Previous Page Next Page 
బుద్ధిజీవి పేజి 5

జనమంతా మంద బుద్ధుల్లా అతని మాటలు వింటున్నారు.
ఆ హృదయేష్ ని ఒకసారి ఆగమని చెప్పి తన టేప్ ని ఆన్ చేసి విన్నాడు లేసర్ కిరణ్. స్పష్టంగానే రికార్డయ్యాయి అతని మాటలన్నీ.
అజిత్ తన టేపు ఆన్ చేశాడు. టేపు తిరుగుతోంది. కానీ శబ్దమేమీ రావటం లేదు.
"అదేమిటి? మీ రికార్డరు వర్కింగ్ కండిషన్లో లేదా?" అన్నాడు లేసర్.
"రికార్డరు శుభ్రంగా పనిచేస్తోంది. అంచేత ఈ కుర్రాడు చెప్పిన అబద్ధాలేవీ రికార్డు చెయ్యలేదు. అతని చేతికి ఇచ్చిన మైక్రోఫోన్ లో 'లై డిటెక్టర్' ఉంది. అతని శారీరక స్థితిని బట్టీ అతను అబద్ధాలు చెబుతున్నాడని గ్రహించి, ఆటోమాటిక్ గా ఆఫ్ అయిపోయింది" అని హృదయేష్ వైపు చూసి, "థాంక్స్ ఫర్ ది ఫన్!" అన్నాడు అజిత్.
ఆశ్చర్యంగా చూస్తున్న లేసర్ తో వస్తామని చెప్పి బయటికి నడిచారు అజిత్, అపురూపా.
"అదిగో పులి అంటే ఇదిగో తోక అనే ఇలాంటి మనుషుల వల్లే చాలా విషయాల తాలూకు నిజానిజాలు ఎటూ తేల్చుకోలేకుండా ఉండిపోతాం" అన్నాడు అజిత్.
"అవును! నిజమే!" అంది అపురూప.
ఇద్దరూ కారెక్కారు.
"ఒక్కసారి మళ్ళీ ఆ విమానం కూలిపోయిన స్థలం చూడాలని ఉంది నాకు" అన్నాడు అజిత్.
కాసేపటి తర్వాత ఊరి బయట విమానం పడిపోయిన చోటికి వచ్చారు.
తీవ్రంగా ఆ పరిసరాలన్నీ పరిశీలించాడు అతను. తర్వాత రేడియో యాక్టివిటీని కనిపెట్టే చిన్న పరికరాన్ని తీశాడు.
గజగజలాడుతోంది దానిలోని ముల్లు. చేతికి ఉన్న వాచ్ చూసుకున్నాడు. అది ఆగిపోయింది. కానీ దిక్సూచీలో, ఉత్తర దక్షిణాలని చూపించవలసిన ముల్లు మాత్రం గిర్రున సెకెండ్ల ముల్లులా తిరుగుతోంది చిత్రంగా. అక్కడ ఊరికే నిలబడితేనే కడుపులో తిప్పినట్లు వికారంగా ఉంది.
నుదురు చిట్లించి ఆలోచించాడు అజిత్.
ఒక వైపంతా తాటిచెట్లు.
అతని సునిశితమైన దృష్టికి ఆ తాటి ఆకుల్లో ఏదో విశేషం కనిపించింది.
పాదరసం పూసినట్లు మెరుస్తున్నాయి ఆ ఆకులు - వాటిపైన ఏదో గుర్తు తెలియని వాహనం సుతారంగా కాసేపు ఆగి వెళ్ళిపోయినట్లు.
ఒక్క అంగలో తాటి చెట్టుని చేరి చకచక పైకి ఎక్కాడు.
పైకివెళ్ళి చూస్తే ఏమీలేదు. మామూలుగానే ఉన్నాయి ఆకులు.
మరి ఇందాక...?
బహుశా ఎండ పొడ పడి అలా మెరుస్తున్నట్లు కనబడి ఉండొచ్చు.
కిందకి దిగి మళ్ళీ చూశాడు అజిత్.
ఇప్పుడు మామూలుగానే పచ్చగా కనబడుతున్నాయి. నో! ఇందాక ఇలా కనబడలేదు ఆకులు! మెరుస్తున్నాయి ఇందాక అవి!
తను చెట్టు ఎక్కేలోగా ఆ మెరుపు మాయమయింది.
"అపురూపా! విమానం కూలిపోకముందు నిశ్చయంగా ఇక్కడేదో విశేషం జరిగింది! మనం ఒక్కసారి ఆ పైలట్ తో మాట్లాడాలి. కమాన్!" అన్నాడు.
ఈసారి అతని కారు నేలమీద పరిగెత్తలేదు. హెలీకాఫ్టర్ లా తిన్నగా గాలిలోకి లేచి బాణంలా ముందుకు దూసుకుపోయింది.
కొద్దిక్షణాల తర్వాత హాస్పిటల్ ముందు దిగింది కారు.
అక్కడ మెట్ల దగ్గరే నిలబడి ఉన్నాడు కమీషనర్ విక్రమ్. వాళ్ళని చూడగానే మొహం చిట్లించాడు.
"కమీషనర్! ఒక్కసారి - ప్లీజ్ ఒక్కసారి పైలట్ తో మాట్లాడాలి నేను."
"బహుశా అది సాధ్యం కాదేమో!" అన్నాడాయన కాస్త వ్యంగ్యంగా. "అయిదు నిమిషాల క్రితమే చనిపోయాడు పైలట్!"
హతాశుడైపోయాడు అజిత్.
"మిస్టర్ అజిత్! మళ్ళీ ఒకసారి చెబుతున్నాను. దయచేసి మీ లిమిట్స్ దాటకండి. మా డ్యూటీకి మీరు అడ్డం పడకపోయినా మాకు వచ్చే నష్టమేమీ లేదు." అన్నాడు కమీషనర్ కటువుగా.
ఇల్లు చేరేసరికి సొమ్మసిల్లిపోయినట్లయింది అపురూప ప్రాణం.
టీ.వీ. ఆన్ చేసి ఒక ప్రైవేట్ ఛానెల్ కి ట్యూన్ చేశాడు అజిత్.
వెంటనే స్క్రీన్ మీద లేసర్ కిరణ్ కనబడ్డాడు. 'మన పాలపుంతలో వింతలు!' అన్న ప్రోగ్రాం చేస్తున్నాడతను.
అజిత్ 'లై డిటెక్టర్' ద్వారా శుద్ధ అబద్ధాలని తేలిపోయిన హృదయేష్ ఇంటర్వ్యూని యధాతథంగా వినిపించాడు. తర్వాత అజిత్, అపురూపా కనబడ్డారు స్క్రీన్ మీద. గ్రహాంతర నాగరికతలను గురించి అజిత్ చెప్పినదంతా కూడా వినిపించాడు. తర్వాత తా కామెంటరీ చెప్పడం మొదలెట్టాడు లేసర్ కిరణ్.
"గ్రహాంతర వాసులని గురించి ప్రఖ్యాత సైంటిస్టు సంజీవ్ కుమారుడు అజిత్ చెప్పింది విన్నారు. గ్రహాంతర వాసులని ప్రత్యక్షంగా చూసిన హృదయేష్ తో ఇంటర్వ్యూ కూడా విన్నారు.
గత రెండు మూడు రోజులలో జరిగిన విచిత్రమైన సంఘటనలు జోడించి చూస్తే నిజంగా జరిగినదేమిటో మనకు అర్థం అవుతుంది.
ఎవరో గ్రహాంతర వాసులు భూగోళం మీదకి వాళ్ళ ఫ్లయింగ్ సాసర్లలో వచ్చారు. వారు తమ శక్తితో డాక్టర్ సంజీవ్ సృష్టించిన 'నరహరి' అనే రాబొట్ ని వశపర్చుకుని, దానిచేతే ఆయన్ని చంపించారు. ఆ రాబొట్ చేతే డాక్టర్ శోధనని బంధించి ఆమె తయారుచేసిన విషక్రిమిని సంపాదించారు.
అయితే గ్రహాంతర వాసులకు ఆ విషక్రిమితో అవసరమేమిటన్న ప్రశ్న రావచ్చు. దీనికి జవాబు స్పష్టంగా కనబడిపోతూనే వుంది. ఆ విషక్రిమిని ప్రయోగిస్తే కొద్దిరోజుల్లో ఈ భూగోళం మీద ఒక్క ప్రాణి కూడా మిగలదు. నిర్జీవమైపోతుంది.
ఈ నరహరి అనే రాబొట్ మనిషిని మించిన తెలివి గలది అన్న సంగతి మనకు తెలుసు. తగిన ముడిపదార్థాలు ఉంటే ఇది తనలాంటి మరమనుషులని డిజై చేసి అసంఖ్యాకంగా తయారుచెయ్యగలదు కూడా!
అలా భూమిమీద జీవరాసులన్నీ చనిపోయి ఆ స్థానాన్ని మరమనుషులు ఆక్రమించుకుంటాయి. ఆ మరమనుషులని తమ గ్రహంలో నుంచే రేడియో సిగ్నల్స్ ద్వారా అదుపు చేస్తూ భూగోళాన్ని తమ రెండో స్థావరం చేసుకుంటారు గ్రహాంతరవాసులు.
దేవుడే రక్షించాలి ఇక మనల్ని!
"థాంక్యూ లేడీస్ అండ్ జెంటిల్ మెన్! ఈ ప్రోగ్రాంలో ఇంటర్వ్యూ ఇచ్చి సహకరించిన హృదయేష్ కి హృదయపూర్వక ధన్యవాదాలు. అజిత్ కీ, అతని ప్రేయసి అపురూపకీ అభినందనలు!"
ఉలిక్కిపడి "వాట్ హెల్!" అంది అపురూప కోపంగా. "ఎవరు ఎవరికి ప్రియురాలు? మీరలా చెప్పారా అతనితో?"
"ఇంటర్వ్యూ టైంలో మీరు నా పక్కనే వున్నారు" అని గుర్తుచేశాడు అజిత్ తన తప్పేమీ లేదన్నట్లు.
కాలితో నేలని బలంగా తన్ని తననితాను నిగ్రహించుకోవడానికి ప్రయత్నించింది అపురూప. ఆమె కళ్ళలో ఎర్రజీర కనబడింది.
"సారీ అపురూపా! అతను కేవలం సెన్సేషన్ క్రియేట్ చెయ్యడానికి ఏవేవో చెబుతున్నాడు. మెడకీ, కాలుకీ లంకె వేసినట్లు ఎంత తమాషా సిద్ధాంతం తయారుచేశాడో చూడండి. ఇలాంటి వాళ్ళని లక్ష్యపెట్టకూడదు" అన్నాడు అజిత్.
"ఇతని మొహం చూస్తేనే పాపం!" అని ఆగ్రహంగా ఛానెల్ మార్చింది అపురూప.
వెంటనే న్యూస్ అయిటమ్ ఒకటి వినబడింది. "...దేశములో ఒక మారుమూల ప్రాంతంలో ఒక చిత్రమైన వ్యాధి వ్యాపించింది. ఈ వ్యాధి సోకిన వాళ్ళకి శ్వాస అందకపోవడం, పెద్ద పెట్టున జ్వరం రావడమే కాకుండా, కనుపాపలు ఆకుపచ్చగా మారుతున్నాయి. ఈ లక్షణాలు బయటపడిన కొద్ది నిముషాల్లోనే డాక్టరు సహాయం అందేలోపలే మరణం సంభవిస్తోంది. వ్యాధికి కారణం తెలియరావటం లేదు.
ఈ ఊళ్ళో ఈ వింత వ్యాధి సోకి చనిపోయిన వారి సంఖ్యా ఇప్పటికే మూడువేలు దాటిందని తెలుస్తోంది."
ఫ్లయింగ్ సాసర్ల భయం అదుపుతప్పి పెరిగిపోవడం అలా మొదలయింది.

                                                           * * * *

"అపురూపా! మెకానికా దేశపు సరిహద్దుల్లో జాడ్యంలా వ్యాపిస్తున్న ఆ చిత్రమైన జబ్బేమిటో కనుక్కోవాలి. నేను వెళుతున్నాను." అని ఒక్కక్షణం ఆగి, "అపురూపా! మీ పరిచయాన్ని నిజంగా నేను అపురూపమైన అదృష్టంగా భావిస్తున్నాను. ఇది వూరికే ముఖస్తుతి కాదు - మనస్పూర్తిగా చెబుతున్నాను. సోలాంగ్!" అని చెయ్యి వూపి కదలబోయాడు అజిత్.
ఒకసారి అతనివైపు ఆందోలనగా చూసింది అపురూప.
"అమ్మ ఎక్కడ ఉందో, ఆ విషక్రిమి ఏమిటో, ఇవన్నీ తెలిసేదాకా నా మనసు మనసులో వుండదు. నేనూ మీతో వస్తాను. ప్లీజ్! నేనొక్కదాన్నే ఇక్కడ వుంటే - ఆదుర్దాతో నాకు బ్లడ్ ప్రషర్ రావడమో, సస్పెన్సుతో నరాలు తెగిపోవదమో తప్పదు!" అంది.
అజిత్ సాలోచనగా చూశాడు ఆమెని. "నాతో మీరు వచ్చారనుకోండి! మళ్ళీ ఏ లేసర్ కిరణో, ఎక్సరే కిరణో చూసి ఏవేవో కథలల్లేయవచ్చు."
"కథలు కాదు, నవలలు అల్లుకోమనండి! నాకు పంతం వస్తే ప్రపంచంలో ఎవరేం అనుకున్నా కేర్ చెయ్యను" అంది అపురూప బింకంగా.
ఆమె కళ్ళలో ఇందాకటి ఎరుపుజీర కనబడటం లేదు ఇప్పుడు.
ఇందాక లేసర్ కిరణ్ తనని అజిత్ ప్రేయసిగా పరిచయం చెయ్యకముందు అతనిపట్ల ఎలాంటి భావమూ లేదు తనలో.

 Previous Page Next Page