Previous Page Next Page 
బుద్ధిజీవి పేజి 4

ముగ్గురూ అజిత్ కారు ఎక్కి రెస్టారెంట్ చేరుకున్నారు. కుర్చీలూ, బల్లలూ మాత్రమే ఉన్నాయి అక్కడ. సర్వర్లు లేరు. మధ్యలో మూడు మెషిన్లు ఉన్నాయి. అందులో ఒకటి కాఫీ డిస్పెన్సరు, రెండోది టిఫిన్లు అందించేది. మూడో మెషిన్ మంచి నీళ్ళు అమ్ముతుంది.
లేసర్ కిరణ్ జేబులోనుంచి చిల్లరతీసి మూడు వంద రూపాయ నాణాలు కాఫీ డిస్పెన్సరులో వేశాడు. మూడు పేపరు కప్పులతో కాఫీ వచ్చింది. వాటర్ డిస్పెన్సరులో రెండొందల రూపాయల నికెల్ నాణెం వేశాడు. ఒక సీసా నిండా మంచినీళ్ళు వచ్చాయి.
అవి ట్రేలో పెట్టుకుని, మూలగా ఉన్న ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు.
"సో! మీరు అమెరికాలోనే కదా ఉండేది?" అన్నాడు లేసర్, ఇంటర్వ్యూ మొదలెడుతూ.
"నా బేస్ అమెరికానే. కానీ ప్రపంచమంతా తిరుగుతుండడం నా హాబీ!"
"దానికి ప్రత్యేకమైన కారణం ఏదన్నా ఉందా?"
"ఉంది. నేను సోషియాలజీలో రిసెర్చి చేస్తున్నాను."
"మీ ఫాదర్ రాబొటిక్స్ లో స్పెషలిస్టు. మీకు దానిలో ఇంట్రస్టు లేదా?"
అజిత్ నవ్వాడు.
"ఇంట్రస్టు సంగతి చెప్పాలంటే నాకు రాబొటిక్స్ లోనే కాదు, ఆంత్రోపాలజీలో, ఆస్ట్రోఫిజిక్సులో, ఆర్గానిక్ కెమిస్ట్రీలో, అప్లయిడ్ మేథమేటిక్స్ లో - అన్నిట్లోనూ ఇంట్రెస్టు ఉంది. కానీ నా అభిమాన విషయం మాత్రం సోషియాలజీ."
"ఐసీ! ఐసీ! మీరు సకలకళా వల్లభులన్నమాట! మిస్టర్ అజిత్! ఇంతకీ తప్పించుకు పోయిన రాబొట్ ని గురించి ఏమిటి మీ ఉద్దేశం? డాక్టర్ సంజీవ్ అలాంటి వెర్రిపని ఎందుకు చేశారంటారు?"
తన తండ్రిని గురించి ఆ విలేకరి చులకనగా మాట్లాడటం అజిత్ కి నచ్చలేదు. కొంచెం సీరియస్ గా అన్నాడు. "ప్రతి మనిషీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు పొరపాటు చెయ్యవచ్చు. అలాంటి పొరపాట్లు అలవాటుగా చేస్తుంటేనే మనం తప్పు పట్టాలి. డాక్టర్ సంజీవ్ చేసిన మంచి పనులే నేను గుర్తుంచుకుంటాను. ఆ రాబొట్ త్వరలోనే నాశనమైపోయి, ప్రపంచానికి భయం తొలిగిపోతుందని ఆశిద్దాం!"
"ఓకే! ఒకే! సీరియస్ గా అయిపోకండి! ఫ్లయింగ్ సాసర్లని మీరు నమ్ముతారా?"
కొంచెం ఆలోచించి, నిదానంగా చెప్పాడు అజిత్ - "దీనికి అవునూ, కాదూ అని సమాధానం చెప్పడం కంటే, కొన్ని ఫాక్ట్స్ మీకు చెబుతాను. మీకు కొద్దిగా బోర్ అనిపించవచ్చు బహుశా!"
"చెప్పండి!"
అపురూప కూడా అప్రయత్నంగానే వినసాగింది.
"మిస్టర్ లేసర్ కిరణ్! మీకు కాంతి కిరణం పయనించే వేగం ఎంతో తెలుసా? కాంతి సంవత్సరం అంటే అయిడియా ఉందా?"
లేసర్ కిరణ్ ఛాతీ పెద్దది చేశాడు.
"మీ అంత కాకపోయినా, నాకూ కొద్దో గొప్పో తెలుసు అజిత్! కాంతి కిరణం సంవత్సరంలో రెండులక్షల తొంభై తొమ్మిది వేల ఏడువందల ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. దాన్ని కాంతి సంవత్సరం అంటారు."
తల వెనక్కి వాల్చి నవ్వాడు అజిత్.
"ఇలాంటి వాటినే సగం నిజాలు - హాప్ ట్రూత్స్ అంటారు మీ జర్నలిస్టులు. కాంతికిరణం రెండు లక్షల తొంభై తొమ్మిది వేల ఏడువందల ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. నిజమే! కానీ సంవత్సరంలో కాదు - సెకండులో! ఒకే ఒక్క సెకెండుకి అంత వేగంతో కాంతి ఒక సంవత్సరంలో పయనించే దూరాన్ని ఒక కాంతి సంవత్సరం అంటారు. మన విశ్వం అంచు దాదాపు పధ్నాలుగు బిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది."
ఆ దూరాన్ని ఊహించడం లేసర్ కిరణ్ కి సాధ్యం కాలేదని అర్థమావుతూనే ఉంది. ఊరికే బుర్రాడించాడు అతను.
"ఈ విశాల విశ్వంలో లక్ష మిలియన్ల గెలాక్సీలు ఉన్నాయి. ఒక్కో గెలాక్సీలో కోటానుకోట్ల నక్షత్రాలు వుంటాయి. వాటిలో చాలా నక్షత్రాలకి గ్రహాలూ ఉండొచ్చు - ఆ గ్రహాలకి మళ్ళీ ఉపగ్రహాలూ ఉండొచ్చు."
ఈ సమాచారాన్ని మింగడానికి బాటిల్ ఎత్తి గటగట మంచినీళ్ళు తాగాడు లేసర్ కిరణ్.
"ఏ గ్రహమైనా, దాదాపు మన గ్రహం సైజులోనే, ఏ సూర్యుడికీ మరీ దగ్గరగా గానీ, మరీ దూరంగా కానీ లేకుండా వుండి, తగిన వాతావరణం కలిగి వుంటే, అక్కడ ప్రాణికోటి ఉద్భవించే అవకాశం ఉండవచ్చు.
ఈ విశాల విశ్వంలో భూమిమీదే కాక, చాలా చోట్ల ప్రాణికోటి వుండే అవకాశం ఉందంటున్నారు శాస్త్రజ్ఞులు. కేవలం మన భూమి మాత్రమే చాలా స్పెషల్ అనీ, విశ్వంలో ఎక్కడా లేని ప్రాణికోటి కేవలం ఈ భూగోళం మీద మాత్రమే వుందనీ భ్రమపడటం హాస్యాస్పదమంటున్నారు.
ఒక తోకచుక్క మీద కూడా జీవ పదార్ధం ఉన్నట్లు ఆమధ్య తేలింది.
యూ నో! మన మిల్కీవే గెలాక్సీలోనే హీనపక్షం ప్రతి లక్ష నక్షత్రాలకీ ఒక్క గ్రహంలో తగిన వాతావరణం వుండి ప్రాణికోటి ఉద్భవించిందనుకున్నా, అది పదివేల కోట్ల నక్షత్రాలలో ఒక శాతంలో వెయ్యోవంతు మాత్రమే అవుతుంది. ఆ లెఖ్ఖన చూసినా, దాదాపు ఒక పదిలక్షల గ్రహాలు, ప్రాణులతో కూడినవి తేలతాయి!
అలాంటప్పుడు పదివేల కోట్ల గెలాక్సీలలో వుండే శతసహస్రానుకోట్ల నక్షత్రాలూ, వాటి తాలూకు గ్రహాల తాలూకు ఉపగ్రహాలూ గుర్తుకు తెచ్చుకుంటే - గ్రహాంతర నాగరికతలు అసంఖ్యాకంగా వుంటాయని చెప్పడం సాహసం కాదు" అన్నాడు అజిత్.
"ఒకవేళ ఏ గ్రహంలోనైనా ప్రాణులంటూ వుంటే అవి ఏ క్రిములో, కీటకాలో అయి ఉంటాయి గానీ తెలివితేటలూ, నాగరికత గల మానవులు ఉండరనుకుంటాను" అంది అపురూప కల్పించుకుంటూ.
మెల్లగా నవ్వాడు అజిత్.
"నిజమే! ఆ ప్రాణులు అచ్చం మనుషుల్లాగే వుండాలనే రూలు లేదు. ఏ రూపంలో ఉంటారో ఊహించలేక పోయినా, వాళ్ళు మనుషుల కంటే వేలరెట్లు గొప్ప నాగరికత, మేథస్సూ, టెక్నాలజీ కలిగి వున్న వాళ్ళయినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే, విశ్వంలో ఉన్న అనేకనేక గ్రహాలూ భూమికంటే, వందలకోట్ల సంవత్సరాలు ముందటివై వుండవచ్చు. ఒకవేళ వాటిలో ప్రాణులంటూ వుంటే, అవి ప్రస్తుతం మనం వున్న నాగరికత అనే మెట్టుని చిరకాలం క్రితమే అధిగమించి, మరింత ఎత్తులు చేరుకొని వుండాలి.
నా ఉద్దేశ్యంలో వాళ్ళతో పోలిస్తే మనం ఏకకణజీవి అయిన అమీబా స్థాయిలో వుంటామేమో! ఫ్లయింగ్ సాసర్లతో పోలిస్తే మన స్పేస్ షిప్పులు ఒంటెద్దు బళ్ళలా వుంటాయేమో!" అన్నాడు.
అంతలో డోర్ దగ్గర కలకలం!
"వాళ్ళని నేను ఈ రెండు కళ్ళతోనే చూశాను. అయ్యబాబోయ్! అయ్యబాబోయ్! ఎంత చిత్రంగా ఉన్నారో!" అని కళ్ళు విప్పార్చి చెబుతూ ఒక యువకుడు రెస్టారెంట్ లో ప్రవేశించాడు. దెయ్యాన్ని చూసినవాడిలా ఉంది అతని వాలకం. చెమటలు పోసి, షర్టంతా తడిసిపోయి ఉంది. అతను చెప్పేది చెవులు రిక్కించి వింటూ ఒక పది మనుషులు వెనకాలే వచ్చారు.
ఉసూరుమంటూ కుర్చీలో కూలబడ్డాడు ఆ కుర్రాడు.
లేసర్ కిరణ్ అజిత్ నీ, అపురూపనీ వదిలేసి అతని దగ్గర చేరిపోయాడు.
"ఏమిటి? ఏం జరిగింది?" అన్నాడు.
"ఈయన్ని ఎగిరే పళ్ళెంలోకి తీసుకెళ్ళారుట మరుజుగ్గుగాళ్ళు!"
"ఫంటాస్టిక్!" అని తన చేతిలోని మైక్రోఫోన్ ఆ కుర్రాడి చేతిలో పెట్టి టేప్ రికార్డర్ ఆన్ చేశాడు లేసర్. అతని కుడిచేతిలో చిన్న మూవీ కెమెరా వుంది.
అజిత్ మెరుపులా కారు దగ్గరికి వెళ్ళి, తన రికార్డర్ కూడా తీసుకొచ్చాడు.
తన మైక్రోఫోను ఆ కుర్రాడి చేతికందించాడు.
"చెప్పండి!" అన్నాడు.
లేసర్ అందించిన మైక్రోఫోను ఒక చేతితో, అజిత్ అందించిన మైక్రోఫోను రెండో చేతితో పట్టుకున్నాడు అతను. రెండు టేపు రికార్డరూ తిరగటం మొదలెట్టాయి.
అందరూ అతన్ని హీరోని చూసినట్లు చూస్తున్నారు. ఎవరో వెళ్ళి కాఫీ కప్పు తెచ్చి అతనికి అందించారు.
"నా పేరు హృదయేష్!" అని మొదలెట్టాడతను. ఒక అరగంటక్రితం ఆ తాటితోపులకేసి వెళ్ళాను నేను. అప్పుడు జుయ్ మంటూ ఒక సాసరు లాంటిది దిగింది. అచ్చం ఈ కప్పుకింద ఉన్న సాసరులాగే ఉందది."
"అప్పుడేమయింది?" అన్నాడు జనంలోని ఒకడు - కళ్ళు పత్తికాయల్లా చేసి.
"అప్పుడేమయింది? ఆ సాసరులో నుంచి ఇద్దరు మనుషులు దిగారు. భూమికి జానెడెత్తున వున్నారు వాళ్ళు. 'రా!' అని కర్కశంగా పిలిచారు నన్ను. మంత్రం వేసిన పాములాగా తేలుతూ లోపలికి వెళ్ళిపోయాను నేను."
"అబ్బా!" అన్నాడొక శ్రోత నోరెళ్ళబెట్టి.
"ఆ తర్వాత నన్ను పెద్ద మైక్రోస్కోపు కింద పడుకోపెట్టి అంగుళం అంగుళం పరీక్ష చేశారు."
"వాళ్ళు మనుషుల్లాగే ఉన్నారా?" అన్నాడు లేసర్ కిరణ్.
"వాళ్ళా? వాళ్ళు మనుషుల్లాగే ఉన్నారు గానీ తమాషాగా, వెలగపండూ, ఒక సొరకాయా, ఒక పచ్చిమిరపకాయా, నాలుగు మునక్కాడలూ ఒకదానికొకటి అతికించి మనిషి బొమ్మ చేస్తే ఎలా వుంటుందో అలా వున్నారు. నెత్తిమీద టీ.వీ. యాంటినా లాంటిది ఉంది" అన్నాడు.
జనం అంతా విరగబడి నవ్వారు ఆ వర్ణనకి.
"ఇంతకీ వాళ్ళదే గ్రహంట?" అన్నాడు ఒకడు.
"ఆ! ఏదో గ్రహం! శనిగాళ్ళలా ఉన్నారు. నాకు ఈ కుశల ప్రశ్నలన్నీ అడిగే ఓపికెక్కడిదీ? అసలే ఆ ఫ్లయింగ్ సాసర్లో గాలాడదు. విపరీతమైన చెమట! పైగా సూర్యుడికి బాగా దగ్గరనుంచీ వచ్చిందేమో - పెనంలా వేడెక్కిపోయి ఉంది. అందుకని వాళ్ళని నాలుగు ఉతికి పారిపోయి వచ్చేశాను."

 Previous Page Next Page