Previous Page Next Page 
హైజాక్ పేజి 4

నిశ్చేష్టురాలయింది సుజాత.
"పరిస్థితి అంతా వివరంగా మీ పేరెంట్స్ కి తెలియబరిచి పెళ్ళిచూపులు వాయిదా వెయ్యమని అడగండి" అన్నాడు రెడ్డి.
"కాని అతను రెండు వారాలకంటే ఎక్కువ రోజులు ఉండడు ఇండియాలో."
సారీ వన్స్ ఎగెయిన్" అని లేచి నిలబడ్డాడు రెడ్డి.
అమెరికా అబ్బాయితో సగం పెళ్ళి నిశ్చయమయి పోయినట్లే అన్న ధీమాతో ఉన్న సుజాతకి హఠాత్తుగా నిరుత్సాహం ముంచుకొచ్చేసింది. వాళ్ళు అంత దూర దేశం నుంచీ తనని చూడడానికి వస్తుంటే తను వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోతుందా? కారణం ఏం చెబుతుంది? బ్యాంకు రాబరీ జరిగిందనీ, దాని మూలంగా, పోలీసులు తనని ప్రశ్నిస్తున్నారనీ, అందుకని తను రాలేకపోతోందనీ చెప్పాలా? ఇందులో తన తప్పేమీ లేకపోయినా వినేవాళ్ళకు ఎలా ఉంటుంది? ఈ ఎంక్వయిరీ అంతా పూర్తి అయ్యేదాకా వాళ్ళు తన కోసం కనిపెట్టుకుని ఢిల్లీలోనే ఉంటారా? లేకపోతే, ఇలాంటి సంబంధం మనకెందుకులే అని వదులుకుంటారా?
అంతా అయోమయం!
ఆ దొంగ ఎవడోగాని, బ్యాంకులోని అబ్బుతోబాటు తన భవిష్యత్తుని కూడా దోచేశాడు! దరిద్రుడు!
ఎప్పటికి పూర్తి అవుతుంది ఈ విచారణ? ఎప్పుడు చేరుకోగలదు తను ఢిల్లీకి?
"ప్రస్తుతానికి మీరు లీవు కాన్సిల్ చేసుకోండి. నాతో వస్తే కార్లో మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను" అన్నాడు బ్యాంకు మేనేజరు.

                                                      *    *    *    *

 పిక్చర్ మొదలయింది. అరమోడ్పు కన్నులతో చూస్తున్నాడు వివేకానంద్.
హీరోయిన్ శాలిని తెల్లటి పల్చటి చీరె కట్టుకుని జలపాతం కింద తడుస్తూ, దొర్లుతుంది.
"అబ్బ! ఏం పర్సనాలిటీ డాడీ!" అన్నాడు వివేకానంద్ తన్మయంగా.
బోర్ గా చూస్తున్నాడు శతృఘ్న.
తెర మీద శాలిని వంపులని ప్రేక్షకులు ఊహించుకోడానికి ఇంకేమీ మిగల్చకుండా బయట పెట్టేస్తోంది.
"స్స్ స్స్ స్స్!" అన్నాడు వివేకానంద్ తాపంగా.
శతృఘ్న అతని చెయ్యినొక్కి వారించబోయాడు. అయినా వినలేదు వివేకానంద్. గొణుక్కుంటున్నట్లు ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు. "ఏం పర్సనాలిటీ బాస్! కొంతమంది అమ్మాయిలకు వెనక పర్సనాలిటీ, ముందు మునిసిపాలిటీ! ఇదట్లా కాదు! ఒక్కసారి దీన్ని..."
"ఊర్కోరా బాబూ!" అన్నాడు ఇక్బాల్.
"....ఒక్కసారి దీన్ని ఎంజాయ్ చేయడం కోసం ప్రాణాలైనా ఇచ్చెయ్యొచ్చు డాడీ! నిన్న పొద్దున్న ఇందిరా పార్కులో పాట షూటింగ్ జరుగుతుంటే చూశాను. ఏం కలర్ బాస్! గులాబిరంగులో ఉంటుంది."
"మేనుని కప్పేది మేకప్పు అన్నారు" అన్నాడు ఇక్బాల్ "మేకప్పు చేస్తే నువ్వు కూడా గులాబీరంగులోనే ఉంటావ్!"
తమ అభిమాన తారని విమర్శిస్తే వీరాభిమానులకి ఎంత తిక్కరేగుతుందో అంత తిక్కా రేగింది వివేకానంద్ కి.
"షట్-అప్! బాస్టర్డ్! శాలినిది రియల్ కలరు! ఈసారి శాలినిని ఏమన్నా అన్నావంటే - ఐవిల్ బరీ యూ ఎలైవ్! ఏం చెబుతున్నానూ? యా! పాట మిగతా భాగం ఇవాళ కుతుబ్ షాహి టోంబ్స్ దగ్గర షూట్ చేసేసి ఉంటారు. రేపటినుంచీ రెండు వారాలపాటు స్టూడియోలో ఇండోరు"
"సిగదరగ! దాని కాల్షీట్లూ, డైరీ అంతా నువ్వెలా బట్టీపట్టావురా?" అన్నాడు ఇక్బాల్.
"అవుట్ డోర్ షూటింగులో ఏ జూనియర్ ఆర్టిస్టునో పట్టి ఉంటాడు" అన్నాడు శతృఘ్న.
వాళ్ళని పట్టించుకోకుండా గడగడ మాట్లాడుతూనే ఉన్నాడు వివేకానంద్.""పదిహేనోరోజున ఈవెనింగ్ ఫ్లయిట్ లో తను ఢిల్లీ వెళ్తోంది బాస్! అక్కడ తనకు సన్మానం బెస్ట్ యాక్ట్రస్ అవార్డూ_"
ఒంటికి అంటుకుపోయిన బట్టలతో ఉన్న శాలిని డాన్సు పేరుతో అసభ్యకరమైన జర్కులూ, ఒంపులూ ఇస్తోంది. వివేకానంద్ కి ఒళ్ళు వేడెక్కింది.
"డాడీ! డాడీ! ఒక్కసారంటే ఒక్కసారి శాలినిని అనుభవించడానికి ఆమె ఎక్కిన విమానాన్ని హైజాక్ చెయ్యడానికైనా తయారే నేను!" అన్నాడు. అతని మాట ముద్దగా వస్తూంది.
ఇక్బాల్ పెద్దగా నవ్వాడు.
కానీ శతృఘ్న నవ్వలేదు. హఠాత్తుగా బిగుసుకుపోయాడు.
హైజాక్! ఆకాశంలో పోతున్న విమానాన్ని లొంగదీసుకుని దారి మళ్ళించడం!
ఎంత థ్రిల్లు!!!

                                                      *    *    *    *
రాత్రి ఒంటిగంట అవుతున్నా ఇంకా ఇంటికి వెళ్ళలేదు వెంకటరెడ్డి. కుర్చీలో నిటారుగా కూర్చుని తీవ్రంగా ఆలోచిస్తూనే ఉన్నాడు. అతనికి కొంచెం దూరంలో కూర్చుని ఉన్న కానిస్టేబులు ఆవలింతలు ఆపుకోడానికి ప్రయత్నిస్తున్నాడు.
ఏదో గుర్తు వచ్చినట్టు చటుక్కున లేచి నిలబడ్డాడు రెడ్డి. "నేను టీ తాగి వస్తాను" అని ముక్తసరిగా కానిస్టేబుల్ తో చెప్పి బయటికి వచ్చి మోటర్ సైకిల్ స్టార్ట్ చేశాడు.

 

 Previous Page Next Page