Previous Page Next Page 
రెక్కలు విప్పిన రివల్యూషన్ పేజి 6


    గ్రిమోను రేడియో కారు వద్దకు తీసుకొస్తారు. "పోలీసులు ఎప్పుడూ పోలీసులే" అని మైక్రోఫోన్ లో అంటాడు. "రక్షణ కొక శిరస్త్రాణం, శిక్షణ కొక లాఠీ!"
    ఒకప్పుడతను కూడా ఒక విద్యార్థి. ఒకప్పుడతనూ లాఠీ దెబ్బలు తిన్నాడు.
    వెలుపలి నిశ్శబ్దంలోనికి చిన్న చిన్న ధ్వని తరంగాలు జబర్దస్తీగా తోసుకొస్తాయి. ముఖాముఖాగా తిరగబడుతున్న కంఠ ధ్వనులు నిశ్శబ్దం మీద ఎడతెగని దాడి చేస్తాయి. ఈ నిశ్శబ్దం మరిదేన్నో భయంకరంగా అనుకరిస్తోంది. దాడి తీవ్రతకు గురవుతున్న లక్షలాది అంధ ప్రజలకు దారితెన్నులు తెలియడం లేదు. ఇరుగుపొరుగు గోడలు కరిగిపోతున్నాయి. అడ్డు తెరలు చిరిగిపోతున్నాయి. సెయింట్ జెర్మేన్ లో గుంపులని చెదరగొట్టడానికి నీటి ఫిరంగులు ఉపయోగిస్తున్నారు.
    ఒక మనిషి దెబ్బతిని పేమెంట్ మీది కొరిగిపోతాడు.
    ఇప్పుడు గాలి బుడగ నిండా బాష్పవాయువు. విద్యార్థులు తమ సంఘమూ, టీచర్ల సంఘమూ ఇచ్చిన పిలుపునందుకొని మాంట్ పరాస్ లోని డెన్ఫర్ రోషిరో వద్ద ప్రదర్శనకు గుమిగూడుతున్నారు. అధ్యాపకులు (అంధకార గుహల్లోని వివిధ శాఖాధిపతులు మినహా) తమ నీతి సూత్రాలను పునర్మించి నేటి సరికొత్త అవసరాలకు అనుకూలంగా సరిదిద్దుతున్నారు.
    లాఠీ దెబ్బలకు తలకాయలు పగుల్తూ ఉంటే పాఠశాల తరగతుల్లోని అనేకనేక పరాజయాలు వీళ్ళ తలల్లో సమ్మెట దెబ్బలు మ్రోగిస్తాయి. సక్రమంగా సాగవలసిన టైం టేబుల్స్ బాష్పవాయువుల పాలవుతున్నాయి. తాము ప్రారంభించిన పనిని పూర్తి చేస్తున్నారు దుర్మార్గులు.
    మానవత్వం పేరిట, విద్య పేరిట ఒక తెర తిరగబడుతుంది. వీళ్ళల్లో చాలామంది తమ హృదయాంతరాలలో బంధీలు - తెలిసి గానీ, చీలిపోయి గానీ, విద్యాబోధన ప్రమాదకరమైన వృత్తిగా పరిణమించింది.
    తమ ఉమ్మితో దినదినమూ నిలబెట్టిన అమూల్యమైన ఇసుక కోట పడిపోతోంది.
    పదమూడు పద్దెనమిదేళ్ల మధ్య వయస్సుగల హైస్కూలు విద్యార్థులు కూడా తిరుగుబాటు చేస్తున్నారు. వాళ్ళ వయస్సు పద్దెనిమిదో, పదిహేనో, ఇంకా తక్కువో బహుశా ప్రపంచ పురాణేతిహాసాలముచ్చిరేకు వీరుల వయస్సు. హెక్టర్ చంపిన పట్రోక్లస్ వయస్సు, హెలెన్ వయస్సు. తండ్రుల, నాయకుల వయస్సు, పుక్కిటి కథలు నిర్మూలించలేని పురాణ గాథల వయస్సు. నిర్దాక్షిణ్యంగా, ఉత్సాహోద్రేకాలలో పరవళ్ళు తొక్కేవాళ్ళు, మప్పితంగా పెరిగినవాళ్ళు, సురక్షితావరణాల్లో ఎదిగినవాళ్లు. ఇప్పుడు వూలు స్వెట్టర్లతో, పొడుగు లాగుల్తో వీధుల్లో విరగబడుతున్నవాళ్లు.
    నిన్నటి బలవంతమైన ఉత్సవ విగ్రహాన్ని వేళాకోళం చేస్తున్నవాళ్లు-విద్యని వెక్కిరించి, అసందర్భాన్ని బోధించే పాఠాశాల గదుల్లోంచి, గొర్రెల మందల్ని తయారుచేసే స్కూళ్లలోంచి, రక్తసిక్త రణరంగాల, రాక్షసుల వంటి సేనా నాయకుల పాతకాలపు తారీఖులనూ, పనికిమాలిన వర్ణనలనూ గుడ్డిగా వల్లించడం నేర్పేచోట్లలోంచి.
    డెన్ ఫర్ లో షెల్ వైపు, ఇరుకు గదుల్లోంచి విశాలమైన వీధులవైపు ముసుగు లాగేసిన కపటతం పట్ల తమ అసమ్మతిని తెలుపుతూ అరవడానికీ, నిజాలను నేర్చుకొనే హక్కుని కోరడానికీ, తప్పు చేసే హక్కు అడగడానికీ, వాంతి తెప్పించే బాష్పవాయువు నెదుర్కొనడానికీ, పాఠ్యగ్రంథాలను మార్చాలని కోరుతున్న కామ్రేడ్ లను ఊచకోత కోస్తున్నచోటికి. గద్దెదిగండి అనే అక్సహ్రాలే ఈ కొత్త పుస్తకాల పుటల్నిండా నిండిపోయాయి.
    డెన్ ఫర్ లోవేనకు వేలున్నారు. సెయింట్ జెర్మేన్ ఇంకా పోరాడుతోంది.
    "గర్జించు" - అంటుందొక గోడ. గాలిబుడగ పగిలిపోతోంది.
    వయోవృద్ధుల తారకమంత్రం, పోలీసు కార్ల, నల్లసేనల దాడి. దట్టమైన పొగల్లోంచి, గాయపడ్డవాళ్ళని బాదడం, డబ్బు తీసుకొని ద్వేషించడం, నిర్లక్ష్యంగా హింసించడం.
    దాడి చేస్తూ అరుస్తారు - ఏదో తమకు తెలియని, అర్థంకాని దానిపట్ల భయం ప్రకటిస్తూ.
    వాళ్లకి బలం వుంది. ఆయుధాలున్నాయి. అవి దమనకాండకి ముసుగులు. కాని వాళ్లూ మనుష్యులే. ముక్కుతూ, మూలుగుతూ. ఎదురు తిరిగితే చెదిరిపోతారు.
    కాసుల కోసం వాళ్లు పోరాడుతున్నారు, ఆశయాల కోసం మనం పోరాడుతున్నాం.
    నేలరాలిన శరీరాలను స్ట్రెచర్లమీది కెక్కించి పట్టుకుపోతున్నారు. అదేపనిగా వాడడం వల్ల స్ట్రెచర్లు నెత్తురుతో నిండిపోయాయి. కేకలు ఆకాశాన్నందుకుంటున్నాయి. బాంబులు ప్రేలిన పొగ వల్ల నీళ్ళునిండిన కళ్ళకి ఆకాశం కనిపించడంలేదు.
    వేకువజాముతో పోరాటం ఉద్దృతమవుతుంది. నీటి ఫిరంగులతో వచ్చిన రెండు ట్రక్కులు నియమిత స్థలంలో నిలబడ్డా రాళ్ల వర్షానికి విండ్ స్క్రీన్ లు పగిలి, తిరోగమిస్తాయి. క్రమంగా సద్దుమణుగుతుంది. అలుపు ప్రవేశిస్తుంది. లాటిన్ కార్టర్ పోలీసుల స్వాధీనమవుతుంది. వీధి కొసలు కనిపెడుతూ, నీడలకు భయపడుతుండే పోలీసులు పొరపాటున అటు వచ్చే పౌరులపైపడి చితకబాది హడల గొడతారు.
    కాలేజి విద్యార్థులు, స్కూలు కుర్రాళ్ల ఛిన్నాభిన్నమైన దళాలు విశ్రాంతికై వెనకంజ వేస్తాయి. ఎదిరింపు విప్లవంగా మారుతోందనీ, అందరూ సహాయానికి రావాలనీ మిత్రులకు కబుర్లందిస్తారు. ఆశయం ఏమిటో, అందుకు ఆటంకాలేమిటో అందరికీ స్పష్టంగా తెలుసు.
    టెలివిజన్ విశేషాలు లేకపోయినా అన్ని కుటుంబాలూ ఆ సాయంత్రం ఆందోళనతోనే గడిపాయి. టెలివిజన్ కార్యకర్తలు జోకొట్టడమే పనిగా పెట్టుకున్నారు.
    కాని రేడియోలు చురుకుగా సంకేతాలందిస్తున్నాయి. వార్తల కోసం ఆవురావురుమంటున్న వారి ఆకలి తీర్చడానికే అవి పాటుపడుతున్నాయి. స్వేచ్చా వ్యాపారాన్ని ఒకందుకు మెచ్చుకోవలసిందే! నిజాన్ని అప్పుడప్పుడు బయటపెడుతుంది, దానమ్మ కడుపు చల్లగా!
    అంతా కొంతమంది తీవ్రవాదుల చర్య అంటుంది ప్రభుత్వం. సంభాషణలకు, నిర్మాణాత్మకమైన సంభాషణలకు సమయమాసన్నమయిందంటుంది.
    కమ్యూనిస్టులు - బల్లగుద్ది మరీ చెబుతారు. ఇదంతా ట్రాట్స్కీయిస్టుల, అనార్కిస్టుల, తదితర ఆందోళనకారుల పనే అని. ఇటీవల ఈ కమ్యూనిస్టులు తిండి గురించీ, ప్రస్తుత పరిస్థితి గురించీ కార్మికులతో మాట్లాడుతూ ఫ్యాక్టరీ గేట్ల వద్ద కనబడ్డారు. వీళ్ళంతా మధ్యతరగతి సంతానం. కాబట్టి ప్రమాదకరమైనవాళ్లు. అయితేనేం ఫ్రెంచి క.పా. దమననీతినీ, అనవసరంగా ఉద్రేకాలను రెచ్చగొట్టడం జరుగుతుందనీ ఉద్ఘాటించింది. ఈ ఉద్రేకాల జోలికి పోవడం మానేస్తే అభివృద్ధి వర్ధిల్లుతుందనీ, చదువుకునే విద్యార్థులు శ్రద్ధగా చదువుకుంటారని చెబుతుంది.

                              5

    వాస్తవాన్ని గుర్తించు,
    అసాధ్యమైనదే కావాలని అడుగు
    (సెన్సియర్)
    పాపం బద్దలయ్యేలాగుంది. పార్టీలకు వేడి పుట్టింది.
    ఎవరి దుప్పటి ముసుగుల్లోంచి వాళ్లు మెల్లమెల్లగా కదులుతున్నారు.
    కార్మికులు మేలుకుంటున్నారని యూనియన్ ప్రధాన కార్యాలయానికి టెలిఫోన్ వార్తలందుతున్నాయి.

 Previous Page Next Page