చాలామంది విద్యార్థుల్ని చావబాదుతారు. పక్క వీధుల్లోని విద్యార్ధులిదంతా చూస్తారు. ఆ నోటా ఈనోటా వార్తలు ప్రాకుతాయి. అరుపులు వినిపిస్తాయి.
సమావేశాలు, గుంపులు, సెయింట్ మైఖేల్ రహదారంతా విద్యార్థుల మయం.
సెయింట్ జెర్నేన్ వీధినిండా విద్యార్థులు.
ప్లేస్ సెయింట్ మైఖేల్ క్రిక్కిరిసిపోయింది. అయిదు గంటలయింది.
ప్రచార సాధనాల విలేఖరుల దళాలు హడావుడిగా తిరుగుతాయి.
రంగం అంతటా వార్తా ప్రసారయంత్రాల తీగలు దోబూచులాడుతాయి. గాలిలోకి రేడియో తరంగాలను పంపిస్తాయి. మర్యాదస్తులు తమ ఇళ్ళల్లోనే కూర్చుండి ఇబ్బందిగా వార్తలు వింటారు.
చిన్న చిన్న వివరాలతో సహా పోరాటాల వర్ణన. పొట్లాలు కట్టిన హత్యలు. సెల్లోఫేన్ కాగితంలో చుట్టిన మందుగుండు. పోలీసుల ప్రవర్తన వింటున్న తటస్థ కుటుంబాల అంతరాత్మల మందపు పొరలలో అవి బాకులు దూస్తాయి.
నిద్రా మందిరాల నుండి బయటికి వచ్చిన యువకులు, బలహీనమైన చేతులతో, బాధపడే మనస్సులతో, సగం సగం మేలుకొని కదుల్తున్నారు. ఇకమీద వీళ్ళంతా వీధుల్లోనే ఉంటారు - కేకలతో, బూతులతో కోరికలు ప్రకటిస్తూ.
ట్రాన్సిష్టర్ తరంగాలు పోరాటపు వార్తల్ని ఏ క్షణానికా క్షణం అందిస్తాయి. పొగలలో, పోరాటపు తీవ్రతలో చిక్కుకుని కళ్లకు కనిపించని కామ్రేడ్స్ గురించిన వార్తలు.
మళ్లీ సభలు. మళ్ళీ గుంపులు, అణువులోని ఎలక్ట్రాన్ ల ఆనంద నాట్యం తమ్ముతాము తెలుసుకున్న ఆత్మ వికాసం.
నల్ల పోలీసు దళాలు చర్మం, ఉక్కు, ప్లాస్టిక్ ఆయుధాలు.
మరచిపోయిన దుస్సప్నాలు - అంథతపుబురఖాలు - భయం గీసిన గీతలు.
నోరూరించే తియ్యని బాధ. ఆర్చుకుపోయే అంగుళ్లు_ప్రేగులు.
ప్రాచీన సేనా నివహాల జ్ఞాపకాలు. పరాజయమెరుగని సైన్యాల క్రూర నాయకులు. హోరెత్తే సేనా తరంగాలు, అంగారక వాసుల దండయాత్ర. మంచుతో ఉక్కుతో తయారయిన ఇతర గ్రహాలవారు. క్రూర కర్మకాండ సాగిస్తున్న యూనిఫారాలవారు.
అరుపులు, ఆలాపనలు. విద్యుచ్చక్తి. మెరుపులు. పదే పదే పునశ్చరణ చేస్తున్న మాటల మంత్ర శక్తి. పాటల చుట్టూ గుంపులు. మాటల వెండి గొలుసులు. గాలికీ ఆకాశానికీ సన్నని ఆచ్చాదనం.
తొలి కెరటం.
చెదిరిపోతున్న సీతాకోక చిలుకలు.
నల్ల సైన్యం ఇప్పుడు తెల్ల లాఠీలతో హింసను సరఫరా చేస్తున్ననల్ల మనుష్యుల తరంగం. ఒంటరివయ్యి పోయావంటే దొరికిపోయి లాఠీ దెబ్బలు తినడమన్నమాటే. కింద పడిపోవడం, చుట్టూ మూగిన రాక్షసుల వల్ల తన్నులు తినడం అన్నమాటే. ఒక అమ్మాయి స్పృహ తప్పిపడిపోయి ఉంటుంది. తూటాలు చప్పుడు చేస్తూ, నీలి మబ్బులు సృస్టిస్తాయి.
రేడియోలు కీచురాళ్లు.
కార్లు ప్రవహిస్తాయి. మత్స్య ప్రదర్శన శాలలో చేపలు.
రోడ్ల నిర్మాణం చేసిన కలపరాళ్లు. చెట్లపక్క రాళ్ళ గుట్టలు.
రాకపోకల సిగ్నల్ రాటల్ని పెకలిస్తున్నారు, కుర్రాళ్ళు_ పోలీసు లాఠీల నెదుర్కొనే పొడుగాటి ఈటెల్లా ఉపయోగించడానికీ, కలపరాళ్ళ నీతం తొలగించడానికీ.
పావే(Paves)కలప రాళ్లు.
వీధులు చర్మం ఒలిచిస్తున్నాయి విసరడానికి రాళ్లుగా. పావేలు అర్ధచంద్రాకారంలో కొద్దిక్షణాలు ఎగురుతాయి.
తొలి పోలీసు నేలకొరిగి పోతాడు. తోలు, ఉక్కు బిసలు విరిగిపోతాయి.
చేతి బాంబుల ధనులు, పోరాటపు సరిగమలు.
భరించరాని విష వాయువులతో వీధులూ, ఊపిరితిత్తులూ నిండిపోతాయి. రక్షణ, మళ్ళీ శక్తుల్ని కూడదీసుకోవడం. వీధుల్ని బారికేడ్ లతో బంధించే ప్రయత్నాలు. తర్వాత నిజంగానే బారికేడ్లు.
ప్లేస్ సెయింట్ మైఖేల్ నుంచి నల్ల లారీల ఎడతెగని ప్రయాణం.
గువల్లా గూళ్లలో కూర్చుని బువలు తినే కుటుంబాలు. ఈ సత్పురుషులు, భోజనంతోపాటు రేడియోలు క్రక్కే విషం కూడా తమకు తెలియకుండానే తినేస్తారు.
అరెస్టు చేసిన విద్యార్థుల్ని నోతర్ - దమ్-దెషాం పోలీస్ స్టేషన్ లో హాజరు పెడతారు.
పదిగంటలకి వాన ప్రారంభం. పదకొండుకి పోలీసులే ప్రభువులు.
సోర్బాన్ విద్యాలయం చుట్టూ నల్లని వలయం.
3
ప్రేయసిని ముద్దు పెట్టుకో
తుపాకిని మాత్రం వదలకు!
(ఓడియాన్ థియేటర్ పోస్టర్, మేం విప్లవకారుల ఆక్రమణలో)
రోమ్.... బెర్లిన్ .... మాడ్రిడ్... వార్సా.... పారిస్
ఆదివారం సమావేశమైన కోర్టు. అరెస్టయిన విద్యార్థులకు శిక్షణ విధించింది.
సమాజం ఒక ప్లాస్టిక్ పువ్వు.
సమూనా పాతదే. కొత్త రంగులు మాత్రం పూశారు.
ప్లాస్టిక్ పువ్వులు వాడిపోవు. వేడికి కరిగిపోతాయి.
స్వర్గంలోని పరమ పితా, ఈ రోజుకి మా రొట్టెముక్క ప్రసాదించు. మరిన్నీ, మా నెలవారీ లంచం.
మా కలలకీ ఆశలకీ ఆకారం ఇయ్యి, నేనొక్క్నే బాగుపడే విధంగా.
నా ఆఫీసు నౌకరీకి అంటిపెట్టుకుంటాను. గర్వించదగ్గది కాకపోయినా ఫ్యాక్టరీ పని భరిస్తాను. గలాటాలన్నీ దాటి బైటపడి గూడుచేరుకోగానే నా అల్లారు ముద్దు కుటుంబం అభినందిస్తుంది. యథా ప్రకారంగా, నాతోటి బానిసలతో తియ్యగానో చేదుగానో బృందగానం సాగిస్తూ విద్యుత్సంబంధం నిలబెట్టుకుంటాను.
అయితే ఈ తరంగాలలో అవసరాలు వినిపిస్తున్నాయి. కలవారి కుటుంబాల కుర్రాళ్ళలో కదలికలు పుడుతున్నాయి.