ఏకగ్రీవాభిప్రాయం అనే గోడ పగుళ్లు వేస్తోంది. పట్టుదలతోనే దీన్ని మరమ్మత్తు చెయ్యాలి.
అక్కడ ఉన్నంత మాత్రంచేత నలుగురు విద్యార్థులకు శిక్షపడింది.
అది ఆదివారం. ప్రార్థనల రోజు.
రాత్రిపూట సోర్బాన్ చుట్టూ ఉన్న నివేశనాలలో చెత్తనంతా పోలీసులు తొలగించి వేస్తారు.
పసికుర్రల తెలివితక్కువతనం దేశానికి ముచ్చట గోలిపింది. మనస్సులు పరిపక్వంగాని కుర్ర విద్యార్థులు నిప్పులతో చెలగాటమాడుతున్నారు.
సోమవారం ఉదయం ఆరు గంటలకు మూడువేలమంది పోలీసులు సోర్బాన్ ను రక్షిస్తారు. లాటిన్ కార్టర్ అంతటా గస్తీలు, నీళ్ల ఫిరంగులు సిద్ధంగా ఉన్నాయి-వేడెక్కిన వాళ్ళని చల్లార్చడానికి.
తేలికగా అడుగులు వేసే బాల దళాలు కండలు బిగిస్తున్నాయి. ఈ ఆట కొత్తది కాబట్టి వాళ్లకి భయం ఏమిటో తెలియదు. మనస్సులు పచ్చివి కాబట్టి దేనినీ లక్ష్యపెట్టరు.
రంగస్థలం సిద్ధమయింది.
విద్యార్థుల సంఘం, ఉపాధ్యాయుల సంఘం సమ్మెకు పిలుపిచ్చాయి.
లాభనష్టాలు బేరీజు వేసే దస్తాల మధ్య దాగున్న లిఖితపూర్వకం కాని నియమాలు. తిరుగుబాటు చేసే కార్మికుల మీదకు సైన్యాన్ని ఉసిగొల్పాలనీ, తుపాకులు పేల్చాలనీ నిశ్శబ్దంగా నిష్కర్షగా చాటుతాయి. అలాగే విద్యార్థులు ఆందోళన చేస్తే లాఠీలూ, బాష్పవాయువూ పరిస్థితిని చక్కగా సర్దుబాటులోకి తెస్తాయంటాయి.
బెదిరింపు బెదిరింపే. న్యూసెన్సు న్యూసెన్సే.
అంతేకాక పాలక సమాజం తన పిల్లల్ని తానే చంపుకునే చర్యలతో దొరికిపోకూడదు. తత్ఫలితంగా చెలరేగే అసమ్మతి ఘోషలు అసలు అలజడికన్నా ప్రమాదకరమైనవి.
తొమ్మిదిగంటలయ్యేసరికి కాపలాకి పెట్టిన రైతులతో లాటిన్ కార్టర్ బంద్ అయింది. గడ్డపారలు పట్టుకునే చేతులకి వాళ్ళు గ్లవ్స్ తొడుక్కున్నారు.
అయితే శత్రు శ్రేణుల్లోనికి వందలకొలది విద్యార్థులది వరకే సర్దుకున్నారు. స్థలజ్ఞులు కావడం వాళ్లకి లాభించింది.
పోలీసులు అడ్డుదార్లలో కాచుకుని మ్యాపుల మీద ఆధారపడతారు.
కాన్ - బాందీ మున్నగువారు సోర్బాన్ దారం వద్ద ప్రత్యక్షమవుతారు. లోపల వాళ్ళకోసం ఒక క్రమశిక్షణ కమిటీ సిద్ధంగా ఉంది.
"ఇంటర్నేషనల్" పాడుతూ ప్రవేశిస్తారు. తమ్ము ఎలా పీడించారో పోలీసులకు తెలియజేశారు.
C.R.S.(S.S.)స్తోత్ర పాఠాన్ని మరికొందరు విద్యార్థులు బృంద గానంలా పాడతారు.
C.R.S. దళం వృత్తి ధర్మంప్రకారం, ఉద్దేశపూర్వకంగా దాడి ప్రారంభిస్తుంది.
అరుపులు, బాష్పవాయువు, చావబాదడం, సైరెన్లు, మళ్ళీ గాయపడ్డవారు.
అసందర్భపు నృత్య నాటిక.
ఈసారి తూటాలు గాలిలోకి కాకుండా సరాసరి ప్రదర్శకుల మీదనే ప్రేలుతాయి. గాయపరచడం కోసమే.
పోరు విస్తరిల్లుతుంది. విద్యార్థులు కాల్బలం కాబట్టి జోరుగా కదలగలరు. పోలీసులు మాత్రం కార్లను అంటిపెట్టుకునే ఉంటారు. కదిల్తే చీమల్లాగ విద్యార్థులు చుట్టబెడతారని తెలుసు. కార్లతో ట్రాఫిక్ బంద్. తటస్థపు కార్లు కూడా పోలీసులని ఎదిరిస్తాయి. నగర గెరిల్లాలు. కుర్రాళ్లు గాలిలో మాయమవుతారు. లాటిన్ కార్టర్ మీద ఒక హెలికాఫ్టర్ తిరుగుతుంది. విద్యార్థులు సులువుగా శ్రేణుల్ని పునర్నిర్మిస్తారు. అది వాళ్ళకి ధైర్యమిస్తుంది. తర్వాత నదిని దాటతారు. పోరాటం ఇతర ప్రాంతాలలో అంటుకుంటోంది.
వీధుల్లో కదంతొక్కే, పదం పాడే సమిష్టి క్షేమం.
జపనీస్ విద్యార్థులు సృష్టించిన ఉత్తేజకరమైన టెక్నిక్ తో ఆ దినం ప్రకాశమానంగా ఉంది.
డెలోపేరా వీధి నుంచి వెయ్యి మంది "మేమొక చిన్న దళం మాత్రమే" అని పాడతారు కొద్దిగా ఆశ్చర్యంతో.
హ్యుమనిటే, థిగారో పత్రికలు ఇదంతా తీవ్రవాదుల చర్య అని కచ్చితంగా వ్రాస్తాయి. దుష్టశక్తుల ప్రేరణ.
ఇంటికి తిరుగు ప్రయాణం. మంత్ర బద్దమైన కార్టర్ లోనికి, కానాస్ జోళ్ళతో.
రొట్టెలతోను, ఉద్రేకంతోను ఆకలి తీర్చుకోవడం.
నగరవాసుల కోసం రేడియోలు సక్రమంగా సంఘటనలను రికార్డు చేస్తున్నాయి.
సెయింట్ జెర్మేన్ నుంచి మొబేర్ మ్యూచుయాలిటీదాకా నల్లదళం వుంది. నిశ్చల జీవితం. నల్లదనంతో తారసపడకుండా మానవ వలయం.
పోలీసులు దాడి చేస్తారు - ఆకస్మికంగా.
బెదిరిపోవడం, తొడతొక్కిడి, పారిపోవడం, చాలా మంది దొరికిపోతారు. పేమెంట్లమీద పడిపోతారు. ఆనందానికి చెల్లించే మూల్యం. ఎరుపూ, నలుపూ.
పోలీసులకు మరికొన్ని వందలగజాల ప్రాంతం స్వాధీనమయింది.
ఉన్మాదం, ఆగ్రహం, రోషావేశం, ఆశాభంగం.
కార్లతో అడ్డుకొడతారు. బారికేడ్లు నిర్మిస్తారు. నిష్ఫలమైన ఎదురుదాడి.
చేతుల్లో రాళ్ళతో, లేదా మొండిధైర్యంతో నల్లదళం మీదకు పరిగెత్తడం, ఉక్కిరిబిక్కిరయి, పడిపోయేదాకా బాష్పవాయువుల్లోకి పరుగు - చేతిలో ఎర్రని గుడ్డ పీలికతో, లేదా నల్ల పీలికతో.
ఒక గుడిసెకు నిప్పంటుకుంటుంది. ఇప్పుడు పోలీసులు పదేపదే దాడి చేస్తారు.
విద్యార్థులు నిలద్రొక్కుకుంటారు. రేడియో రిపోర్టర్లు మైక్రో ఫోన్లలోంచి అరుస్తారు. ఆ అరుపులు చాలా దూరానికి పోతాయి. ఆఫీసు గుహల్లోకి, సంసారుల గృహ దుర్గాల్లోకి. ఇది దొమ్మీ. కొట్లాట. ప్రళయ లాస్యం అనే నృత్య ప్రదర్శనం.
4
సముద్ర తీరం
రాళ్లకింద
పోలీసు ఉన్నతాధికారి గ్రిమో-చాలా సబబైన మనిషి. నమ్మలేనిది జరగడం చూడడానికి మొబేర్ కు వస్తాడు. అక్కడ ఉద్యోగులు ఆఫీసుల్లోంచి బైటికి వచ్చేస్తున్నారు.
జన సంచారంలేని రోడ్డుకి అడ్డుగా వెళ్ళబోయిన ఒక నడి వయస్సు మనిషి మీద ఒక నల్ల యూనిఫారం వాడు దౌర్జన్యం చేసి తలకాయ పగులగొడతాడు. మరికొంతమంది పరుగెడతారు. పిచ్చెత్తినట్టు లాఠీలతో మోది, అతన్ని కాళ్ళతో తంతారు. ఒక అధికారి వచ్చి పోలీసులను లాక్కుపోతాడు.