కానీ అతనన్న ఆ మాట ఆమె మనసుమీద కేటలిస్టులా పనిచెయ్యడం మొదలెట్టింది - సైలెంటుగానే! ఆ విషయం ఆమెకే తెలియదు.
పది నిమిషాల తర్వాత సూట్ కేసులో నాలుగు జతల బట్టలు పెట్టుకుని వచ్చింది అపురూప.
మళ్ళీ ఏదో గుర్తువచ్చి, సూట్ కేస్ అక్కడే పెట్టి లోపలికెళ్ళింది. తను బయటికి వెళ్ళినప్పుడు అమ్మ వస్తే తను ఎక్కడికి వెళ్ళిందో తెలియక గాబరా పడిపోతుంది. అందుకని మెసేజ్ ఉంచి వెళ్ళాలి.
మెసేజ్ రికార్డర్ దగ్గరికి వెళ్ళి ఆన్ చేసింది అపురూప. "అమ్మా! నేను నిన్ను వెదుకుతూ డాక్టర్ సంజీవ్ గారి అబ్బాయి అజిత్ తో మెకానికా వెళుతున్నాను. పైకి నేనెవరితోను చెప్పడంలేదు గానీ నాకు చాలా భయంగా ఉందమ్మా! నిన్ను చూడకపోతే దిగులుగా వుంది. అక్కడ నువ్వు కనబడకపోతే వెంటనే తిరిగి వచ్చేస్తాను. ప్లీజ్! నేనొచ్చేసరికి నువ్వు ఇంట్లోనే ఉండమ్మా! ప్లీజ్!"
ఆ తర్వాత అపురూప వెక్కిళ్ళు రికార్డయ్యాయి అందులో.
* * * *
కళ్ళు తెరిచింది డాక్టర్ శోధన. కళ్ళు చిట్లించి చూసింది. చిమ్మ చీకటి. ఏమీ కనబడటం లేదు.
"గుడ్డికన్ను మూసినా తెరిచినా ఒకటే!" అన్న సామెత గుర్తొచ్చింది.
తను గుడ్డిదయిపోయిందా? లేకపోతే తన చుట్టూ చీకటి వుందా? ఏమీ అర్థం కావటం లేదు.
తను పడుకుని వుందా? నిల్చుని వుందా? నిద్ర పోతోందా? కలగంటోందా? భ్రాంతి చెందుతోందా? ఏమిటిది? ఒళ్ళంతా ఇలా తేలికైపోతున్నట్లు వుందేమిటి?
అసలు తను బతికి వుందా? చనిపోయి వుందా?
చాలాసేపటి తర్వాత ఆమె కళ్ళు చీకటికి అలవాటు పడ్డాయి. మసక మసకగా కనబడుతోంది ఎదురుగుండా వున్న గోడ.
అప్రయత్నంగానే ఆమె చెయ్యి ఏదో మీటకి తగిలి పల్చటి కాంతి వ్యాపించింది.
మైగాడ్! ఇది గది కాదు! కాప్స్యూల్!
వెంటనే ఆమెకు తను తయారుచేసిన విషక్రిములు గుర్తొచ్చాయి. వాటిని ఇలాగే ఒక కాప్స్యూల్ లో పెట్టింది తను.
కానీ చిత్రంగా తనే కాప్స్యూల్ లోకి ఎలా వచ్చింది. చేసిన నేరానికి శిక్ష అనుభవిస్తున్నట్లు!
చుట్టూ చూసింది డాక్టర్ శోధన. నాలుగు గోడలు లేవు. చుట్టూ గుండ్రంగా వుంది అది. తళతళ మెరుస్తున్న స్టీలు గొట్టంలో తనని బంధించినట్లు వుంది.
ఎదురుగుండా అరడజను మీటలు కనబడుతున్నాయి.
ఒక మీట నొక్కింది శోధన. గ్లాసుతో మంచినీళ్ళు బయటికి వచ్చాయి. అవి చూడగానే ప్రాణం లేచివచ్చినట్లయింది. ఉద్వేగంతో నోరెండిపోయి ఉంది తనకు.
వణుకుతున్న చేతులతో గ్లాసు అందుకుంది డాక్టర్ శోధన. పెదవులకి ఆనించుకోబోతూ గ్లాసుని పరీక్షగా చూసింది.
అది గాజుగ్లాసు కాదు, స్టీలు గ్లాసు కాదు, ప్లాస్టిక్ గ్లాసు కాదు. మరేమిటి?
ఆ పదార్ధం - అది లోహమో - మరేదో - తనెప్పుడూ చూసినది కాదు. తనేకాదు, మనుషులెవ్వరూ చూసి ఉండరేమో?
దేనితో తయారయింది ఈ గ్లాసు?
తనెక్కడ ఉంది?
సన్నగా వణకడం మొదలెట్టాయి శోధన చేతులు. గ్లాసును వదిలేశాయి.
ఆ నీళ్ళు తనమీద పడతాయేమోనన్న భయంతో అసంకల్పిత ప్రతీకార చర్యగా ఒక్క అడుగు వెనక్కి వేసింది శోధన.
అప్పుడు చూసింది.
ఆ గ్లాసు కింద పడిపోలేదు. తలక్రిందులైపోయి అలాగే గాల్లో నిల్చుని వుంది.
దానినిండా నీళ్ళున్నా, గ్లాసు తలక్రిందులుగా ఉన్నా ఒక్క చుక్క కూడా కింద పడటం లేదు!
అంటే...అంటే...అది భార రహిత స్థితి.
అంటే...భూమి ఆకర్షణ పరిధిని దాటి వచ్చేసిందా తను?
ఎక్కడికి వచ్చింది? ఎంత దూరం వచ్చింది? ఎలా వచ్చింది?
భయంతో వివశురాలైపోయి, చుట్టూ వున్న స్టీలు గోడను రెండు చేతులతో దబదబ బాదింది శోధన. "ఎవరక్కడ? లెట్ మీ అవుట్! లెట్ మీ అవుట్!"
జవాబులేదు. దుర్భరమైన నిశ్శబ్దం!
ఒక్కక్షణం అలాగే వెర్రిగా చూసి, కోపంతో మెడలో వున్న ముత్యాల హారాన్ని తెంపి విసిరికొట్టింది శోధన.
ఆ ముత్యాలు కిందపడిపోకుండా, నిశ్చలంగా గాల్లోనే నిలబడిపోయాయి నక్షత్రాల్లా మెరుస్తూ!
అప్పుడు -
పైన మూతలా ఉన్న తలుపు పక్కకి జరిగింది.
అందులో నుంచి అస్పష్టంగా కనబడింది ఆ ఆకారం.
"నువ్వు మనిషివా? పశువ్వా? నన్నెందుకిలా బంధించావ్?" అంది శోధన అదుపు తప్పిన కోపంతో.
ఆకారం చిన్నగా, వ్యంగ్యంగా నవ్వింది.
"నేను మనిషినీ కాను, పశువునీ కాను. నేనొక రాబొట్ ని."
ఆ తర్వాత విహ్వలంగా కేకలు వేయడం మొదలెట్టింది శోధన.
* * * *
స్ఫటికంలా మెరిసిపోతున్న అజిత్ కారు - తేలిపోతోంది గాలిలో. అది సూపర్ సోనిక్ వేగంతో. అంటే శబ్దవేగాన్ని మించిన వేగంతో పోతున్నా లోపల కూర్చున్న వాళ్ళకి స్వల్పమైన అసౌకర్యం కూడా కలగటం లేదు.
డ్రాయింగ్ రూంలోనే సోఫాలో కూర్చున్నంత సాఫీగా జరుగుతోంది ప్రయాణం. విండోలో నుంచి చూస్తే కిందగా మబ్బులు ఫోంబెడ్ లాగా కనబడుతున్నాయి. విండో స్క్రీన్ లోనుంచి తదేకంగా ముందుకు చూస్తున్నాడు అజిత్.
ఓరగా అతన్ని చూసింది అపురూప. ప్రొఫైల్ ఎత్తుగా, అందంగా కనబడుతోంది అతని ముక్కు. బిగించిన పెదిమలని చూస్తే 'ఇతను తలుచుకున్న దానిని సాధించేదాకా వదలడు సుమీ!' అనిపిస్తుంది.
వదులుగా ఉన్న తెల్లని షర్టుని బిగుతుగా ఉన్న తెల్ల ప్యాంటులోకి టక్ చేశాడు. అతను కొద్దిగా కదిలినా భుజాలమీద ఉన్న కండలు చేపపిల్లల్లా తృళ్ళిపడటం షర్టు క్లాత్ లో నుంచి కూడా కనబడిపోతోంది.
షర్టు కాలరు మీద దాకా పడుతున్న ఉంగరాల జుట్టు, చెంపలమీద ఆ జుట్టుతో కలిసిపోయిన గెడ్డం, అలాంటి అయోమయ పరిస్థితిలో కూడా ప్రశాంతంగా ఉన్న మొహం!
"ఇంత విషాదంలో కూడా మీరు కామ్ గా వుండడం గొప్ప సంగతే! అదే నేనైతే, చూస్తున్నారుగా... చాలా అప్ సెట్ అయిపోతాను. చాలా నెర్వస్ నేనసలు! మీరు... తండ్రిని పోగొట్టుకుని కూడా... రియల్లీ హాట్సాఫ్ టూయూ!" అంది అపురూప సిన్సియర్ గా.
సంతోషం లేని నవ్వు నవ్వాడు అజిత్.
"జన్మనిచ్చిన తండ్రి చనిపోతే ఎవరికి మనసు చలించిపోదు అపురూపా? అయినా మన బాధని అందరి ముందూ ప్రదర్శిస్తూ దాన్ని అందరికీ పంచడం వల్ల వచ్చే లాభమేమిటి? "నీ దుఃఖాన్ని నువ్వే అనుభవించు, నీ సుఖాన్ని ఇతరులకు పంచిపెట్టు" అన్నది నా ఫిలాసఫీ."
"ఓమ్మిగోష్! మీకు ఫిలాసఫీ పిచ్చి కూడా ఉందా? ఇంకాసేపు పోతే 'జగమే మాయా!' అని కూడా చెబుతారేమో!" అంది అపురూప విసుగ్గా.
"జగమే మాయ అని వేదాంతాలు చెప్పడమే కాదు, మనం ప్రత్యక్షంగా అనుభవిస్తూనే వున్నాం అపురూపా!"
"బుల్ షిట్! ఏమిటామాయ?"
"ఉదాహరణకి ఒకటి చెబుతాను. బోలెడన్ని నక్షత్రాలు మనకి కోటానుకోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి. అతి దూరంలో ఉన్న ఒక నక్షత్రం తాలూకు కాంతికిరణాలు వేల మిలియన్ల కాంతి సంవత్సరాలపాటు పయనించి ఇవాళ మన కళ్ళలో పడుతున్నాయనుకుందాం. అంటే మనకు ఇవాళ ఆ నక్షత్రం ఆకాశంలో కనబడుతోంది. కానీ నిజానికి ఆ కాంతి కిరణం ఇలా కోటానుకోట్ల సంవత్సరాలు ప్రయాణంచేసి భూమిని చేరేలోపల ఆ నక్షత్రమే నాశనమైపోయి వుండొచ్చు. అది ఇవాళ అక్కడ లేకపోవచ్చు. కానీ అది మనకు కనబడుతూనే వుంది. ఇవాళే కాదు, ఇకముందు కూడా కోట్ల సంవత్సరాలపాటు అది కనబడుతూనే ఉంటుంది. - అక్కడ లేకుండానే! దీన్నే మీకు ఇష్టమైతే 'మాయ' అని వ్యవహరించుకోవచ్చు. పొడుగు, వెడల్పు, లోతు లాంటి కొలమానాలకి 'కాలం' అనే ఫోర్త్ డైమన్షన్ ని కూడా కలిపితే చాలా చిత్రంగా ఉంటుంది అపురూపా!
"అలాగే అయిన్ స్టీన్ ఊహించిన 'బ్లాక్ హోల్సు' అనే పెనుచీకటి గుయ్యారాలు విశ్వంలో ఉన్నాయనీ, అవి నక్షత్రాలకు నక్షత్రాలనే కాక అన్ని విధాలైన ఎనర్జీని మింగేస్తాయని, వాటిని సమీపిస్తున్న కొద్దీ కాలం కూడా స్లో అయిపోయి, వాటిని సమీపించగానే కాలం ఆగిపోతుందనీ..."
"కాలం ఆగిపోతుందా? డోంట్ బీ సిల్లీ" అంది చురుగ్గా.
ఇంతలో ఎదురుగుండా, చాలా దూరంలో కనబడింది వెండి పళ్ళెంలా తళతళా మెరుస్తున్న ఫ్లయింగ్ సాసర్.
'అదిగో! దాన్ని అందుకోవాలి!" అంటూ స్పీడు ఎక్కువ చేశాడు అజిత్.
తుపాకి గుండులా దూసుకుపోయింది కారు. సరిగ్గా ఎనిమిది సెకండ్లలో ఆ ఫ్లయింగ్ సాసర్ ని చేరుకుంది.