"ఈ కాగితాలు నీ జేబులో ఎందుకున్నాయ్ ? అన్నాడు ఇన్ స్పెక్టర్ కఠినంగా.
"నా పుస్తకంలో పేజీలు , నేను చింపి నా జేబులో పెట్టుకున్నాను. అది చట్టవిరుద్దమనుకోను" అన్నాడు సందీప్ నిర్లక్ష్యంగా.
అతను చెబుతోంది కరెక్టే అని ఇన్ స్పెక్టర్ కి తెలుసు. బాంబు తయారుచేసే విధానం వివరించి వున్న పేజీలు జేబులో ఉంచుకున్నంత మాత్రాన బాంబు తయారుచేసినట్లు కాదు.
మరో సందర్భంలో అయితే ఆ విషయాన్ని అంతగా పట్టించుకునేవాడు కాదు ఇన్ స్పెక్టర్. కానీ క్రితంరోజే ఒక ఉగ్రవాది లాకప్ నుంచి తప్పించుకుపోయాడు. పై అధికారుల చేత తిన్న తిట్లు అతని చెవుల్లో గింగురుమంటూనే ఉన్నాయి.
అతను ఈసారి బాధ్యత తనమీద పెట్టుకోదలుచుకోలేదు. మొహానికి పట్టిన చెమట తుడుచుకొని తన పై అధికారికి ఫోన్ చేశాడు.
ఈ వార్త క్షణాల్లో టాప్ రాంకింగ్ ఆఫీసరు ఒకాయనకి చేరిపోయింది. తర్వాత సబ్ ఇన్ స్పెక్టర్ కి క్లుప్తంగా ఆదేశాలు వచ్చాయి.
"అతన్ని మాగ్జిమమ్ సెక్యూరిటీ సెల్ లో పెట్టండి" అని.
అవసరమైన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తిచేశాక, సందీప్ ని మాగ్జిమమ్ సెక్యూరిటీ సెల్ లోకి నడిపించారు.
ఆ సెల్ లో అప్పటికే ఒక రాటుదేలిన ఖైదీ ఉన్నాడు.
అతని పేరే __
భూతాలరాజు
ఉద్వేగంతో సందీప్ చేతులమీద రోమాలు లేచి నిలబడ్డాయి ఈ భూతాలరాజు ఆచూకీ తెలుసుకోవడానికి సరిగ్గా సంవత్సరంపాటు పాటుపడ్డాడు తను. ఎంతో ప్రయాసపడిన తర్వాత తెలిసింది. అతను జైల్లో ఉంటున్నాడని.
ఎలా ఉంటాడతను? నరరూప రాక్షసుడిలా భయంకరంగా ఉంటాడా? పచ్చి మాంసం పీక్కుతినే వాడిలా భీభత్సంగా ఉంటాడా?
కానీ భూతాలరాజుని ప్రత్యక్షంగా చూశాక సందీప్ కి నోటినుండి మాట రాలేదు. అతను చాలా సాదాసీదాగా ఉన్నాడు. మామూలు పర్సనాలిటీ, దొప్ప చెవులు. ఆ దొప్ప చెవులవల్ల అతని మొహానికి కొంచెం అమాయకత్వం వచ్చింది.
అతని కుడికన్ను గాజుది. నిశ్శబ్దంగా చూస్తోంది అది.
"చిన్నప్పుడు గిల్లీ దండా ఆడుకుంటే దెబ్బ తగిలింది. కన్ను తీసేశారు" అన్నాడు భూతాలరాజు, సందీప్ మొహంలోని ప్రశ్నార్థకాన్ని గమనించి. అతని గొంతు సౌమ్యంగా స్నేహపూర్వకంగా ఉంది. "నీ పేరేమిటి బాబూ ?"
"సందీప్ !" అన్నాడు సందీప్, భూతలరాజుని పరిశీలనగా చూస్తూ. తను ఊహించుకున్న వ్యక్తికీ, ఇప్పుడు చూస్తున్న రూపానికీ ఏమాత్రం పోలికలేదు.
అఫ్ కోర్స్ ! దొంగలందరూ దొంగ మొహాలతో ఉండరు. చూడగానే 'వీడు హంతకుడు' అనిపించే వ్యక్తి నిజానికి చీమకి కూడా అపకారం చెయ్యలేని వాడయి ఉండొచ్చు. రూపాన్ని బట్టి మనిషిని అంచనా వెయ్యడం సరికాదు.
"నాకు ఏ పాపం తెలియదు బాబూ ! నేను దొంగనోట్లు అచ్చుకొడతానని నేరం బనాయించి జైల్లో పెట్టేశారు. ఏమన్నా నమ్మేటట్లు వుందా ఇది ? నువ్వు ఏం నేరం చేశావూ ?" అన్నాడు భూతాలరాజు.
తెప్పరిల్లుకుని చూశాడు సందీప్. "నేను నేరస్థుడిని కాను. నిన్ను కలుసుకోవాలని చాలా తంటాలు పడి, ఈ సెల్ లోకి వచ్చాను. నేను ప్రొఫెసర్ శేషాద్రి గారి కొడుకుని."
"శేషాద్రా ? ఆయనెవరు ?"
"ప్రొఫెసర్ శేషాద్రిగారు ఆర్కియాలజిస్టు. ఆయన తన యూనిట్ తో సహా అడవిలోని మమ్మీని వెదుకుతూ వెళ్ళినప్పుడు దారి చూపించడానికి నువ్వు గైడ్ గా వెళ్ళావు. అవునా ?"
కొద్దిక్షణాల సేపు ఆశ్చర్యంగా చూశాడు భూతాలరాజు. క్రమంగా అతని మొహంలో నవ్వు చోటుచేసుకుంది.