటం లేదా? ఎలక్షన్స్ లో గెలిచాక చేస్తున్నామా? చేయం... ప్రభుత్వోద్యోగుల మాటేమిటి? పని చేస్తున్నారా? లంచాలు మేస్తున్నారు. ఈ మధ్య ఒరిస్సాలో ఛీఫ్ మినిస్టర్ బిజూ పట్నాయక్ మీదే దాడి చేశారు. ఈ దేశంలో ఎవరు ఏది మాత్రం చేస్తున్నారు? చేస్తే దేశం ఎందుకిలా వుంటుంది?" నవ్వుతూనే అన్నాడు అహోబలపతి.
"నాకు డబ్బవసరం వున్నమాట వాస్తవమే కావచ్చు. అంతమాత్రం చేత హత్యలు చేస్తానని ఎలా అనుకున్నారు?" కోపంగా అన్నాడు ఆదిత్య.
"నీ అవసరం నీతో ఆ పని చేయిస్తుంది..."
"మీ రాజకీయ నాయకులకు అందరూ గూండాల్లాగా, రౌడీల్లాగే కనిపిస్తారా? డబ్బు కోసం ఎవరు ఏదైనా చేస్తారని మీ నమ్మకమా?" ఉక్రోషంగా అన్నాడు ఆదిత్య.
"అందరి నమ్మకం అదే. ఇంతకీ ఏమంటావ్...?"
"నేను ఒప్పుకోనంటే ఏం చేస్తారు?"
"నా మనిషి మీ ఊరెళ్తాడు. మీ అమ్మాయికి కడుపొచ్చిందట గదా- పాతిక వేలిస్తే ఆ విషయాన్ని దాచిపెడతానని చెబుతాడు. ఆ డబ్బివ్వలేని మీ తల్లిదండ్రులు, పరువు ప్రతిష్టల కోసం బావిలో దూకుతారు. వాళ్లను మా వాళ్ళే రక్షిస్తారు. అది నీకు తెలుస్తుంది. నువ్వు మీ వూరు పెరిగెడతావ్. విషయం తెలిసి తల బాదుకుంటావ్. విధిలేక నా పని చేసేందుకు నా దగ్గరకే వస్తావు. నీకు ఐదులక్షలిచ్చి నా పని చేయించుకుంటాను. పరిస్థితుల్ని, వ్యక్తుల్ని రాజకీయ నాయకులు తమకు అనుకూలంగా మార్చుకొనేందుకు. యిలాంటి ఎత్తుగడలు చాలా వేస్తారు. మరి నేను రాజకీయ నాయకుడ్నే గదా...? అంత ప్రాసెస్ ఎందుకూ? వెంటనే ఒప్పుకుంటే పనయిపోతుంది.
నా రహస్యం నీకు తెలిసాక... ఇక నిన్నెలా వదులుతాను? వీలైతే నీతో నా పని చేయించుకుంటాను. కాకపోతే మట్టుబెడతాను... అంతే..." చిద్విలాసంగా కాళ్ళూపుతూ అన్నాడు అహోబలపతి.
ఆదిత్య ఒక్కక్షణం తీవ్రమైన భయోద్వేగానికి లోనయ్యాడు.
"ఎలాంటి ప్రమాదం నుంచైనా నిన్ను రక్షించుకునే బాధ్యత నాది.
చెప్పాగదా... అధికారంలోకొస్తే డబ్బొస్తుంది. డబ్బొస్తే రౌడీయిజాన్ని కొనేయవచ్చు. రౌడీయిజం అండవుంటే ఏదైనా చేయవచ్చు.
ఈ రోజు ఈ దేశాన్ని ఏలేది మూడే. రౌడీయిజం... డబ్బు... అధికారం. బాగా ఆలోచించుకో..." సిగరెట్ వెలిగించుకుంటూ అన్నాడు అహోబలపతి.
కొద్దిక్షణాల వరకు ఆదిత్య మెదడు పనిచేయలేదు... మొద్దుబారిపోయింది.
చూస్తుండగానే తనిలాంటి విషవలయంలో చిక్కుకుంటానని ఆదిత్య ఏ మాత్రం ఊహించలేదు.
ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి.
గొంతు తడారిపోయింది.
నవనాడులు స్తంభించిపోయాయి.
ఐదు నిమిషాలు నిశ్శబ్ధంలో కరిగిపోయాయి.
అవతల వ్యక్తి ఆలోచించుకుని ఒక నిర్ణయానికి రావటానికి ఆ మాత్రం టైమివ్వాలని అహోబలపతి అంతసేపు మౌనంగా వుండిపోయాడు.
విధి లేదని నిర్ణయించుకున్నాక మొండి ధైర్యానికొచ్చాడు ఆదిత్య.
"ఒక అమాయకుడ్ని మీ కోసం నేను చంపాలన్న మాట..." అహోబలపతి మీద పెల్లుబుకుతున్న అసహ్యాన్ని, ఆగ్రహాన్ని అణుచుకుంటూ అన్నాడు ఆదిత్య.
"ఒక దుర్మార్గుడ్ని... నమ్మకద్రోహిని... నీచుడ్ని నువ్వు చంపాలి. మంచివాడ్ని కాదు..."
తిరిగి ఆశ్చర్యపోయాడు ఆదిత్య.
"మీ కంటేనా?" ఆదిత్య హృదయం భగ్గున మండిపోతోంది. తన స్థితి మీద తనకే అసహ్యంగా వుంది.
అహోబలపతి నవ్వాడు.
"ఇంతకీ ఏం నిర్ణయించుకున్నావ్...."
"మా చెల్లెలి భవిష్యత్ గురించే ఆలోచించాను..." అన్నాడు ఆదిత్య గంభీరంగా.
"మన దేశంలో సెంటిమెంట్స్ బాగా వర్కవుట్ కావటం మా లాంటి వాళ్ళ అదృష్టం..."
"మాలాంటి వాళ్ళ దురదృష్టం..." డిజ్ గస్టింగా అన్నాడు ఆదిత్య.
"రేపు ఉదయం పదిగంటలకల్లా మెహదీపట్నం స్టేట్ బ్యాంక్ గేటు దగ్గర నిలబడు. నా మనిషి నీకు ఐదు లక్షలకి బేరర్ చెక్ యిస్తాడు. అదే బ్యాంక్ లో కేష్ చేసుకో. వరంగల్ వెళ్ళు... నీ వాళ్ళకి ఆ మనీ యిచ్చెయ్."
"పని చెయ్యకుండానే, డబ్బు యిచ్చేస్తారా?!" ఆశ్చర్యపోయాడు ఆదిత్య.
"ప్రొఫెషనల్ కిల్లర్స్ కైతే... అడ్వాన్సులు, ష్యూరిటీలు, సెక్యూరిటీలు... నువ్వు ప్రొఫెషనల్ వి కాదు కాబట్టి, నిన్ను నేను నమ్ముతాను. ఎంతవరకో తెలుసా... నన్ను నువ్వు నమ్మేంత వరకూ."
"మర్డర్ ఎప్పుడు చెయ్యాలి... ఎవర్ని చెయ్యాలి?" అడిగాడు ఆదిత్య.
"రేపు రాత్రి తొమ్మిది గంటలకు నిజాం గ్రౌండ్స్ లో ఒక పార్టీ మీటింగ్ జరగబోతోంది. క్రౌడ్ విపరీతంగా వుంటుంది. చీఫ్ మినిస్టర్, హోం మినిస్టర్ కూడా అక్కడే వుంటారు."
"చీఫ్ మినిస్టర్నా..." భయం భయంగా అడిగాడు ఆదిత్య.
"కాదు. ఒక ఎక్స్ ఎమ్.ఎల్. ఏని. అతను చీఫ్ మినిస్టర్ కి దండ వెయ్యడానికికొస్తాడు. స్టేజెక్కిన అతను మళ్ళీ స్టేజ్ దిగకూడదు. ఎలా ప్లాన్ చేస్తావో... నీ యిష్టం."
"ఎవరా ఎక్స్ ఎమ్మెల్యే!" రూమ్ లో బల్బ్ కాంతి సగం మాత్రమే ఆదిత్యమీద పడుతోంది. ఆ కాంతికి, అతని ముఖం ఎర్రగా ప్రకాశిస్తోంది.
నవ్వాడు అహోబలపతి. సూటిగా ఆదిత్య కళ్ళవేపు చూశాడు. రెండు ఘడియలు ఆలోచించాడు.
"నేను చేసే ప్రతి పనికీ ఓ రిజల్ట్ వుంటుంది. నేను నీ నుంచి కోరుకునేది... నీకు అంత మొత్తం డబ్బిస్తున్నదీ ఫర్ ఫెక్ట్ ప్లాన్ కోసం... ఫర్ ఫెక్ట్ ప్లాన్ ఫర్ ఏ.. ఫర్ ఫెక్ట్ మర్డర్..."
"ఇంతకీ నేనెవర్ని చంపాలి?" విసుగ్గా అడిగాడు ఆదిత్య.
ఆదిత్య నరాల్లో ఏదో తెలీని ఉద్రిక్తత గూడు కట్టుకుంది. అహోబలపతి శత్రువుల లిస్ట్ ని జ్ఞాపకం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నాడు.
అహోబలపతి ఒక ఎమ్మెల్యేని ఎందుకు చంపమంటున్నాడు?
ఎవరా ఎక్స్ ఎమ్మెల్యే? అతనంత పవర్ ఫుల్ వ్యక్తా?
అకస్మాత్తుగా ఆదిత్యకు జ్ఞాపకాని కొచ్చింది.
గుర్రం పెద్దబ్బాయి. సిటీలో సగభాగాన్ని, తన సామ్రాజ్యంగా చేసుకుని పాలిస్తున్న గుర్రం పెద్దబ్బాయికి, అహోబలపతికి మధ్య బద్ధవైరముంది. ప్రతిరోజూ డైలీ పేపర్లను చూసే ప్రతివాడికీ ఆ విషయం తెలుసు. కానీ గుర్రం పెద్దబ్బాయి ఎక్స్ ఎమ్.ఎల్.ఏ కాదు. మరి?