Previous Page Next Page 
మండు వెన్నెల పేజి 4

పింకీ అనే ఆ అమ్మాయి చటుక్కున అనేసింది. "అంతా ఉత్తది! మనింట్లో వున్న టూ ఇన్ వన్ చాలా చిన్నది కదా? దానిమీద అసలు బొమ్మనెలా పెడతావ్? పైగా పొద్దున ఎలా పెడతావ్? అన్నీ అబద్ధాలు! నేను పుట్టకముందు నుంచీ నువ్వు మొద్దునిద్దర పోతున్నావుగా! అమ్మ చెప్పిందిలే!"
గడుసుగా మాట్లాడుతున్న ఆ చిన్నపిల్లవైపు ఒకసారి భయంగా చూసి, తండ్రి గుండెల్లో తల దాచుకుంది భాను.
ఇబ్బందిగా ఫీలయ్యాడు రఘురాం. పింకీని వెళ్ళమని సైగచేసి, భానురేఖ తల నిమురుతూ ఉండిపోయాడు.
వెచ్చటి ఆమె కన్నీళ్ళతో తన షర్టు తడిసిపోతూ ఉండడం తెలుస్తూనే ఉంది. కాసేపు అయ్యాక నిద్ర పట్టేసింది భానూకి. మళ్ళీ మెలకువ వచ్చేసరికి ఇంట్లో ఎవరూ ఉన్న అలికిడి లేదు.
కాసేపు అలానే పడుకుని ఉండి, తర్వాత ప్రయత్నపూర్వకంగా లేచి నిలబడింది భానురేఖ. నీరసంగా, నిస్సత్తువగా ఉంది ఒళ్ళు. బలంలేని బంగారు తీగ నిటారుగా నిలబడడానికి ప్రయత్నిస్తున్నట్లు ఉంది అది.
అతి కష్టంమీద అడుగు తీసి అడుగు వేస్తూ, తన నర్సరీ రూమ్ వైపు నడిచింది భానురేఖ. గడియ తీసి లోపలికి వెళ్ళింది. గోడలకి అంతా బూజుపట్టి ఉంది. గదిలో తన చిన్న మంచం, చిన్న కుర్చీ, టేబులూ, పుస్తకాలూ, లెఖ్ఖలేనన్ని బొమ్మలా వున్నాయి. మంచం కిందపడి ఉంది. బంగారపు జుట్టుతో, నీలి కళ్ళతో ఉన్న పింకీ బొమ్మ. బాగా దుమ్ము కొట్టుకుపోయి ఉంది అది. దాన్ని తీసుకుని, తుడిచి, ఆప్యాయంగా ముద్దు పెట్టుకుంది భాను. వేళ్ళతో దాని జుట్టు సరిచేసింది. తన టేబులు దగ్గరికి నడిచి స్కూలు ఫీజు బుక్కు తీసి చూసింది. ఆప్సెంట్ అయిన రోజులకి కారణం రాసి, పేరంట్స్ చేత సంతకం పెట్టించి, ప్రిన్సిపాల్ కి చూపించాలి ఆ పుస్తకాన్ని.
వేళ్ళమీద లెఖ్ఖపెట్టి చూసింది భాను.
ఎన్నిరోజులు ఆప్సెంట్ అయింది తను?
నిన్న, మొన్న, అటు మొన్న - మూడు రోజులా?
మూడు రోజులూ యాక్సిడెంటు వల్ల స్కూలుకి ఆప్సెంట్ అయిందని రాయాలా? లేకపోతే ఫీవర్ అని రాస్తే చాలా? అమ్మని అడగాలి.
హఠాత్తుగా సుడిగాలి గదిలోకి వచ్చినట్లు వచ్చేసింది ఆమె సవతి చెల్లెలు పింకీ. భానురేఖ చేతిలోని బొమ్మని ఒక ఉదుటున లాగేసుకుని పరిగెత్తి వెళ్ళిపోయింది.
ఉక్రోషంతో దుఃఖం వచ్చింది భానూకి. లేని ఓపిక తెచ్చుకుని తనుకూడా గబగబ ఆ అమ్మాయి వెనుక వెళ్ళింది.
ఆ పిల్ల నవ్వుతూ, పింకీ బొమ్మ కాళ్ళూ, చేతులూ అటూ ఇటూ వంచేస్తుంది.
"ఏయ్! నా పింకీకి నొప్పు పుడుతుంది! ఏడుస్తుంది!" అంది భాను ఆదుర్దాగా.
"పోవే పిచ్చీ! బొమ్మలకెక్కడన్నా నొప్పి పుడుతుందేమిటి? నేనెన్ని బొమ్మలు విరక్కొట్టానో తెలుసా? అవన్నీ ఏడిచాయా ఏమిటి?"
"నా పింకీని నాకిచ్చేయ్!"
"ఇవ్వను! ఏం చేస్తావ్?"
"అమ్మా"! అంది భానురేఖ ఏడుపు గొంతుతో -
"నీకు అమ్మలేదుగా! మీ అమ్మ చచ్చిపోయిందట? మా అమ్మ చెప్పింది!"
పిడుగు పడ్డట్లు చూసింది భానూ. "నువ్వు అబద్ధాల కోరువి!" అంది మెల్లిగా.
"గాడ్ ప్రామిస్! మీ అమ్మ చచ్చిపోకపోతే తన ఫోటోకి కుంకుమ బొట్టు ఎందుకు పెడతారు? కావాలంటే డాడీ ఆఫీసు రూంలో చూస్కో పో! యా! యువర్ మదర్ ఈజ్ యాజ్ డెడ్ యాజ్ ఏ డోడో!" అని, బొమ్మతో సహా పారిపోయింది పింకీ అనే పెంకిపిల్ల.
కలలో నడుస్తున్నట్లు ఒక్కొక్క గదీ దాటుకుంటూ నాన్నగారి ఆఫీసురూంలోకి వచ్చింది భాను. గోడమీద ఫోటోలో నుంచి తనవేపే చూస్తుంది అమ్మ. "దామ్మా! జ్వరం తగ్గిపోయిందా?" అని ముద్దు చేస్తూ అడిగినట్లనిపించింది.
ఉన్నట్లుండి దుఃఖం పొర్లుకొచ్చింది భానూకి.
"అమ్మా!" అంది వెక్కివెక్కి ఏడుస్తూ.
"నేనీ ఫోటోలో బందీనయి పోయానమ్మా! బయటికి రాలేను" అన్నట్లు దిగులుగా చూసింది అమ్మ.
చాలాసేపటిదాకా అలా ఏడుస్తూ ఉండిపోయింది భానూ. అప్పుడు వచ్చాడు రఘురాం గదిలోకి. చాలాసేపటి వరకూ అతన్ని గమనించలేదు భానురేఖ.
గమనించాక, "నాన్నా!" అంది జీరపోయిన గొంతుతో. "అమ్మ...అమ్మ ఏది నాన్నా? చెప్పరా?"
భానూని దగ్గరికి తీసుకుని తల నిమురుతూ మౌనంగా ఉండిపోయాడు రఘురాం.
"చెప్పండి నాన్నా!"
గద్గదికమైపోతున్న గొంతుని అతికష్టం మీద స్వాధీనంలోకి తెచ్చుకుని అన్నాడు రఘురాం. "నీకు పూర్తిగా మెలుకువ వచ్చేసిందా డార్లింగ్ బేబీ?"
"వచ్చింది నాన్నా! చెప్పండి! అమ్మేదీ?"
"అమ్మ దేముడి దగ్గరికెళ్ళిపోయిందమ్మా!"
చాలాసేపు మాట్లాడలేదు భానురేఖ. ఆమె వీపు ఎక్కిళ్ళతో ఎగిరెగిరి పడుతుంటే, ఓదార్పుగా రాస్తూ ఉండిపోయాడు రఘురాం.
హఠాత్తుగా అంది భానూ. "మనం కూడా దేముడి దగ్గరికి వెళ్ళిపోవచ్చా నాన్నా?"
విషాదంగా నవ్వాడు రఘురాం. "అందరమూ అక్కడికెళ్ళిపోవలసిన వాళ్ళమే స్వీటీ! దేముడు తనకి ఇష్టమైన వాళ్ళని త్వరగా వెనక్కి పిలిపించేసుకుంటాడమ్మా!"
"అయితే దేముడికి నేనంటే ఇష్టం లేదా నాన్నా? నన్నెందుకు పిలిపించేసుకోలేదు?"

 Previous Page Next Page